భగవంతుణ్ని చేరడమెలా?
>> Thursday, August 18, 2011
- చిమ్మపూడి శ్రీరామమూర్తి జ్ఞానమార్గం రెండు రకాలని ముండకోపనిషత్తు వివరించింది. 1. పరవిద్య, 2. అపరవిద్య. భౌతిక జీవన సౌకర్యాలు- అంటే ధనం, కీర్తి, అధికారం, ఆహారం, శయనం, భోగం, వైభోగం... ఇలాంటివన్నీ అపరవిద్యకు సంబంధించినవి. ఇంద్రియాల ద్వారా పొందే ప్రపంచజ్ఞానమిది. అపరవిద్య ద్వారా పొందిన జ్ఞానం అనిత్యమైంది. దీనివల్ల పరమాత్మ లభించడు. అవివేకులు ఈ మార్గం కోరుకుంటారు. బ్రహ్మజ్ఞానం పరవిద్య ప్రధాన లక్షణం. ఇది వివేకవంతులు ఎంచుకునే మార్గం. ఇది శాశ్వతమైనది. పరవిద్యకు వేదాలు సాధనాలు. వేదాలు మార్గనిర్దేశనం చేసేవి మాత్రమే. భగవంతుని దర్శించే ప్రయత్నం ఎవరికి వారు చేసుకోవలసిందే. జ్ఞానయోగమంటే మన పూర్వులు ఉద్దేశించిన ఆత్మజ్ఞానమనే గ్రహించాలి. ఈ ఆత్మజ్ఞానమే పరమాత్మజ్ఞానం. ఆత్మను తెలుసుకోవడమంటే పరమాత్మను తెలుసుకోవడమే! నువ్వుల్లో నూనెలా, పెరుగులో వెన్నలా అంతరాత్మలోనే దైవం ఉన్నాడు. సాధన వల్లనే దైవదర్శనం సంప్రాప్తమవుతుంది. ఆత్మజ్ఞానం పొందడానికి సాధనతో పాటు స్వచ్ఛమైన ప్రవర్తన, పరిశుద్ధమైన శీలం, ఇంద్రియ నిగ్రహం కూడా అవసరమని భగవద్గీత చెబుతోంది. ఆత్మజ్ఞానం పొందినవాడికి కర్మవాసనలంటవు. అప్పుడే అతను జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయినవాడు సకల జీవులపట్లా సమదృష్టిగలవాడై ఉంటాడు. భగవంతుని చేరుకోవడానికి సూచించిన రెండో మార్గం కర్మమార్గం. కర్మ అంటే పని లేక చర్య. జన్మించిన ప్రతి జీవీ కర్మ చేస్తూనే ఉంటుంది. కర్మాచరణంనుంచి మానవుడు కూడా తప్పించుకోలేడు. ప్రతి కర్మకూ ఫలితముంటుంది. మంచి కర్మకు మంచి ఫలితం, చెడ్డకర్మకు చెడు ఫలితం లభిస్తుంది. సత్కర్మలే చేసి సత్ఫలితాలను సముపార్జించమని గీతాకారుడు భగవద్గీతలో ప్రవచించాడు. దుష్కర్మలను చేసేందుకు ప్రేరేపించే రజస్తమోగుణాల మూలతత్వాలైన కామక్రోధాలను దూరంగా ఉంచితే పరమాత్మ మరింత చేరువవుతాడని గీతాకథనం. అంతేకాదు. 'కర్మ చేస్తూ వెళ్లు, ఫలితాన్ని నాకే వదిలిపెట్టు...' అంటాడు వాసుదేవుడు. ఫలితం మీదనే ధ్యాస పెట్టుకుంటే కర్మ కొనసాగదు, కర్మమీద ఏకాగ్రత నిలవదని తాత్పర్యం. సర్వకర్మలను భగవదాయత్తం చేసి భగవంతుణ్ని శరణువేడితే కర్మబంధం తెగిపోవడమే కాక, జన్మపరంపరనుంచి విముక్తి కూడా లభిస్తుందన్నది పెద్దల మాట. ఇక మూడో మార్గం భక్తి. పరమాత్మ పట్ల అపరిమితమైన ప్రీతినే భక్తి అంటాం. భగవంతుడు కరుణామయుడు, ప్రేమమూర్తి. ఆ ప్రేమమూర్తి కేవలం భక్తిలతలకే బందీ అవుతాడు. పూజ్యులయందు మనసు చేర్చినప్పుడు కలిగే అనురాగపూర్వక వృత్తిని 'భక్తి' అంటారని నారద భక్తిసూత్రం నిర్వచించింది. భక్తిని నవవిధాలుగా చెబుతారు. భక్తి పదకొండు విధాలని నారద భక్తి సూత్రాలు నిర్వచించాయి. 'పత్రం, పుష్పం, ఫలం తోయం'- ఏది సమర్పించినా హృదయనైర్మల్యంతో, ఏకాగ్రతతో నివేదిస్తే అదే నాకు సంతోషదాయకం, మీకు మోక్షదాయకం అన్నాడు పరమాత్మ. సత్వరజస్తమోగుణాలను అతిక్రమించి, జన్మమృత్యుజరాదులనుంచి విముక్తుడై అమృతత్వం పొందుతాడు భక్తుడు. ఈ మూడు మార్గాల్లో భక్తిభావం అంతర్లీనంగా ఉండితీరాలి. లేకపోతే ఆ మూడూ నిరర్థకాలే! భగవంతుని రూపాన్ని మనసులో సుప్రతిష్ఠితం చేసుకొని, సజ్జనుడై, భగవత్ప్రేమలో పూర్తిగా నిమగ్నమైనవాడు పరిపూర్ణభక్తుడు. అతనిది పరిణతి చెందిన భక్తి. అన్ని మార్గాల్లోనూ భక్తి మార్గమే అత్యంత శక్తిమంతమైనది. భగవంతుని చేరేందుకు ఇంతకుమించి దగ్గరి దారి లేదు. భక్తికి భగవంతుడు 'వశం' అవుతాడు. భక్తి లేకపోతే నరుడు 'శవం' అవుతాడు. భగవంతుణ్ని చేరే నాలుగో మార్గం రాజయోగం. ఇది సాధకుణ్ని భగవంతుడితో అనుసంధానం చేస్తుంది. శరీరంలో కుండలిలో నిద్రాణంగా ఉన్న ప్రాణశక్తిని మేల్కొల్పి సుషుమ్ననాడి ద్వారా స్రహస్రారంలోని చైతన్యశక్తితో అనుసంధానించడమే రాజయోగం. ఇది చాలా కష్టసాధ్యమైన మార్గం. ప్రాణశక్తిని ఉద్దీపం చెయ్యడం ద్వారా శుద్ధచైత్యన్యస్థితిని అందుకోవడమే రాజయోగ లక్ష్యం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార, ధారణ, ధ్యాన, సమాధులనేవి రాజయోగానికిగల ఎనిమిది సోపానాలు... వీటిని అధిరోహించటమే రాజయోగసాధనమవుతుంది. భగవంతుణ్ని చేరుకోవడానికి ఈ నాలుగు మార్గాల్లో ఏదైనా అనుసరణీయమేనని మన పూర్వజులు అనుభవపూర్వకంగా చెప్పారు. చిత్తశుద్ధి, ఏకాగ్రత, ఆత్మసమర్పణ భావం, విశ్వాసం, భక్తికి సంపూర్ణతనిచ్చే లక్షణాలని సనాతన ధర్మం చెబుతోంది. ఇవి మినహాయించి చేసే ఆడంబరాలు, దానధర్మాలు, మొక్కుబడులు, ఉపవాసాలు, వ్రతాలు, భజనలు, అర్చనలు, ఆరాధనలు- అన్నీ నిరర్థకాలేనని గ్రహించాలి. |
|
|
1 వ్యాఖ్యలు:
Not funny at all but there is nothing called 'yoga margam.' It is called rAja yOga. Seems like yoga is changing fast and daily. A guy comes to NY and says now it is 'Bikram yoga.' Great stuff
Post a Comment