శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మూడు కన్నుల హనుమంతుని మున్నెన్నడైనా చూసారా

>> Wednesday, November 4, 2009





హనుమంతుడు ... ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని తెలుసుకున్నారా ?

అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.

"స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల"ని వేడుకున్నాడు.

అప్పుడు రాముడు "నారదా ! రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ"ని అన్నాడు. , రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.

యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంఖు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ఇచ్చారు .. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.విశిష్ఠంగా కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.

వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

3 వ్యాఖ్యలు:

Anonymous November 4, 2009 at 9:40 AM  

అవటానికి నేనూ ఆ స్వామి భక్తుణ్ణే. కానీ ఈ రకమైన కథ నా జీవితంలో వినలేదు. నిజమైతే అవ్వొచ్చు, ఒకవేళ తెలిస్తే ఏ పురాణములోదో చెప్పగలరు. ఏదైనా వెయ్యొచ్చు కానీ వెఱ్ఱి తలలు మటుకు వెయ్యకూడదు అని ఆశించే వాళ్ళలో ఒకడిని. ఆ స్వామికి క్షమాపణలతో

durgeswara November 4, 2009 at 10:28 PM  

స్వామీ !

భగవత్ లీలలకు అవధులుండవు. మనకు పౌరాణిక ప్రమాణీకము కాకున్నా స్థానిక చరిత్రలనుంచి అనేక భగవత్ గాధలను మనం వింటుంటాము. వాటిలో భక్తిప్రపూరితము మానవశ్రేయస్సుకు ఉపయోగపడేవాటిని అంగీకరిస్తూనే వున్నాము.ఉదాహరణకు అయ్యప్పస్వామి వారి చరితం.
ఇక్కడ అంతర్జాలం లో ఎక్కడో చదివిన విషయాన్ని మీకు పరిచయం చేయాలనేసదుద్దేశం తో వ్రాసాను. వెర్రిని పెంచే చర్యలను మీకులాగే నేను కూడా అంగీకరించను. ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి May 5, 2010 at 3:52 PM  

నమస్కారములు.
ఈశ్వరుని వలన ముక్కంటి గా పిలువ బడిన హనుమంతుని కధ చక్కగా వివరించారు. ఈ కధ వలన తెలియని విషయాన్ని తెలియ జెప్పినందుకు ధన్య వాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP