శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివానందలహరి......1

>> Monday, November 17, 2008


శ్లో// కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతప:
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే
శివాభ్యాం మస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియం

సకళ కళారూపులు ,చూడాలంకృత శశికళాన్వితులు,పరస్పర తపస్సంపద్ ఫలాయుతులు,భక్తకోటికి ఐహికాముష్మికఫలప్రదాతలు ,త్రిభువనాలకస్తోకమంగళప్రదులు, భక్తవితతి ధ్యాన హృదయాంతరాల్లోపున:పున:ప్రభావితులు,స్ఫురదానందానుభవ సాక్షాత్కారవైభవోపేతులు,శ్రీపార్వతీపరమేశ్వరులు వారికిదే నాభక్తి పురస్కృత సాష్టాంగనమస్కృతులు.

శ్లో// గళంతీ శంభో త్వచ్చరితసరిత: కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణషు పతంతీవిజయతామ్
దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం
వసంతీమచ్చేతో హ్రదభువి శివానందలహరీ .

ఓశంకరా! సమస్తకిల్భిషరజస్సునూక్షాళనం కావిస్తూ సంసారమ్లో పరిబ్రమించేమనసు యొక్క తాపాన్ని వుపశమనంచేస్తూ ప్రవహించే శివానందలహరిని తమచేతోహ్రదాల్లో చిరస్తాయిగా నిల్పుకునే అశేషభక్తజనావళికి అహరహం సిద్దిమ్పజేయి విజయశ్రీ.

త్రయీ వేద్యమ్ హృద్యం త్రిపురహర మాయం త్రిణయనం
జటాభారోదారం చలదురగహారాం మృగధరం
మహాదేవం దేవం మయి సదయిభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే

త్రయీవేద్యున్ని ,హృద్యున్ని ,త్రిపుర సమ్హారుణ్ణి ,ఆద్యుణ్ని ,త్రినయణున్ని,జటాజూటభారోదారుణ్ణి చల దురగహారుణ్ణి ,మృగధరుణ్ణి మహాదేవుణ్ణి,నామీద సదయభావుణ్ణి ,పశుపతిని చిదాలంబుణ్ణి,సాంబుణ్ణి అతివిడంబుణ్ణి శివుణ్ణి,దేవదేవుణ్ణి నాహృదిలో నిల్పుకొని నిరంతరం భజిస్తాను.

శ్లో// ఘటోవా మృత్పిండో ప్యణురపిచ ధూమో2గ్ని రచల:
పటోవా తంతు ర్వాపరిహరతి కిం ఘోరశమనం
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజ సుధీ:

ఘటమనీ,పటమనీ,మ్మృత్తనీ తంతువనీ,ధూమమని ,అగ్ననీ ,అణువని,పరమాణువనీ ,అచలమని,చలమని ఏవేవో తర్కవితర్క వాక్యాలు వల్లిస్తేఉబుసుపోకేగాని ,ఒరిగిపడేదేముంది?వృధాకంఠ క్షోభతప్ప. ఘోరమయిన యమధర్మపాశాలనుఁడి తప్పిస్తాయా అవి? అందుకే ఓసుధీమణీ ! వేవేగ అందుకో శంభుపదాంభోజ భజనం .పొందగలవు పరమసౌఖ్యం .

శ్లో// మనస్తే పాదాబ్జే వివసతు వచ స్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణనవిధౌ
తవధ్యానే బుద్దిర్నయనయుగళం మూర్తివిభవే
పరగ్రంధాన్కై ర్వాపరమశివజానే పరమత:

ఓపరమేశ్వరా! నామనస్సు నీపాదపద్మాలకే కట్టువడనీ,నావచస్సు నీస్తోత్రఫణితిలోనే ఫలించనీ! నాశృతి నీకథాకర్ణనానికే ఆకర్షితం కానీ ! నాబుద్ధి నీధ్యనధారలోనేనిమగనమైపోనీ! పరమశివా ఏవం విధంగా ,ఈనామృణ్మయవిషయేంద్రియవితతి అన్యవిషయాసక్తి విముఖమై ,భవదున్ముఖంగా చిన్మయీకరించు.
[౧ నుండి ౫ ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP