ఇది కదా జీవితమంటే..!
>> Friday, June 28, 2024
ఇది కదా జీవితమంటే..!
వారం రోజుల కిందట తెగిన చెప్పు కుట్టిద్దామంటే విజయవాడలో కుట్టేవారిని కనిపెట్టడం పెద్ద టాస్కే అయ్యింది. మొత్తానికి అయ్యప్పనగర్ రోడ్డులో ఇవాళ ఒకాయన్ని పట్టుకుని చెప్పు కుట్టించుకున్నాను. అన్నిచోట్లా ఇరవై రూపాయలు తీసుకుంటుంటే ఆయన పది రూపాయలే తీసుకున్నాడు. సరే పనేం లేదు కదా అని ఆయనతో కాసేపు మాట్లాడాను.
ఆయన తాత, తండ్రులది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? అని అడిగితే చెప్పాడు అసలు విషయం. వాళ్లబ్బాయి ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంక్ ఉద్యోగి. యనమలకుదురులో 7 సెంట్లలో సొంతిల్లు. నెలకు వచ్చే అద్దెలు 25వేలు. నున్నలో ఎకరం మామిడి తోట. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావని అడిగితే --
"ఒకప్పుడు ఈ పనే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ పనిచేసే అప్పట్లో రేటు తక్కవని నున్నలో మూడెకరాలు కొంటే నా వాటా ఎకరం వచ్చింది. మా చిన్నప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డబ్బులకు బదులు వడ్లు ఇచ్చేవారు. అవి సరిపోక మా అమ్మ వరి కోసిన పొలాల్లో పరిగె ఏరుకొచ్చి అందులో గింజలను వేరుచేసి మాకు అన్నం పెట్టేది. మేం తరతరాలుగా ఆధారపడి బ్రతికిన పని ఇది. డబ్బులున్నా ఈ పనిచేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది " అని ఆయన చెప్పిన మాటలు అద్భుతంగా అనిపించాయి. మీరు ఎప్పుడైనా రండి ఉదయం నుంచి సాయంత్రం ఏడింటిదాకా ఇక్కడే ఉంటానని చెప్పాడు.
వెనక కావాల్సినంత ఆదాయం ఉందన్న ధీమా లేదు. ఒకరోజు కుట్టకపోతే ఏంకాదులే అనే ఆలోచన లేదు. అందుకే ఆదివారం కూడా అక్కడే ఉన్నాడు. నా తర్వాత మరొకాయన వచ్చి 200 నోటుకు చిల్లర ఉందా? అని అడిగితే ఫర్లేదు సర్ ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడు.
సింపుల్‌గా ఉండే ధనవంతులు మనకు రోల్‌మోడల్. సుధా నారాయణ మూర్తి సాదాసీదా నేత చీర కట్టుకుంటే అదొక ఆశ్చర్యం మనకి. సెలబ్రిటీలు రోడ్డు పక్కన ధాబాలో తింటే అదీ ఒక వార్తే. అలా ఉండటం వారి గొప్పతనమే. ఈ చెప్పులు కుట్టే ఆయన కూడా ఆ కోవకి చెందిన వాడే. ఆయనకు చదువు లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. పిల్లల్ని చదివించుకున్నాడు. ఇవాళ కూర్చుని తినే స్థితికి చేరాడు. అలాగని అన్నం పెట్టిన వృత్తిని వదల్లేదు. 59ఏళ్ల ఆ ముసలాయనకు పళ్లు ఊడిపోయే దశ వచ్చింది, అందుకే మాట స్పష్టంగా రావట్లేదు. నిరంతర కష్టం వల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేరలేదు. ఉదయం అన్నం తిని రావడం. మధ్యాహ్నం భోజనానికి వెళ్లొచ్చి మళ్లీ రాత్రి వరకూ అక్కడే చెప్పులు కుట్టడం. ఇదే సంతృప్తి అంటున్నాడు.
ఆయన వైపు నుంచి చూస్తే ఆయనకిదే విలాసవంతమైన జీవితం. ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో చూశా. పచ్చని పొలాల మధ్యలో చిన్న పంపుసెట్ లాంటి ఇంట్లో ఒకాయన దర్జాగా కూర్చున్న ఫొటో అది. ఈ ఆనందం ఎంత పెద్ద బంగళా ఉన్నా వస్తుందా? అనేది ప్రశ్న.
విలాసం, ఆనందం అనేవి నచ్చిన జీవన విధానంతో వస్తాయి తప్ప, కేవలం డబ్బు వల్ల మాత్రమే రావు.
( సేకరణ )
0 వ్యాఖ్యలు:
Post a Comment