రామున్ని నమ్మిన వారిని సదా హనుమ రక్షిస్తారు అనేది నిజమా ? ఇదిగో ప్రత్యక్ష ప్రమాణం
>> Monday, August 29, 2011
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం.......అని అంటారు కదా నిజంగా రామున్ని నమ్మినవారిని కంటికి రెప్పలా ఎలాకాపాడుతాడో స్వామి ఈ ఉదాహరణ చుస్తే తెలియటం లేదా ! ఈసంవత్సరం పీఠం లోజరిగిన హనుమత్ రక్షాయాగం లో హనుమజ్జయంతి నాడు పూర్ణాహుతిలోలో పాల్గొన్న ఒకరామభక్తుడు తన స్వానుభావాన్ని వ్రాశి పంపారు .ఆయన తనపేరు చెప్పొద్దనటం వలన ఆయన పంపిన మెయిల్ నుండి పేరు తొలగించాను . అయితే ఆరోజు యాగానికి వచ్చిన మన అంతర్జాల మిత్రులకు అతను పరిచితుడే .ఆయన పంపిన మెయిల్ యథాతథంగా చదవండి]
------------------------
గురువుగారు
నమస్తే ..
మొదటి శ్రావణ మంగళవారం నాడు గుర్తు చేశారు, కనీసం చివరి శ్రావణ మంగళ వారానికైనా అందించాలనుకున్నాను. చిత్తగించండి.
.............................
ఎనిమిదేళ్లకుపైబడిన నా సాఫ్ట్ వేర్ కెరీర్ లో నాకు ఒక విషయం బాగా అర్ధమైంది. ఈ ఉద్యోగం, కెరీరు, డెడ్ లైన్లూ, డెలివరీలూ, క్లైంట్లూ, బిల్లింగులూ వీటన్నిటి వెనక్కాల మన ప్రమేయం ఎంత మాత్రమూ లేని మనం ఏవిధంగానూ ప్రభావితం చేయలేని కొన్ని విషయాలు సూపర్ పవర్లు ఉంటాయి. అది అమెరికా ఆర్ధిక మాంద్యమే కావచ్చ్చు, మన టీముల్లో నడిచే గ్రూపు రాజకీయాలే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. వీటన్నిట్లో నెగ్గుకురావాలంటే మన పనిమీద మనకుండే నైపుణ్యమో, వృత్తిమీద ఉండే నిబద్ధతో సరిపోవు. మనల్ని వెనకుండి నడిపించే ఒక శక్తికావాలి.
నా జీవితానికి సంబంధించి నాకు నా ఆలోచనలూ నా ప్రణాళికలూ చాలా వరకూ ముందుగానే సిద్ధం చేసుకుని ఉన్నాను. నా 22 వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను, ఎనిమిదేళ్లతర్వాత ఈరోజుకున్న స్థితిగతులప్రకారంగా లెక్కవేసుకుంటే మరో పదేళ్ళు, పన్నెండేళ్ళు ఏకధాటిగా ఉద్యోగం చేస్తే 42 వ సంవత్సరందాటాక ఇక ఉద్యోగం చేయదలచుకోలేదు. ఆ వయసురాగానే ఇంత వత్తిడి ఉన్న ఉద్యోగాన్ని ఇకచేయదలచుకోలేదు. నేను తప్పుకుని ఆ వత్తిడిని భరించగలిగి, నాలా ఔత్సాహికుడైన మరో యువకుడికి ఆ అవకాశం ఇవ్వదలుచుకున్నాను.
ప్రణాళిక బానే ఉంది, కానీ అది అమలుజరగాలంటే దానికి బలమైన పునాది పడాలి. 9 to 6 ఉద్యోగమొక్కటే సరిపోదు, నా లక్ష్యం చేరుకోవడంలో నాకు ఎదురవబోయే ప్రతీ అవరోధం మీదా నాకు ఒక అవగాహన ఉంది. ఆ ప్రకారంగా రిస్కులు తీసుకోవడానికి, పడినా లేచి నిలబడడానికి ఇదే సరైన సమయం అనిపించింది.
ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను.
ఒక ప్రణాళిక ప్రకారం 365 రోజులపాటు కష్టపడితే ఒక పునాది ఏర్పడుతుంది, తర్వాత కొంతమంది సాయం తీసుకుని దాన్ని మరికొన్నాళ్ళు స్టెబిలైజ్ చేయగలిగితే నేను ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది అనుకున్నాను.
అయితే అన్నీ అనుకున్నట్లు జరగలేదు, ఒక తప్పటడుగు పడింది. నా వల్ల.. కేవలం నా వల్ల.. నా క్షణికావేశం మూలాన సాధించిన ప్రగతి అంతా నేలపాలయి మళ్ళీ సున్నా నుంచీ నిర్మించుకునే పరిస్థితి వచ్చింది.
చిన్నప్పుడు మా అమ్ముమ్మ రోజూ రాత్రివేళ భోజనం ముగిశాక రామాయణం కధలు చెప్పేది. నాకు ఒక 7,8 సంవత్సరాల వయసులో రామదాసు, తానీషా కధ తెలుగువాచకంలో చదివి నేను ఒక సందేహం అడిగాను. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము, ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు, ఎవడబ్బసొమ్మని కులుకుతు తిరిగావు రామచంద్రా అని రామదాసు తిట్టాడు కదా? అయినా ఆయనికి రాముడు దర్శనం ఎలా ఇచ్చాడు అమ్ముమ్మా అని! "ఆయన అలా తిట్టాడు కాబట్టే అన్ని రోజులు చెరసాలలో అఘోరించాడు, పొరపాట్న కూడా దైవదూషణ తగదు, ఫలితం అనుభవించక మానవు” అని చెప్పింది.
ఒకటికి పదిసార్లు నన్ను నేను తిట్టుకోవడం నాకు ఇష్టంలేదు. పొరపాట్లు జరుగుతాయి, కొన్నిసార్లు అలా జరిగిపోతాయి, నేను దేవుణ్ణికాను, ఏ గొప్పతనమూ లేని ఒక మనిషిని, నా వల్ల మరిన్ని పోరపాట్లు జరుగుతాయి. కానీ చేసిన పొరపాటుని క్షమించకుండా దాన్ని మరింతగా పెంచేసి, దాని పర్యవసానాలని నాకు అంత త్వరగా, అంత కఠినంగా విధిస్తున్న దేవుణ్ణి అంతకన్నా ఎక్కువసార్లు విమర్శించుకున్నాను. "ఏమయ్యా రామయ్యా ! ఏదో తప్పుచేశాను సరే, నువ్వునాకు అనుక్షణం అందిస్తున్న సంకేతాలని గుర్తించకుండా ఏదో మాయలో పడి అలా ప్రవర్తించాను సరే, నా మీద కొంచెం కూడా దయలేదా? మరీ ఇంత కఠినమైన పరిక్షపెడతావా? అంటూ”
ఇక ఒకవైపు మనసు కకావికలంగా తయారైంది. సుఖంగా గడుస్తున్న జీవితాన్ని ఒక్క స్వయం కృతాపరాధంతో కష్టాల్లోకి నెట్టుకున్నాను, ఇక నా చేతిలో ఏమీ లేదు, అంతా మనల్ని నడిపిస్తున్న సూపర్ పవర్ చేతిలో, మన కార్పొరేట్ కెరీర్ ని శాశించే సూపర్ పవర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. నేను చేయగలిగింది వేచి చూడడమే. నాకు అస్సలు నచ్చని పరిస్థితి అది, నా వంతు ప్రయత్నంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను.
అదే సమయంలో నాకు ఒక గురువుగారినుండీ ఫోన్ వచ్చింది. మరి ఆయనకి నామీద ఎందుకని అభిమానమో నాకు తెలీదు, ఆయనకి తెలిసున్న అంతమంది కుర్రాళ్ళలో నాకున్న ప్రత్యేకతేంటో నాకుతెలీదు. నన్ను పీఠానికి రప్పించడానికి గత పదినెలలుగా ఆయనతో పలికిస్తున్న శక్తికున్న గొప్పతనమేమిటో నాకు తెలీదు. హనుమజ్జయంతిని పునస్కరించుకుని 40 రోజులపాటు వ్రతం చేస్తున్నాం, ఫలానారోజు మొదలుపెడుతున్నాం, నువ్వు రావాలి అని మైల్ వచ్చింది. రాలేను గురువుగారు అని బదులిచ్చాను, సరే కనీసం దీక్ష ముగించేరోజుకైనా సరే రావాలి, పూర్ణాహుతికి ఉండాలి అని మరో మైల్ వచ్చింది. అక్కడితో ఆగలేదు కనీసం 4 ఫోన్లు వచ్చాయి, నేను దేశంగాని దేశంలో ఉన్నా, మీటింగులో ఉన్నా, జిమ్ములో ఉన్నా, నన్ను వదల్లేదు, వెతుక్కుంటూ వచ్చేశాయి ఆ పిలుపులు.
సరే కానీ అనుకున్నాను, అక్కడికి వెళ్ళి ఆ హనుమంతుడితోనే చెప్పుకుందాం నా బాధలు అనుకున్నాను. కనీసం ఆయన సాన్నిధ్యంకోసం, గురువుగారి సంతృప్తికోసం, యఙ్ఞం లో పఠించే వేదమంత్రాల ధ్వనికోసం, పాప ప్రక్షాళన చేసే పూర్ణాహుతి సెగకోసం, ఒక పవిత్రమైన కార్యంలో పాలుపంచుకున్న అనుభూతికోసం, అన్నిటికీ మించి అన్నిసార్లు పిలిపించిన అమ్మ పిలుపుకోసం బయలుదేరక తప్పదన్న నిర్ణయానికి వచ్చాను.
పొద్దున 9 దాటితేగాని నిద్రమెలకువారాని వాడికి సరిగ్గా తెల్లవారుఝామున నాలుగు గంటలకి మెలకువ వస్తుందే. గంట నుంచి కురుస్తున్న భోరున వర్షం ఈ అభాగ్యుడు బయటకి వచ్చీ రాగానే ఎవరోపిలిచినట్లు ఆగిపోతుందే? నిండా గుప్పెడు లేని పెట్రోలు పదికిలోమీటర్లు ఆగకుండా నడిపిస్తుందే, 5 గంటల 5 నిముషాలకి స్టేషను వదిలివెళ్ళిపోవాల్సిన బస్సు పదినిముషాల పాటు ఆగిపోయి వీణ్ణి ఎక్కించుకుని కాని బయల్దేరదే? తోవతెలియక ఎవరిని సాయమడిగినా నేను చేప్తా నేను చెప్తా అని వంతులేసుకుని చెప్తారే, మారాల్సిన మూడు బస్సులు పట్టుమని ఒక్క నిముషం కూడా ఆలశ్యం చేయకుండా పోటిలుపడి ఒకదానికొకటి అందిస్తాయే .. అన్నిటికీ మించి...
చేరడానికి గంటక్రితమే అయిపోవాల్సిన పూర్ణాహుతి, నేను చేరుకున్న పదినిముషాలకి మొదలౌతుందే, నేను రావడం ఆలశ్యమయినందుకు కోప్పడతాడనుకున్న హనుమంతుడు, సరిగా సమయానికొచ్చేశావురా అని చిరునవ్వుతో పలకరిస్తాడే? కన్నీళ్ళతో ఆయనముందు నిలబడి వేదుకున్న అభ్యర్ధనని ఆరామయ్యకి మర్చిపోకుండా అందజేస్తాడే, ఎంత త్వరగా ఒక కారుమబ్బు జీవితాన్ని కమ్ముకుందో అంతే త్వరగా విడగొట్టేస్తాడే, సరిగ్గా 96 గంటల్లో ఇదిగో నువ్వెళ్ళే దారిదే అని వేలుపట్టి నడిపించాడే !!!
ఎవరిమాయ ఇది? ఎవరి మహిమ ఇది?
ఒక్క పూజతో కష్టాలు తొలగిపోతాయా? ఒక్క సారి యఙ్ఞంలో కూర్చుంటే అనుకున్నవి జరిగిపోతాయా? పూర్ణాహుతి సెగ ఒంటికి తగిల్తే అప్పటిపవరకూ చేసినపాపాలు హరించుకుపోతాయా?
కాకపోవచ్చు ............కానీ ఒకటిమాత్రం నిజం ..
నమ్మి వెంటవచ్చిన వాణ్ణి విడిచేదిలేదని నా రాముడు మరోసారి నిరూపించాడు.
చుక్కనడిగా దిక్కునడిగా .. చెమ్మగిల్లిన చూపునడిగా ..
నల్లపూసైనాడు దేముడు నల్లని రఘు రాముడు[ఆయన వద్దంటే పేరు తెలియజేయటం లేదుగానీ వాస్తవానికి భగవంతుని పట్లమనకృతజ్ఞత ఎలుగెత్తి చాటటానికి చాటు అవసరం లేదనేది నా అభిప్రాయం]
11 వ్యాఖ్యలు:
mee anubhavam adbhutham. meeru namminadi nijam.
జై శ్రీరాం
జై శ్రీరామ్..
రాజ్ కుమార్
అద్భుతం!
జై శ్రీరాం
జై శ్రీరాం
రామ ద్వారె తుమ రఖవారె
హోతన ఆజ్ఞా బిను పైఠారే.......
ఆ స్వామి ఎన్నడూ ఎవరినీ వదలడు. స్వామి ఎప్పుడూ మనకి దూరంగా వెళ్ళడు. సర్వకాల సర్వావస్థలలోనూ మనమే రకరకాల కారణాల వల్ల ఆయనకి దూరంగా జరుగుతాం. తద్వారా ఆయన ఉనికిని కోల్పోతాం. మళ్ళీ ఎప్పుడైనా మనం దగ్గరగా వెల్తే ఆ స్వామి అనుగ్రహాన్ని చూస్తాం.
బాగుంది. భగవంతుడు నమ్మిన వారిని వదలడు
అద్భుతమయిన అనుభవము!
జయ జయ హనుమంత!
Excellent
అద్భుతం, అపూర్వం.
దైవం తలుచుకుంటే క్షణంలో పరిస్థితులు మారిపోతాయి.
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము, ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు, ఎవడబ్బసొమ్మని కులుకుతు తిరిగావు రామచంద్రా అని రామదాసు తిట్టాడు కదా? అయినా ఆయనికి రాముడు దర్శనం ఎలా ఇచ్చాడు అమ్ముమ్మా అని! "ఆయన అలా తిట్టాడు కాబట్టే అన్ని రోజులు చెరసాలలో అఘోరించాడు.
"మీరు తప్పుగా విన్నారు . శ్రీ రామదాసు చెరసాల కు వెళ్ళింది చిలుక ను పంజరం లో పెట్టినందుకు. "
జై శ్రీరాం
Post a Comment