శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సజీవ గురువు కావాలి

>> Friday, November 4, 2011


సజీవంగా ఉన్న గురువుకి...దేహం చాలించిన గురువుకి తేడా ఏమిటంటే.... ఎవరైనా సరే గురువైనా...మీరైనా...ఎవరైనా...జీవించి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం...దీని ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వర్ణించనవసరం లేదు. జీవించి ఉండటం ఏ జీవికైనా ముఖ్యమే. దేహం చాలించిన వారు మన జీవితానికి గొప్ప స్ఫూర్తి కావచ్చు. కానీ వారితో పనిచేయలేము. కొంతమంది గురువులు వారు సంపాదించిన ప్రావీణ్యాన్ని బట్టి కొద్దికాలం మాత్రమే పనిచేయడానికి సిద్ధ పడతారు.

ఇటువంటి గురువుల సమక్షంలో వారి శక్తి వలయం సాధనకు దోహదపడుతుంది. కానీ ఇది కేవలం ఒక అనుకూలమైన వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తుంది. లేదా సాగుకు భూమిని సిద్ధం చేస్తుందని అనవచ్చు. అంతే కానీ మీకు కావాల్సిన మార్గదర్శనం దేహం చాలించిన గురువు ఇవ్వలేరు. మీరు సత్సంగంలో కూర్చున్నపుడు అన్నిటినీ గ్రహించే స్థితిలో ఉండరు. ఎందుకంటే మీ మనస్సు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి. మీ మనసు మిమ్మల్ని ఏలుతున్నపుడు మీకు ఒక సహాయం ఎంతో ముఖ్యం. కానీ మీరే గనక గ్రహణ శీలంతో ఉంటే మీకు మార్గదర్శకుల అవసరం ఉండదు. అంతే కాదు మీకు గురువు కూడా అక్కర్లేదు. ఎందుకంటే అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. అలాంటప్పుడు మీకు గురువు...ధ్యానలింగ...ధ్యానం ఇవేవీ అవసరం లేదు.

ఇలా ఉండటం చాలా అరుదు. ప్రస్తుతం మీరెలా ఉన్నారంటే మీలో ఎక్కువ శాతం మీ మనసే నిండిపోయి ఉంది. అంటే మీ గ్రహణ శీలం చాలా తక్కువగా ఉందన్నమాట. ఏదో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు భౌతిక విషయాల్లో లేదా జీవితానికి సంబంధించిన విషయాల్లో మీ మనసు బ్రహ్మాండంగా పని చేస్తుంది. అంటే ఇటువంటి స్థితిలో మరణించిన వాటికి సంబంధించినది ఏది పనిచేయదు. అందుకే దేహం చాలించిన గురువు ఇక్కడ పని చేయలేడు. మీరే గనక పరిపూర్ణ గ్రహణ శీలులుగా ఉన్నారనుకోండి...అప్పుడు మీరు సజీవంగా ఉన్నవారితోనూ మరణించిన వారితోనూ బ్రహ్మాండంగా ఉంటారు.

అంతటా అనుగ్రహం
అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. అది కేవలం ఒక్క చోటే ఉంటుందని అనుకోవడానికి లేదు. కాకపోతే కొన్ని స్థలాల్లో తీవ్రంగా ఉంటుంది. మీ గ్రహణ శీలత తీవ్రతను బట్టి దాన్ని గ్రహిస్తారు. ఇటువంటి ప్రదేశాల్లో మీరు దాన్ని గ్రహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ ఈ తోటలో కూర్చున్నపుడు ఇది తోటే కదా అని ఒకలా ఉంటారు. అదే గుడిలో వెళ్లినపుడు మరొకలా ఉంటారు. కొంతమంది ఎంత మొద్దుబారిపోయి ఉంటారంటే ధ్యానలింగంలో కూర్చున్నా ఏమీ అంటనట్లు ఉంటారు.

లింగం పైనుంచి కారే నీటిబొట్లను చూస్తూ కూర్చుంటారు. ఇలాంటి వారిని తీర్థకుండంలో ముంచి మళ్లీ ఆలయంలో కూర్చోపెడతాం. అప్పుడు వారిలో ఏదో కదులుతుంది. వారు కొద్దిగా అనుభూతి చెందుతారు. మరికొంతమంది ఉంటారు. వారు ధ్యానలింగంలో పెద్దగా ఏ అనుభూతి చెందరు. ఇలాంటి వారిని భైరవి ముందు నిలబెడతాం. ఉన్నట్టుండి వారిలో ఏదో మేలుకుంటుంది. అక్కడ ఉన్న శక్తి అలాంటిది మరి అలాగని ఇక్కడేదో తక్కువుందని అనడం లేదు.

కానీ ఇక్కడ ఉన్న శక్తి మీరు గ్రహించేటంత తీవ్రంగా లేదు...అంతే.
అనుగ్రహం అనేది అంతటా ఉంది. కానీ మనం గుడిలోనే దాన్ని ఎక్కువగా అనుభవించగలుగుతున్నాం. మన చుట్టూ ఉన్న జీవశక్తిని మనం అలాగే గ్రహించగలుగుతున్నామా? లేదు కదా ? ఉదాహరణకు మనం పదార్థాలను ఆహారంగా స్వీకరించడానికి ముందు మనకి సులువైన విధానంలో వండుకుంటాం. మేకలు గడ్డి తినేసి బతుకుతున్నాయి కదా అని మనం ఆ పని చేయలేం కదా ? ఈ సృష్టిలోని ఎన్నో క్రిములు, కీటకాలు తొంభైశాతం సూర్యరశ్మి, గాలిపై బతుకుతాయి.

వాటికి నీరు, ఆహారం అవసరం పదిశాతమే. వాటి శరీరమెంత? ఎంతో సూక్ష్మం...అంటే వాటి ఆహారం ఇంకా సూక్ష్మం...అంతే కదా? ఇది మీలో జరగటం కూడా మీరు గమనించే ఉంటారు...మీరు పరమానందంగా ఉన్న రోజు ఎక్కువ ఆకలి వేయదు. ఎంతో తక్కువ తింటారు. ఎందుకంటే మీ గ్రహణ శీలత ఎక్కువగా ఉంది కాబట్టి...అంటే మీ జీవశక్తులకు కావాల్సిన అరవైశాతం పోషణ...సూర్యరశ్మి ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా వస్తోంది. నలభైశాతం మాత్రమే ఆహారం ద్వారా వస్తుంది.

గురువు సహాయం తప్పదు
అందుకే మీ గ్రహణశీలతను పెంపొందించుకుంటే జీవించి ఉన్నవీ..లేనివీ,ఉనికిలో లేనివి కూడా మీకు తోడ్పడతాయి. అలా కాని పక్షంలో మీకు గురువు అవసరం ఎంతో ఉంది. మీ మనసే మీలో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకొని కూర్చున్నపుడు మీకు గురువు సహాయం తప్పదు. నా గురువు ' నిన్ను ప్రేమిస్తున్నాను' అని స్వర్గం నుంచి ఉత్తరం రాస్తారు.... అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు...ఎందుకంటే మీకు నచ్చేవే మీ మనసు చెపుతుంది కదా?

దీన్నిబట్టి మనకు అర్థం అయింది ఏమిటంటే ...మీ మనసు మిమ్మల్ని ఇలా ఏలుతున్నపుడు దాన్ని ఏలడానికి ఇంకొక మనసు కావాలి...తప్పదు. ఇదేమీ అవసరం లేకుండా...మీరు గ్రహణశీలురై ఉంటే...మీకు ఏ దేవుడూ అక్కర్లేదు. ఒక బండరాయి చాలు...అంతెందుకు? ఒక గడ్డిపోచ మీ గురువు అవుతుంది...కానీ ఇది మీ మనసు పూర్తిగా పోయినప్పుడే సాధ్యమవుతుంది. ఇలా కానీ పక్షంలో మీ మనసు కంటే తెలివైన మనసొకటి దాన్ని లొంగతీసుకోక తప్పదు.


[ from andhrajyothy.com]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP