శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చెప్పలేదంటనకపొయ్యేరు ......... బుధులార మీరు....

>> Saturday, May 29, 2010

మనం సంవత్సరం మొదట్లోనే చెప్పుకున్నాం . ఇది వికృతి నామ సంవత్సరం . భూమ్మీద సంభవిమ్చనున్న పరిణామాలను ,దుర్ఘటనలను గూర్చి పంచాంగ కర్తలు ,శాస్త్రకారులు చేసిన హెచ్చరికలను చెప్పుకున్నాం .
ఇక వరుసగా మొదలైన దుర్ఘటనలను మనం గమనిస్తూనే ఉన్నాం . ఇక రాబోయే మూడు నెలలో మరింత ప్రమాదకరమైన స్థితులను చూడబోతున్నాము. ఈ పరిస్థితులను మనం ఎదిరించలేము, తప్పించలేము . ఒకరకంగా చెప్పాలంటే మన బంధువర్గం,డబ్బు కీర్తి,హోదాలు,మేధస్సు కూడా ఎదురైన ప్రమాదాన్నుంచి తప్పించలేక పోవచ్చు ్,ఒక్క భగవన్నామం తప్ప.
సూర్యుడు విపరీతంగా మండుతున్న ఈ వేసవి లో నైనా మన ప్రయాణాలు తప్పవు. మనం ఎలాగూ సూర్యప్రతాపాన్ని ఆపలేము . కానీ గొడుగు పెట్టుకుని మనం ఆ సూర్యప్రతాపాన్నుంచి తప్పించుకోవచ్చు. అలాగే భగవంతునుకి శరణాగతులమైతే అనివార్యమైన ఆపదలనుండైనా ఉద్దరింపబడవచ్చు.
మనం ఈ సత్యాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జరిగేయి జరుగుతాయి మనకళ్లముందే .

ఈ సమయంలో హనుమంతుని ఆశ్రయించి ఆయనరక్షనలో ఉండటం సర్వత్రాశ్రేయస్కరమని పెద్దలమాట .భక్తజన రక్షకుడు అగు హనుమంతుని ఆశ్రయించి లోకాన సర్వులూ సకల శుభాలు పొందాలని వేడుకుంటున్నాను...సర్వే జనా సుఖినభవంతు .

Read more...

శ్రీ గణపతి సచ్చిదానంద కృత హనుమాన్ చాలీసా(తెలుగు)

>> Friday, May 28, 2010


జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
------------------------------------------------------


శ్రీ గురుచరణ సరోజ రజస్సుతో
మనసను అద్దము శుచి గావించి
రఘుపతి చరితము గానము చేయుచు
నాలుగు విధముల ఫలములనందుము

హనుమను విడువక తలచిన భక్తిగ
బుద్ధిహీనతలు తొలగును నిజముగ
బుద్ధిని బలమును విద్యనొసంగును
వికారదూరుడు ఆ ఆంజనేయుడు

౧) జయహనుమాన జ్ఞానగుణసాగర!
జయకపీశ మము కావర దేవర!!
౨) రామదూత అతులిత బలవంతా!
హనుమా నీవే మా బలమంతా!!
౩) మహా వీర విక్రమ భుజశాలీ!
కుమతిని చెరుపుట నీకది కేళి!!
౪) బంగరువన్నెతో వెలిగెడి దేవా!
గురువై మమ్మిక కావగ రావా!!!
౫) చేతను దాల్చిన వజ్రాదులతో!
విరాజమానుడవీవొక రీతి!!
౬) శంకర అంశజ కేసరి నందన!
తేజోరాశీ అంజని చందన !!
౭) విద్యావారిధి బహుగుణచతుర!
కార్యసిద్ధి కర కపివర వీరా!!
౮) భక్తితో రాముని కధలను వింటివి!
హృది సీతాపతి ఉన్నాడంటివి!!
౯) సూక్ష్మరూపమున సీతను పోల్చి!
పెద్దరూపమున లంకను గాల్చి!!
౧౦) భీమ రూపమున అసురుల గూల్చి!
రామకార్యమును చేస్తివి గెల్చి!!
౧౧) హే సంజీవన లక్ష్మణజీవన!
రామాలింగన పులకితభావన!!
౧౨) రఘుపతి కీరితి పెంచితివయ్యా!
స్వామికి భరతసమానుడవయ్యా!!
౧౩) వేయిపడగల ఫణి కీర్తించెను!
అదివిని రాముడు కౌగిట ముంచెను!!
౧౪) సనకాదులు బ్రహ్మాది సుధాదులు!
నారద తుంబురు శారాదాదులు!!
౧౫) ఇంద్రయమాదులు దిక్పదయుక్తులు!
కవులందరు నినుపొగడనశక్తులు!!
౧౬) సుగ్రీవుడు నీ మేలును పొంది!
రాముని కలిసె రాజ్యము పొందె!!
౧౭) అభయమునంది విభీషణుడేలె!
ఆ లంకేశుడు భయమున తూలె!!
౧౮) భానుని ఫలమని తలచి గ్రహించి
హనుమన్నాముడవైతివి దేవా!!
౧౯) ప్రభు ముద్రికను మోమున దాల్చి!
జలధిని దాటగ అచ్చెరువేమి!!
౨౦) జగమున దుర్గమ కార్యములన్నియు!
సుగమములాయెను నీ కృపతోడను!!
౨౧) రాముని ద్వారమునందున ఉందువు!
నీ ఆనతితో కదులును లోకము!!
౨౨) నిను శరణనగ కలుగును సుఖములు!
నీ రక్షణలో తొలగును భయములు!!
౨౩) నీ తేజోకర హుంకారముల!
కంపనమొందెను త్రిజగతి భయముల!!
౨౪) భూతప్రేత పిశాచములన్నియు!
నీ నామంబును పలికిన విడుచును!!
౨౫) రోగ వినాశము ,పీడా హరణము!
చేయును హనుమా నీ రఘుమంత్రము!!
౨౬) సంకటములనువు విడిపించెదవు!
ధ్యానమునందున మది గుడి వుందువు!!
౨౭) రాముడే గమ్యము ముని కులమునకు!
నీవే గమ్యము మాకందరకు!!
౨౮) నిను సేవించిన కోర్కెలు తీరును!
ముక్తిపదంబది జీవులకందును!!
౨౯) నీదు ప్రతాపము నాలుగు యుగముల!
సిద్ధిని పంచును,కీర్తిని పెంచును!!
౩౦) సాధురక్షకా,దుష్టశిక్షకా!
అసురనాశకా రామసేవకా!!
౩౧) అష్టసిద్ధి నవనిధులను ఒసగే!
హనుమకు సీతా కృపతో వెలిగే!!
౩౨) రమరసాయనమున్నది నీ దరి!
నువు కొలువుండుము హనుమా మాదరి!!
౩౩) నిని భజియించిన రాముడు దొరకును!
శతశతజన్మల పాపము తొలగును!!
౩౪) రాముని కొల్చిన అవసానమున!
భక్తుడు వెలుగును హరిధామమున!!
౩౫) మనసున హనుమను నిలిపిన సుఖము!
మరుజన్మములిక కలుగవు నిక్కము!!
౩౬) నీ స్మరణముచే కష్టము తీరును!
ఓమ్ బలవీరా పీడలు తొలగును!!
౩౭) జైజైజై హనుమాన గోసాయీ!
సద్గురురూపా బహుఫలధాయీ!!
౩౮) ఈ స్తోత్రమ్మును శతపర్యాయము!
చదివిన మోక్షము శివుడే సాక్ష్యము!!
౩౯) కవి వాల్మీకులు,తులసీదాసులు!
కరుణను తలచిరి ముక్తిని పొందిరి!!
౪౦) ఇది తెనిగించెను సచ్చిదానందుడు!
దీనిని చదివిన సచ్చిదానందము!!

పవన తనయ,సంకట హరణ, మంగళ మూరతి రూపా
సీతారాముల హృదయమునందున నిలిపిన వానర సురభూపా!!

Read more...

హనుమంతుడొక్కడు బ్రతికుంటే చాలు మనమందరమూ బ్రతికినట్లే...


సంగ్రామంలో ఇంద్ర జిత్తు యుద్ధరంగం లో ప్రవేశించాడు. ఆతని దివ్యాస్త్ర సంపద గూర్చి తెలిసిన విభీషణుడు భయపడుతున్నాడు. ఘోరయుద్ధం ప్రారంభమైంది. విజృంభించిన రావణసుతుడు వివిధ అస్త్రాలతో విరుచుకపడ్డాడు శత్రుసేనలపై విరుచుకపడ్డాడు . అరవై ఏడు కోట్ల వానరులు మరణించినవారు,తీవ్రగాయాలపాలైనవారు ,ఎముకలువిరిగి కూలినవారు,మూర్చనొందినవారు భీభత్సంగా తయారైంది యుద్ధరంగం. సాక్షాత్తూ రాముడే లక్ష్మణునితో ఈరోజు వీనిని యుధ్ధంలో నిరోధించలేము అని చేతులెత్తివేసినాడు. ఈతని ప్రభావాన్ని అంచనా వేసిన విభీషణుడు ముందుగనే పక్కకుతప్పుకున్నాడు. ఎదిరించి నిలచినవారిలో హనుమంతుడొక్కడే స్మృతి కలిగి ఉన్నవాడు. విజయగర్వంతో ఇంద్రజిత్తు వెనుదిరిగిన తరువాత పరిస్థితి చక్కదిద్దటానికి విభీషణుడు ,హనుమంతుడు యుద్ధరంగమంతా కలియదిరుగుతున్నారు. ఒకచోట పూర్తిసృహలోకి రాలేక పడిఉన్న జాంబవంతుని చూశారు. విభీషణుడు ఆందోళనగా తాతా! ఎలా ఉన్నావు అని పలకరించాడు .ఆయన కనురెప్పలు ఎత్తలేక నాయనా గొంతును బట్టి నువ్వు విభీషణుడవని పోల్చుకుంటున్నాను అన్నాడు. ఆయన అవును తాతా నేను విభీషణుడనే నమస్కరిస్తున్నాను అన్నాడు
హనుమంతుడు క్షేమముగా ఉన్నాడుకదా అని అడిగాడు ఆ వృద్ధయోధుడు
ఆశ్చర్యపోయాడు విభీషణుడు. అదేమిటి తాతా ! నీవు శ్రీరాముని క్షేమాన్ని అడగలేదు ! లక్ష్మణుని గూర్చిగాని కనీసం వానర ప్రభువైన సుగ్రీవుని క్షేమమునుగూర్చి కూడా అడగలేదు ...కానీ హనుమంతుని గూర్చి ఇంత ఆందోళన చెందుతున్నావు. ఈ గాయాలతో మతిచలించ లేదు కదా ? అని ప్రశ్నించాడు .

నాయనా ! వాని శక్తి నీకు తెలియదు . హనుమంతుడు ఒక్కడు జీవించి ఉంటే చాలు మనందరమూ రక్షింపబడతాము. అతను మరణించి మనమందరమూ బ్రతికినా మరణించినవారి క్రిందే లెక్క ! అన్నాడు.
ఆమాటలు విన్న హనుమ వెంటనే ఆయన పాదాలు తాకి తాతా ! హనుమ నీకు నమస్కరిస్తున్నాడు అని , పలికాడు.

హనుమా ఈ కష్టకాలంలో ఇంకా ఆలస్యం చేయకు . ఉన్నపలంగా బయలుదేరి ఉత్తరదిక్కుగా వెళ్ళి క్రౌంచపర్వతం అవతల ఉన్న సంజీవనీ పరవతం మీద ఉన్న ఔషధులను తెమ్మంటాడు . ఆయన సూచనననుసరించి అతి వేగంగా వెళ్ళి హనుమ ఆ మూలికలను గుర్తించలేక పర్వతం తో సహా పెకలించుకుని వస్తాడు. వానరులను పునరుజ్జీవులను చేసి స్వస్థత పరుస్తాడు.

{ ఈ రోజు పీఠానికి వచ్చిన మన బ్లాగర్ చెనికల మనోహర్ [న్యూజింగ్స్]ఈ విషయమై చర్చజరిపి హనుమంతుని ప్రభావాన్ని గూర్చి మాట్లాడుతుంటే స్వామి మహిమ కదా అని వ్రాసి ఇక్కడుంచుతున్నాను , జై హనుమాన్ .]

Read more...

హరహర మహా దేవా ! ఏమిటీ అనర్ధం !?

>> Wednesday, May 26, 2010

మరొక అనర్ధం సంభవించింది. శ్రీ కాళహస్తీ శ్వరుని గాలి గోపురం కుప్పకూలింది . దేశానికి చుట్టుకో బోతున్న మహోపద్రవానికి సూచనకాదుకదా !? అని భక్తజనం తల్లడిల్లుతున్నారు . భౌతిక అభివృద్ధి చూసుకుని మిడిసిపడుతున్న మనకు నైతిక విలువలు నెర్రెలిచ్చి కుప్పకూలనున్నామని హెచ్చరిక కాదుకదా ? లయకారకుడగు పరమేశ్వరుని సన్నిధిన జరిగిన ఈ అనర్ధం లోకోపద్రవకారకం కాకుండా కాపాడాలని ఆమృత్యుంజయునే శరణు వేడుదాము ......హరహర మహాదేవ .

Read more...

హనుమంతుని ఆకలిని తీర్చగలగటం సాధ్యమా ! ?

వానరులందరికీ కడుపునిండా భోజనం పెట్టాలని ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన విందు ప్రహసనం రసాభాసగా ముగిసింది . పాడు కోతులు బుద్ధిగా కూర్చోకుండా భీభత్సం సృష్టించాయి . వీటి బుద్ధిపోనిచ్చుకున్నాయి కాదు. అయినా వాటిననుకుని ఏం లాభం ? ఒక పక్కన మాఆయన చెబుతున్నా వినకుండా విందు ఏర్పాటు చేసిన నన్ననుకోవాలి ! ఇలా అమ్మవారు జరిగిన సంఘటనను తలుచుకున్నప్పుడలా బాధపడుతున్నారు. ఇంకొక పక్క ఆయనేమో బాగా జరిగింది నీ విందు కార్యక్రమం అన్నట్లు ముసిముసి నవ్వులు నవ్వుతూ , ఎగతాళి చేస్తున్నట్లనిపిస్తుంది ఆతల్లికి .
అయినా కోతులందరూ హనుమలాగా ఉంటారా ? నాపిచ్చిగాని . పాపం హనుమచూడు వెర్రి నాయన మామాట జవదాటడు . ఏదైనా సత్కరించాలన్నా అలాంటి బుద్ధిమంతుని సత్కరించాలి. అందులో అందరు వానరులొకపెట్టయితే ,హనుమంతుడొక్కడూ ఒకపెట్టు .కాబట్టి నా చేతులారావండి బిడ్దకు కడుపునిండా అన్నం పెట్టాలని సీతామాత నిశ్చయించుకుంది. హనుమంతుడైతే బుద్ధిమంతుడు అల్లరి చేయదని అమ్మ నమ్మకం . ఇక ఈవిషయం ముందుగా చెప్పటం ఎందుకులే అని రాములవారికి కూడా చెప్పకుండా మరొకమారి హనుమకు భోజనం పెట్టాలని ఏర్పాట్లు చేసింది .
హనుమను పిలచి నాయనా హనుమా ! రేపు నీకు నేను స్వయంగా వండి వడ్డిస్తాను భోజనానికి ఇక్కడకే వచ్చెయ్ నాయనా అని చెప్పింది .
నాకు మీ అభిమానం తో కడుపునిండింది చాలమ్మా ! రామనామస్మరణమే నాకు భోజనం .మీకెందుకు శ్రమ అని నసిగాడు హనుమ.
అయ్యో ! అదేమిటి నాయనా నీకు కడుపునిండా అన్నం కూడా పెట్టలేననుకున్నావా ? నాకోసం ఎంత శ్రమ పడ్దావు నువ్వు . నీకోసం వండి వడ్డించటం నాకు శ్రమెందుకవుతుంది ?రేపు నేను వడ్డిస్తే నీవు కడుపునిండా భుజించాల్సిందే అని పట్టుబట్టింది అమ్మవారు.
కానీ నాకు కొంచెం ఆకలెక్కువ తల్లీ . తినటం మొదలెడితే కడుపు నిండినదాకా తినాలి నేను సందేహం వ్యక్తం చేశాడు పవనసుతుడు .
ఏం పరవాలేదు నాయనా ! నీకు కావాల్సినంత వడ్డిస్తాను సరేనా అని హామీ ఇచ్చిందా లోకమాత .
సరే నమ్మా ! నీ మాట ఉల్లంఘించగలనా ? నాకడుపు పట్టినదాకా తృప్తిగా భుజిస్తాను అని వినయంగా పలికాడు హనుమ.
తన దు:ఖాన్ని తొలగించినవాడు. పుత్రసమానుడు అగు హనుమకోసం ఆతల్లి స్వయంగా భారీగా వంతకలు తయారు చేసి భోజనానికి పిలచింది .
హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు . ఆపోశన పట్టాడు. భోజనం చేయటం మొదలయింది .పరిచారికలు అందిస్తుండగా విస్తర్లో వడ్దనలు మొదలయయ్యాయి. ఒక్కొక్కటిగా వస్తున్న వంటకాలు ఆవురావురుమని లాగించేస్తున్నాడు అంజనీ పుతృడు . సంతోషం గా వంటకాలు పళ్ళెరాలలో తెప్పించి వడ్డిస్తున్నది .. ఎంత ఆకలితో ఉన్నాడొ పిచ్చి నాయన అనుకుంటూ ఆతల్లి. ప్రవాహంగా వస్తున్న వంటకాలన్నీ జ్వలిస్తున్న అగ్నిలో పడిన ఘృతంలా ఆహుతవుతున్నాయి హనుమనోటిలో కెళుతూ. అమ్మవారు ఆశ్చర్యపోతున్నారు ,ఇదేమి తిండి అని
వడ్దన ఆగినప్పుడల్లా అమ్మా ! ఇంకొంచెం అని అడుగుతున్నాడు హనుమ.తెప్పించి వడ్డిస్తున్నది .వండినవి అయిపోతున్నాయి .
పరిస్థితి గమనించి వంటవాళ్లు కొత్తగా వండుతూనే ఉన్నారు . చాలటం లేదు . వంటవాళ్లకు చెమటలు పడుతున్నాయి. అమ్మవారికి అయోమయంగా ఉంది . వండినవి వండనివి ,కాయగూరలు పండ్లు ,వంట పదార్ధాలతో సహా ఉరుకులపరుగులమీద పరిచారకులు తెచ్చి పోస్తున్నా ఆగటం లేదు. సేవకులంతా రంగం లోకి దిగి ధాన్యం తోసహా తెచ్చిపోస్తున్నారు భయపడుతూ .మొత్తం హనుమ నోటిలోకి ప్రవాహంగా వెళ్లిపోతున్నాయి . ఇంకా .. అని అడుగుతున్నాడు హనుమ .ఎంత తెచ్చినా చాలటం లేదు .పంచభూతాత్మకుడు మహాభూతంలా తినేస్తున్నాడు. వడ్దించకపోతే అమ్దరినీ తినేసేలా ఉన్నాడు. అమ్మవారి మనసు ప్రమాదాన్ని శంకించింది . ఏమిటీ తిండి ? ఏమిటీ ఆకలి ? భూమ్మీదున్న సమస్తాన్ని తిని హరించేలా ఉన్నాడు హనుమ . ఎక్కడో పొరపాటు జరిగింది . హనుమకు ఆకలితీరుస్తానని మాటిచ్చి ఇప్పుడు సమస్యలో ఇరుక్కుపోయాను అని భీతి చెందింది . ఉరుకులపరుగులమీద రాములవారి సన్నిధికి చేరి శరణుప్రాణేశ్వరా అని వణికిపోతూ శరణు వేడింది .
ఏమైంది దేవీ ! స్వామి వారు అనునయించి అడిగారు
ప్రభూ ! హనుమంతునికి కడుపునిండాభోజనం పెడతానని మాటిచ్చాను .హనుమంతుడు నేను వండినవంటకాలనే కాదు .సమస్త లోకాన్నీ ఆరగించేలా ఉన్నాడు చూస్తుంటే ...అని అంతావివరించింది . హనుమంతుని ఆకలి తీర్చి తృప్తిపరచగల మార్గం చెప్పమని వేడుకున్నది.
ఎంత అమాయకురాలివి సీతా ! హనుమంతుని ఆకలి తీర్చటం అంత సాధ్యమనుకున్నావా ? హనుమ ఎవరనుకున్నావు ? సాక్షాత్తూ లయకారకుడైన శివాంశ సంభూతుడు . సకలసృష్టిని తన గర్భాన లయం చేసుకోగల పరమశివుని ఆకలి ఈ భౌతిక పదార్ధాలతో సాధ్యమనుకున్నావా ? సాధ్యాసాధ్యాలు విచారించక కడుపు నింపుతానని మాటిచ్చి ఉపద్రవం తెచ్చావు .అన్నారు శ్రీరామచంద్రుడు .
పరిష్కారం చెప్పమని వేడుకున్నది సీతామాత .
నువ్వెళ్ళి హనుమవెనుక నిలుచుని శివుణ్ణిస్తుతించు . భోళాశంకరుడు శాంతించి హనుమ ఆకలి శమిస్తుంది సూచించాడు స్వామి.
సీతమ్మ వెళ్ళి భుజిస్తున్న ఆంజనేయుని వెనుక నిలబడి పరిపరి విధముల పరమేశ్వరుని స్తుతించింది .
ఆతరువాత హనుమవిస్తట్లో ఒక అరటి పండూపెట్టి నాయనా ఇంకా వడ్డించనా అని అడిగింది.
చాలమ్మా ! కడుపు నిండిపోయింది .ఇక తినలేనుతల్లీ అంటూ బ్రేవ్ !మని త్రేన్చాడు హనుమ.

