వైదిక కర్మలు ఎలా ఆచరించాలి?
>> Friday, September 9, 2011
వైదిక కర్మలు ఎలా ఆచరించాలి?
-ఎ. పూర్ణచంద్రరావు, విశాఖపట్నం
మనం చేసే శాస్త్రవిహితవర్ణాశ్రమ వైదిక కర్మలన్నీ భగవత్ కైంకర్య బుద్ధితో, అతని ప్రీతి కొరకే ఫలసంగ కర్తృత్వాలు వీడి చేయాలని రామానుజ ఉపనిషద్ సమన్వయ దర్శనంలో విధింపబడింది. ఇది భగవద్గీతకు అనుగుణంగానే ఉంది.
యజ్ఞార్థాత్ కర్మణ్కోన్యత్రలోకోయం
తదర్ధం కర్మకాన్తేయ కర్మ బంధనః ముక్తసంగ సమాచారః
'భగవదారాధన కొరకై చేసే కర్మ భగవత్ ప్రసాదహేతువే కాబట్టి కర్మలన్నింటిని భగవత్ కైంకర్య బుద్ధితో ఆచరించు' అని భగవానుని ఉపదేశం. భగవానుడే మరలా ఇలా ఆదేశిస్తున్నాడు.
యత్‌కరోషి, యదన్నాసియత్ జుహోషిదదాసియత్
యత్ తపస్యసి కౌంతేయ! తత్ కురుష్వమదర్పణమ్
అర్జునా! నీవు దేహ ధారణకై చేయు లౌకిక వ్యాపారములను, శాస్త్రోక్తమైన యజ్ఞ, దాన తపాది వైదిక కర్మలను నీకు శేషినగు నాయందు అర్పణ బుద్ధితో ప్రేమతో ఆచరింపుము. అన్నీ నా కర్పించి, ప్రసాదంగా స్వీకరించు(9-27). ఇంకా 18వ అధ్యాయం 56వ శ్లోకంలో ఇలా భరోసా ఇస్తున్నాడు.
సర్వ కర్మాణ్యపి సదా కుర్పాణోమద్వ్యపాశ్రయః
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పద మవ్యయమ్
'సకల నిత్య నైమిత్తిక కామ్య కర్మలను నాపై కర్తృత్వముంచి ఆచరించువాడు నా అనుగ్రహమును పొంది శాశ్వత బ్రహ్మానంద పదవిని అధిరోహించుచున్నాడు! ముందుగా, మూడవ అధ్యాయంలోనే భగవానుడు' మనకు కర్తవ్యాన్ని నిర్దేశించాడు.
మయిసర్వాణికర్మాణి సన్యస్యాధ్మాత్మచేతసా నిరాశే నిర్మమోభూత్వా యుద్ధ్యస్వవినతజ్వరః
నీవు నాకు శరీర భూతుడవుగాన, నాచే ప్రేరేపించబడియే సకల కర్మలను చేయుచున్నావు. అందుచేత, ఆ కర్మలన్నింటికి కర్తను నేనే. అవన్నీ నా ఆరాధన రూపాలే అని గ్రహించి, ఆ కర్మ ఫలాలపై ఆశను, మమకారమును వీడి, 'నాకు పరమాత్మ అంతర్యామి. అతడే కర్త నా దేహేంద్రియాలు అతని పరికరములు.
ఇవి అతని ఆరాధన కొరకే అనుగ్రహింపబడినవి. అతడు సర్వశేషి, సర్వేశ్వరుడు. తానే తన సేవను అతని పని ముట్టైన నాచే చేయించుకుంటున్నాడు. అతడే నన్నీ సంసార బంధం నుంచి విముక్తుని చేయగలడు' అని నిశ్చింతగా మనం కర్మలను ఆచరించాలి.
- ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ
0 వ్యాఖ్యలు:
Post a Comment