స్వయంభువు ఈ శ్వేతార్క గణపతి
>> Saturday, February 4, 2012
తెల్లజిల్లేడు చెట్టు మొదలు నుంచి ఉద్భవించే గణపతిని "శ్వేతార్కమూలగణపతి" అని అంటారు. బాగా పాతబడిన తెల్లజిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని, అటువంటి బహు అరుదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శ్వేతార్కమూల గణపతి అడిగిందే తడవుగా శుభాలను కటాక్షించే దైవంగా భాసిల్లుతున్నాడు.
వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే దేవాలయ ప్రాంగణంలో వెలసి, భక్తజనుల విశేష ప్రార్థనలు అందుకున్నాడు. తెల్లజిల్లేడు మొదలు నుంచి స్వయంభువుగా వెలసిన స్వామి రూపాన్ని, చెక్కడం ద్వారా మలచబడలేదు. నేత్రాలు, నుదురు, వక్రతుండం, జ్ఞానదంతం (కుడిదంతం), ఎడమ దంతం, కాళ్ళు, పాదాలు, హస్తం, తల్పం, ఎలుక.. అంటూ అన్నీ స్పష్టంగా గోచరిస్తూ వెలసిన సర్వావయవ సంపూర్ణ శ్వేతార్కమూలగణపతి రూపం నయనానందకరం.
భక్తులు 11, 16, 21, 27, 32 మంగళవారాల పాటూ స్వామి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయడం ద్వారా సకల శుభాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అంతేగాకుండా శ్వేతార్కమూలగణపతిని ఆరాధించడం వల్ల విశిష్టమైన ఫలితాలు ఏర్పడతాయని విశ్వాసం. మనసులో స్వామిని తలచుకుని ఏయే కోరికలు కోరుకుంటారో, ఆయా కోర్కెలను దేవుడు తక్షణం నెరవేర్చే దేవునిగా భాసిల్లుతున్నాడు. స్వామికి ప్రతినెల మొదటి మంగళవారం రోజున ప్రత్యేక గణపతిహోమం, గరికపూజ నిర్వహిస్తుంటారు.
ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో కాకతీయులకాలం నాటి శ్రీ సీతారామలక్ష్మణులు, శ్రీ వీరాంజనేయస్వామి, శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామ, శ్రీ అయ్యప్పస్వామి, శ్రీ షిరిడీ సాయిబాబా, గణపతి, నవగ్రహ విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో విదేశీయులు కూడా వస్తుండటం విశేషం.
[వెబ్ దునియా.కామ్ నుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment