స్వాతంత్ర్యం వచ్చి అరవైనాలుగేళ్లయినా మంచినాయకులను తయారుచేసుకోలేకపోయాం
>> Monday, August 15, 2011
మనం స్వాతంత్ర్యం సాధించి ఇప్పటికి 64 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ మన దేశంలో మనం మౌలిక విషయాలకు సైద్ధాంతిక ప్రాముఖ్యతను నేటికీ ఇవ్వలేకపోయాం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత రెండు తరాలు గతించాయి. కానీ ఆహారం, పోషణ, ఆరోగ్యం మరియు విద్య వంటి ప్రాధమిక అవసరాలు ఇప్పటికీ జనాభాకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏదో స్వీట్లు పంచుకుని కేకలు వేసుకుంటూ ఏవో నీతులు చెప్పి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కాదు. ఇది ఎంతమాత్రం సరికాదు. స్వాతంత్ర్య పోరాటంలో నాటి మహనీయులు చూపిన కృషి, అంకితభావం, వారి త్యాగం, జీవితాలను పణంగా పెట్టి సాధించిన అపురూపమైన ప్రేమైక బహుమానం స్వాతంత్రం అని తెలుసుకుని స్మరించుకోవాలి. స్వాంతంత్రం ఎందుకూ అంటే, మన జీవితాన్ని మనమే స్వేచ్ఛగా మలచుకుని ఓ మంచి మార్గంలో పెట్టుకుని పరిపూర్ణమైన మానవునిగా ఉండేందుకు. అంతేతప్ప ఎవరో మన జీవితాలను మలచడం కోసం కాదు.
స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన దేశం గణనీయమైన ప్రగతిని సాధించింది, కానీ మౌలిక వసతుల మాటేమిటి... అందుకే ఇప్పటితరం చేయాల్సింది ఏంటంటే, మనం ఎలా ఉండాలన్నది మనకు మనమే నిర్దేశించుకోవడం, అలాగే దేశం ఎలా ఉండాలో.. అలా తీర్చిదిద్దుకోవడం, అదేవిధంగా భావితరాలకు కావల్సిన బంగారు బాటను వేయడం. అందుకోసం ప్రాథమిక అవసరాలైన పోషణ, ఆరోగ్యం, విద్య, మరియు జీవావరణ వ్యవస్థలను పటిష్టపరచుకోవడం. ఇవి అవశ్యం.
దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్న మనం దేశానికి అవసరమైన గొప్పగొప్ప నాయకులను మాత్రం తయారు చేసుకోలేకపోయాం. రాజకీయవేత్తలను, నిర్వాహకులను తయారుచేసుకోగలిగాము కానీ దేశానికి కావలసిన గొప్ప నాయకులను మాత్రం సాధించుకోలేకపోయాము. సమగ్రత, మేధస్సు దేశానికి అవసరం. వీటిని ఆయుధాలుగా చేసుకుని నేటి యువత దేశాన్ని నడపాలి. మనం కొన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని చూపిస్తున్నప్పటికీ, జనాభాలో ఇప్పటికీ 50 శాతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దేశ జనభా శక్తియుక్తుల్ని ఉపయోగించుకోకుండా ఏ దేశమూ ప్రగతిపథంలో పయనించజాలదు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోనూజాలదు.
అందుకే ఈ స్వాతంత్ర్యదినం నాడు, ప్రతి భారతీయుడు ప్రతినబూనాలి. మనకు మన దేశం ఎలా ఉండాలో అలా సృష్టించుకునేందకు పాటుపడాలని నిశ్చయించుకోవాలి. మనం మన దేశంకోసం పడిన శ్రమ భావితరాలకు బంగారుబాటలు వేయాలి. వాటిని ఆస్వాదించే భావితరం మనల్ని తలచుకుని గర్వపడాలి. ఈ స్వాతంత్ర్యదినోత్సవంనాడు ఈ లక్ష్యసాధనకు నడుం బిగించుదాం.
- సద్గురు జగ్గీవాసుదేవ్, ఇషా ఫౌండేషన్
0 వ్యాఖ్యలు:
Post a Comment