శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాదబ్రహ్మ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవములగూర్చి సాయిపథం వారి వ్యాసం

>> Saturday, January 14, 2012

శ్రీ గురుభ్యోన్నమః
ఓం శ్రీ సాయి నాదాయనమః

ప్రియ భగవత్ బంధువులారా మీ అందరికి నమస్కారం
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి పాద పద్మములకు,
అమ్మగారి పాద పద్మములకు అనేకానేక నమస్కారములతో ఈ మంచి మాట శీర్షిక తో
మీతో పాలుపంచుకొనే విషయం - త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా పరమ
భక్తుడు, నిరాడంబర జీవి, శ్రీ రామనుగ్రహానికి పాత్రుడైన శ్రీ
త్యాగరాజ స్వామి వారినిగూర్చి.
ఈ రోజు "పుష్య బహుళ పంచమి" శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవం. శ్రీ
వెంకటేశ్వర భక్తి ఛానల్ తో సహా మరికొన్ని t v చానళ్ళు మన అదృష్టవశాత్తు
ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. మన సత్సంగ్ సభ్యులందరికీ మా విన్నపం
ఏమిటి అంటే ఈ రోజు శ్రీ త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలనుంచి
ఒక్క కీర్తననైనా విని తరించండి. ఆ సేవకు భగవంతుడు ఆ శ్రీ రామచంద్ర
మూర్తి చాల సంతోషించి మన అందరికి చక్కని ఆయురారోగ్యాలు, సంపదలు, సర్వ
శుభాలు ప్రసాదిస్తాడు. ఎందుకంటే మన పూజ్య గురువులు పదే పదే చెప్పే విషయం
- ఆ పరమాత్మ, తనను నమ్ముకున్న భక్తులను స్మరించినంత మాత్రాన ఎంతో
ముఘ్దుడుఅవుతాడట. అందుకే, మనం అందరం ఒక్క చోట కలవలేకపోయినా, సాముహిక
కార్యక్రమంగా నిర్వహించలేకపోయిన, ఈ రోజు రాత్రి లోపు ఒక్క పంచరత్న
కీర్తన తప్పకుండా విందాం- తరిద్దాం.

ఈ సందర్భం గా.. చేతులు జోడించి సిరసుకు తాకించి సంపూర్ణ భక్తిభావనతో ...........
శ్రీ త్యాగరాజ స్వామి వారిని ఇలా ప్రార్ధిద్దాం.
కావేరీ తీర వాసాయ కారున్యామ్రుత వర్షినే
రామబ్రహ్మ తనూజాయ త్యాగారాజాయతే నమః
ఈనాడు ఆ మహనీయుని తలుచుకుని -- ఆయన జీవితంలోని కొన్ని విషయాలు
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
త్యాగరాజు (1767-1847) కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం.
ప్రస్తుత ఆంద్ర ప్రదేస్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కాకర్ల గ్రామంలో
వైదిక బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.. ఇతని అసలు పేరు కాకర్ల త్యాగ
బ్రహ్మం. ఇతడి పూర్వీకులు కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస
వెళ్ళటం, తంజావూరు సమీపంలోని తిరువాయూరులో స్థిరపడటం వల్ల త్యాగయ్య అటు
తమిళులకూ , ఇటూ తెలుగువారికీ ఆప్తుడయ్యాడు. త్యాగరాజు గారికి 18
సంవత్సరాల వయసులో పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆమె ఆయన 23
సంవత్సరముల వయస్సులో ఉండగా అకాల మరణం చెందినది. తరువాత ఆయన పార్వతి
సోదరియైన కమలాంబను వివాహమాడాడు. సద్గురు త్యాగరాజ స్వామి తన జీవన
విధానాన్ని ఉంఛ వృత్తి ద్వారానే నిర్వహించి అతి నిరాడంబరమైన జీవితం గడపి
జీవన్ముక్తి పొందిన మహనీయుడు, నిత్యస్మరణీయుడు కూడా. త్యాగరాజు
తెలుగువాడైనా, తమిళనాట పుట్టి తన సంగీత సామ్రాజ్య వైభవాన్ని భారతదేశమంతటా
విస్తరింపజేసిన కారణజన్ముడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో త్యాగయ్య గా ప్రసిద్ధి చెందిన కాకర్ల
త్యాగయ్య కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు. ముత్తుస్వామి
దీక్షితారు, శ్యామ శాస్త్రులు తక్కిన ఇద్దరు. ముగ్గురిలోనూ త్యాగయ్య శైలి
సులభంగా పాడటానికీ , వినటానికీ ఇంపుగా ఉంటుంది. రామ భక్తునిగా ,
వాగ్గేయకారునిగా ప్రసిద్ధికెక్కిన త్యాగయ్య తంజావూరు ను ఏలిన రెండవ
శరభోజి కాలం నాటి వాడు.
త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష
తెలుగులో రచించినవే. కొన్ని మాత్రం సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ
కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న. కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో
ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక
అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద
భక్తి విజయం' అనే రూపకాన్ని కూడా రచించాడు.
త్యాగరాజు తన సంగీత శిక్షణను శ్రీ శొంటి వెంకటరమణయ్య దగ్గర చాలా చిన్న
వయసులోనే ప్రారంభించాడు. తన పదమూడేండ్ల చిరు ప్రాయములోనే త్యాగరాజు
దేశిక తోడి రాగం లో నమో నమో రాఘవ అనే కీర్తనను స్వరపరచిన మహనీయుడు.
త్యాగరాజ పంచ రత్న కృతులలో ఐదవది అయిన ఎందఱో మహానుభావులు తన గురువు గారైన
శొంఠి వేంకటరమణయ్య గారి ఇంటిలో చేసిన కచేరీలో స్వయంగా స్వరపరచి పాడిన
కీర్తనే. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని
బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన
కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానిన్చాడట. కానీ
త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను
నిర్ద్వంద్వంగా తిరస్కరించి ఆ సందర్భంగా స్వరపరచి పాడినదే "నిధి చాల
సుఖమా " అన్న కీర్తన. తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు
ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీ రామ
పట్టాభిషేక విగ్రహాలను కావేరి నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను
తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి
అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను
త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు.
వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.

త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
దేవముని అయిన నారదుడు స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, ఓ
అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా
పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనా ఓ మనసా" అనీ చెపుతారు.

తాగయ్య అన్నగారైన జపేశుడు, తగయ్య కీర్తిని ఓర్వలేక "త్యాగయ్య
రామచంద్రమూర్తినే కీర్తిస్తాడనే సిద్ధాంతం బయిటికి తీసి - తిరువయ్యూరు
దేవత ఐన ధర్మసంవర్దినీదేవిని కీర్తిన్చలేదని ప్రచారం మొదలుపెట్టాడు.
త్యాగరాజు ఈ అభియోగాన్ని భగవంతునికే చెప్పుకున్నాడు -- "ఎవరని
నిర్ణయించిరిరా - నిన్నెట్లు ఆరాదిన్చిరిరా"- అనే కీర్తన ద్వారా.

త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన
కీర్తనగా "ఎందుదాగినావో" ; తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం
వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, ఆలపించిన కృతిగా "తెర తీయగ రాదా" (ఈ
కీర్తనకే వేంకటేశ్వరుని దయచేత తెరలు అవే తొలగిపోయాయి) . శ్రీ
వేంకటేశ్వరుని దర్సనానంతరం ఆయన "వెంకటేశ నిను సేవింప" అనే కృతిని
పాడారని ప్రతీతి. ఆఖరికి, తను పరమపదమునకు చేరటానికి ముందు "గిరిపై"
అనే కీర్తన "పరితాపము" అనే కీర్తన త్యాగయ్య ఆలపించారని పెద్దల మాట.

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను
సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును
కర్ణాటసంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి
సంవత్సరం "పుష్య బహుళ పంచమి" నాడు (సాధారణంగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో
వస్తుంది ) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు
త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఆయన భక్తులు మరియు సంగీత
కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి
నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు.
వందలకొద్దీ సంగీత కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను
(జగదానంద కారకా; దుడుగుల నన్నే దొర; సాధించనే ఓ మనసా; కన కన రుచిరా;
ఎందఱో మహానుభావులు )కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం
చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా
భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని సంప్రదాయసిద్ధంగా
మనదేశ నలుమూలల మరియు ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ
తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది.

త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగారత్నమ్మగారు కావేరీ
నది ఒడ్డున శిధిలావస్థలోనున్న త్యాగరాజస్వామి వారి సమాధి చూసి, ఆ
స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా,
రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి,
గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి, తన వద్ద నున్న డబ్బునంతా
ఖర్చు చేసి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని
ముగించింది. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో ఆనాటి ప్రముఖ చలన
చిత్ర నటులు శ్రీ చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మగారి సలహాపై
త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు. సుమారు 1940 నుండి నేటి వరకూ
సమాధి వద్దనే ఆరాధనోత్సవం జరుగుతుంది. ఆరాధనోత్సవాలు పెద్ద యెత్తున
జరిగేవి. అందులో భాగంగా త్యాగరాజు పంచరత్న కీర్తనలని సమాధి వద్ద పాడే
ఆచారానికి శ్రీకారం చుట్టారు. .

త్యాగరాజు ఇంటి అమ్మకపు పత్రము

సుమారు 1929 ప్రాంతంలో త్యాగరాజుంటున్న పై భాగాన్ని లగూ బాయి, పయమ్మ బాయి
అనే ఇద్దరు మరాఠీ స్త్రీలకి అమ్మేసారు. ఈ అమ్మకాల పత్రంలో "త్యాగరాజ
స్వామి స్వదస్తూరీ" తో ఆయన సంతకముంది. తిరువయ్యారు కళ్యాణ మహల్ పేలస్ లో
వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. తిరువయ్యారు కళ్యాణ మహల్
పేలస్ లో వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. హిందూ దిన
పత్రిక వారికిది లభ్యమయ్యింది. ఆ పత్రంలోని వివరాలు యధాతధంగా...

సర్వధారీ సంవత్సరం 1828 డిశంబరు 18 వ తేదీ, మార్గశిర మాసం పదకొండో
రోజున, తంజావూరు వాస్తవ్యులైన శ్రీమతి లాగు బాయి, పయమ్మ బాయీ,
తిరువయ్యారు వాస్తవ్యులైన కీ.శే. రామబ్రహ్మం అయ్యర్ కుమారుడు త్యాగబ్రహ్మ
ఆయ్యర్, పంచనదబ్రహ్మం ఆయ్యర్ కుమారుడు సుబ్బబ్రహ్మ్మ అయ్యర్ ల మధ్య
జరిగిన ఒప్పంద అంగీకార పత్రమిది. త్యాగబ్రహ్మం ఇంటి పై అంతస్థు
నివాసాన్ని ముందు చెప్పిన వారికి చెందేలా రాసిన పత్రమిది. ఈ అమ్మకంలో
భాగంగా 32 - 3 3/4 వంతుల బంగారమూ, 50 6/16 వెండీ ఇంటి ధరగా నిర్ణయిస్తూ,
తిరువయ్యారు మహలు మహారాణి అభయ, అయ్యలు నాయకన్ సమక్షంలో జరిగిన ఒడంబడిక.
ఇది ప్రభుత్వ ముద్ర కలిగిన అమ్మక పత్రము.

(త్యాగబ్రహ్మ అయ్యర్ వ్రాలు) (సుబ్బబ్రహ్మ అయ్యర్ వ్రాలు)

సాక్షులు:
1. తిరుమంజన వీధి నివాసస్థులు - రామశాస్త్రి, 2. తిరుమంజన వీధి
నివాసస్థులు - సాంబశివ అయ్యర్
3. తిరువధి వెంకటరామ అయ్యర్, 4. సామ గురుక్కల్ తనయుడు, పంచనద గురుక్కల్
5. పంచాయితీ అధికారి - అయ్యలు నాయకన్

ఈ మూలప్రతి ప్రస్తుతం మదురై సౌరాష్ట్ర సభ వారి ఆధీనంలో ఉంది. ఇదొక్కటే
త్యాగరాజు సంతకంతో లభ్యమైన ప్రతి.
అక్కడే కాకుండా దేశం నలుమూలలా ఈ ఉత్సవాలు సంగీత ప్రియులు
జరుపుకుంటున్నారు. త్యాగరాజు సంగీతం పదిమందికీ తెలిసినా సంగీత శాస్త్ర
పరంగా మరిన్ని పరిశోధనలు విశ్వవిద్యాలయాలవల్లే సాధ్యం. ఈ దిశగా
తమిళనాట అనేక పరిశోధనలు జరుగుతున్నా, మన ఆంధ్రదేశంలో ఈ సంగీత సంబంధ
విషయాల మీద ఆశించిన విధం గా పరిశోధనలు జరగటల్లేదనే చెపాల్సిఉన్తున్ది.
మన సనాతన ధర్మమూ, మన జాతీయ విలువలు, మన సంస్కారమూ, మన కళలూ, మన విద్యలూ
వాటి ఔన్త్నత్యము కొంతవరకైనా మనం తెలుసుకోవాలి, వాటిని, మన తరువాత
తరాలకి అందజేయాలన్న విధితో ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మన పూర్వీకులలోని
ఈ భావనే, మనకు వాల్మీకి రామాయణమూ, నన్నయ భారతమూ, పోతన గారి భాగవతము,
కాళిదాసు కావ్యాలూ, శంకర భగవత్పాదుల వాంగ్మయము, శ్యామ శాస్త్రి,
ముత్తుస్వామి త్యాగరాజు,అన్నమయ్యా,రామదాసు ఇతర వాగ్గేయ కారుల కీర్తనలూ
మనకందేలా చేసింది, అంటే అతిశయోక్తి కాదేమో ?
కర్ణాటక సంగీతమున్నంత కాలమూ త్యాగరాజ స్వామి వారు జీవించి ఉంటారు.
త్యాగ రాజ స్వామి వారి కీర్తనలు ఉన్నంత కాలమూ తెలుగు భాషా ప్రతీ ఒక్కరి
నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది. ఇది అక్షర సత్యం.

ఒక్క విషయం, మీకు సంగీతం వస్తే చాలా బాగు. రాకుంటే కూడా, త్యాగరాజ
స్వామి వారి కీర్తనలను విని, మననం చేస్తూ, భగవదనుగ్రహము పొందెదరు గాక.
అలాగే, మీ పిల్లలకు, మనుమలకు, ఈ వాగ్గేయ కారులను గూర్చి చెప్పండి, వారి
కీర్తనలు వినే అవకాసం, సౌలభ్యం, మక్కువ కలగాచేయండి.

"మంచి మాట" శీర్షిక తో "శ్రీ త్యాగరాజ స్వామి" వారిని గూర్చిన కొన్ని
వివరాలు, కొన్ని చిత్రాలు శ్రీ సాయిపథం మీతో పంచుకుంటోంది. ఇవి మీకు
బాగున్నాయని అనిపిస్తే, మన తెలుగువాడైన త్యాగరాజు కర్ణాటక సంగీతానికి
చేసిన సేవని మరోసారి స్మరించుకున్నామనుకోండి. ఎక్కడైనా తప్పులు దొర్లితే
క్ష్యన్తవ్యులం.


ఎందఱో మహానుభావులు -- అందరికి వందనాలు.

సర్వే జనాః సుఖినో భవంతు....
మీ
శ్రీ సాయిపథం

--

3 వ్యాఖ్యలు:

madhumarati January 15, 2012 at 10:26 PM  

మంచి విషయం చెప్పారు.. ధన్యవాదాలు.

Sri Harish Sivalenka March 12, 2012 at 10:59 PM  

Thanks for your valuable information sir. Nenu chaala baadhapaduthunnaanu... Telugu lo type cheyalekapothunnanduku...

Sri Harish Sivalenka March 12, 2012 at 11:00 PM  

Thanks for your valuable information...
Naaku praanamaina Telugu lo type cheyalekapothunnanduku kashaminchandi.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP