శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగవంతుని చూడాలంటే రోజుకెన్నిగంటలు పూజ చేయాలి?

>> Sunday, September 7, 2008



చాలామంది సాధకులలో, భక్తులకు ఒక సందేహం వస్తుంది. భగవంతుని చూడాలంటే రోజూ ఎంత సమయం పూజ ,జపం, చేయాలి? ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఏ మంత్రాన్ని ఎంత సాధనచేయాలి?అని. మరికొతమంది దేవుడుంటే చూపించండి,దానికోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం,చూపించగలరా ? అని సవాల్లు చేస్తుంటారు. అసలు మహాత్ములభావమేమిటో గమనిద్దాం.
దేవుడున్నాడా? అని మనకంటే తలతిక్కగా ప్రశ్నించాడు వివేకానందుడు.
వున్నాడు.ప్రశాంతంగా సమాధానమిచ్చారు,రామకృష్ణపరమహంస
నువ్వుచూశావా? మరొక మొడి ప్రశ్న

చూశాను. చూస్తున్నాను. నిన్నెలా చూస్తున్నానో ఆయనను అలాగే చూస్తున్నాను. అన్నారు. గురుదేవులు.
మరి నేను చూడాలంటే ఏమిచేయాలి ? అని అడిగారు వివేకానందులు.
వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్లో ముంచి ఒక నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తరువాత వదలి పెట్టారు.
ఇప్పుడేమనిపించింది? గురుదేవులడి గారు.
ఇంకొక్క క్షణం గాలిలేకుంటే నేను బ్రతకలేనని ,భయంవేసింది అన్నారు వివేకానందులు.
అదే ఆరాటం ,నీలో కలిగి, నీవులేకుంటే నేను బ్రతకలేననే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది వివరించారు పరమగురువు.

మరి మనమో కొబ్బరికాయ కొట్టగనే ఆయన కనపడాలంటే ఎలా? ఢిల్లీ టిక్కేట్ తీసు కున్న వెంటనే ఢిల్లీ కనపడుతుందా? ప్రయాణం సాగి అక్కడకు చేరుకోవాలికదా? టిక్కేట్ కొన్నా ,కనిపించలేదు కనుక ఢిల్లీ లేదు గిల్లీ లేదు. అంతా అబద్ధం అంటే వానినిమనం చిన్నపిల్లవాడు అనాలి .అంతేకదా!
మాకు కాంతారావు అని వినుకొండలో ఒక మితృడు ,ఉన్నాడు. తలతిక్కమనిషి. ఉదయం ప్రభాత సమయం నుంచి 9 గంటల దాకా ధ్యానం విడిచి బయటకు రాడు. మంచి సాధకుడు.
ఒకసారి బృందావనం నుంచి గుంటూరు వచ్చివున్న మా పూజ్యగురుదేవులు రసయోగి శ్రీ రాధికా ప్రసాద్ మహరాజ్ వారిని వెళ్ళి కలిశాడు. నేను భగవంతుని చూడాలంటే ఇంకా ఎన్ని గంటలు ధ్యానం చెయ్యాలి? చెప్పండి? ఐదు గంటలా? ఆరుగంటలా ? చెప్పండిఅని ఆవేశపూరితంగా అడిగాడు.
వారు చిరునవ్వు నవ్వి, ఒరే అబ్బాయ్ ! ఇప్పుడు నీకు ఒక చక్కని అమ్మాయిని చూస్తాను, ఆ అమ్మాయికి నువ్వునచ్చి నీకా అమ్మాయి నచ్చాక ఆవిడ.. ఏమండీ ! నేను పెళ్ళయ్యాక ఏకల్మషం లేకుండా రోజూ 15 గం\టలు మీతో కాపురం చేస్తాను ,మిగతా సమయం అలా..అలా.. తిరిగివస్తాను ,ఇది నాకు అలవాటు,కానీ మిమ్మల్ని చెప్పిన సమయమ్లో కల్మషం లేకుండా భర్తగా సేవిస్తాను ఒట్టు. అని అన్నదనుకో? నువ్వు పెళ్ళిచేసుకుంటావా? అని అడిగారు .
ఛీ..ఛీ.. అలాంటిదాన్ని ఎలా చేసుకుంటాను ..చీదరించుకున్నాడు మా కాంతారావు.
మరి స్వామీ నేను ఒక ఐదు గంటలపాటు నిన్నుతప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను. మిగతా సమయమ్లో నాబుద్ధి అలా..అలా.. గాలికి తిరిగి చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది ,మరినువ్వు నాకు కనపడతావా? అంటే ఆయన నీకెలా కనపడతారురా? అన్నారు.
నాన్నగారు[ భక్తులంతా ఆయనను అలా పిలుస్తారు]
అంతే మన కాంతారావు..వితండవాదాలు మానుకున్నాడు.
అందుకే వివేకానందులవారంటారొకచోట.
నీ పూజలు జపతపాలు, సాధనలూ ఏవీ..ఏవీ.. భగవంతుని దర్శింపజేయలేవు కేవలం ఆయన కరుణతప్ప. అని
కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ వుంటే .మన మనస్సు పవిత్రమై, ఆయనను వదలి వుడలేని ఆర్తిమనలో కలుగుతుంది. అప్పుడు లేగదూడ పిలుపువిన్న గోమాతలా పరుగుపరుగున వస్తాడు ఆయనే. మనకేంటి తొందర .

2 వ్యాఖ్యలు:

Saraswathi Kumar September 7, 2008 at 11:23 PM  

దుర్గేశ్వర గారూ!చక్కగా చెప్పారు. మనం సత్యం ఆచరిస్తే చాలు. భగవంతుడే మనలను వెతుక్కుంటూ వస్తాడు.

చిలమకూరు విజయమోహన్ September 8, 2008 at 7:23 AM  

ఎంత సేపు చేసామన్నది కాదు ముఖ్యం ఎంత పవిత్రంగా , ఎంత నిష్టతో చేసామన్నదే ముఖ్యం

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP