కాల సర్పదోషం.. తస్మాత్ జాగ్రత్
>> Saturday, August 30, 2008
ఎందరో జాతకులను సర్పదోషం బాధిస్తుంటుంది. వివాహం, సంతానం వంటి తదితర శుభకార్యాలను తప్పించే ఇలాంటి సర్పదోషాలకు కాళహస్తి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, నాగప్రతిష్ట చేయడమో లేదా కేతు-రాహు శాంతి పూజలు, పరిహారాలు వంటివి చేయడం పరిపాటే.
కేవలం... సర్పదోషానికే జాతకులు ఎన్నో ఇక్కట్లకు గురవుతుంటే... మరీ "కాలసర్పదోషం" సంగతేమిటి?.. గ్రహాలన్నీ రాహు-కేతువుల మధ్య సంచరించడం వల్లనే కాలసర్పదోషం ఏర్పడుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. కాగా, భారతదేశానికి మాత్రమే కాకుండా, మొత్త ప్రపంచానికి కాలసర్పదోషం ఉందని ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పీఏ రామన్ తెలిపారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేశంతో పాటు యావత్తు ప్రపంచానికి ఈ ఏడాది ఆగస్టు 1నుంచి డిసెంబర్ వరకు కాల సర్పదోషం ఉందని స్పష్టం చేశారు.
రామన్ వివరించిన సర్పదోషంతో సంభవించబోయే పరిణామాలను పరిశీలిస్తే... ఆగస్టు 1న సూర్య గ్రహణం కర్కాటక రాశిలోనూ, 16న చంద్రగ్రహణం మకర, కుంభ రాశుల్లో ఏర్పడుతున్నందున ఈ రాశుల వారు ఈ గ్రహణాలను వీక్షించడం మంచిది కాదని సూచించారు. ఇకపోతే ప్రజలు రక్తపోటు, మధుమేహం, నరాలు, మెడకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోను లేదా నవగ్రహ ఆలయాల్లో ఉండే రాహుకేతువులకు శాంతి పూజలు చేయిస్తే కాలసర్పదోషం కొంతమేర తొలగి ఉపశమనం చేకూరుతుందని రామన్ చెప్పారు.
కాలసర్పదోష ప్రభావంతో ప్రజల్లో అశాంతి నెలకొనడం, నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరగడం, తుఫానులు సంభవించడం, రహదారి ప్రమాదాలు, అత్యధిక ప్రాణనష్టం, నదులు ఉధృతంగా ప్రవహించి వరదలు వంటి అసంభవాలు సంభవిస్తాయని రామన్ చెప్పారు. మహిళా, శిశుమరణాలు అధికసంఖ్యలో ఉండటం, రాజకీయ నాయకులకు, రక్షక భటులకు భద్రత కరువవడం వంటివి తటస్థిస్తాయని రామన్ వివరించారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment