అయినవాడే అందరికి ..అయినా చిక్కడు ఎవ్వరికి
>> Saturday, August 23, 2008
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత... అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ అంటూ గీతా సారాంశంలో అర్జునుడికి ప్రబోధించిన శ్రీకృష్ణుడు తన లీలా విన్యాసాన్ని అలా తన భక్తులకు అందించాడు. భూమి మీద అధర్మం పెరిగిపోయి ధర్మానికి సంకటం ఏర్పడిన సమయంలో తాను అవతరిస్తానని చెప్పిన ఆ కృష్ణ పరమాత్ముడు తనను శరణు వేడినవారి కోసం ఏదో రూపంలో కాపాడుతుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చెరసాలలో దేవకీ గర్భాన ప్రవేశించి కారణ జన్ముడిగా భూమి మీదకు వచ్చిన శ్రీకృష్ణుని లీలలు సామాన్య మానవునికి అంత సులభంగా అర్థం కావు. మనిషి రూపంలో జన్మించి మనిషికి చెందిన అన్ని గుణాలను పుణికి పుచ్చుకున్న ఆ నల్లనయ్య దుష్ట శిక్షణ కోసం ద్వాపర యుగమున అనుసరించిన మార్గం యావత్ ప్రపంచానికి ఆదర్శనీయం.
చిన్ననాడు గోపికల మానస చోరుడై వెన్న ముద్దలు దొంగలించిన ఆ చిన్ని కృష్ణుడు తన మేనమామ కంసుని వధించి తన అవతార విశిష్టతను లోకానికి చెప్పకనే చెప్పాడు. కామి కాని వాడు మోక్షగామి కాడన్న చందంగా దుష్ట శిక్షణ చేసిన చేతితోనే ఎనిమిది మంది భార్యల సమక్షంలో 16 వేల మంది గోపికల మనస్సులో ఏక కాలంలో గిలిగింతలు పెట్టగలిగాడు.
నమ్మినవారికి కొంగు బంగారంగా నమ్మనివారికి అర్థం కాని ఓ మహా ప్రళయంగా ఆ గోపాలకుడు చేసిన ఘన కార్యాలు సామాన్యుని మదికి ఏమాత్రం అర్థం కావంటే అందులో అతిశయోక్తి లేదేమో. పాండవ పక్షపాతిగా కౌరవ వంశాన్ని కూకటి వేళ్లతో సహా నాశనం చేసిన ఆ జగన్నాటక సూత్రధారి లోకంలోని సకల కార్యాలకు తాను సూత్రధారినంటూ గీతాసారాంశాన్ని కూడా అందించాడు.
నిండు కౌరవ సభలో విశ్వరూపాన్ని ప్రదర్శించి సకల లోకాలకు తానే అధిపతినంటూ గుర్తు చేశాడు. మన్ను తిన్న వేళ నోరు తెరవమని కోరిన యశోదకు మొత్తం విశ్వాన్నే తన నోటిలో చూపించి చరాచర సృష్టి మొత్తం తనలోనే అవతరించి తనలోనే అంతరించి పోతోందన్న విషయాన్ని లోకానికి చాటి చెప్పాడు.
యుద్ధం చేయలేనంటూ ధనుర్బాణాలను త్యజించిన తన ప్రియ మిత్రుడు అర్జునుడికి గీతా సారాంశాన్ని బోధించి మహాభారత యుద్ధానికి నాంది వాచకం పలికాడు. ఆయుధమన్నది పట్టకుండా 18 రోజుల యుద్ధంలో శత సోదరులైన కౌరవులనందరినీ సంహరింపజేసిన ఆ దేవదేవుని చరితం మానవజాతి మొత్తానికి ఆదర్శప్రాయం.
0 వ్యాఖ్యలు:
Post a Comment