శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అవినీతికి లొంగి బతకలేని అధికారి ఇతను

>> Friday, March 10, 2017

రాజు నారాయణస్వామి.
ఒక ఫెయిల్యూర్ స్టోరీ.
 .
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు.స్టేట్ ఫస్ట్....
 .
1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ....స్టేట్ ఫస్ట్....
 .
ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....
 .
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తి చేశాడు.బ్యాచ్ ఫస్ట్.....
 .
అదే ఏడాది గేట్ పరీక్ష ....మళ్లీ ఫస్ట్ రాంక్....
 .
ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు...మళ్లీ ఫస్ట్ ర్యాంక్....
 .
ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్....
 brataka
ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని ఆమెరికా ఎర్ర తీవాచీ పరిచి, పచ్చ కార్డు వీసా ఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ మా మెసాచుసెట్స్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది.
 .
మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే.మనవాడు మాత్రం నా చదువుకు ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది.
 .
ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు. ప్రజల డబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం... వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులేతనను చదివించాయి.
అలాంటిది ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి అనుకున్నాడు. ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష వ్రాసి ఐఏఎస్ అయ్యాడు.
 .
చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న విలువలు, పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన... వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.
 .
అతని పేరు రాజు నారాయణ స్వామి. కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వాడు.అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి.
 .
ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది. ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.
 .
ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది.
ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. "నా అల్లుడు కలెక్టర్... నన్నేం చేయలేరు" అనుకున్నాడు.
 .
మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చేయించారు. కోపంతో మామభగ్గుమన్నాడు. భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణస్వామిని వదిలివెళ్లిపోయింది.
 .
ఆ తరువాత రాజు నారాయణస్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు.
కలెక్టర్ గారుఅవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు.
 .
అంతే ...
మళ్లీ ట్రాన్స్ ఫర్... మళ్లీ కొత్త ఊరు... కొత్త పని...కొత్త చోట వానాకాలాని ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం... బిల్లులు వసూలు చేసుకోవడం.... ఆ తరువాత వానలు పడటం... వానకి గట్టు కొట్టుకుపోవడం.... మళ్లీ టెండర్లు... మళ్లీ పనులు... మళ్లీ బిల్లులు... మళ్లీ వానలు...ఇదే తంతు కొనసాగేది.
రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు. వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.
 .
మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. అంతే ... మళ్లీ పాత కథ పునరావృతం అయింది.చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి అచ్యుతానందన్ రాజు నారాయణస్వామిని ఎలాంటి ప్రాధాన్యతా లేని ఒక విభాగంలో పారేశారు.
 .
చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్యసమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. మా దగ్గర పనిచేయండి అని కోరుతూ పిలువు వచ్చింది.
 .
ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవడానికిసిద్ధమయ్యాడు.
రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు. ఆయన 23 పుస్తకాలు వ్రాశారు.
 .
వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలకు సాహిత్య ఎకాడెమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన వ్రాసిన నవల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు.
 .
కానీ నిజజీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.
రాజు నారాయణ స్వామి ... ఈ ఘనతవహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయాడు.

6 వ్యాఖ్యలు:

శ్యామలీయం March 10, 2017 at 6:12 AM  

కాల్పనిక సాహిత్యంలో అవినీతిపై నీతి విజయం సాధిస్తుంది. కారణం కథకుడికి ఉన్న నీతిని గెలిపించాలన్న ఆకాంక్షయే ఆ సాహిత్యసృష్టి వెనుక ఉన్న చోదక శక్తి కావటం. నీతి యొక్క బలం దుర్బలమైన అవినీతిపై కాక బలీయమైన అవినీతిపై గెలవటంతోనే ప్రస్ఫుటమౌతుంది కాబట్టి బలమైన అవినీతి యొక్క విశ్వరూపాన్నీ నీతియొక్క అవిశ్రాంత పోరాటాన్నీ కాల్పనికసాహిత్యం ఎంతో అందంగా మలచి జనామోదాన్ని పొందుతుంది. చదువరులంతా ఉత్తేజితులై నీతియొక్క విజయానందాన్ని తామూ మనస్ఫూర్తిగా అస్వాదించి సమాజం నిండా నీతి మాత్రమే నిండాలనీ అవినీతి సమూలంగా ఎండాలనీ అకాంక్షిస్తారు. కాని స్వయంగా అవిరామంగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నీతి సాధించిన విజయంలో అది పడ్డ కష్టాలనే తలచుకొని భయపడి అవినీతిని ఎదిరించేందుకు తాము చాలమనీ ఎవరో రావాలని ఆశిస్తూ అదే అవినీతికి అసహాంగా వత్తాసు పలుకుతూ అసమర్థంగానే జీవిస్తూ ఉంటారు!

వాస్తవిక జీవితంలో నీతిపై అవినీతి విజయం సాధిస్తుంది. నీతిమంతుడు ఎవడన్నా నూటికో కోటికో ఒక్కడుంటే అతడిని అణచేందుకు పదిపాతిక రెట్లుగా అతగాణ్ణీ అణచేందుకు పూనుకొనే అవినీతిపరులూ, కాల్పనిక సాహిత్యపు విలువలని చదువుకొంటూ నిజజీవితంలో అవినీతికి తలొగ్గి దానికి అసహాంగా ఆసరా ఇస్తూ మిగిలిన నిరుపయోగ జనసందోహమూ కలిసి నీతికి విజయాన్ని ఎండమానిని చేస్తుంది.

మనలో హెచ్చు శాతం అలాంటి అసమర్థులమే అవినీతికి నిస్సహాయంగా కొమ్ముకాసే వారమే. మరలా నీతిపరులని బతకలేని వారని సానుభూతి చూపటమే వెక్కిరించటమో చేసేది మనమే.

అవును లెండి. నూటికి తొంభై శాతం నీతిపరులైతే అటువంటి వారి కథలు అపురూపం ఎందుకవుతాయి? ఆకర్షణీయమైన సాహిత్యవస్తువులు ఎందుకవుతాయి?

అన్యగామి March 10, 2017 at 7:24 AM  

మీరు చెప్పినదానితో నేను ఏకీభవించను. ఎంత కంటిలోనలుసులా మారకపోతే, రాజకీయులు ఆయనకి అన్నిసార్లు స్థానచలనం కలిగించారు. భార్య వెళ్లి పోయినా, అధికారంలో ఉన్నవాళ్లు ఈసడించినా ఆయన పని ఆయన చేసుకొని వెళ్లిపోయారు. ఆలా బ్రతకాలంటే ఎంత ఆత్మవిశ్వాసం, గొప్ప పూనిక కావాలి. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన చేసిన పనిని స్మరించి, కృతజ్ఞతలు చెప్పుకొనే వాళ్ళు చాలా మందే ఉంటారని నా నమ్మకం. అందువల్ల ఆయన ఓడిపోయారంటే నేనొప్పుకోను.

Jai Gottimukkala March 10, 2017 at 9:36 PM  

కొంత వరకు అన్యగామి గారితో ఏకీభవిస్తాను. గెలుపు ఓటములు నిర్ధారించడం ఒక్కోసారి కష్టం. దేశం వీడి "పారి" పోయారనికునే బదులు, ఐరాసలో ఉన్నత పదవి రావడం గెలుపే అవుతుందేమో?

విన్నకోట నరసింహా రావు March 11, 2017 at 4:58 AM  

శ్యామలీయం గారు తన వ్యాఖ్య మొదటి పేరాలో చెప్పింది అక్షరాలా నిజం. కాల్పనిక విజయమే మన సినిమా కథలకు, సినిమాలో హీరో గారి హీరోయిజానికి ఆధారం. Virtue wins over evil అనే సూత్రం అన్నమాట. అఫ్ కోర్స్ ఎంత భ్రష్టు పట్టిన సినిమాలో కూడా చివరికి అవినీతిదే విజయం అన్నట్లు చిత్రీకరించలేరుగా. అందువల్ల అలాగే ఉంటాయి.
వారి రెండో పేరాలో చెప్పినదీ అంతే నిజం. అవినీతి బలమైనది కదా. కాబట్టి సగటు మనిషి గెలవలేడు, అంత సమయమూ వెచ్చించలేడు (RTI Act క్రింద చేసిన పోరాటాలకే గతి లేదు). అందువల్ల ఇదింతే అని సమాధాన పడిపోతాడు, తన జీవనం సంగతి చూసుకుంటాడు.
--------------------
అన్యగామి గారు చెప్పినదీ ఓ రకంగా సబబే. కానీ అలా మొండిగా ఉండడానికి చాలా...చాలా...మనోనిబ్బరం కావాలి. ఏమిటీ చాదస్తం, ఇదంతా నీకొక్కడికే పట్టిందా అంటూ తరచూ కుటుంబ సభ్యుల వైపు నుంచే విమర్శలు, ఒక్కోసారి ఈసడింపులూ ఎదురవుతాయి. బయటి వత్తిడులతో పాటు ఇవి కూడా తట్టుకుని ముందుకు సాగగలిగే పట్టుదల ఉండాలి. కొంత లూప్ లైన్ లోకి నెట్టేసే సందర్భాలూ ఉంటాయి. వెంటనే వెంటనే బదిలీలుంటాయి. అయినా తను నమ్మిన సిద్ధాంతాలననుసరించి చేసే విధి నిర్వహణ ఎంతో సంతృప్తినిస్తుంది. ఒకటి నిజం - అన్యగామి గారన్నట్లు అటువంటి అధికారులను ప్రజలు, వారి వద్ద పని చేసిన ఉద్యోగులు స్మరించుకునే అవకాశాలు ఎక్కువే. అటువంటి ఆఫీసర్లు నేను చూశాను.
---------------------
గొట్టిముక్కల గారు 'ఐరాస' లో పదవే గెలుపంటారా? దాన్ని స్వీకరించడం ఈ బ్లాగ్ పోస్ట్ లో చెప్పినట్లు 'దేశం వదిలేసినట్లవుతుందా'? అయితే జై గారన్నట్లు గెలపోటములేమీ లేవు. 'ఐరాస' లో ఖాళీ ఉంది, తగిన అధికారిని పంపించండి అని 'ఐరాస' వారో, విదేశాల్లో భారత ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీ ఉందనో భారతప్రభుత్వాన్ని అడగడం మామూలే. అలాగే విదేశాలలో ట్రెయినింగ్. విదేశీ యూనివర్సిటీలలో ఉన్నతవిద్య. అలాగే రాష్ట్రం నుంచి కేంద్రానికి డిప్యుటేషన్లు. వెడతారు, అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసి ఏదో పోస్టింగులో కొనసాగుతారు. ఇదంతా మామూలే. అఫ్ కోర్స్ తామే కోరుకుని ట్రై చేసుకునే ఆఫీసర్లు కూడా కొంతమంది ఉండకపోరులెండి.
'ఐరాస' కు ఈ అధికారిని సెలక్ట్ చేసుంటారు (ఆ సమయానికి అక్కడున్న ఇతని పై అధికారులలో కూడా ఇతని లాగానే నిజాయితీపరులు కొంతమందైనా ఉండకపోరు కదా). అలా పంపించబడిన వారందరూ నిజాయితీపరులు కానక్కరలేదు (ఒక్కోసారి రికమండేషన్లు వగైరా కూడా ఉంటాయిగా), సెలక్ట్ కానివాళ్ళందరూ అవినీతిపరులూ కానక్కరలేదు.
-----------------
చివరగా నేను చేసే విన్నపం ఒకటే. సోషల్ మీడియా లో తిరిగే కథలన్నీ వెంటనే నమ్మెయ్యద్దు. కొన్ని చాలా పాత సమాచారం అయ్యుండచ్చు. గూగుల్ చేస్తే రాజు నారాయణ స్వామి ఏదో ట్రెయినింగ్ నిమిత్తం కొంతకాలం విదేశాలకు వెళ్ళాడే తప్ప 'దేశం వదిలి' వెళ్ళిపోలేదు అని కనిపిస్తుంది (అదైనా నమ్మచ్చా అంటారా? 🙂). కేరళ ప్రభుత్వ వెబ్ సైట్లో ఇతను వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అని చూపిస్తోంది మరి. అంటే 'దేశం వదిలి' వెళ్ళిపోలేదన్నమాటేగా.

Jai Gottimukkala March 12, 2017 at 11:31 PM  

@విన్నకోట నరసింహా రావు:

ఐరాస ఉద్యోగంలో వారి సామర్త్యానికి సముచిత గుర్తింపు దొరికిందని నేను assume చేస్తున్నాను. ప్రతిభా సామర్త్యాలకు తగిన అవకాశం & అనుకూల వాతావరణం లభించడం విజయమే కదా.

రాజు నారాయణ స్వామి లాంటి నిఖార్సయిన అధికారికి మీరు ఉటంకించిన విషయాలు (recommendation, deputation) వర్తించకపోవొచ్చును. ఇంకా చెప్పాలంటే పైవాళ్ళు ఆయనను "కొరకరాని కొయ్యగా తయారయ్యాడు, ఇతగాణ్ణి బయటికి నెట్టేద్దాం" అనుకొని ఉండవచ్చు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కథలన్నీవాస్తవం కావేమో అన్న మీ అభిప్రాయం సబబే. అయితే దీన్ని ఫలానా వారి వాస్తవ అనుభవంగా కాక ఒక ethical dilemma అనుకుంటే సరిపోతుంది. We can draw lessons from the story even if the facts vary slightly.

విన్నకోట నరసింహా రావు March 13, 2017 at 10:11 AM  

< "కొరకరాని కొయ్యగా తయారయ్యాడు, ఇతగాణ్ణి బయటికి నెట్టేద్దాం" అనుకొని ఉండవచ్చు."
-----------------------
గొట్టిముక్కల గారు, మీరన్నది నిజమే, సాధారణంగా జరిగేది అదే. మరి అప్పుడు ఆ అధికారిని వెంటపడి తరిమి hounding చేసిన వారిదే గెలుపు / విజయం అవుతుంది కదా. అటువంటప్పుడు మీరన్న "అవకాశం" వస్తే అది ఆ అధికారి దృష్టిలో విజయం కన్నా ఉన్న వాతావరణం నుంచి ఓ రకమైన రిలీఫ్ లాగా అనిపించవచ్చు. అందువలన ఏది నీతి, ఏదవినీతి "ఓ మహాత్మా ఓ మహర్షీ" అనుకోవడమే.
ఇది tricky సబ్జెక్టు కాబట్టి మీరన్నట్లు ప్రతి కేసూ మరీ వివరాల్లోకి వెళ్లకుండా అటువంటి కథల నుంచి నేర్చుకునేది నేర్చుకుంటే చాలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP