శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాదేవా నీనామం పలుకగ మా మార్గమేదో ఇలా చూపావా ?!! అల్లా హో..అక్బర్

>> Thursday, October 22, 2009

నిన్న బుధవారంఉదయం కోటి పంచాక్షరీ జపయాగం ప్రారంభించాము . సాయంత్రం పూజముగించుకుని రాగనే ఫోన్ మ్రోగింది .
ఫోన్ ఎత్తగనే " బాగున్నారా ! స్వామీ . ఎక్కడో విన్న గొంతు పలకరించింది .
ఎవరు ?

నేను స్వామీ ! మూసా కలీముల్లా ను ముసలమడుగునుంచి .......
మనసువెంటనే .బాధతో నిండింది .అయ్యో ఎంతకష్టమొచ్చినది . ఎలా వున్నారని అడిగాను.
ఊరంతా మునుగుపోయినది స్వామి .ఇల్లన్నీ కూలిపోయాయి . పట్టలతో గుడారాలు వేసుకుని కాలం గడుపుతున్నాము. సర్వం వరదకు కృష్ణార్పనం అయిపోయి మనుషులం మిగిలాము
అయ్యయ్యో ! తాతగారెలావున్నారు ? పలుమార్లు హజ్ యాత్ర కెల్లివచ్చిన ఆథ్యాత్మిక సాధకుడు పండుముసలి అయిన ఆవృద్దుని క్షేమం అడిగాను.
తాతగారితో మాట్లాడండి అని ఆఫోన్ ఆయనకిచ్చాడు .
తాతగారు ! ఈవయసులో ఎంతకష్ట మొచ్చినదండి ? ఓదార్చబోయాను
నా అమాయకత్వాన్ని అపహాస్యం చేస్తూ ఆ పండిపోయిన భగవద్భుక్తుని నోట నిర్లిప్తంగా ” భగవంతుని లీల స్వామీ ! ఎన్నిపాపాలు చేశామో ? ఇలా అంతా ఆయన లీల .అనే మాటలు విని ,. గీతలో పరమాత్మ చెప్పిన సుఖ దు:ఖాలను సమానంగా తీసుకోగలిగిన యోగిలక్షణాలు కనపడి మనసులోనే ఆ స్థితప్రజ్ఞునికి నమస్కరించుకున్నాను.

ఏమిటితండ్రీ ! నీలీల నిన్నటివరకు నిశ్చితంగా వున్నవారిని ఇలా దిక్కులేనివారిగా చేశావు ? మనసులోనే ప్రశ్నించుకున్నాను.
నాసంగతి సరే !ముందు నీ రుణం తీర్చుకుని ఏడువు . మనసుకు సంకేతం అందింది .
అవును . ఎవరివల్ల మనం కొద్దిగా సహాయం పొందినా ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకోవాలి . లేకుంటే అది జన్మ జన్మ లకూ బాకీగా మనలను వెంటాడుతుంది . నిరాకారస్వరూపం లో భక్తులచేత అల్లాహో అక్బర్ అని పొగిడించుకుంటూన్న పరమేశా ........పాహిపాహి వెంటనుండి ఇలా ఎప్పుడూ మెలకువకలిగించి కాపాడు తండ్రీ . అని వేడుకున్నాను .


....................................................................................................................................................................
ఈ సన్నివేశానికి మూలకారణమైన విషయాన్ని మీకు వివరిస్తాను.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

గత సంవత్సరం జరిగిన తుంగభద్రపుష్కరాలకు సంగమేశ్వరం వెల్లాము .ఇక్కడ అంతర్జాలములో అనేకమంది భక్తుల తరపున కూడా తుంగభద్రకు పూజ దీపదానం చెసే కార్యక్రమం గురించి చెప్పగానే చాలామంది తమ తమ గోత్రనామాలను కూడా పంపారు గుర్తుందనుకుంటాను మీకు .

నేను మా అమ్మగారిని ,భార్యను పదిహేడుమంది పదవతరగతి విద్యార్ధులను , తీసుకుని సంగమేశ్వరం బయలుదేరగా రాత్రికి అక్కడకుెల్లటం ప్రమాదకమని వెళ్లరాదని పోలీసులు ఆపటం ,తో మాతోపాటు ప్రయాణిస్తున్న మరో బ్రాహ్మణులజంట ,ఇంకో కుటుంబముతో కలిసి ముసలమడుగు అనే వూరిలో దిగాము . ఆరాత్రివేళ ఆవూరివారైన ఈకుటుంబము పిల్లలకొరకు అప్పటికప్పుడు భోజనాలు ఏర్పాటు చేసి ఏంతగానో ఆదరించారు . ఆవివరాలన్నీ ఒకపోస్ట్లో వ్రాసి వున్నాను అప్పుడే.చూడండి ఇక్కడ
http://durgeswara.blogspot.com/2008/12/blog-post_20.html



మీకు ఇబ్బంది కలిగిస్తున్నామని మొహమాటపడగా ఆముసలాయన భగవత్ భక్తులు రావటం మా అదృష్టం ,దొరకమన్నా దొరుకుతారా అంటూ ఆయన చూపిన ఆదరణ మరువలేము . నిజమైన భారతీయవిలువలకు ప్రతీక ఇలంటివారే .ఆ సమయం లోనే మామధ్య నిరాకార స్వరూపుడైన శివున్ని అల్లా అనే నామంతో ముస్లిం భక్తులు ఎలా కొలుస్తున్నది , తరచిచూస్తే గాని భవిష్యపురాణం లో చెప్పబడిన ఈ రహస్యాలు అర్ధమవటం జరుగుతుందని చర్చ కూడా జరిగింది. అలానే కాలం విపరీత కష్టాలను తేబోతుందని .తాతగారు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు చెప్పిన కాలజ్ఞానం లో సూచనల ఆధారంగా రాబోతున్న కష్టాలను గుర్తించి మానవులు భగవంతున్నాశ్రయించవలసివున్నదని ఇలా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నాము . వారి అడ్రస్ వ్రాసుకున్న కాగితాన్ని పిల్లలు పోగొట్టటంతో వారితో ఫోన్ నంబర్ కూడా గుర్తులేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు మేము సేకరించి పంపిన బియ్యాన్ని ఆత్మకూరు పంపమని గోకవరం కేంద్రంగా చేపట్టిన సహాయ చర్యలలో ముసలమడుగు ప్రాంతం లో పంపిణీ చేస్తామని విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు చెప్పినప్పుడు ,స్వామీ నాసంకల్పం లేకుండానే ఈ సహాయం చేపిస్తున్నవా అనుకున్నాను . .ముస్లిం కుటుంబాలు ఎక్కువగా వున్న ఈగ్రామం లో వరదనీరు ముప్పైఅడుగులకు పైగా నిలచినదట . ఊరంతా దగ్గరలో వున్న కొండప్రాంతానికి చేరుకోవటం తో ప్రాణ నష్టం లేకున్నా ఇల్లన్నీ నేలమట్టమయ్యాయని చెప్పారు . అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న కార్యకర్త వాసుదేవరెడ్డి గారిని ఈకుటుంబ వివరాలు తెలుపమని అడిగాను .కానీ గందరగోళంగా వున్న ఈపరిస్థితిలో సాధ్యంకాలేదు వారికి .

కానీ రుద్రహోమము మొదలుపెట్టగనే సాయంత్రానికి రుణమున్న వారి విషయం లో నిరాసక్తత తగదని హెచ్చరిస్తూరుణం తీర్చుకునే అవకాశం కల్పించి వీరినుంచి ఫోన్ చేపించిన పరమేశ్వరుని లీలకు ఆశ్చర్యపోయాను . నాకు చేతనైన సహాయం వెంటనే పంపాను .
భగవంతుడే గొప్పవాడు ...[ అల్లా హో అక్బర్ ]

ఏలీల ఎందుకు జరుగుతుందో అర్ధంకాని మాయామోహితులము ప్రభూ ! వీరికష్టాలను తొలగించమని కరుణా సాగరుడైన పరమశివుని వేడుదాము.

6 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ October 22, 2009 at 4:24 PM  

కులాలకు,మతాలకు అతీతంగా మానవత్వమే చివరకు మనకు శ్రేయస్కరం.

Rajasekharuni Vijay Sharma October 23, 2009 at 4:06 AM  

భగవంతుడు నేనున్నానంటూ నిరూపించే ఇలాంటి సంఘఠనలు విన్నప్పుడూ , కన్నప్పుడూ కళ్లు ఆనందంతో తడిచిపోతుంటాయి.

ఇటువంటి అనుభవాలు తోటి బ్లాగు మిత్రులకు పంచే మీ ప్రయత్నమునకు ధన్యవాదములు. -^-

durgeswara October 23, 2009 at 9:22 AM  

ఈదేశములో వున్నది మతం కాదు. మతం ఒకానొక మార్గం .ఒకరి ప్రతిపాదన మాత్రమే .ధర్మం అలాకాదు ఎవరేమనుకున్నా చివరకైనా తప్పనిసరిగా ఆచరించాల్సిన సత్యం . కనుక ఈదేశం లో ప్రజలు ధర్మాన్నే దైవంగా భావిస్తారు. ధర్మం కోసమే జీవిస్తారు. అటువంటి ధర్మ భూమి మనది.

బృహఃస్పతి October 23, 2009 at 9:54 AM  

ఆ సమయం లోనే మామధ్య నిరాకార స్వరూపుడైన శివున్ని అల్లా అనే నామంతో ముస్లిం భక్తులు ఎలా కొలుస్తున్నది , తరచిచూస్తే గాని భవిష్యపురాణం లో చెప్పబడిన ఈ రహస్యాలు అర్ధమవటం జరుగుతుందని చర్చ కూడా జరిగింది.

నాలో ఈ భవిష్య పురాణంపై జిజ్ఞాస రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ వివరాలు తెలుసుకునే దారి తెలుపగలరు.

మనోహర్ చెనికల October 26, 2009 at 11:12 AM  

బృహస్పతి గారు,
భవిష్య పురాణం archive.org లో చూసినట్టు గుర్తు,http://www.archive.org/search.php?query=bhavishya

రాఘవ October 27, 2009 at 4:30 AM  

సర్వే భవన్తు సుఖినః సర్వే సన్తు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃఖభాగ్భవేత్.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP