శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దివ్యయోగి అక్కమహాదేవి

>> Thursday, February 9, 2012

దివ్యయోగి అక్కమహాదేవి

నిజమైన భక్తుల తీరు భిన్నంగా ఉంటుంది. ఈ లౌకిక ప్రపంచంతో వారికి ఎలాంటి అనుబంధం ఉండదు. వారు మనతో పాటే మనుగడ సాగిస్తూ ఉంటారు కానీ వారి జీవన విధానం, వారికి స్పూర్ఫినిచ్చే శక్తి మరో లోకం నుంచి వచ్చినట్లుంటుంది. అలాంటి మహాభక్తురాలు అక్కమహాదేవి గురించి...

అక్క మహాదేవి మహా శివ భక్తురాలు. పరమ శివుడినే తన భర్తగా భావించి, చిన్నతనం నుంచి ఆమె ఆరాధిస్తూ వచ్చింది. Äౌవ్వనంలో అడుగుపెట్టిన ఆమె సౌందర్యంపై స్థానిక రాజు కన్నుపడింది. పెళ్ళి చేసుకుంటానని ప్రతిపాదించాడు. ఆమె అంగీకరించలేదు. వివాహానికి అంగీకరించకపోతే ఆమె తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. అంగీకరించక తప్పలేదు. కానీ రాజును దగ్గరకు రానీయలేదు. తనకు ఎన్నడో పెళ్లి అయిపోయింది. తన భర్త ఆ పరమశివుడే. నాకు నీతో పెళ్లి కాలేదు అని స్పష్టంగా చెప్పింది. రకరకాలుగా ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. సహనం నశించింది. ఆమెపై చేయి వేయడానికి సాహసించాడు.

ఆమె అడ్డు చెప్పడమే కాక, తనకు మరో భర్త ఉన్నారని ఆయన నిత్యం తనతో ఉంటాడు, నేను నీతో ఉండలేను అని బదులు చెప్పింది. పూర్తిగా విసిగిపోయిన రాజు 'ఇటువంటి భార్య ఉండి ఏం ప్రయోజనం? అదృశ్యంగా ఉన్న మరో వ్యక్తిని వివాహం చేసుకున్నానని అంటున్న భార్యతో బతకడం ఎలా?' అని మధనపడ్డాడు. అప్పట్లో విడాకుల విధానం ఉండేది కాదు. ఏం చేయాలో రాజుకు తోచలేదు. అందువల్ల ఆమెను రాజ్యసభ ముందుకు తీసుకువచ్చాడు. నిర్ణయం చేయమన్నాడు. సభలోని వారు ఆమెను ఎన్ని విధాలుగా ప్రశ్నించినా తనకు మరెక్కడో భర్త ఉన్నాడని పదేపదే చెప్పింది. అది భ్రాంతి కాదు. నూటికి నూరు పాళ్లూ ఆమె దృష్టిలో అది వాస్తవం.

పరమశివుడే భర్త
రాజుకు నిజంగానే ఆగ్రహం వచ్చింది. సభలోని వారి అందరి ఎదుట, తన భార్య తనకు వేరే భర్త మరోచోట ఉన్నాడని చెప్పడం సహించలేకపోయాడు. 800 సంవత్సరాల క్రితం ఒక రాజుకు ఇలాంటి సందర్భం ఎదురుకావడం సామాన్య విషయంకాదు. ఆమె అంతరంగంలో ఏం జరుగుతున్నా దాన్ని సామాజికంగా ఆమోదించడం ఆనాటి కట్టుబాట్ల ప్రకారం అంత తేలికైన వ్యవహారం కాదు. దాంతో 'మరొకరిని వివాహం చేసుకుని ఉంటే ఇక్కడ నాతో ఉండి ఏం చేస్తావ్. వెళ్లిపో' అన్నాడు.

'సరే' అంటూ వెళ్లిపోవడానికి అక్క మహాదేవి సిద్ధమైంది. ఆ కాలంలో భర్త ఇంటి నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచన కూడా ఏ మహిళకు వచ్చేది కాదు. అయినా ఆమె చాలా ప్రశాంతంగా వెళ్లిపోవడానికి సిద్ధం కావడంతో రాజులో ఒక దురాలోచన చోటు చేసుకుంది. 'నీవు ధరించిన ప్రతిదీ, నగలు, వస్త్రాలు అన్నీ నావే. వాటిని కూడా ఇక్కడే వదిలేయ్' అన్నాడు. అక్క మహాదేవి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. సభ మధ్యలోనే ఉన్న అక్క మహాదేవి, బహుశా 17, 18 ఏళ్లప్రాయంలో ఉండి కూడా అన్నిటినీ తీసివేసింది. నగ్నంగానే బయటకు నడిచి వెళ్లిపోయింది.

అసాధారణ భక్తి
అంతే. ఆ రోజు నుంచి ఆమె తన శేష జీవితమంతా దిగంబరంగానే గడిపింది. అలా బట్టలు లేకుండా తిరగడం సమస్యలకు కారణం కావచ్చని ఎందరో ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. చివరికి వారంతా ఆమె ఒక గొప్ప యోగినిగా, సన్యాసినిగా గుర్తించారు. చాలా చిన్న వయసులోనే పరమపదం చేరిన ఆ భక్తురాలు ఈశ్వరునిపై వందలాది పద్యాలను, ప్రార్థనలను రచించింది. అక్క మహాదేవి భక్తి తీవ్రత అసాధారణమైనది.

"పరమేశ్వరా, నాకు ఎలాంటి ఆహారం వద్దు. ఆహారం అందితే ఈ శరీరం తినకుండా ఉండదు. తింటే శరీరం సంతృప్తి పడుతుంది. కాని, ఆ శరీరానికేం తెలుసు. నేను భగవత్ సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. అందుకే ఆహారం కూడా నాకు అందనీయకు. ఒకవేళ చేతికి అందినా నోటికి అందకుండా, వీలైతే నా చేతుల్లోంచి జారిపోయి మట్టి పాలవ్వనీ. మట్టిలో పడిన ఆహారాన్ని ఎత్తుకు తినాలన్న దుర్బలత నాలో రగలవచ్చు. అందుకే ఈ లోగా ఒక కుక్క వచ్చి దాన్ని ఎత్తుకు వెళ్ళిపోనీ'' అనే అక్కమహాదేవి పరమభక్తురాలు. ధన్యురాలు.

ఉపవాసం ఒక యోగం
యోగ సూత్రాల ప్రకారం కనీసం ఎనిమిది గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవడం సముచితం. ప్రతి ఒక్కరికీ కనీసం అయిదు గంటల విరామం ఉండటం తప్పనిసరి. పొట్ట ఖాళీగా ఉన్నపుడు మాత్రమే మీ జీర్ణకోశ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇలా ప్రయత్నించి చూడండి. ఒక పూట మీరు తీసుకునే ఆహారాన్ని, ఇన్ని క్యాలరీలు, లేదా ఇంత పరిమాణం అని లెక్కకట్టండి. ఆ మొత్తాన్ని రెండు భాగాలుగా చేయండి. రెండుసార్లు తీసుకోండి.

దాన్నే పది భాగాలుగా చేసి పదిసార్లు తీసుకున్నారనుకోండి. మీరు తప్పకుండా లావెక్కుతారు. ఎందుకంటే అప్పుడు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయదు. కారణం- శరీరంలో పేరుకుపోయిన ఎంతో చెత్త, వ్యర్థ పదార్థాలు బయటకు పోవు. పొట్ట పూర్తిగా ఖాళీగా ఉన్న సమయంలోనే విసర్జన వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయగలుగుతుంది. ఆకలిగా ఉన్నపుడు నీలో నీ శరీరమే నీవు అనే భావం ఎక్కువగా ఉంటుంది. ఉపవాసం వల్ల ఈ శరీరం నీవు కాదని గుర్తించగలవు. ఈ వాస్తవాన్ని విస్మరించటం వల్లనే బాధాకరమైన ఉపవాస దీక్ష వైపు దృష్టి మళ్లుతుంది.

బాధాకరమైన ఉపవాస దీక్షను చేపట్టకుండా ఉండటం ముఖ్యం. శరీర అవసరాలను నిర్దేశించే మార్పులను మీరు గుర్తించగలిగితే, దాన్ని మండలం అంటారు. మండలం అంటే 40 నుంచి 48 రోజుల వ్యవధి. మండలానికి ఒక సారి కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో మూడు రోజుల పాటు మీ శరీరానికి ఆహారం అవసరం ఉండదు. మీ శరీరంలోని అంతర్భాగాలు పనిచేసే విధానాన్ని అవగాహన చేసుకుంటే ఆ మూడు రోజుల్లో ఆహారం అవసరం లేదని మీరు గమనించగలుగుతారు.

అలాంటి రోజున మీరు ఆహారం లేకుండా ఉండవచ్చు. 11 లేక 14 రోజులకు ఒకసారి ఆహారం అవసరం లేదని తెలుసుకోగలుగుతారు. ఆ రోజున మీరు నిరాహారంగానే ఉండాలి. ఇందుకోసమే పెద్దలు ఏకాదశి దీక్షలను నిర్దేశించారు. చాంద్రమానం ప్రకారం 14 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. అంటే 15 రోజులకు ఒకసారి మీరు ఆహారం లేకుండా ఉండవచ్చు. పూర్తిగా నిరాహారిగా ఉండలేకపోతే పళ్లు వంటి వాటిని తీసుకోవచ్చు. బలవంతంగా ఆహారాన్ని నోటిలో కుక్కడం శ్రేయస్కరం కాదు.

మనోసంకల్పం ముఖ్యం
కొద్దికాలం పాటు ఉపవాసం పాటించాలని అనుకుంటే అందుకు తగిన సాధనాబలం ఉండాలి. దేహాన్ని, బుద్ధిని (మనసును) సరైన పద్ధతిలో సన్నద్ధం చేయకుండా ఉపవాస దీక్ష చేపడితే, మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వాళ్లే అవుతారు. శరీరాన్ని సక్రమంగా సిద్ధం చేసి మనో సంకల్పాన్ని కూడా కూడగట్టుకోగలిగితే, శరీరం ఆరోగ్యంగా శక్తిమంతంగా ఉన్నట్లయితే, అప్పుడు ఉపవాసం మీకు చాలా మేలు చేకూర్చగలుగుతుంది. మీరు కాఫీ, టీ ఎక్కువగా తాగుతున్నట్లయితే, అలాంటప్పుడు ఉపవాసం చేస్తే అది బాధాకరమే అవుతుంది.

ఉపవాసం చేయాలనుకుంటే ముందుగా మీరు మీ శరీరాన్ని సరైన ఆహార పదార్థాలతో సిద్ధం చేసుకోండి. ఆహారం తీసుకోవాలని బలమైన కాంక్ష ఉన్నప్పుడు, నిరాహారిగా ఉండటం వల్ల దేహంలోని వ్యవస్థలన్నీ దెబ్బతినడం తప్పదు. ఏదో ఘనకార్యం చేయాలనుకొని 'మూడు రోజుల పాటు ఆహారం ముట్టను' అనడం, ఆ విషయాన్ని ప్రపంచానికంతటికి తెలియజేయడం మీ ఉద్దేశం కావచ్చు.

దయచేసి అటువంటి సాహసాలు చేయకండి. అందువల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ శరీరం బలహీనమవుతుంది. అంతే. ఉపవాసం చేయడం అందరికీ మంచిది. అదీ సరైన అవగాహనతో చేస్తే ఇంకా మంచిది. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. ఆహారం జోలికి వెళ్లకుండా ఉండటానికి అనువైన సమయం ఏది అని గమనించి అలా నిరాహారిగా ఉంటేనే సత్ఫలితాలు లభిస్తాయి.


[andhrajyothi]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP