శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈజిప్ట్ పిరమిడ్స్ లో వింత అనుభవాలు

>> Monday, September 8, 2008

( పూజ్య శ్రీ ఎక్కిరాల వేద వ్యాస్ గారి రచనలనుండి (4) ) లండన్ లో కీరో “జ్యోతిష్కుడూ సాముద్రికుడూ “అన్న బోర్డు తగిలించినప్పటినుంచీపదులూ వందలూ దాటి, వేల సంఖ్యలో జనం రావడం మొదలు పెట్టారు.

ఉదయం భోజనానంతరం 10-30 నిముషాలకల్లా టంచన్ గా తన ఆఫీసుగదిలో టేబుల్ వద్ద కూర్చుంటే చివరకు సాయంత్రం ఆరు గంటలకు బలవంతంగా విజిటర్స్ ను వదిలించుకుని బయటకు వచ్చేవరకు ఊపిరి సలపనంత పని రకరకాల వ్యక్తులు స్త్రీలు, పురుషులు కళాకారులు , నేరస్తులు, దొంగలు, గూఢచారులు , ప్రధానమంత్రులు, మహారాజులు – ఒకరేమిటి కాస్త పేరుప్రతిష్టలు పొందిన వారేవరైనా సరే కిరోను దర్శించినవారే.

ఆశ్చర్యం ఈ మధ్య స్వామి వివేకానందుని – ఆముద్రిత ఉపన్యాసాలతో ప్రచురించిన పుస్తకం ‘The New Discoveries’ అన్న సంపుటంలో ఒక అపురూపమైన ఫౌటో చిత్రంవున్నది. అది స్వామి వివేకానందుడి కుడి – చేతి ప్రింటు ( Hand Print of Swami Vivekananda ) – దానికింద స్వామీజీ చికాగో పర్యటనలో ప్రపంచ సర్వమతాల పార్లమెంటు సభ లకు వెళ్ళినపుడు సరిగ్గా – అదే సమయంలో కీరో చికాగోలోని ఒక ప్రఖ్యాత హోటల్లో కూర్చుని తన జ్యోతిషం ప్రాక్టీసు కొనసాగించిన రోజులలో స్వామి వివేకానందుని అరచేతిముద్ర కీరో చేతిముద్రల ఫైలులో లభించింది.

అలానే దివ్యజ్ఞాన-సమాజ (Theosophical society ) సభ్యురాలు అనీబిసెంట్ వంటి ప్రముఖులు – శ్రీకృష్ణుడి అవతారం అని కొందరు, లేక రానున్న ప్రపంచ అవతారమూర్తి అని కొందరు ఊదర గొట్టేసిన వాడూ ఐన జిడ్డు కృష్ణమూర్తి ( J.K.) చేతి ముద్రలు కూడావున్నాయి. కీరోజాతకాలు చూసినవారిలో – ఎందరో ప్రముఖులు వున్నాయి. దివ్యజ్ఞానసమాజ సభ్యురాలు మేరీ కేధరీన్, టింగ్లీ , ఇంకా దివ్య జ్ఞానసమాజ స్థాపకురాలు మేడం బ్లావెట్స్కీ వంటి ప్రముఖులు ఎందరో కీరో చేత జ్యోతిషం చెప్పించుకున్నారు. ఇందులో కొన్నివిడిగా వేరే అధ్యాయాలలో తెలియచేయడం జరిగింది.

ఎంతటి ఉక్కు శరీరంగల మనిషికైనాసరే ఉదయంనుంచీ సాయంత్రందాకా అదే ఉదరకొట్టినట్టు జాతకాలు తోమేస్తే ఆరోగ్యం దెబ్బతినక మానదు. అందులోను వేలాది వందలాదిమందికి తన ప్రాణశక్తిని ధారపోస్తూ వారి కష్టాల్లో సలహాలు, సహాయ సహకారాలందిస్తూవుంటే ఆరోగ్యం దెబ్బతినక మానదు. కీరో విషయంలోనూ సరిగ్గా అంతే జరిగింది. రోగం ఏమీ లేకపోయినా నరాల బలహీనత ,నీరసం , అని డాక్టరులు నిర్ధారించిన నీరసం పరిస్థితి ఏర్పడింది.
ఇక లండన్ లోగాని, చికాగోలోకాని, ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్ లోని ఏ ముఖ్యనగరంలోవున్నా కీరోను పట్టుకొని పీడించే జనసమ్మర్ధం విడిచిపెట్టదు. మరి ఏమిచేయాలా అని కీరో ఆలోచిస్తుంటే అతని మనస్సుపై టి.వి. స్క్రీన్ వంటి చిత్రం ఒకటి, ఫ్లాష్ అయింది. ఆచిత్రంలో ఎత్తైన కొండల్లాంటి నలు పలకల పిరమిడ్ లు , ఈజిప్ట్ లోని పురాతన శిల్పాలు కనిపించాయి. దాంతో ఎగిరి గంతేశాడు కీరో, భారతదేశం తరువాత అంతే ప్రాచీనతగల ఆధ్యాత్మిక దేశం ఈజిప్ట్ క్రీస్తుపూర్వం 17000 బి.సి వరకూ కూడా ఈజిప్టును పరిపాలించిన ఫారో చక్రవర్తుల సమాధులు వారి దిప్యజ్ఞాన విజ్ఞానానికి సంబంధించిన అపురూపమైన ధ్యానమందిరాలు ఒకటేమిటి ఈజిప్టులో ఆధ్యాత్మక పురాతన సంపద అంతా కట్టకట్టుకొని వచ్చి కీరో మనసుముందు మెరిసింది.

మరునాడే తన సెక్రటరీ పూర్తి జీతంమీద రెండునెలలు సెలనిచ్చి తాను విశ్రాంతిగా ఈజిప్టువెళ్లే స్టీమరుకు టికెట్టు తీసుకొని, మూడోకంటికి తెలియకుండా బైల్దేరివెళ్ళాడు.

బంగారురంగు సూర్యాస్తమయంలో గోరువెచ్చటి నీరెండ లండన్ చలికి కాచుకున్న వెచ్చదవంతో చిరుగాలులు వీస్తుంటే ఓడ ఈజిప్టువైపుకు దూసుకుపోయింది. కెయిరో మహానగరంలో టూరిస్టుగా అడుగుపెట్టాడు కీరో

ఓడ ప్రయాణం దాదాపు నెల రోజులు సాగింది. ఓడ ఇంకా కెయిరో సమీపానికి చేరకముందు సముద్రంలో ప్రయాణిస్తుండగా ఓడ కెప్టెన్ కీరో వద్దకు వచ్చి.మీరు వైద్యులా మీసహాయం కావాలి అన్నాడు. కీరో ఆశ్చర్యపోయి దానికి సమాధానంగా నేను వైద్యునికాదు కాని సహాయం చెయ్యగలను ఏమి కావాలి అన్నాడు.

ఓడలోని ఇంకొక ప్రయాణీకుడు చలిజ్వరంతో వణికిపోతూ మెలికలు తిరిగిపోతున్నాడు. ఒక వైపు దిగ చెమటలు ధారలు కట్టి కారుతుంటే మరొకవైపు దంతాలు కటకటా కొరికే చలి. మీరేమన్నా అతనికి వైద్యంచేయగలరా ఎవరిదగ్గరా మందులేవీలేవు. అన్న కెప్టెన్ అభ్యర్ధన విని కీరో పరుగు పరుగున తన ఓడలోని క్యాబిన్లోని తన సూట్ కేస్ తెరచి, ఏవో కొన్ని తెల్లని బిల్లలు తీసుకువచ్చి ఆ వ్యక్తిచేత మింగించాడు. అతడి పక్కనే కూర్చుని వేడినీరు గంటగంటకు తాగిస్తూ ఉపచారంచేసాడు.

అతడు పైకిచూస్తే మనిషి, ఓడలో తక్కువస్ధాయి ఉద్యోగో లేక బంట్రోతో లోక వంటవాడో లాగ కనిపిస్తున్నాడు ఎపరైతేనేమి కష్టాలలోవున్నాడు అనుకుని అతనికికీరో చేసిన ఉపచారములతో కోలుకున్నాడు తనకిలా అద్భత సాయంచేసున వ్యక్తి కీరో అని తెలిసి అతనికి కన్నీళ్ళు పొంగి వచ్చాయి . తన రెండుచేతులతో కీరో హస్తాల్ని కౌగలించుకొన్నట్లు నొక్కి పట్టుకుని కృతజ్ఞతతో.

సోదరా మీరు నాకు ప్రాణదానం చేశారు మీమేలు ఎన్నటికి మరిచిపోను. నేను పరిస్ధితులు చెడి ఇలాగ చిన్న నౌకరీచేసి జీవించ వలసివచ్చింది. కాని మా పూర్వీకులు ఈజిప్టులోని దేవాలయాల్లో ప్రాచీన అర్చకులు ఈజిప్టులో ఫారోల కాలంనుంచీ మాదేశంలో మంత్రశాస్త్రమూ ఈజిప్టులోని దేవాలయాలలోని ఆగమశాస్త్రం ప్రకారం పూజలూ, జపాలూ నిర్వహించే ఆగమపండితుల లేక అర్చనాచార్యుల వంశానుక్రమంగా వచ్చే, సాంప్రదాయ పురోహితుణ్ణి మీరు ఈజిప్టుకు ఇదే మొదటిసారి రావడం అనుకుంటా అక్కడ ఎన్నో విచిత్రాలూ, వింతలూ చూడవచ్చు. ఇక్కడి చాలా విషయాలు అంతుపట్టవు. మీలో చాలామందికి సిగరెట్ తాగడం, విస్కీ సేవించడంతో పాటు తూర్పుదేశాలలోని ఈజిప్టు భారత దేశాల ఆధ్యాత్మికతను గురించి చులకనగా విమర్శిస్తారు తప్ప మరేమీ తెలియదు. చాలామందికి క్షమించాలి బుర్రతక్కువ వ్యక్తులు డబ్బు జాస్తి మేకపోతు గాంభీర్యంగా బతికేస్తూ వుంటారు అన్నాడు.

కీరో ఇబ్బందిగా నవ్వుతూ అది చాలామంది విషయంలో సహజమే అయినా నేనలాంటినాడిని కాననీ తన చిన్నతనంలో భారతదేశంలో గడిపాననీ సాంప్రదాయపరాయణులైన బ్రాహ్మణులవద్ద జ్యోతిషం నేర్చానని చెప్పగానే ఆ ఈజిప్టు పురోహితుడి కళ్ళు జ్యోతుల్లా మెరిశాయి. పొంగి పచ్చే కన్నీళ్ళతో ఆనందభాష్పాలురాగా.

సోదరా ఈరోజునుంచీ నన్ను మీ ఆత్మబంధువుగా భావించండి మీకే ఇబ్బంది, కష్టం కరిగినా నన్ను తప్పక గుర్తుంచుకోండి. కీరో అతని అభినందిస్తూ తనదగ్గర ఇంకా మిగిలివున్న క్వినైన్ మలేరియా బిల్లలు ఇచ్చి చిలిజ్వరం పూర్తిగా దీంతో పటాపంచలౌతుంది అని చెప్పి ఇంతలో ఓడ హార్బరుకి చేరడంతో హడావుడిగా తన సామాను తీసుకుని దిగిపోయాడు. ఇద్దరూ పాత స్నేహితులవలే కౌగలించుకుని సెలవు తీసుకున్నారు.

విచిత్రమైన అతి పురాతనమైన చరిత్రకల ఆధ్యాత్మిక దేశం ఈజిప్టు వెచ్చటి అక్కడి వాతావరణం, నీలమైన పరిశుభ్రమైన ఆకాశం, గాలీ, కీరో ఆరోగ్యాన్ని త్వరలోనే బాగుచేశాయి.

టూరిస్టుగా ఈజిప్టును చూడాలని బయలుదేరాడు కానీ ఏంచూడాలి అతి పురాతనమైన మహారాజులు, సిద్ధపురుషుల సమాధులు వందలు , వేల సంఖ్యలో వుండే ప్రసిధ్ధమైన ఎల్ కార్నాక్ అనబడే రాజుల స్మశానం అన్న ప్రాంతంలో దిగాడు. చరిత్రలో ప్రసిద్ధమైన పరవతాలవలె వందల ఆడుగుల ఎత్తు కట్టిన ఈజిప్టు పిరమిడ్ లను దర్శించాలని తహతహ లాడాడు . కీరో ఇప్పటికి ప్రపంచ ప్రసిద్దమైన ఏడు ప్రపంచ వింతలలో “seven wonders in the world “ అనబడే పెద్ద ఘీజా పిరమిడ్ ని దర్శించాలని తహ తహలాడాడు.

అనేకమంది యూరోపియన్ ప్రొఫెసర్లు, చరిత్ర పరిశోధకులు కొత్తగా కనుగొన్న ఈ గొప్ప పిరమిడ్లు అనబడే నల్లరాతికొండలవంటి కట్టడాలపైన చారిత్రక పరిశోధనచేస్తున్న రోజులవి. అవిచూడాలంటే అందరికి అనుమతి లభించదు. అందులోని ప్రాచీన శిల్పసంపదను పాడుచేస్తారని. అంతేగాదు ఆ పిరమిడ్లలో ప్రవేశించగానే భూమి అడుక్కివెళ్ళేసొరంగంలాంటి దారులు. కటిక చీకటిలో నిండినవి మెలికలు మెలికలు తిరుగుతూ, మన పత్రకలలో కనిపించే చిక్కుపజిల్లోని గజిబిజి మార్గంవంటి అనేక చిక్కుదారులు భూగర్భంలో వలలుగా అల్లుకొని వుంటాయి. అందులోకి దిగి ఆసొరంగంలో ప్రవేశించినవాడు ఎవ్వడూ తిరిగి ప్రాణాలతో పైకిరాలేడు. కారణం ఆ సొరంగంవంటి భూగృహంలో చిక్కుదారుల వెంటబడి అక్కడే తిరుగుతూ తిరిగినచోటే మళ్ళీ ప్రదక్షిణాలుచేస్తూ అందులోనే పద్మవ్యూహంలా చిక్కి బయటకు రాలేక అందులోనే మరణిస్తారు.

అందుకని ఆ చిక్కుదారుల ప్లాన్లు తెలిసిన ఈజిప్టుదేవాలయ సాంప్రదాయం తెలిసినవారికే తప్ప , లేదా అలాంటివారినే గైడ్ తో సహాయకుల వెంటతీసుకొనివెడితేనో, తప్ప అందులోకి వెళ్లేందుకు అనుమతి లభించదు.

కీరో ఈజిప్టుకు ప్రయాణమయ్యే తరుణంలో ఒక ఉద్యోగంలేని ఇంగ్లీషు యువకునిగా భావించి ఒక ముసలి ప్రొఫెసర్ గారు ఇతనిని తనతోపాటు ఈజిప్టులో చరిత్ర పరిశోధకుడు అసిస్టెంట్ గా తనవెంట రమ్మని ఈజిప్టుకు తీసుకు వెళ్ళడం జరిగింది. ఇదీ ఒక విధంగా మేలే ఆ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి వెంట వెళ్ళడంతో కీరోకు ఈజిప్టు పిరమిడ్ల సొరంగాల చీకటి కోణాలలో కి ప్రవేశించే అనుమతి లభించింది. కీరో ఆనందంతో గంతులేశాడు. కాని ఆఆనందం ఎంతో సేపు నిలువతేదు.

అంత పెద్ద ప్రొఫెసర్గారు వెంట వున్నారుగదా అని పిరమిడ్ లోనికి అనుమతి లభించిన వీరిద్దరూ, చెరొక లాంతరూ తీసుకొని ఒక చిన్న టిఫిన్ బాక్సులో బిస్కట్లూ, ఫ్లాస్కులో కాఫీ వెంటతీసుకుని నేల సొరంగంవంటి ఆ పిరమిడ్ అంతరాళంలోకి ప్రవేశించారు. పైన బ్రహ్మాండమైన పర్వతంవంటి ఎత్తైన కట్టడం ప్రపంచంలో ఇంత వరకూ ఏ మనిషిచేతా కట్టబడలేదు. ఇలాంటి ఈజిప్టు పిరమిడ్ల కంటే ఎత్తైనవి ఇంతవరకూ ఎవరూ కట్టలేదు. దాదాపు 2000 అడుగుల ఎత్తుగల నల్లని కారు కంకరరాయి ఇటుక లతో కట్టిన ఎత్తైన కొండలవంటి దిభ్బలు పిరమిడ్అంటే అసలు ఇవి ఎవరు కట్టారో ఎందుకు కట్టారో అసలు ఎప్పుడు కట్టారో ఈ విషయాలేవీ ఇంతవరకూ ప్రపంలో ఎవరికి అంతుబట్టలేదు. సరికదా ఎవరికితోచినట్టు వారు ఊహాగానాలుచేస్తూ ఊకదంపుడు రచనలు చేస్తున్నవారే.

ఈ పిరమిడ్ కట్టడాల ప్రాచీనతను వాటి గంభీరతను చూస్తూ ఆనందిస్తూనే, బ్రిటీష్ ప్రొఫెసరూ, యువకుడైన కీరో , ఆ చీకటి నేల సొరంగంలో తిరిగి విహారం చేశారు. కడుపులో ఆకలి మండుతోంది. వాచీ చూచుకుంటే ఈ ఒక రోజు దాటి రెండవరోజు నడుస్తూంది. ఇద్దరికి భయం పుట్టు కొచ్చింది 24 గంటలా దేవుడా ఇందులోంచి బయట పడేదెలాగ అనికుంటూ తమవెంట తెచ్చుకున్న కాఫీ, బిస్కట్ల ఎప్పుడో ఖాలీ అయిపోయాయి. అంతా చీకటి లాంతర్లుకూడా ఆరిపోతున్నాయి. వత్తిలో కిరసవాయిలు కూడా అయిపోవస్తున్నది. చప్పువ కీరో కు మెరుపు లాంటి ఆలోచన తోచింది.

ప్రొఫెసర్ మహాశయా మనం ఈపాతాళగుహలలో దారి తప్పాము. మనం ఎలా బయటపడతామో లేక ఇక్కడే మరణిస్తామో తెలియదు. మన దారి మనం వెతుక్కోవలసిందే. మనిద్దరిం విడిపోకుండా కలిసి అన్వేషించడం అవసరం. ప్రొఫెసరుగారికి దిగ చెమట పోస్తుంటే గతిలేక అంగీకరించాడు. అప్పుడు కీరో ఇంకో సూచన కూడా చేసాడు. మన దగ్గరున్న లాంతర్లలో ఒక లాంతరు ఆర్పి రెండింటిలోని కిర్సనాయిలు ఒకే దాంట్లో పోసి అలా ఒకే లాంతరు ఇద్దుర వాడుతుంటే ఎక్కువకాలం వెలుతురు లభిస్తుంది.

అలాగే చేసారు. ఫలితంగా రెండవరోజుకూడా పాతాళ సొరంగంలో దారి తప్పి ఆలాగే తిరగ్గా ఆచీకటికోణంలో చిక్కుకుపోయామని మరొక్కసారి రూఢిఅయింది. ప్రొఫెసరుగారు భయంతో, నీరసంతోనూ కుప్పకూలిపోయాడు. కళ్ళనీళ్ళ పర్యంతం అయి విలపిస్తూ కీరోతో ఇలా అన్నాడు.

“ నాయనా చిన్నవాడివి ఎంతో భవిష్యత్తు చూడవలసిన యువకుడివి. ఇలా నాతోపాటు ఇలా ఈ పాతాళగుహలలో దిక్కిమాలిన చావుతో నశించిపోవడమేనా. నువ్వు నాతో రాకుండావుంటే బాగుండేది. కాని, విచారించి ఇప్పుడేం ప్రయోజనం నాకా నీరసం, భయం ముంచుకు వస్తుంటే మైకంకూడా కమ్ముకు రాసాగింది. ఏం చేయడమా అనే ఆందోళనతో దిగులుగా ఆలోచిస్తే కీరోకి మెరుపు ఆలోచన ఒకటి తట్టింది. తాను భారతదేశంలో నేర్చుకున్న పద్మాసనం లో కూర్చుని శ్వాస పీల్చి ప్రాణాయామం చేయసాగాడు. తన మనసు అంతర్ముఖమైంది. ఒక చోట, రెండు కనుబొమ్మల మద్యా కేంద్రీకరించి తీవ్రంగా ధ్యానించసాగాడు. ఒకే సంకల్పం.

“ సహాయం కావాలి . సహాయం కావాలి “
“ మహాత్ములకూ , సద్గురువులకూ సందేశం “
“ సహాయం కావాలి “

అంటూ S.O.S టెలిఫోన్ తరంగాల్లా మనసులో ఆలోచనలూ ఆందోళనా కలిపి రేడియో వార్తలలాగా బైటికి పంపించ సాగాడు. ఇంతలోనే మెరుపు మెరిసినట్టు కీరోకు ఓడలో తాను సహాయం చేసిన ఈజిప్టు అర్చకుడు అకస్మాత్తుగా గుర్తుకు వచ్చాడు. నన్ను గుర్తుంచుకోండి “ మీకేదైనా కష్టం కలిగితే నన్ను తలచుకోండి “ అన్న అతని మాటల్లో ఏదో నిగూఢమైన అర్ధం గోచరించింది. మరుక్షణమే ధ్యానిస్తూ ఆ ఈజిప్టు దేవాలయ అర్చకుణ్ణే మనసులో కేంద్రీకరస్తూ ధ్యానించాడు.

నిముషాలూ గంటలూ గడిచిపోతున్నాయి చలితోను, ఆకలితోను, నీరసంతోను శోషవచ్చి కీరో కూడా సృహతప్పిపోయాడు.,ఏం జరుగుతుందో తెలియకుండా అంతా చీకటి నిరాశ కాని ధ్యానించడం మాత్రం మానలేదు.

అలా ఎంతసేపు జరిగిందో ఊహకందని చీకటి అగాధం క్రంమంగా క్రమంగా వెచ్చని వేడినీళ్ళు కాపడం వెచ్చదనమూ అమృతాంజనం వంటి ఘాటైన ఏవో మందుమూలికల ఆయింట్ మెంటు లాంటి ఘాటుగా ముక్కులను మండించగా తెలివివచ్చింది కీరోకి . తానెక్కడవున్నదీ ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాడు. ఒక వెలుతురుతో నిండి, ప్రకాశవంతమైన పురాతన ఈజిప్టు దేవాలయంవంటి గది.

అరే ఆశ్చర్యం ఇది కలా నిజమా తానింకా జీవించేవున్నాడా లేక మరణిస్తే ఇది ఇంకో లోకమా ఇదేమిటి

ఆనుకుంటూ చుట్టూ కీరో పరకాయించి చూస్తే తాను ఒక పెద్దమంచంమీద పడుకునివున్నాడు అతని తలవద్ద అరే ఆశ్చర్యం ఓడలో తాను ఉపచారంచేసి మందులిచ్చిన ఈజిప్టు మాంత్రికుడు

నేనెలా వచ్చాను ఇక్కడికి మీకెలా తెలిసింది. నేనక్కడవున్నానని అంటూ వేయి ప్రశ్నలు మనస్సులో అన్నీ ఆశ్చర్యాలే

ఈజిప్టు పండితుడీ చిక్కు ప్రశ్నలకు నవ్వుతూ.

కీరో మిత్రుడా నీవు ఇప్పుడు బాగా విశ్రాంచి తీసుకోవాలి. ముందు నీవా పిరమిడ్ లోని పాతాళ గుహలనుండి ఇక్కడకు ఎలావచ్చానా అని ఆశ్చర్య పోతున్నావా అది నీవు ఎంతసేపు ఆలోచించినా నీ బుర్రకు అంతు పట్టదు పురాతన ఈజిప్టుశాస్త్రంలో అనేక సిద్ధవిద్యలు , మీ తెల్లదొరలకు అంతుపట్టనివీ , నమ్మనివీ ఎన్నో రహస్యాలు ప్రాచీన ఈజిప్టు ఆగమశాస్త్రంలో వుండేవి. అవన్నీ ఇప్పుడు దాదాపు నశించిపోయాయి. ప్రాచీన ఆగమపండితుల వంశంలో నేను ఏడవతరంవాడిని. ఈజిప్టులో ఇప్పటి యువకులు ఎవ్వరికీ కూడా ఈ పురాతన విద్యలు అబ్బలేదు. ఈ విద్యలు ఇప్పుడు నాతోనే అంతరించిపోతాయి.

ఆశ్చర్యపోతున్న కీరోవంక ప్రేమతోచూస్తూ ఆ ఈజిప్టు ఆగమమాంత్రికుడు చెప్పుకుపోతున్నాడు

వేలాది సంవత్సరాల క్రితం మీ క్రీస్తుశకం కంటే 17 వేల సంవత్సరాల 17000 బి.సి. పైచిలుకు మాట. ఈజిప్టు, భారతదేశాలు ప్రాచీన ఆధ్యాత్మిక సిద్దులకు పుట్టినిల్లు. అందులో దూరదృష్టి, భవిష్యత్తు తెలుసుకునే జ్ఞానమూ మీరిపుడు జాతకం , జ్యోతిషం అని పేర్లుపెట్టే విద్యలకు మించినవి ఇంకా ఎన్నో విద్యలు వుండేవి. అందులో మనిషి శరీరం ఆకారం, ఎత్తు, రంగువంటి సాముద్రిక లక్షణాలను బట్టి ఆమనిషి జాతకం చెప్పవచ్చు.

దీనినే ఈజిప్టులో అంగ సాముద్రికం లేక ఆగమ శిల్ప సాముద్రికశాస్త్రం అంటారు.దీని ప్రకారం మనిషియొక్క ఎత్తు, ఆకారం, వంటి సాముద్రిక లక్షణాలు కొలిచి అతడి భవిష్యత్తు చెప్పవచ్చు. అంతేకాదు అతడు గత జన్మలో ఎవరో ఇప్పుడీ జన్మ ఎదుకు ఎత్తాడో చివరకు మరణించాక అతని ఆత్మ ఏస్ధాయికి చేరుకుంటుందో అన్నీకూడా చేతిరేఖలేకాదు అరికాలు సాముద్రికములోని రేఖలనుబట్టి నుదుట ఉండే అడ్డగీతలు పొట్టమీద మడతలూ లెక్కించీ అలాగే కంఠంకింద అడ్డరేఖలు పరిశీలించి ఇంకా మోకాళ్ళు నాభి లేక బొడ్డు ఇలాంటి అవయవాలు ఆకారం, రంగు నిర్మాణం ఆగమ శిల్పశాస్త్రం ప్రకారం కొలిచి మనిషి భవిష్యత్తుచెప్పవచ్చు.

ఆశ్చర్యంగా వుందికదూ ఎంతో ఇలాంటి ప్రాచీన విజ్ఞానం చాలా నశించిపోయింది ఇప్పటికే. మీతెల్లదొరల ఇంగ్లీషు చదువుల పుణ్యమా అని. అలాంటి సాంప్రదాయ కుటుంబంలో నేను ఆఖరివాడను. నేనెవరో నీకు తెలియదు. కాని, నీవెవరో నాకు తెలుసు నీభవిష్యత్తుకూడా నాకు తెలుసు. ఇదిగా నేనుచెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు టూరిస్టుగా విహారయాత్రగా ఈజిప్టువొచ్చాననికదూ అనుకుంటున్నావు. అంతా అబద్ధం మాయ నీవు ఇక్కడికి పిలిపించ బడ్డావు.

అది నీశక్తికాదు ఇక్కడ ఈజిప్టులోని ప్రాచీన పిరమిడ్ లు నిర్మాణం చేసిన సిద్ధపురుషులు, ఆగమపండితులు యోగసమాధిలోవుండీ జీవించివుండగానే ఈ విగ్రహాల కింద సమాధి చేయబడ్డారు. వారు రాబోయే భవిష్యత్తు తెలిసిన జ్ఞానులు.

మీ తెల్లదొరలు చూడలేనివారు వారి శరీరాలను శవాలనుకుని వాటిని త్రవ్వి తీస్తున్నారు. దీనివల్ల వారి శాపాలు తగులుతాయి. నష్టాలు కలుగుతాయి. ఈ ప్రాచీన కట్టడాలకింద సమాధులలో పురాతన దేవాలయాలదేవాలయాలు మాటున ఎన్నో భూతాలు దుష్టశక్తులు, పిశాచ, రాక్షస యక్ష కిన్నర శక్తులను మా మాంత్రిక పండితులు మంత్రశక్తితో బంధించి వుంచారు. ఈపురాతన రహస్యాలను రక్షించుకోవడంకోసం ఈ భవనాల అడుగున దాచివున్న అపారమైన నిధులు, రత్నాలు, వజ్రాలు, బంగారు నిధులు రత్రక్షించడంకోసం అనవసరంగా వాటిని తవ్వితీసి ఆదుష్ఠశక్తులను ప్రంపంచంమీదికి విడిచి పెడుతున్నారు.

అది సరే నీవిపుడు ఈజిప్టు రప్పించబడ్డావు. తెలుసా ఇక్కడ నీకు కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు ఉపదేశంగా లభిస్తాయి.

నీవు తిరిగి మీదేశానికి వెళ్ళబోతున్నావు.నీవు అనేక మందికి భనిష్యత్తు చెప్పగల శక్తీ ప్రసాదిచగలిగే సద్గరువులు. ఈజిప్టునుండి కూడా నీకు సహాయం చేస్తారు. పదివేల సంవత్సరాక క్రితం మహాయోగినీ ఈజిప్టును పరిపాలించిన మహారాణి అయిన నెఫర్టెటీ అన్న ఈజిప్టురాణి చెయ్యి యొక్క అవశేషం నీకు లభిస్తుంది.

ఆమె మరణంచి పదివేల సంవత్సరాలైనా అమె శరీరం ఇంకా కుళ్ళలేదు. ఎండిపోయి పోక చెక్కలా కరక్కాయలా నిలిచిపోయింది, అదే నీకిస్తున్నాను . దీని రక్షణలో నీకెన్నో ప్రమాదాల నుండీ ఎన్నో కష్టాలనుంచీ, నీకు సహాయం లభిస్తుంది. దివ్య దృష్టితో చూసే శక్తి లభిస్తుంది.

అంతేగాదు ఎంతోమంది రాజులు,ధనవంతులు, ప్రముఖులు నీదగ్గరకు రప్పించబడతారు. నీద్వారా ప్రాచీనవిద్య జ్యోతిషానికి ప్రపంచంలో తిరిగి ప్రచారం లభిస్తుంది. నీవొక కారణంతో జన్మించిన వాడివి. అందుకే నాలుగు రోజుల క్రితం నీవు పిరమిడ్ లోని పాతాళ సొరంగంలో చిక్కుకుపోయిన – నీ ఆర్తనాదం పొలికేక వంటి ఆలోచనా తరంగాలు నాకు నచ్చి చేరాయి. అంతే వెంటనే ధ్యానంలో కూర్చున్నాను. మరుక్షణం నీ శరీరం ఇక్కడకు నా వద్దకు చేర్చాను. ఆశ్చర్య పోవద్దు కొంచెం ఆహారం తీసుకో ఈసాయంత్రమే మనిద్దరం వెళ్ళి ఆపాతాల సొరంగంలోంచి నీ ముసలి ప్రొఫెసర్ ని తీసుకువద్దాం. ఆన్నాడు.

ఆతర్వాత మరికొన్ని గంటల తర్వాత ఆప్రొఫెసరును ఈజిప్టు తాంత్రిక పండితులతో రక్షించగలిగిన తాను ఎవరో ఎట్టి పరిస్తితులలోను ఈ తెల్లదొరకు చెప్పరాదని గట్టి నిఘాపెట్టిన నిషేదం వున్నందున కీరో నోరు విప్పలేదు.

అలా రెండుమూడు నెలలు ఈజిప్టులో ఒక టూరిస్టువలె తిరిగి ఎన్నో వింతలు అనుభవాలు చూపించి చిపరకు ఒక అర్ధరాత్రి అంతా ఈజిప్టు పిరమిడ్ లోని దివ్యజ్ఞాన గుహ లేక రాజయోగుల గది లో ధ్యానంలో గడిపి కీరో ప్రపంచ భవిష్యత్తును సినిమాలో చిత్రాలలాగా స్వయంగా చూశాడు.

ఆలాగే రెండురోజుల పాటు స్పృహలేకుండా శవంలా పడివున్నాడు . ఇంకా ఎన్నో వింతలూ విచిత్రాలూ అనుభవాలూ పొందివున్నాడు

2 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ September 8, 2008 at 5:19 PM  

అద్భుతమైన విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదములు

MURALI September 9, 2008 at 9:08 AM  

ఈ వృత్తాంతం పూర్తిగా ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? లేదా ఇలాంటి ఆసక్తికర విషయాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. చాల ఆసక్తిగా ఉన్నాయి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP