మానవతా మణిదీపం
>> Monday, April 22, 2013

తొంభై ఏళ్ల క్రితం జగజ్జననీ చైతన్యం మానవదేహం ధరించి, స్త్రీ రూపం దాల్చి, మాతృభావాన్ని, భారానిన వహించి నేలపై నిలవటం ఒక ఆధ్యాత్మిక వసంతం. ఆది నిత్య చైతన్యహేల. వింధ్య పర్వతాలకివతల, దక్షిణాపథంలో, త్రిలింగ దేశంలో ఒక అవతారమూర్తి ఆగమించటం ఒక మహాద్భుత చారిత్రక సత్యం.శాంభవీ ముద్రలో సహజంగా సంస్థితమైనా, కుర్తాళ పీఠకర్త మౌనస్వామి వారికి సంభ్రమాశ్చర్యాలు కలిగించే రీతిలో దివ్యత్వ స్పర్శను రేఖామాత్రంగా అనుభవమయం చేసినా, దయను, కరుణను, కాలాతీత ప్రజ్ఞను దివ్యపరిమళంగా వెదజల్లినా, భారతీయ చింతనను, వేదాంతాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతినీ సమాజపరం చేసినా, వేదాంతాన్ని అచ్చ తెలుగులో అన్నా...యిదంతా బాల్యదశ! శైశవం మాటున మసలిన మహితత్వం. కాలగమనంలో, తరుణోదయంలో కులమతాలకు, వర్గవర్ణాలకు అతీతంగా సమాజసమస్తాన్నీ ఒడినిలిపి, అక్కున చేర్చుకున్న అమరానందమయి, జిల్లెళ్ళమూడి అమ్మ! సామ్యవాద స్ఫూర్తిని ఆచరణీయం చేసిన ఆనందశాల అమ్మ జీవన గమనం. ఆరు దశాబ్దాలు దేహంలోనూ, మూడు దశాబ్దాలు దేహాతీతంగాను, సర్వవ్యాపిగాను, అమ్మ సంచారమంతా ఒక అనుష్ఠాన వేదాంత భూమిక.
అరవై సంవత్సరాల ప్రయాణంలో అమ్మ చేసిన అంకురార్పణలన్నీ విద్య, వైద్యం, సమాజసేవ, సంప్రదాయ పునరుద్ధరణ, మానవతా వికాసం, వ్యక్తి పరిణామం, అధఙవాస్తవిక జీవన విధానం, జీవన్ముక్త స్థితులు, జీవకారుణ్యం, సమత్వం, సర్వత్రా ఆత్మదర్శనం వంటి మహోదాత్త భావనల చుట్టూ అల్లుకున్న పందిరి. అక్కడ అందరికీ అందరూ. అందరికీ అమ్మ ఆలంబన, ఆశ్వాసన! అమ్మ సంకల్పాలన్నీ రూపుదాల్చి, అవన్నీ మానవతా స్ఫూరిని రగిలించేదాకా ఆరని జ్వాలల వలె వెలుగులీనటం ఈనాటి వాస్తవం. విద్యాలయంలో ప్రజ్ఞాన కీలలు ప్రతిభామంతంగా ఎగుస్తూ, జ్ఞానదీపాలను వెలిగిస్తుండటం నేటికీ అధివాస్తవం. వైద్యాలయంలో అమ్మ అనుగ్రహం ఎందరికో ఆయువునివ్వటం నిత్యసత్యం. తానున్న ప్రదేశానికి అందరిల్లు అని పేరు పెట్టినందుకు వేలాది జనులకది స్వాంతనాలయం. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ పుట్టిల్లు.
బాల్యంలో అమ్మ ప్రేమను అనుభవించి, కాలగమనంలో ప్రసిద్ధులైన వారందరికీ జ్ఞాపకాల పొదరిల్లు, ఎదలుప్పొంగే భావసామ్రాజ్యం. సోదరభావం, సౌమనస్యం వెల్లివిరిసే మహానందభూమిక. అహంకార, మమకారాలను వదులుకోగలిగిన వారికి అమ్మ అనుగ్రహస్తన్యం లభించే అనురాగారామం. "అన్ని బాధల కంటే ఆకలి బాధ భయంకరమైనది. దుర్భరమైనది. అన్నం దొరకక మరణించకూడద''ని అమ్మ వెలిగించిన పొయ్యి అరవై ఏళ్ళుగా ఆరకుండా వెలగటం, అమ్మ భావనాకీల! అదే భావం, అదే స్ఫూర్తి, అదే ఆదరణ, అదే ఆప్యాయత నేటికీ జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయంగా, తల్లి గుండె చప్పుడుగా, సంతృప్తి గీతంగా, మానవజాతి చరిత్ర మీద అక్షరాక్షర అక్షయ చిరముద్ర.
మరణానంతర సుఖం కానిది...
"విన్నవాడు విమర్శిస్తాడు. కన్నవాడు వివరిస్తాడు'' అన్న అమ్మమాట విశ్వజనీనమైనది. ఒక్కసారి ఆశ్రయ దర్శనం చేసుకున్న వాడికి జీవిత మాధుర్యము, సహజీవన సౌందర్యము, సమతాభావనలో దాగిన శక్తి, భగవద్విశ్వాసము, మానవ సంబంధాల స్ఫూర్తి, పంచటంలో వున్న ఆనందం, యివ్వటంలో వున్న తృప్తీ, సంప్రదాయాల బలము, సంస్కృతీ వికాసం, జీవితాన్ని, అధివాస్తవిక దృష్టిలో అనుభవించ గల నేర్పు, ఏ కష్టాన్నైనా ఎదుర్కొనగల ఓర్పు, అవాంఛనీయ మూఢ విశ్వాసాలను దరిచేరనీయని వాస్తవిక దృష్టీ...ఏర్పడి అధ్యాత్మ మరణానంతర సుఖం కాదని స్పష్టత ఏర్పడుతుంది.
ఇవన్నీ ఎవరూ ఎవరికీ చెప్పకుండానే జరిగిపోతయ్. ప్రవచన ప్రవాహం ఎవరినీ ముంచెత్తదు. ప్రబోధ పెనుగాలులు ఎవరినీ తాకవు. ఆచరణకు నోచుకోని సూక్తులు ఎవరినీ గాయపరచవు. భయపెట్టవు. పాశ్చాత్య నాగరకతా ప్రభావం ప్రసరించని పుణ్యభూమిగా స్వస్థితిలో నిలిచిన గంభీర అధ్యాత్మమూర్తి, అందరిల్లు! ఎవరి పనిలో వారు, ఎవరి సాధనలో వారు, కానీ అందరూ ఒకరుగా సాగించే అధ్యాత్మ సాధన, ఒక అనుపమాన దృశ్యం.
"సృష్టిని మించిన మహాత్మన మేమున్నది?
నీకున్నది తృప్తిగా తిని, యితరులకు ఆదరంగా పెట్టుకో!
అంతా భగవంతుడే చేయిస్తున్నాడనుకో!
తమ బ్రతుక బ్రతకలేని బలహీనులున్నారు. వారికి తోడ్పడండి, సమస్త మానవ సమాజము, ఈ సృష్టి భగవంతుడే. సమాజసేవ ఈశ్వరసేవే. ఆ సేవ కలిగించే తృప్తే ఆనందం. అదే ఐశ్వర్యం. తృప్తే ముక్తి'' అంటూ అనాహతనాదంగా సాగిపోతున్న అమ్మ బోధ మహాచైతన్యవిలసితం. నాడు ప్రత్యక్షంగా ఎందరెందరినో ఆదుకున్న ఆదరహస్తం, యిప్పటికీ చందన శీతల స్పర్శగా అమ్మ చేతలుగా అనుగ్రహిస్తూనే వుంది. కన్నీళ్లను తుడుస్తూనే వున్నది. కడుపు నిండా అన్నం పెడుతూనే వుంది. ఇంకా అవిద్యలో కూరుకున్న వారిని, ప్రేమపూర్వకంగా తడుముతూనే వున్నది. మానవతా పరిమళాన్ని వెదచల్లుతూనే వున్నది.
శ్రీరామజననంతో అయోధ్య, శ్రీకృష్ణ సంచారంతో మధుర, రమణాగమనంతో అరుణాచలం, సాయి వలన షిర్దీ, సత్యసాయి వలన పుట్టపర్తి పుణ్యక్షేత్రాలైనట్లే, అమ్మ రావటంతో జిల్లెళ్ళమూడి మహా పుణ్యతీర్థమైంది. వేదాంతాన్ని బోధించటం కన్నా, జీవించటం మిన్న. అన్ని విధాలా అస్తవ్యస్తమౌతున్న సమకాలీన సమాజానికి అమ్మ స్మృతి, ఒక వెలుగురేక, వెన్నెల దారి, పలువన్నెల స్ఫూర్తి తోరణం, జ్ఞానరేఖ, మానవతా స్పృహ! నిరతాన్నదాన మహాయజ్ఞ ప్రకర్తగా, అమ్మ ఒక మానవతా మణిదీపం. నమ్మకమే గాని, అమ్మకాలు తెలియని అమ్మ కాలం యింకా మిగిలే వుంది. చేజారిదంతా గతం. మిగిలినదంతా అంతటినీ వెలిగించగల సంకల్ప సౌందర్యం. అ్మ. అందమంతా అందులోనే వుంది.
వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
0 వ్యాఖ్యలు:
Post a Comment