Read more...

కోతులకు విందు భోజనం వద్దు సీతా ! అన్న రామయ్య మాట ,వినని సీతమ్మ

>> Tuesday, May 25, 2010

అమ్మవారికి అయోధ్య కొచ్చిన తరువాత అందరినీ సత్కరించటం ఒక పనై పొయింది . కష్టకాలంలో తమ పట్ల అభిమానం చూపిన వారందరినీ గుర్తుపెట్టుకుని వారందరినీ వారి స్థాయి ననుసరించి సన్మానించింది . అయితే తమ కోసం ప్రాణాలకు తెగించి రాక్షసులతో పోరాడిన వానరులపట్ల అమ్మవారి హృదయంలో అపారమైన కృతజ్ఞత గూడుకట్టుకుంది .లోకమాత గనుక వారిని బిడ్డలవలే సత్కరించాలని కోరిక .
ఒక శుభముహూర్తాన శ్రీరాములవారు విశ్రాంతిగా ఉన్నసమయం లో అమ్మవారు, స్వామీ ! గోముగా పిలచింది.
ఏమి దేవీ ! మరింత మురిపంగా అడిగారు స్వామి వారు.
నాదొక చిన్న విన్నపం స్వామీ ...
సీతా ! నువ్వడగటం నేను తీర్చక పోవటమూనా ! ఏంకావాలి నిరభ్యరంతంగా అడుగు స్వామి వారు అనుమతిచ్చారు.

వానరులు మనకోసం చేసిన త్యాగానికి మనం ఎంతచేసినా ఋణం తీరదు. అందుకని వారి కోసం ............

అడుగుదేవీ ! వాళ్లకు నీవు ఏమి ప్రసాదించ దలచినా సందేహించకు . అమూల్య రత్నాభరణాలను మన కోశాగారం నుంచి పంపిస్తాను చెప్పు ఏమివ్వమంటావో ?

అవికాదు స్వామీ ! పాపం వాళ్ళు వనచరులు .ఏవో ఆకులు కాయలు తప్ప మనరుచికరమైన వంటలను వారెప్పుడు తినలేరు . ఒక్కసారి బిడ్డలందరికీ స్వయంగా వండి వడ్డించి కడుపునిండా భోజనం పెట్టాలని నా కోరిక .వారి జీవితంలో రుచిచూడని మన నాగరిక వంటకాలతో విందు భోజనం పెట్టాలి. అందుకు ఏర్పాట్లు చేయించండి ప్రభూ .దానిలో పాల్గొనాలని సమస్త వానరులకు ఆహ్వానం పంపండి . అమ్మవారు మనసులో మాట బయట పెట్టింది .

స్వామి వారు అమ్మవారి అమాయకత్వానికి నవ్వుకున్నారు.

సీతా ! ఏదైనా సన్మానం చేయాలంటే అది గ్రహీతకు పీతిపాత్రంగాను చేసేవారికి ఇబ్బంది లేకుండాకూడా ఉండాలి. వానరులకు విందేమిటి ? .అది సాధ్యంకాదు.అంతేకాదు మనం అభాసుపాలవుతాము . అది కాక ఇంకేదన్నా అడుగు అన్నారు స్వామి.

అమ్మవారికి రోషం వచ్చింది . నేను వీరందరికీ ఏకొరతా లేకుండా వండించి వడ్డించగలను . అన్నారు.

అదికాదు సీతా .అవి కోతులు . వాటికి విందు భోజనం పెట్టటం లాంటి తిక్క ఆలోచనలు బాలేవు. వారించబోయాడాయన.
అమ్మవారి మాతృ హృదయం అన్నం పెట్టాలంటే వద్దంటున్న భర్తపట్ల క్రోధం వహిస్తున్నది.
మీరు ఎవరికి ఎన్ని సత్కారాలు చేసినా నేను వద్దన్నానా ? ఎదో ఎన్నడు తినని బిడ్డలకు కడుపునింపుదామనుకుంటే అడ్డుకుంటున్నారు ....దు:ఖం తొంగిచూస్తున్నది అమ్మ గొంతులో .
స్వామి వారికి ఇక ఏమి చెప్పినా లాభం లేదని అర్ధమైపోయింది . సరే నీ ఇష్టం నీవు కోరినట్లే ఏర్పాటు చేస్తాను ..ఆతరువాత ఫలితాలకు నాకు సంబంధమ్ లేదు ..ఆన్నాడు.

సీతమ్మ హృదయం ఆనందంతో పొంగిపోయింది .వెంటనే ఏర్పాట్లకు సిద్దమయి పోయింది

స్వామి వారు సమస్త వానరజాతి అమ్మవారిచ్చే విందుకు రావలసినదిగా ఆహ్వానాలు పంపారు.
అయోధ్యనిండా చలువ పందిర్లు వేశారు .పాక శాస్త్ర ప్రవీణులు వేలాదిగా తరలి వచ్చి అమ్మవారి పర్యవేక్షణలో రుచికరాలైన వివిధవంటకాలను వండారు.
ఇక వచ్చినవారందినీ బంతులమీదకూర్చో బెట్టారు . వివిధ భక్ష్యాలు,వంటకాలు వడ్డన సాగుతున్నాయి. అమ్మవారు ఆన్ని వరుసలు తిరుగుతూ కొసరికొసరి వడ్డింపజేస్తున్నారు. ఆహో ...ఓహో అంటు వానఎరులు లొట్టలువేస్తూ ఆరగిస్తున్నారు .అమ్మవారు ఆనందంతోతబ్బిబ్బవుతున్నారు.
ఇప్పుడు చారు వడ్డిస్తున్నారు బంతులమీద . .పులుసువేసి ఆన్నం కలుపుతున్నారు భుజిస్తున్న వాళ్ళు.

ఇంతలో ఒకపిల్లకోతి అన్నంపులుసు పిసికేప్పుడు ఒక చింతపిక్క చటుక్కున పైకెగిరింది దాని చేతిలోంచి. చింతపిక్క అలాపైకెగరటం చాలా సరదా అనిపించింది ఆపిల్లకోతికి .మరలా పులుసు పిసికింది మరొక చింతపిక్క చటుక్కున ఇందాకటిలాగే పైకెగిరింది . అదొక తమాషాగా ఉన్నందున ఆ పిల్లకోతి ఆచింత పిక్కకంటే పై ఎత్తుకు ఎగిరి కూర్చుంది . అయితే దానిపక్కనే ఉన్న కుర్రకోతి కూడా దానికంటే ఎత్తు ఎగిరి కూర్చుంది .
పక్కనే ఉన్న మరొక కోతి . దీనికేనా తెలుసు ?పై కెగరటం అనుకుని అదికూడా మరింత ఎత్తు ఎగిరి కూర్చుంది .
పక్కనే ఉన్న పెద్దకోతికి ఇది అవమానంగా తోచింది.అవునూ ఇది ఎందుకెగిరింది? అంటే నేనంత ఎత్తు ఎగరలేనా ?
అనుకుని అది మరింత ఎత్తు ఎగిరి కూర్చుంది .
నేను యుద్దంలో పదిమంది రాక్షసులను చంపినవాడిని నాముందే అది ఎగిరిందంటే ఇక నేను ఎగరకపోతే అవమానం కదా అనుకుని ఒక వానరవీరుడు దాదాపు పందిరి తగిలేలా ఎగిరాడు. ఆపక్కనున్నవాడు దీన్ని సవాల్ గాతీసుకుని పందిరి లేచేలా ఎగిరాడు.
ఇక చూస్కోండి . పక్కవారు ఎగరటం తనకు పోటీగా భావించి, అంతకంటే ఎక్కువ ఎత్తు ఎగరలేకపోతే అది అవమానకరంగా భావించి కోతులన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి ఎగరటం మొదలెట్టాయి . పందిర్లకేసిన తాటాకులు లేచి వెళ్లిపోతున్నాయి . వడ్డించేవాళ్ళు.వంటవాళ్లు పరిచారకులు ,చూస్తున్నవారు పరుగులు పెడుతున్నారు . కేరింతలు ,గర్జనలు ,ఎగిరిదుముకుతున్న కో్లాహలంతో భీభత్సమైపోయింది వాతావరణం. వారిని వారించాలనుకోవటం వృధాప్రయాసైపోయింది . ఎవరిమాట ఎవరూ వినడు. విందుభోజనం పందిర్లు వేదికలు రణరంగం జరిగి ధ్వంసమైనట్లు గా తయారయ్యాయి అరుపులు కేకలతో రసాభాసగా ముగిసింది విందుకార్యక్రమం. అమ్మవారి ముఖం చిన్నబోయింది . అది చూసి ఓదారుస్తూ రాముడు సీతా ! నేను ముందే చెప్పాను . అవి కోతులు వాటికి చెట్లమీదగెంతుతూ తినే అలవాటేగాని స్థిరంగా కూర్చునే అలవాటు ఉండదు అని. వినలేదు నువ్వు. జరిగిందేదో జరిగింది ,ఇలాంటి పని ఇకపై పెట్టుకోకు అని చల్లబరచాడు . పాపం కోతులకు కూర్చోబెట్టి భోజనం పెడదామనుకున్న సీతమ్మవారి కోరిక తీరనే లేదు.

Read more...

తుఫానులో కూడా సాగిన యాగం .చలించని చిన్నారి దీక్షాస్వాములు

>> Saturday, May 22, 2010

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు ...అనే సూక్తి హనుమత్ రక్షాయాగంలో పాల్గొంటున్న బాల స్వాములకు బాగా వంటపడుతున్నది. . ప్రభంజనుని ధాటికి చలించకుండా దీక్ష సాగిస్తున్నారు. హోరుగాలి ,వర్షం తో రెండురోజులు అంతా అతలాకుతలమైనది. ఇక్కడ పదిహేనుమంది పిల్లలు దీక్షతీసుకుని ఉన్నారు. వారిలో నాలుగవతరగతి చదివేవారినుండి తొమ్మిదవతరగతి వరకు ఉన్నారు. వాళ్లకు భోజనసదుపాయం అంతా పీఠంతరపునే కల్పించబడుతున్నది. కాబట్టి వాళ్ళుకూడా దీక్షయిపోయినదాకా మాతో పాటే ఇక్కడ ఉంటారు. వర్షానికి తోడు పెనుగాలులు వీస్తుండటంతో ఉన్నరేకులషెడ్ లలోకి కూడా నీరు వచ్చిపడుతూ తడిసి ముద్దయింది పీఠం ఆవరణంతా . మేము నివాసం ,వంటకోసం ఉపయోగించుకుంటున్న గది రేకులు కూడా లేచిపోయేలా ఊగుతుండటం తో సామానంతా ఆఫీస్ గదిలోకి చేరవేశారు పిల్లలు . మా ఆవిడ ఆవర్షంలోనే ,మంచాలకు దుప్పట్లు కట్టించి అడ్దం పెట్టి ఆ షెడ్లలోనే ఉప్మా,అన్నం వండింది మొదటిరోజు . ఆఫీసు గదిలో పెట్టిన గ్యాస్ స్టవ్ పై కూరలు తయారు చేసింది . ఏదో ఇంట్లో మావరకైతే ఏ పచ్చడిమెతుకులైనా పరవాలేదు ,కానీ పిల్లలున్నారు ఇంతమంది అని ఆవిడ తపన.
ఇదేమీ పెద్దవిశేషం కాదుగానీ ,ఆవర్షంలో కూడా పిల్లలు తమ నియమపాలన తప్పకుండా సాగించిన దీక్షావిధి చెప్పుకోదగ్గది. జోరున కురుస్తున్న వానలోనే స్నానాలు చేసి గాలి విసురుతున్నా వెరవకుండా ప్రదక్షనాలు చేసారు . అనంతరం ఆ వానలోనే పూజ [ మా పీఠం లో హనుమంతులవారు ఓపెన్ లోనే ఉంటారు మరి] ముగించారు
. ఇక యజ్ఞం చేయాలి ఎలా ?
స్వాములూ ! మనం చేయగలమో లేదో అని ,మనకు ఇదొక పరీక్ష కనుక యజ్ఞం ఆపకుండా చేయాలి అని చెప్పాను. వర్షం జల్లులతో యాగశాలగా ఉపయోగిస్తున్న తాటాకులపాకలో నీల్లు ప్రవహిస్తున్నాయి . యజ్ఞకుండం తడిసి ముద్దయింది. సమిధలన్నీ నెమ్మిచ్చాయి . ఆవుపేడతో అలికిన నేలంతా చిత్తడిగా తయారయింది . గాలి తాకిడికి అగ్ని నిలబడటం ప్రజ్వరిల్లటం కష్టం . ఎలా చేద్దాం ? ఆలోచించండి అని చెప్పాను . వాళ్లు సామాన్యులా ? బండలుమోసి,కొండలుతెచ్చి వారధికట్టిన హనుమంతునికి ఆయనపరివారానికి వారసులు . . పాదరసాల్లా పనిచేశారు. యజ్ఞకుండం దగ్గర కూర్చోవటానికి నాకు రెండు చెక్కలువేసి దానిపై చాప పరచారు. యజ్ఞకుండం చుట్టూ వలయంలా నిలబడి వాళ్లకండువాలు రక్షణగా పట్టుకున్నారు . అంత చలికి వాళ్లు వణుకుతున్నా వాళ్ల స్థిరసంకల్పం మాత్రం తొణకలేదు. వారి సంకల్పానికి ముగ్దుడైన హవ్యవాహనుడు దేదీప్యమానంగా జ్వలించాడు. స్వాహాకారాలతో భక్తులందరి తరపున సమర్పిస్తున్న ఆహుతులని ప్రీతిపూర్వకంగా స్వీకరించాడు. నిర్విఘ్నంగా కొనసాగింది యాగం . భక్తసులభుడైన ఆంజనేయుడు ఈ బాలస్వాముల రూపంలో తన యాగానికి తానే రక్షణగా నిలచి తన ఉనికిని మరోసారి నాబోటి మందమతులకు తెలియపరచాడు . జైహనుమాన్.

Read more...

ఇంకా ఇరవై రోజులు మాత్రమే సమయముంది ,ఇప్పటినుండైనా ప్రారంభించండి..

>> Monday, May 17, 2010

ఇంకా ఇరవై రోజులు మాత్రమే సమయముంది ,ఇప్పటినుండైనా ప్రారంభించండి..

వికృతి నామ సంవత్సరం లో పేరునిబట్టి కొన్ని చర్యలు వికృతరీతిలో సంభవిస్తాయి అని పంచాంగములు జ్యోతిష శాస్త్రములు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యముగా సాధుహింస,మంచివారికే కష్టాలు సంభవించటం జరుగుతుంది. అలాగే మనం గౌరవనీయంగా చూసుకునే వ్యవస్థలలో నీఛమైన సంఘటనలు సంభవించటం వంటి ఫలితాలు సరేసరి. ఉగ్రవాదాలు,భీభత్సాలు కాలానుసారంగా విపరీతమయ్యే సూచనలున్నాయి.
ఈసమయంలో లోకహితం కోరుతూ ఇక్కడ శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం హనుమత్ రక్షాయాగమును నిర్వహించుచున్నది .భక్త జనరక్షకుడగు హనుమంతుని ఆశ్రయించడంద్వారా ఆయన రక్షణలో ఉండడం ద్వారా మనం నిర్భయులమై ఉండవచ్చు.. ధర్మ బద్ధమయిన మన మనో సంకల్పాలను స్వామి సఫలీకృతం చేస్తాడు. ఆయన కరుణ పొందేందుకు మహనీయులందించిన సాధనా మార్గాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నది .

సాధకుల విధి
----------

నిత్యం ఉదయాన్నే హనుమాన్ చాలీసా పదకొండుసార్లు పఠించడం
ఆలయం లోగాని లేక ఇంట్లో తులసికోట లేక కొత్త ఆసనం లో స్వామి చిత్రాన్నుంచి మీ సంకల్పానుసారంగా ప్రదక్షిణలు చేయడం.
మద్యమాంసాదులను ఈకాలంలో వర్జించాలి .అనేది నియమం

ఇందుకొరకు మనకు సమయం దొరకటం లేదనే సాకుతో నిర్లక్ష్యం వహించవద్దని మనవి. పాల్గొని సాధన చేసాక ఫలితం మీకే అర్ధమవుతుంది. ఇక ఇరవైరోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నందున మీరు ఇప్పుడు ప్రారంభించినచో అర్ధమండల దీక్షగా సాగుతుంది. పనిలో పనిగా గోత్రనామాలు మెయిల్ చేయండి మీ పేరున ఇక్కడ అర్చన కూడా సాగుతుంది.
జై హనుమాన్

Read more...

అక్షయ తృతీయ [రేపే] నాడేం చేయాలి ? ఏ దేవతలను ప్రార్ధించాలి ?

>> Saturday, May 15, 2010


వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.

అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.

ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.

ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.
ఈరోజే దేవతలను పూజించాలి ?
-------------------------------
అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన వచ్చే అక్షయ తృతీయ నాడు జాతక రీత్యా 12 రాశులకు చెందిన జాతకులు, ఏయే దేవతలు పూజించాలనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి.

ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు, మహాలక్ష్మీలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు, పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. సింహ, కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులువుండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది.

తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సురాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటిపువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇకపోతే.. మకరరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవచ్చు.

అలాగే కుంభ రాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీన రాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more...

భక్తియోగి-కర్మయోగి

>> Thursday, May 13, 2010

భక్తియోగి-కర్మయోగి [ఈనాడు నుండి]
- రాధామనోహరన్‌
బాటసారులు దాహం తీర్చుకోవటానికి ఎవరో మహానుభావులు వూరికి దగ్గరగా ఒక చెరువు తవ్వించారు. దాని గట్టునే పెద్ద రావిచెట్టు ఉంది. అలసిపోయిన బాటసారులు ఆ చెరువులో నీరు తాగి చెట్టు దగ్గర బండమీద కాసేపు విశ్రమించి వెళ్లేవారు. ఆ అరుగు మీద ఒక గ్రామస్తుడు కూర్చొని ఉన్నాడు. ఎందుకోగానీ మొహం బాగా విసుగ్గా పెట్టుకుని, తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. ఆ మార్గంలో వెళ్తున్న ఒకాయన ఏవో పదాలు పాడుకుంటూ ఏకతారా మీటుతూ అటువైపు వచ్చాడు. ఆయనకు అక్కడ కాసేపు విశ్రమించాలని అనిపించింది. అక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఇంతలో గ్రామంలోంచి కొందరు ఆకతాయి పిల్లలు గోలగోలగా అరుస్తూ వచ్చారు. ఒక తేలుకు దారం కట్టి గిరగిరా తిప్పుతూ ఆనందిస్తున్నారు. కాసేపటికి వాళ్ళకు దానిమీద ఆసక్తి తగ్గింది. దాన్ని చెరువులోకి విసిరేసి, ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇదంతా గమనిస్తున్న ఆ భక్తుడు ఒక ఆకును తీసుకుని, చెరువు గట్టు దగ్గరకెళ్ళి దాన్ని తేలు దగ్గరగా పెట్టాడు. అది నెమ్మదిగా ఆకుమీదకు ఎక్కింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి రక్షిత ప్రాంతంలో వదలాలనేది ఆయన సంకల్పం. కానీ, అది ఆయనను కుట్టింది. ఆ కదలిక వల్ల మళ్లీ చెరువులో పడింది. ఆయన మళ్లీ దాన్ని ఆకుమీదకు రానిచ్చి రెండు అడుగులు వేశాడు. అది మళ్లీ ఆయనను కొండెతో కుట్టి కదలికకు చెరువులో పడిపోయింది. ఇట్లా ఆయన దాన్ని ఆకు మీదకు ఎక్కించి రక్షించటం, అది ఆయనను కుట్టి చెరువులో పడటం అయిదారుసార్లు జరిగింది. చెట్టు కింద కూర్చున్న ఆసామీకి ఆయన మీద కోపం వచ్చింది. 'ఏమిటి స్వామీ, అది విషకీటకం. తేలుకు కొండెలో విషం ఉంటుందంటారు. మీరేమో దాన్ని రక్షిస్తున్నారు. అదేమో మిమ్మల్ని కుడుతూనే ఉంది. మీ ప్రవర్తన నాకేం అర్థం కావటంలేదు... చూడటానికి మీరు జ్ఞానుల్లా ఉన్నారు. ఇదేమి పని?' అని ఆయన్ని మందలిస్తున్నట్లు విసుగ్గా, కోపంగా, కటువుగా కసురుకున్నాడు. దానికి ఆ భక్తుడు 'నాయనా! నా విధి నేను నిర్వర్తిస్తున్నాను. ఆపదలో ఉన్న జీవిని రక్షించటం మనిషి కనీస ధర్మం. దాని విధి అది నిర్వర్తిస్తోంది. కొండెతో కుట్టడం దాని లక్షణం. పైగా నేను రక్షిస్తున్నట్లు దానికి తెలీదు. అది ఆకుమీద స్థిరంగా ఉన్నప్పుడు... దాన్ని ఆ రాతిగుట్ట దగ్గర పెట్టి, నా దారిన నేను పోతాను' అని నిదానంగా చెప్పాడు.

'మరి అది ప్రతిసారీ మీ చేతిని కుడుతోంది కదా. మీకు కష్టంగా లేదా? పైగా అన్నిసార్లు దానికోసం ప్రయాసపడటం, మీకు విసుగనిపించడం లేదా?' అని అడిగాడు ఆ గ్రామస్తుడు. అతనడిగిన ప్రశ్నకీ, అతని అమాయకత్వానికీ ఆ భక్తుడికి నవ్వొచ్చింది.

'నాయనా, నీవెవరో నాకు తెలియదు. రూపాన్ని బట్టి రైతులా ఉన్నావు. విధి నిర్వహణలో కష్టం, విసుగు అనే మాటలకు తావుండదు. ఆ రెండూ నీ లక్ష్యానికి అడ్డు వస్తాయి. ఎంత కష్టమైనా మన పని మనం చెయ్యాలి. చేసే పని మీద మనకెప్పుడూ విసుగు రాకూడదు. ఇది ధర్మసూక్ష్మం. అర్థం చేసుకుంటే నీకే బోధపడుతుంది' అన్నాడాయన.

ఈలోగా ఆ తేలు ఆకు మీంచి కిందపడి గబగబా ఎటో వెళ్లిపోయింది. ఆయన సంతోషించాడు.

ఆ రైతు ఆ భక్తుణ్ని గౌరవ భావంతో చూస్తూ నమస్కరించాడు. ఆయన ఏకతారా తీసుకుని బయలుదేరబోతున్నాడు. తన సమస్యకు పరిష్కారం ఆయన చెప్పగలడని నమ్మకం కలిగింది.

'స్వామీ! నా పేరు భూపతి. నేనొక రైతుని. వర్షాలు లేక, చీడల పీడల వల్ల పంటలు పండటంలేదు. పడ్డ శ్రమంతా వృథా అవుతోంది. కష్టపడి సంపాదించినన్నాళ్లూ ఎంతో గౌరవంగా చూసే భార్యాపిల్లలు- నన్ను చులకనగా చూస్తూ విసుక్కుంటున్నారు. అందుకని ఇంటిమీద అలిగి, ఈ బొడ్డురాయి దగ్గరకొచ్చి కూర్చున్నాను... మీరు జ్ఞానులు... మీ మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. నాకు నా ధర్మం తెలిసింది...' అన్నాడు.

'నాయనా... కాలం ఎప్పుడూ ఒక రకంగానే ఉండదు. ఒక్క ఏడాది పంటలు పండకపోతేనే నిరుత్సాహపడి కోపం తెచ్చుకోకూడదు. వ్యవసాయం నీ ధర్మం. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. మీ గాదెలు నిండుతాయి. నీ పనిని విసుగు లేకుండా చేయి. ఫలితం బాగుంటుంది. సమర్థుడివి అని నిరూపించుకో. ధనహీనుణ్ని ఎవ్వరూ గౌరవించరు. అది లోకధర్మం. నిన్ను నిరసించిన వారే మళ్ళీ నిన్ను గౌరవిస్తారు' అని బోధించి బయలుదేరారు ఆయన. 'స్వామీ... మీ పేరు?' 'నాకంటూ పేరు లేదు. అందరూ నన్ను కబీరు అంటారు...' అని ఏకతారా మీటుకుంటూ ఆయన నిష్క్రమించారు.

Read more...

వైశాఖ వైశిష్ట్యం


- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
యుగాల్లో కృతయుగం, తీర్థాల్లో గంగాజలం, దానాల్లో జలదానం, మాసాల్లో వైశాఖం శ్రేష్ఠమని స్కందపురాణంలోని వైష్ణవ ఖండం పేర్కొంటోంది. కార్తీక, మార్గశిర, మాఘ, వైశాఖాలు పుణ్యప్రద మాసాలుగా ధర్మజ్ఞుల భావన. చాంద్రమానం ప్రకారం చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉండగా వచ్చేది వైశాఖ మాసం.

వైశాఖ మాసం హరికి ప్రీతికరమైనదనే భావనతో 'మాధవమాసం' అనీ వ్యవహరిస్తారు. వైశాఖం బహువిధ దానాలకు శుభప్రదమైన మాసం. వైశాఖంలో తిలాదానం, ధర్మఘటదానం, జలదానం, వస్త్రదానం, ఛత్ర(గొడుగు)దానం చేయాలని పండితులు చెబుతారు.

వైశాఖంలో శుక్లపక్ష తదియ మిక్కిలి శుభప్రదమైన దినం. కృతయుగం శుక్లపక్ష తృతీయనాడే ఆరంభమైందంటారు. అంటే 'కృతయుగాది' అన్నమాట. దీన్నే 'అక్షయతృతీయ'గా జరుపుకొంటారు. ఈ పర్వదిన ప్రాశస్త్యాన్ని విష్ణు, భవిష్యోత్తర పురాణాలు వివరించాయి. సౌభాగ్యాన్ని వృద్ధిచేసే దినంగా అక్షయతృతీయను పరిగణిస్తారు. ఆరోజు బదరీనాధక్షేత్రంలోని బదరీనారాయణుని దర్శిస్తే సకల పాపాలు హరిస్తాయని విశ్వాసం. వైశాఖ శుక్ల తదియనాడే సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవం. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం. అదేరోజు పరశురామ జయంతి. పాలకులు ధర్మరక్షణను విస్మరించి నిరంకుశులై ప్రవర్తించినప్పుడు బ్రహ్మ, క్షత్రియ శక్తులు ఒకే శక్తిగా అవతరించి ధర్మరక్షణ చేస్తాయనే అవతార తత్వానికి ప్రతీక- పరశురాముడు. వీరశైవ మార్గ ప్రవక్త బసవేశ్వరుని జన్మదినమూ ఈ రోజే కావడం విశేషం.

వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరుల జయంతి. ఈ దేశపు అఖండతను కాపాడేందుకు అక్షయమైన అద్వైతతత్వాన్ని ప్రబోధించిన తాత్విక శిఖరం శంకరాచార్య. వైశాఖ శుద్ధ ఏకాదశి పవిత్రదినం. ఆ రోజున అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణోత్సవం. త్రయోదశి నృసింహజయంతి. రాక్షస సంహారం చేసిన వైకుంఠధాముని అవతారంగానే గాక యోగమార్గంలోనూ, తంత్రమార్గంలోనూ భక్తులను తరింపజేసే దైవం. వైశాఖ శుద్ధ సప్తమిని గంగోత్పత్తి దినంగా భావిస్తారు. అంటే గంగావతరణమన్నమాట. ఆ రోజు గంగాస్నానం విశేషఫలదాయకమని భావన. ఈ సప్తమినాడే విజయనగర సామ్రాజ్య ప్రతిష్ఠాపనా ప్రేరక శక్తి, శృంగేరి పీఠాధిపతిగా ధర్మరక్షణకు కృషిసల్పిన విద్యారణ్యస్వామి జననం.

వైశాఖ శుద్ధ పూర్ణిమ మహావైశాఖి. అహింసామార్గ ప్రవర్తకుడు, కారుణ్యసింధువు, గౌతమబుద్ధుని జననం, సంబోధి, నిర్వాణం వైశాఖ పూర్ణిమనాడే సంభవించాయి. వైశాఖ శుద్ధ పూర్ణిమ పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి కూడా.

వైశాఖమాసంలో బహుళ దశమినాడు హనుమజ్జయంతి. రుద్రాంశ సంభూతుడుగా శైవులకు, రామకార్య దురంధరుడిగా వైష్ణవులకూ సర్వులకూ ఆరాధ్యదైవం హనుమ.

ఆధ్యాత్మికంగా వైశాఖమాసం విలక్షణం, విశిష్టం.

[ఈనాడు" నుండి]

Read more...

వైశాఖ వైశిష్ట్యం

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
యుగాల్లో కృతయుగం, తీర్థాల్లో గంగాజలం, దానాల్లో జలదానం, మాసాల్లో వైశాఖం శ్రేష్ఠమని స్కందపురాణంలోని వైష్ణవ ఖండం పేర్కొంటోంది. కార్తీక, మార్గశిర, మాఘ, వైశాఖాలు పుణ్యప్రద మాసాలుగా ధర్మజ్ఞుల భావన. చాంద్రమానం ప్రకారం చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉండగా వచ్చేది వైశాఖ మాసం.

వైశాఖ మాసం హరికి ప్రీతికరమైనదనే భావనతో 'మాధవమాసం' అనీ వ్యవహరిస్తారు. వైశాఖం బహువిధ దానాలకు శుభప్రదమైన మాసం. వైశాఖంలో తిలాదానం, ధర్మఘటదానం, జలదానం, వస్త్రదానం, ఛత్ర(గొడుగు)దానం చేయాలని పండితులు చెబుతారు.

వైశాఖంలో శుక్లపక్ష తదియ మిక్కిలి శుభప్రదమైన దినం. కృతయుగం శుక్లపక్ష తృతీయనాడే ఆరంభమైందంటారు. అంటే 'కృతయుగాది' అన్నమాట. దీన్నే 'అక్షయతృతీయ'గా జరుపుకొంటారు. ఈ పర్వదిన ప్రాశస్త్యాన్ని విష్ణు, భవిష్యోత్తర పురాణాలు వివరించాయి. సౌభాగ్యాన్ని వృద్ధిచేసే దినంగా అక్షయతృతీయను పరిగణిస్తారు. ఆరోజు బదరీనాధక్షేత్రంలోని బదరీనారాయణుని దర్శిస్తే సకల పాపాలు హరిస్తాయని విశ్వాసం. వైశాఖ శుక్ల తదియనాడే సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవం. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం. అదేరోజు పరశురామ జయంతి. పాలకులు ధర్మరక్షణను విస్మరించి నిరంకుశులై ప్రవర్తించినప్పుడు బ్రహ్మ, క్షత్రియ శక్తులు ఒకే శక్తిగా అవతరించి ధర్మరక్షణ చేస్తాయనే అవతార తత్వానికి ప్రతీక- పరశురాముడు. వీరశైవ మార్గ ప్రవక్త బసవేశ్వరుని జన్మదినమూ ఈ రోజే కావడం విశేషం.

వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరుల జయంతి. ఈ దేశపు అఖండతను కాపాడేందుకు అక్షయమైన అద్వైతతత్వాన్ని ప్రబోధించిన తాత్విక శిఖరం శంకరాచార్య. వైశాఖ శుద్ధ ఏకాదశి పవిత్రదినం. ఆ రోజున అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణోత్సవం. త్రయోదశి నృసింహజయంతి. రాక్షస సంహారం చేసిన వైకుంఠధాముని అవతారంగానే గాక యోగమార్గంలోనూ, తంత్రమార్గంలోనూ భక్తులను తరింపజేసే దైవం. వైశాఖ శుద్ధ సప్తమిని గంగోత్పత్తి దినంగా భావిస్తారు. అంటే గంగావతరణమన్నమాట. ఆ రోజు గంగాస్నానం విశేషఫలదాయకమని భావన. ఈ సప్తమినాడే విజయనగర సామ్రాజ్య ప్రతిష్ఠాపనా ప్రేరక శక్తి, శృంగేరి పీఠాధిపతిగా ధర్మరక్షణకు కృషిసల్పిన విద్యారణ్యస్వామి జననం.

వైశాఖ శుద్ధ పూర్ణిమ మహావైశాఖి. అహింసామార్గ ప్రవర్తకుడు, కారుణ్యసింధువు, గౌతమబుద్ధుని జననం, సంబోధి, నిర్వాణం వైశాఖ పూర్ణిమనాడే సంభవించాయి. వైశాఖ శుద్ధ పూర్ణిమ పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి కూడా.

వైశాఖమాసంలో బహుళ దశమినాడు హనుమజ్జయంతి. రుద్రాంశ సంభూతుడుగా శైవులకు, రామకార్య దురంధరుడిగా వైష్ణవులకూ సర్వులకూ ఆరాధ్యదైవం హనుమ.

ఆధ్యాత్మికంగా వైశాఖమాసం విలక్షణం, విశిష్టం.

[ఈనాడు" నుండి]

Read more...

కంటి ముందు జరుగుతున్న ఈ "సాయి" లీలను కాదనటమెలా ?

>> Wednesday, May 12, 2010

నువ్వు నమ్మకపోయినా సరే !నేనెప్పుడు నావారిని విడిచిపెట్టను అని తన ఉనికిని చూపుతున్న సాయి . విభూధి గావర్షిస్తున్న ఆయన అనుగ్రహం
ఈరోజు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది . ఇక్కడ బ్లాగులోకంలో ని ఒక సొదరి, దుర్గేశ్వరగారు మీకో విషయం చెప్పాలి అన్నారు. చెప్పండమ్మా అని అడిగాను. మీకు సాయిబాబా మీద నమ్మకముందా అనడిగారావిడ . ఆయ్యో !ఎందుకడుగుతున్నారలా అన్నాను . ఏమీ లేదండి ,ఈరోజు నేను నమ్మలేని నిజాన్ని నాకళ్లతోనే చూసి ఆశ్చర్యపోతున్నాను మీకు వివరంగా చెబుతానంటూ ఆమె ఆనందం ఉద్వేగంతో ఒక దివ్యలీలను నాకు తెలియజేశారు .వారి మాటలలోనే చదవండి .

" ఒక చిన్న సాయిబాబా విగ్రహం తీసుకున్నాము మూడు సంవత్సరాల క్రితం .అదీ పూజకోసమని కాదు మామూలుగా కొన్నామంతే.
ఆ విగ్రహాన్ని నిలబెట్టటానికి వెనుకేదన్నా ఆధారం కావాలి అందుకని వెనుకగా ఆనిచి వుంచాము మందిరంలో. మొన్న ఒక విచిత్రం జరిగింది . మేము వెనుక ఉంచిన విగ్రహం ఎవరూ కదపకుండానే మేము వాడుకునే వీభూధి గడ్ద ముందుకు వచ్చి ఉన్నది. అంతేకాదు .ఆ విగ్రహాన్నుండి విభూధి ఉద్భవిస్తూ ఉంది . మొదట నమ్మలేకపోయాము . కానీ విగ్రహాన్నుండి అలా విభూధి వస్తూనే వున్నది. అక్కడక్కడా ఇలా జరుగుతున్నదని విన్నప్పుడు నేను అంతగా నమ్మేదాన్ని కాదు .నిజమేనంటావా ? అని సందేహించేదాన్ని. కానీ నాకళ్లముందే జరుగుతున్నదాన్ని ఎలా నమ్మకపోవటం. పైగా నాకు ఏదో అలా నమస్కరించుకునే అలవాటేగాని పెద్దగా పూజలు అవీ చేయను. మావారు మాత్రం చక్కగా పూజలు చేసుకుంటారు. మరి బాబా కరుణ మాపై ఎలాకలిగినదో నాకైతే తెలియదు. నేను ఈవిషయాన్ని మాబంధువులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాను. బయటవాళ్లకు మీకు మాత్రమే చెబుతున్నాను . అని ఎంతో ఆనందంతో వివరించారావిడ .వారి అభిమనానికి కృతజ్ఞుడను.
అదేరోజు మావారి స్నేహితుడొకాయన మాయింటికొచ్చాడు .ఆయనయొక్క కొడుకూ కోడలు మధ్య నడుస్తున్న వివాదం లో మావారి సలహాకోసం. తన కోడలిని ఎలా వప్పించి ఇంటికి రప్పించాలా అని సతమవుతున్నారు ఆయన. మాఇంట్లో జరుగుతున్న సాయిలీల తెలిసి ఆయన ఆవిభూధిని ఎంతో భక్తిగా తనయింటికి తీసుకెళ్ళాడు. చిత్రంగా పొద్దుటకల్లా కోడలు కోపం వదలి తనంత తానుగా కాపురానికొచ్చిందని ఆయన చెప్పగా విని ఆశ్చర్యపోతున్నామని మరొక లీలను వివరించారావిడ.
ఇక్కడ ఆయన అనుగ్రహం మాకు కలిగింది దానిని పదిమందికీ చెప్పలనుకోవటం లేదు. అనవసర చర్చలు . అని కేవలం మీకు చెప్పాలనే ఉత్సుకతతో వివరిస్తున్నారన్నరావిడ. ఐతే నాకు తెలిసిన దైవలీలను నేను దాచిపెట్టి ఉంచలేను . నాపనే పరమాత్మ లీలలను ఎక్కడున్నా సేకరించి పదిమందితో పంచుకోవటం .కనుక ఆసద్గురువు లీలను, ఆవిడ మెయిల్ ద్వారా ఇందాక పంపిన ఫోటోలను సాయి ప్రసాదంగా భక్తజనులకోసం ఇక్కడుంచుతున్నాను.
ఇంత ప్రత్యక్షం గా కనపడుతున్న లీలలను అబద్దమనే సందేహ జీవుల లో ఎవరి కోసం ఈ తన ఉనికిని ఇలా బహిరంగ పరుస్తున్నాడో ! ఆ సద్గురువునకే ఎరుక .
జయ గురుదత్త .

Read more...

చిరంజీవి గౌతమ్ కు ఆరోగ్యం చేకూరాలని ప్రార్ధించండి .

>> Saturday, May 8, 2010


ఇక్కడ అంతర్జాలంలో ఓ వార్త చదివాక మనసు దు:ఖపూరితమవుతున్నది. ఒకపాత్రికేయుని కుమారుడు తీవ్రమైన రుగ్మతతతో వేధించబడుతూ వేదన చెందుతున్నాడు . పందొమ్మిది సంవత్సరాల ఆ పిల్లవాని పేరు గౌతమ్ . వాని బాధచూడలేక ఆతల్లిదండ్రులు గుండెలవిశేలా రోధిస్తున్నారు. లక్షలరూపాయలను ఖర్చుపెట్టారు. అనేకమంది డాక్టర్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆపిల్లవాన్ని చికిత్సకోసం త్రివేండ్రం తీసుకెళ్ళారు. లోకేశ్వరరావుగారనే అపాత్రికేయుడు బిడ్డకోసం బిడ్డ ఆరోగ్యం కోసం తన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. దురదృష్ట వశాత్తూ ఆయన ఆర్ధికపరిస్థితి దీనంగా ఉంది. రాత్రి వారితో మాట్లాడాను . బిడ్డకోసం పరితపిస్తున్న ఆతండ్రి హృదయవేదన మనసును కలచివేస్తున్నది.
ఈ అంతర్జాలం లో వారి శ్రేయోభిలాషులు ఆర్ధికంగా వారికి చేయూతనిమ్మని విజ్ఞప్తులు చేస్తున్నారు. సాటిమానవునికి ఆపదలో అన్నిరకాలుగా సహాయపడవలసిన అవసరం ఉంది. మానవప్రయత్నం తోపాటు ఈసమయంలో దైవానుగ్రహం కూడా ఆచిన్నారికి అవసరం . మంచి మనసుకలవారైన మీరంతా ఆబిడ్డ ఆరోగ్యం కోసం మీమీ పూజ,ధ్యాన సమయములలో సంకల్పం చెప్పి ప్రార్ధించమని మనవి.
హనుమత్ రక్షాయాగం జరుగుతున్నందున ,ఈరోజు ఇక్కడ దీక్షతీసుకున్న చిన్నపిల్లలంతా విషయం చెప్పగనే ఆబిడ్డకు స్వస్థత చేకూరాలని 108 సార్లు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం తో ప్రార్ధనలు చేశారు. ఉదయం ఏడుగంటలనుండి మధ్యాహ్నం పన్నెండు దాకా ప్రతి ఆవృత్తికి ఒక హారతిస్తూ ఈ పారాయణం జరిపారు. సంజీవ రాయడై, ఆరోగ్యప్రదాతగా కీర్తించబడుతున్న స్వామి అనుగ్రహం ఆబాలునిపై ప్రసరించి ఔషధములు సంజీవనులై వైద్యులయత్నాలు సఫలీకృతమవ్వాలని కోరుకుంటున్నాము. ఆచిన్నారి మోముపై చిరునవ్వులు విరబూసేలాచేయాలని స్వామిని వేడుకుంటున్నాము. ఆరోగ్యదాతా ...అభయప్రదాతా ...జయజయ హనుమా..పావననామా.
[సామూహిక సంకల్పానికి,ప్రార్ధనకు అనంతమైన శక్తి ఉంటుందనేది సత్యం కనుక ఆ బిడ్డకోసం మనం కూడా ప్రార్ధిధ్ధాము]

Read more...

శనీశ్వరుని ప్రభావానికి లొంగని హనుమంతుడు

దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి.

శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు.

ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.

కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.

అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.

అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
[అంతర్జాలంలో ఉన్న ఓసమాచారం ఇది.]

Read more...

ఇవి అన్నీ అడుగుచున్నవీ ......మనుషులుగా మీరేమి చేసినారనీ........!?

>> Thursday, May 6, 2010



మనుషులుగా మీరేమి చేశారని ప్రభు సేవలో పాల్గొన్న ప్రకృతిలోని జీవులన్నీ అడుగుతున్నాయని వ్రాసిన ఈగీతాన్ని ఏదో కాకిగొంతుతో పాడాను ఓపికతో వినండి . మనమేమి చేశామో ? ఏమి చేయాలో ఆలోచించండి .

Read more...

భగవన్మయం కాని విద్యకు పరిపూర్ణత ఎలా వస్తుంది ?


లోకంలో ప్రతికళనూ భగవదంకితం చేసినప్పుడే దానికి పరిపూర్ణ సార్ధకత లభిస్తుందనేది మన పూర్వీకులు నిరూపించిన సత్యం.
సురలోకంలో మహా గాయకులని పేరొందిన నారద,తుంబుర మహర్షు లిరువురకు ఒకసారి గానవిద్యలో ఎవరు గొప్ప అనే పోటీ ఏర్పడింది. నేను గొప్ప అంటే నేనుగొప్ప అనే వాదనమొదలైంది.
తమతమ గానప్రావీణ్యం పట్ల ఇద్దరికీ అచంచలమైన నమ్మకం .సంగీతసముద్రం లో లోతులు అంచులు చూసిన గానకళాకోవిదులాయె ! మరి. వాదన తీవ్రమై ఎవరుగొప్పో తేల్చుకోవాలన్న పట్టుదల పెరిగింది . సరే మరి ఈవిషయం లో న్యాయ నిర్ణేత ఎవరు అని ఆలోచించి దేవతలనందరినీ న్యాయనిర్ణేతలుగా ఉండమని కోరినా అందరూ తమకా సామర్ధ్యం లేదని తప్పుకున్నారు . చివరకు లీలానాటక సూత్రధారి పరమాత్మ శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరింది తగాదా .
ఆయన ,నాయనలారా మీ ఇరువురి పోటీలో న్యాయనిర్ణయం చేయగలవాడు ఒక్కడే వున్నాడు . అతడు హనుమంతుడు .గంధమాధన పర్వతం పై ఉన్నాడు వెళ్లి అతనిముందు మీరు మీ సందేహాలకి సమాధానం పొందవచ్చు అని సూచించాడు.
ఇద్దరు వెంటనే గంధమాధన పర్వతం చేరుకున్నారు . అక్కడకు వెళ్ళేసరికి ప్రకృతి పులకించిపోతున్నది .,హనుమంతుడు చేస్తున్న రామనామ గానానికి .హృదయమంతా రామమయమై ,గానంతో ప్రకృతిలో అణువణూవునూ రామనామరస జగత్తులో ఓలలాడిస్తున్న హనుమంతుని గానానికి మహర్షులిరువురూ మైమరచి బాహ్యస్మృతి కోల్పోయి తన్మయులైపోయారు. ఆయన గానం ఉచ్ఛ స్థితికి చేరుకునే సరికి అక్కడున్న రాళ్లు కరిగి ప్రవహించటం మొదలెట్టాయి. హఠాత్తుగా గానమాపిన హనుమంతుడు నారద తుంబురులచేతులలోని వీణలను లాక్కుని ఆ ప్రవాహం లోకి విసిరాడు . అంతే గానమాపగనే ప్రకృతి లో జడపదార్ధలన్నీ తమ స్వగుణం లోకి మారాయి వీరిరువురి వీణలు ఘనీభవించిన ఆరాళ్ల మధ్యలోనే ఉండిపోయాయి .
అప్పుడు స్వామీ ! మీరొస్తున్న కార్యక్రమ సందేశం ప్రభువు ఆజ్ఞానుసారం నాకర్ధమైంది . ఇప్పుడు ఆ ఘనీభవించిన రాళ్లను మీ గానంతో కరిగించి ఎవరు ఆ వీణలను తీయగలరో వారే గొప్ప అని ప్రకటించాడు .
వీరివురూ తమ తమ విద్యాప్రదర్శనచేసి ముల్లోకాలు ఆశ్చర్యచకితులయ్యేలా చేయగలిగారు . కానీ రాళ్ళను కరిగించలేకపోయారు. వాస్తవానికి వారిరువులు మహా భక్తులే . కాని భక్తుడు తనకున్న విద్యను భగవదర్పితం చేసినప్పుడు వినయం వివేకం పెరుగుతాయి . కానీ వ్యక్తిగతమైన అహంకారమనే ,తమస్సు మనస్సును అవరించుకుంటే ,భగవత్ కృపారసం వారిపై ప్రసరించుట ఆగిపోతుంది . అదే ఇక్కడ సంభవించింది . భగవదర్పితమైన తమ గానవిద్య పట్లచేసిన అపచారం తెలుసుకున్న మహర్షులిరువురు తమ తప్పిదం గ్రహించి హనుమంతుని శరణువేడారు .తమ వీణలను తమకిప్పించమని .
మరలా రామనామ గానంతో శిలలను కరిగించిన హనుమంతులవారు వారి వీణలను వారికి తీసి ఇచ్చారట.

Read more...

భగవన్మయం కాని విద్యకు పరిపూర్ణత ఎలా వస్తుంది ?

లోకంలో ప్రతికళనూ భగవదంకితం చేసినప్పుడే దానికి పరిపూర్ణ సార్ధకత లభిస్తుందనేది మన పూర్వీకులు నిరూపించిన సత్యం.
సురలోకంలో మహా గాయకులని పేరొందిన నారద,తుంబుర మహర్షు లిరువురకు ఒకసారి గానవిద్యలో ఎవరు గొప్ప అనే పోటీ ఏర్పడింది. నేను గొప్ప అంటే నేనుగొప్ప అనే వాదనమొదలైంది.
తమతమ గానప్రావీణ్యం పట్ల ఇద్దరికీ అచంచలమైన నమ్మకం .సంగీతసముద్రం లో లోతులు అంచులు చూసిన గానకళాకోవిదులాయె ! మరి. వాదన తీవ్రమై ఎవరుగొప్పో తేల్చుకోవాలన్న పట్టుదల పెరిగింది . సరే మరి ఈవిషయం లో న్యాయ నిర్ణేత ఎవరు అని ఆలోచించి దేవతలనందరినీ న్యాయనిర్ణేతలుగా ఉండమని కోరినా అందరూ తమకా సామర్ధ్యం లేదని తప్పుకున్నారు . చివరకు లీలానాటక సూత్రధారి పరమాత్మ శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరింది తగాదా .
ఆయన ,నాయనలారా మీ ఇరువురి పోటీలో న్యాయనిర్ణయం చేయగలవాడు ఒక్కడే వున్నాడు . అతడు హనుమంతుడు .గంధమాధన పర్వతం పై ఉన్నాడు వెళ్లి అతనిముందు మీరు మీ సందేహాలకి సమాధానం పొందవచ్చు అని సూచించాడు.
ఇద్దరు వెంటనే గంధమాధన పర్వతం చేరుకున్నారు . అక్కడకు వెళ్ళేసరికి ప్రకృతి పులకించిపోతున్నది .,హనుమంతుడు చేస్తున్న రామనామ గానానికి .హృదయమంతా రామమయమై ,గానంతో ప్రకృతిలో అణువణూవునూ రామనామరస జగత్తులో ఓలలాడిస్తున్న హనుమంతుని గానానికి మహర్షులిరువురూ మైమరచి బాహ్యస్మృతి కోల్పోయి తన్మయులైపోయారు. ఆయన గానం ఉచ్ఛ స్థితికి చేరుకునే సరికి అక్కడున్న రాళ్లు కరిగి ప్రవహించటం మొదలెట్టాయి. హఠాత్తుగా గానమాపిన హనుమంతుడు నారద తుంబురులచేతులలోని వీణలను లాక్కుని ఆ ప్రవాహం లోకి విసిరాడు . అంతే గానమాపగనే ప్రకృతి లో జడపదార్ధలన్నీ తమ స్వగుణం లోకి మారాయి వీరిరువురి వీణలు ఘనీభవించిన ఆరాళ్ల మధ్యలోనే ఉండిపోయాయి .
అప్పుడు స్వామీ ! మీరొస్తున్న కార్యక్రమ సందేశం ప్రభువు ఆజ్ఞానుసారం నాకర్ధమైంది . ఇప్పుడు ఆ ఘనీభవించిన రాళ్లను మీ గానంతో కరిగించి ఎవరు ఆ వీణలను తీయగలరో వారే గొప్ప అని ప్రకటించాడు .
వీరివురూ తమ తమ విద్యాప్రదర్శనచేసి ముల్లోకాలు ఆశ్చర్యచకితులయ్యేలా చేయగలిగారు . కానీ రాళ్ళను కరిగించలేకపోయారు. వాస్తవానికి వారిరువులు మహా భక్తులే . కాని భక్తుడు తనకున్న విద్యను భగవదర్పితం చేసినప్పుడు వినయం వివేకం పెరుగుతాయి . కానీ వ్యక్తిగతమైన అహంకారమనే ,తమస్సు మనస్సును అవరించుకుంటే ,భగవత్ కృపారసం వారిపై ప్రసరించుట ఆగిపోతుంది . అదే ఇక్కడ సంభవించింది . భగవదర్పితమైన తమ గానవిద్య పట్లచేసిన అపచారం తెలుసుకున్న మహర్షులిరువురు తమ తప్పిదం గ్రహించి హనుమంతుని శరణువేడారు .తమ వీణలను తమకిప్పించమని .
మరలా రామనామ గానంతో శిలలను కరిగించిన హనుమంతులవారు వారి వీణలను వారికి తీసి ఇచ్చారట.


Read more...

హనుమంతుని ద్వాదశ నామములు

>> Sunday, May 2, 2010


ఆపదామప హర్తారం
దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం .

// హనుమానంజనీసూను: వాయుపుత్రో మహాబల:
రామేష్ట: ఫల్గుణసఖ పింగాక్షో అమితవిక్రమ:
ఉధధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక:
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా //

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన:
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషత :
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్రవిజయీ భవేత్ //

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP