శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విఘ్నేశ్వరుడు.. విశ్వారాధ్యుడు

>> Monday, September 14, 2015

  • - వినాయకరావ్
  • 14/09/2015
  • from andhrabhoomi daily
ఓం కారమే గణపతిగా ఆవిర్భవించింది. సర్వ వ్యాపక ప్రణవ తేజస్వునిగా, విశ్వరూపదైవంగా వేదం వల్లించే రూపమే విఘ్ననాశకుడైన విఘ్నేశ్వరుడు. సర్వసృష్టికి ఆధారం గణేశుడని ఋగ్వేదం చెబుతుంది. వాఙ్మయస్వరూపుడని చిన్మయుడని, సచ్చిదానందమూర్తియని, జ్ఞానవిజ్ఞాన ఖని అని, సృష్టిస్థితిలయాదులకు కారణభూతుడని, త్రిగుణాతీతుడని అధర్వణ వేదం చెబుతుంది. విశ్వం, విశే్వశ్వరుడు ఒకే పదంలో కలిపిన అద్భుతనామధేయుడు వినాయకుడు. అనేకంగా కనిపించే విశ్వం- గణం వీటిన్నింటిని నియమించే ఈశ్వరుడే గణేశుడే కదా. ఉపనిషత్తులు, పురాణాలు గణేశతత్త్వాన్ని ఎరుకపరుస్తున్నాయి. గణేశుని ఆవిర్భాంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో గణేశుని ఆకారంలోను అన్ని విశేషార్థాలున్నాయి. పార్వతి చేతిలోని నలుగుపిండితో ప్రాణం పోసుకున్న బాలుడు, శివుణ్ణి ఎదిరించి ప్రాణాపాయస్థితిని తెచ్చుకొని తిరిగి శివారాధకుని తలను అతికించడం ద్వారా పునర్జీవితుడు అయినట్లుగా మనకు వినాయకుని జననం చెబుతుంది.
ఆ వినాయకుణ్ణి వారువీరను భేదంలేక భద్రమైన భాద్రపదమాసంలో శుక్ల చవితినాడు ఆరాధించడం సంప్రదాయం. ఆదిదేవునిగా అమరత్వాన్ని సిద్ధింపచేసే నాయకునిగా ఖ్యాతి గడించినవాడు విఘ్నేశ్వరుడు. ఒకానొక పురాణం ప్రకారం విశ్వరూప ప్రజాపతి తన కుమార్తెలైన సిద్ధిబుద్ధిఅనువారికి ఇచ్చి వినాయకుని వివాహం చేశాడు. కాల క్రమంలో ఆ సిద్ధిబుద్ధిసమేత వినాయకునికి క్షేముడు, లాభుడు అనుకుమారులు కలిగారు. బుద్ధికి అధిపతి యైన వినాయకుని పూజ చేయడం ద్వారా ఐశ్వర్యసిద్ధి కలిగి క్షేమలాభాలు కలుగుతాయని ఈ కథలోని అంతరార్థమనిచెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ వినాయకుణ్ణి సర్వసృష్టి చేసే బ్రహ్మకూడా ఆరాధించిన తరువాతనే సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారట. క్షీరసాగర మథనం చేసేటపుడు వినాయక పూజ చేయనందునే హాలాహలం పుట్టి సర్వలోకాలను భయభ్రాంతులను చేసిందని మహావిష్ణువుతోడి దేవతలంతా అనుకొని వెంటనే విఘ్నాలను తొలగించమని సురాసురులు పూజించారట. అపుడు విఘ్నాలు తొలిగి మహావిష్ణువు కూర్మావతారుడై నిలిచి మంధర పర్వత సాయంతో క్షీరసాగరాన్ని మధించగా అందులోనుండి లోకాలన్నింటిని లక్ష్మీవంతంచేసే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందట. ఆ తల్లిని విఘ్నేశ్వరునికి సమర్పించి లక్ష్మీగణపతిగా అందరూ విఘ్నరాజును కొనియాడగా సంతృప్తి చెందిన వినాయకుడు ఆ లక్ష్మీదేవిని మహావిష్ణువుకు ఇచ్చాడట. అట్లా వినాయకుణ్ణి సురాసురులు, యక్ష,కినె్నర, కింపురుషులు, విద్యాధరులు, నాగులు మానవులు సర్వప్రాణికోటి ఆరాధిస్తుంది.
ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు సైతం గణపతిని నమస్కరించనిదే ఏ పనిచేయరని పురాణాలు చెబుతుంటే ఇక మానవునికి గణపతిని పూజించడం సనాతన ఆచారమే కదా.
యోగులకు పరబ్రహ్మగాను, భాగవతులకు గాన ప్రియుడుగాను, విద్యార్థులకు విద్యాదాతగాను, నర్తకులకు నాట్యాచార్యుడుగాను, నిస్సంతులకు సంతానవరదాతగాను, ఇట్లా ఎవరు ఏ కోరికతో కొలిస్తే వారి వారి కోరికలు ఈడేర్చేగణనాథుడు సర్వారాథ్యుడిగా విశ్వానికి అధీశ్వరునిగా కీర్తించబడుతున్నాడు. చతుర్భుజుడైన గణేశుని చేతిలో పాశం రాగానికి, అంకుశం తాళానికి ఏకదంతం ఏకాగ్రతకు, మోదకం ఆనందానికి తార్కాణంగా నిలుస్తాయి. జ్ఞానం ఏకత్వానికి సూచిక దాన్ని వినాయకుని ఏకదంతం సూచిస్తుంటే, విజ్ఞానం అనేకత్వానికి సూచిక దీన్ని వినాయకుని భంగం అయిన దంతం సూచిస్తుంది అనగా జ్ఞాన విజ్ఞానాలకు అధిపతి. చేటలంత చెవులు భక్తుల మొరలను ఆలకించడమే కాక వినడంలో బుద్ధికుశలతకు మారుపేరుగా ఉంటున్నాయి. వినాయకుని పెద్దతల విశేషమైన బుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. వక్రతుండం ఓంకారానికి ప్రతీకఅయితే లంబోదరం బ్రహ్మాండానికి సూచిక. వినాయకుని వాహనం సైతం అల్పబుద్ధిని కట్టడి చేయాలని బోధిస్తుంది. అంతేకాక మనిషిలో అంతర్లీనంగా ఉన్న చైతన్యంద్వారా వ్యక్తిత్వవికాసానికి అడ్డుగోడలైన లోభమదమాత్సర్యాలను అణిచివేయాలన్న బోధ కూడా మూషికాన్ని వాహనం చేయడంలో వినాయకుడు సూచిస్తున్నాడు.
విఘ్నరాజైన వినాయకుణ్ణి ఒక్క భారతదేశంలోనే కాక గణపతి ఆరాధన సర్వత్రా కనిపిస్తుంది. ఈ వినాయకుణ్ణి పూజించినవారికి సమబుద్ధి కలుగుతుంది. కర్మబంధనం అంటదు. భాద్రపద మాసంలోని శుక్ల చతుర్ధిని వినాయక చవితిగా అభివర్ణిస్తూ వాడవాడలా వినాయకుని పూజ చేయడం సంప్రదాయంగా మారింది. వినాయకుణ్ణి చవితిరోజునుండి తొమ్మిదిరోజులు షోడశోపచార పూజలు చేసి, అష్టోత్తర, సహస్రనామాలతో పూజించి చివరకు పృధీతత్వానికి చిహ్నమైన వినాయకుణ్ణి జలతత్వంలో లీనం చేస్తారు అంటే జలంలో నిమజ్జనం చేస్తారు. ఇట్లాచేయడం యోగశాస్త్రంలో పంచీకరణ విధానాల్లో ఒకరీతి. శివకేశవుల కు అబేధరూపమైన వినాయకుణ్ణి శివ, విష్ణు, శక్తి, గణేశ, సూర్య, స్కంధ అనే ఆరాధనాపద్ధతుల్లో అర్చిస్తారు. ఇలా గణపతిని వివిధ పద్ధతుల్లోను, వివిధాకారాలల్లోను పూజించడమనేది ఆగమశాస్త్రాల్లో పేర్కొన్న విషయాలే. గణేశ పూజ ద్వారా ఆధ్యాత్మికసాధనలో ప్రగతితో పాటు ఇహలోకంలో శారీరక మానసిక ఆరోగ్యాలు ఒనగూడుతాయి. సర్వసంపదలు కలుగుతాయి. గణేశ పూజలోని ఏకవింశతి పత్రపూజలోని పత్రి పత్రమూ అనేక ఔషధులకు మూలమే కనుక వీటిలోని అంతరార్థాన్ని తెలుసుకొంటూ గణపతి ఆరాధన చేసినవారికి ఇహపరాల్లో సుఖసంతోషాలకు కొదువ వుండదు.

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం September 14, 2015 at 10:18 AM  

విశ్వారాధకుడు?!
మీరు విశ్వారాధ్యుడు అనదలచుకుని పొరపాటున విశ్వారాధకుడు అని వ్యతిరేకార్థపదం వాడారని అనుకుంటున్నాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP