కోరికలు త్యజిస్తేనే సన్మార్గం
>> Saturday, November 5, 2011
ఆధ్యాత్మికత అంటే కేవలం సర్వసంగ పరిత్యాగులకే పరిమితమైనదని భావించరాదన్నారు అవతార్ మెహెర్‌బాబా. మనం మన ప్రాపంచిక విధులన్నిటినీ నిర్వర్తిస్తూనే భగవంతుడిని ప్రేమించాలి, ఆరాధించాలి, జీవిత లక్ష్యమైన భగవదైక్యం పొందడానికి సాధనచేయాలని మెహెర్‌బాబా తన భక్తులకు అనేక సందేశాలలో ఉద్బోధించారు.
ఆధ్యాత్మికత సాధన మార్గంలో బాహ్యంగా అనేక భోగభాగ్యాలను త్యజించడమే కాదు అంతర్గతంగా కూడా ఐహిక వాం«ఛలపై మమకారం నశించాలని మెహెర్‌బాబా బోధించారు. మనం నిత్యం చూసే ఆకర్షణలన్నీ ఒక మిథ్య అని బాబా వర్ణించారు. ఆ ఆకర్ణణలు ఎంతటి శక్తివంతవైనా వాటికి లోబడక నిత్యజీవితంలో తామరాకు మీద నీటి బొట్టులా ప్రాపంచిక విధులన్నిటినీ నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తూ భగవన్మార్గంలో పయనించాలని బాబా తన భక్తులకు సూచించారు. ఈ విషయమై మెహెర్‌బాబా చెప్పిన ఒక కథాంశాన్ని ఆయన సన్నిహిత మండలి సభ్యుడు ఏరుచ్ జెస్సావాలా ఇలా వివరించారు.
సద్గురు దర్శనం
ఒక చక్రవర్తి తన రాజ్యంలో ఉన్న ఒక సద్గురువు దర్శనార్థం తన కుటుంబీకులు, బంధు మిత్రులందరితో కలిసి ఆయన ఉండే ఆశ్రమానికి వెళ్లాడు. సద్గురువు ఆశ్రమానికి చాలా దూరంలోనే తన అశ్వ, గజ బలాలన్నింటినీ నిలిపివేసి రాజు తన పరివారంతో నడుచుకుంటూ ఆశ్రమానికి వెళ్లాడు.
ఆ ఆశ్రమం బయట ఉన్న కాపలాదారుడికి తాను ఈ రాజ్యానికి చక్రవర్తినని, సద్గురువు దర్శనార్థం వచ్చానని, దయచేసి ఆయన దర్శనం ఇప్పించాలని వినయపూర్వకంగా వేడుకున్నాడు. సద్గురువు నుంచి పిలుపు వచ్చే దాకా వినయంగా అక్కడే వేచి ఉన్నాడు. ఆ తర్వాత సద్గురువును దూరం నుంచి నిలబడే దర్శించుకుని తన బంధు మిత్రులను సద్గురువుకు పరిచయం చేశాడు. సద్గురువు చాలా సంతోషించి అందరినీ కూర్చోబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.
సాధారణంగా సద్గురువులు పెద్దగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయరు. కుశల ప్రశ్నలతోనే వారు అనేక విషయాలు మన నుంచి గ్రహిస్తారు. అనంతరం సద్గురువు లేచి నిలబడి సెలవు ప్రకటించారు. క్షేమంగా వెళ్లమని అందరికీ ఆశీసులిచ్చాడు. అయితే చక్రవర్తి రెండు చేతులూ జోడించి తమరి సందేశ వాక్కులు ఏమైనా ఇవ్వాలని సద్గురువును వేడుకున్నాడు. ఇందుకు సద్గురువు నవ్వుతూ, నా సందేశం కావాలా అంటూ సరే నాకు గుర్తున్న ఒక కథ చెబుతాను, శ్రద్ధగా ఆలకించమని చక్రవర్తికి తెలిపాడు.
రాజ్యం నీళ్లతో సమానం!
రాజా...నీకు వేటంటే ఇష్టమనుకుంటాను అని సద్గురువు రాజును ప్రశ్నించగా అవును...తనకు వేటంటే ఆరోప్రాణమని రాజు బదులిచ్చాడు. తాను చెప్పబోయే కథ కూడా మంచి వేటగాడైన ఒకానొక చక్రవర్తి గురించేనని సద్గురువు కథ చెప్పసాగాడు. అరణ్యంలో మృగాల వేటకు వెళ్లిన ఒక చక్రవర్తి సాయంత్రం దాకా వేటాడి గురి తప్పి, దారి తప్పి , తన వెంట వచ్చిన సైన్యానిది మరో దారైపోగా ఎడారి లాంటి ప్రాంతంలో ఒంటరివాడై పోయాడు. తానెక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఆ చక్రవర్తిది. తన రాజ్యం సరిహద్దులు కూడా అతను దాటేశాడు. దప్పికతో, అలసటతో చక్రవర్తి నేలకొరిగాడు.
ఏ క్షణంలోనైనా ప్రాణం పోతుందా అన్నట్లుంది అతని పరిస్థితి. ఈ సమయంలో ఒక కుండ నిండా నీళ్లు పట్టుకుని నేను ఆ చక్రవర్తి ఎదుట ప్రత్యక్షమయ్యాను. అయితే మంచినీళ్లు ఇవ్వడానికి తగిన మూల్యం చెల్లించాలని నేను చక్రవర్తికి షరతు విధించాను. నేను ఈ రాజ్యానికి చక్రవర్తిని..మీరు ఇచ్చే మంచినీళ్లకు వెల ఎంత చెల్లించమంటే అంత చెల్లిస్తాను అని మూలుగుతూ చక్రవర్తి జవాబిచ్చాడు.ఓ అలాగా! నీ రాజ్యంలో సగభాగం ఇవ్వాలని నేను షరతు విధించాను. అదెంత భాగ్యం...అలాగే తీసుకోండి. కానీ, మంచినీళ్లు దయచేసి ఇప్పించండని చక్రవర్తి ప్రాధేయపడ్డాడు.
మంచినీళ్లు తాగిన చక్రవర్తి బలం పుంజుకున్నాడు. తన రాజ్యానికి వెళ్లేదారి నా నుంచి తెలుసుకుని బయలుదేరాడు. అయితే కొంత దూరం వెళ్లేసరికి చక్రవర్తికి మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాని ఎంత ప్రయత్నించినా చక్రవర్తికి మూత్ర విసర్జన చేయడం కష్టమవుతుంది. అప్పటికే చక్రవర్తి తన రాజ్యంలోకి ప్రవేశించాడు. మూత్ర విసర్జన కాకపోవడంతో చక్రవర్తికి విపరీతమైన కడుపునొప్పి రావడంతోపాటు దేహంలో విషపదార్థాలు తయారవుతాయి. ఆ నొప్పి తట్టుకోవడం కంటే మరణమే మేలని చక్రవర్తి భావిస్తాడు.
ఇదిగో ఈ సమయంలో నేను తిరిగి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాను. నీ బాధ ఏమిటని చక్రవర్తిని అడిగాను.నన్ను చూడగానే పరమానంద భరితుడైన చక్రవర్తి మూత్రవిసర్జన చేయలేకపోతున్నానని, విపరీతమైన కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. ఎలాగైనా ఈ బాధ నుంచి ఉపశమన కలిగించమని చక్రవర్తి నన్ను వేడుకున్నాడు.
ఈ బాధకు నా దగ్గర మందు ఉందని చక్రవర్తికి చెప్పాను. అయ్యా! దయచేసి ఆ మందును నాకు వెంటనే ఇప్పించండి. మీకేమి కావాలన్నా తక్షణం చేస్తాను..ముందు నాకు నొప్పి తగ్గించండి అని చక్రవర్తి వేడుకున్నాడు. నీ రాజ్యంలో మిగిలిన సగభాగం నాకు ఇవ్వమని షరతు విధించాను. అలాగే తీసేసుకోండి. ఎలాగైనా నా ప్రాణాలను మాత్రం కాపాడండి అని చక్రవర్తి ప్రాథేయపడ్డాడు. అతనికి జ్ఞానబోధ చేసి ఆ బాధ నుంచి తప్పించాను అంటూ సద్గురువు తన కథ ముగించాడు. ఇదే నేను నీకు ఇచ్చే నా సందేశం అని సద్గురువు రాజుకు తెలియచేశాడు.
నీ రాజ్యంలో సగభాగం విలువ నీ దేహంలో ఉన్న నీటితో సమానం. మిగిలిన సగ రాజ్య భాగం నీ దేహం నుంచి విసర్జించే నీటితో సమానం....ఇదే రాజుకు సద్గురువు ఇచ్చిన దివ్య సందేశం. నీతి నిజాయితీలతో నీ విధులు నిర్వర్తించు అంటూ సద్గురువు రాజును దీవించి పంపివేశాడు.
0 వ్యాఖ్యలు:
Post a Comment