శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మట్టిమనుషుల మంటూ మొహమాట పడకుండ మాపల్లెకొచ్చావ మహదేవా ! మట్టి లింగమై మాపూజలందావా ?!

>> Sunday, September 4, 2011






భగవంతుడు భక్తజనప్రియుడు .భక్తుని మనసుతోనే గాని వారి ధనం,బలం,కులం,చదువులతో ఆయనకు సంబంధం లేదు. మనసుపెట్టిపిలిస్తే చాలు మురిసిపోయి బిడ్డల ముంగిటకొస్తాడు. అటువంటి ఓ అద్భుత సన్నివేశం నిన్నజరిగింది. అందులో ఈ శరీరానికి కూడా ఓ చిన్నావకాశం ఇచ్చి పాల్గొనేలా చేశాడు.

రవ్వవరం వాడలో కుర్రవాళ్ళు .గత పదిసంవత్సరములుగా గణపతి నవరాత్రులను జరుపుతున్నారు. పిల్లలంతా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తాపీ పనులకు వెళుతుంటారు . ఈ గణపతి నవరాత్రులు చేస్తున్నప్పటినుండి జీవితంలో అంతా శుభం గా కలిసొస్తున్నది . ఊర్లో రైతులకంటే కూడా ఆర్ధికంగానూ మరిఅన్నివిధాలుగానూ మెరుగయ్యారు.
అయితే కలి ప్రభావం వలన చేసే పూజా కార్యక్రమాలలో కూడా అనాచారాలు మొదలయ్యాయి. స్వామి నిమజ్జనం రోజున మందు,చిందు లతో గోలగోలచేస్తున్నారు. తాగటం ఊగటం మామూలైంది . నిరుడు నిమజ్జనం అయిపోయిన తరువాత నేను కుర్రవాల్లను పిలచి .చక్కగా పూజ జరుపుకుంటున్న మీరు ఇలా చివరలో అనాచారం తో అనర్ధాలు తెచ్చుకుంటూన్నారు .అని హెచ్చరించాను.

సరే ఈ సంవత్సరం కూడా వేంకటేశ్వర స్వామి తరహా అలంకారంతో మూర్తిని తెచ్చి గణపతిపూజలు మొదలెట్టారు. ఎప్పుడూ మాట్లాడుకునే అర్చకుణ్ణే పూజలు జరిపేలా నియమించుకున్నారు. అయితే ఈ అర్చకుని తండ్రి మరణించటంతో అతను వేరొకరిని పూజకు ఒప్పించారు. అతను అంటులో ఉండికూడా కొద్ది అహంకారంతో మరో అర్చకుణ్ణి తీసుకుని మండపంలోకి రావటం దగ్గరుండి పూజ జరిపించటం జరిగింది. అంతే ఆ రోజు దీపారాధనకు అంటుకుని స్వామివారికి కట్టినవస్త్రాలు దగ్దమయ్యాయి . దీంతో మనస్తాపం చెందిన వాడ పెద్దలు పూజారితో వాదనకు దిగటం తో అతను తప్పునొప్పుకుని వెళ్ళిపోయాడు . ఇక ఇలా జరిగినందుకు వీల్లు భయపడుతూ పరిహారం గూర్చి మధనపడుతున్నారు. నేను ఊరికిదూరంగా పీఠంలో ఉంటానుకనుక విషయం నాకు తెలియదు .ఆరోజు నేను వేరే ఊరువెల్లవలసినవాడిని కూడా ఎందుకో వెళ్లబుధ్ధికాక మానుకున్నాను . సరే ఊర్లో రెండు మండపాలు,పల్లెలో కూడా ఎలాచెస్తున్నారూ చూద్దామని వెళ్లాను . నేవెళ్లగనే పల్లెజనమంతా గుంపుగ వచ్చిచేరారు. ఇలాజరగటం వలన ఏదైనా అనర్ధాలు జరుగుతాయేమోనని భయపడుతున్నామని ,ఇప్పుడు అర్చనకు కూడా ఎవరూ దొరకటం లేదని వాపోయారు. మీరే నిలబడి ఏదో ఒకటి చేయాలని కోరుతున్నారు. అప్పటికే ఏదో ఒక అవకాశం దొరికకపోతుందా అని మతమార్పిడి బేహారీ డేగలు అక్కడ చక్కర్లు కొడుతున్నాయి . స్వామి మీద భారం వేసి నేను వారికి ధైర్యం చెప్పాను.

మనం హరిజనులం .స్వామి పరిజనులం . కనుక భయానికి తావీయవద్దు . దారితప్పకుండా పిల్లలను సరిచేసుకోవటానికి స్వామి చేసిన హెచ్చరికగా భావిద్దాం . అంటులో ఉండికూడా అర్చనలు జరిపిన అర్చకుడిది దోషం. అయితే స్వామి మీభక్తికి వశుడై ఉన్నాడనటానికి ఇది ప్రత్యక్షనిదర్శనం . దాసుడి తప్పులు దండంతోసరి . ఇకపై స్వామి కార్యక్రమం జరిగేప్పుడు తాగితందనాలాడకుండా అలాంటి వారిని కంట్రోల్ చేసుకుంటానంటే నేనుకూడా మీతో ఉంటాను అని చెప్పాను .అందరూ అలాగే స్వామీ ! అని మాటిచ్చారు.

ముందుగా ఆవుపాలు పసుపు నీళ్లతో మూర్తిని సంప్రోక్షించి దివ్యజ్యోతులతో నీరాజనాలిప్పించాము. ఇకశనివారం రోజు
అందరూ ఉపవాసాలుండి అరిష్టం నివారణార్ధం ఉదయాన్నే రామనామ సంకీర్తనతో వాడలో ఊరేగింపు . జరపాలని నిర్ణయించాము. పొద్దున్నే కొద్దిమందితో మొదలైన సంకీర్తనాకార్యక్రమం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రారంభంలో తీసిన దృశ్యమాలిక ఇది .

ఆ నామ సంకీర్తనలో తన్మయులవుతున్నభక్తులనుచూశారు కదా !
ఇక సాయంత్రం సర్వారిష్టశాంత్యర్ధం శివాభిషేకం చేద్దామని నిర్ణయించాము. మనకిప్పుడు శివలింగం ఎలా స్వామీ ! పైగా మనకు మంత్రాలు రావుగా ? అని ప్రశ్నించారు మావాల్లు . ఏంపరవాలేదు . మనం ఆయన బిడ్డలం . చదువుకున్నవాడిపైనా చదువుకోని బిడ్డపైనయినా తల్లీదండ్రికి ఒకేరకమైన ప్రేమ ఉంటుంది . కనుక ఆర్తితో పలికే మన మాటే మంత్రం. మన గుండెలో వేదనే ఆయకు వినిపించే వేదఘోష . ఇక కలియుగంలో పార్ధివలింగానికి చేసే పూజే చాలాగొప్పదని పెద్దలు చెబుతున్నారు. కనుక మనం మట్టితో మహాదేవుణ్ణి అర్చిద్దాం అని చెప్పాను . ఉదయం నుండి ఉపవాసం ఉండి ఎంతో శ్రద్దగా ఎవరి శివలింగాన్ని వారు తయారు చేసుకున్నారు . నమశ్శివ గేయామృతంతో వారంతా చేస్తున్న అభిషేకానికి ఉబ్బితబ్బిబ్బయ్యాడా ఉబ్బులింగడు. వారితో పూజజరిపించే అవకాశాన్నిచ్చి ఈ లీలలో భాగం కల్పించావా తండ్రీ అని మనసు లోఆనందంతోకూడిన దుఃఖం తన్నుకుని వస్తుంది . కన్నీటిపొరలనుంచి చూస్తుంటే ఎన్నిజన్మల పుణ్యాలఫలమో తండ్రీ నిన్నిలా చేతులారా అర్చించునుకునే అవకాశమిచ్చావని ఆనందాంబుధిలో ఓలలాడుతున్న ఆభక్తులు .చూడండి ఇక్కడ






నిజం స్వామీ ....ఏ వేదంబుల్ చదివె లూత ?.........అంటూ చిన్న నాడు చదివిన పద్యానికి అర్ధం చూపావా అని నమస్సులుచెప్పుకున్నాను పదేపదే

4 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni September 4, 2011 at 7:25 PM  

చాలా మంచి కార్యం చేసారు.భగవత్ కౄపాకటాక్షం వారందరికి మీకు ..కూడా లభించాలని కొరుకుంటూ..అభినందనలు.

మనోహర్ చెనికల September 4, 2011 at 10:25 PM  

చాలా గొప్ప విషయం మాస్టరుగారు.

మోహన్ కిషోర్ నెమ్మలూరి September 5, 2011 at 9:31 PM  

చాలా బాగుంది మాస్టారు, ఒక్కసారి "నేను నీ వాడిని రామా" అని మ్రొక్కితే మన వల్ల ఎంత అపచారం/దోషం జరిగినా స్వామి కృప చేసి అక్కున చేర్చుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం.

రాజేశ్వరి నేదునూరి September 6, 2011 at 5:05 PM  

చాలా చక్కని విషయాలు చెప్పారు దుర్గేశ్వర్ గారూ ! భక్తి ఉన్న చోట భగవంతుడు తప్పక ఉంటాడు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP