మాతృ భాషనూ ధ్వంసం చేయాలనుకుంటున్న మూర్ఖులు
>> Monday, October 26, 2009

ఈవార్త చదవండి మీ రక్తం ఉడికి పోవటం లేదూ ?
మైదుకూరు, న్యూస్టుడే:
దేశభాషలందు తెలుగులెస్స.. అంటూ బయటకు చెప్పుకుంటూ లోలోన మాత్రం ఆంగ్ల
మాధ్యమం పేరుతో పిల్లల్ని మాతృభాష మమకారం నుంచి దూరం చేస్తున్నారు.
తెలుగును నిర్బంధిస్తూ 'ఐ నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు (నేనెప్పుడూ తెలుగు
మాట్లాడను)'అంటూ మెడలో ఉపాధ్యాయులు బోర్డు తగిలించడం విస్మయానికి
గురిచేసింది. కడప జిల్లా, మైదుకూరులోని సెయింట్జోసెఫ్ ఆంగ్ల మాధ్యమం
పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని మీడియా సిబ్బంది ప్రశ్నిస్తే...
పాఠశాలలోనికి రావడానికి మీకెవరు అనుమతిచ్చారంటూ ఉపాధ్యాయులు
చిర్రుబుర్రులాడారు. దీంతో విలేకరులు తహశీల్దారు సుబ్బరాయుడు, మండల
విద్యాశాఖాధికారి సుకవనంకి సమాచారం అందించారు. తహశీల్దారు పాఠశాలకు
వస్తున్న విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థుల మెడలోని బోర్డులను
తొలగించేశారు. ఈ మొత్తం తతంగంపై తహశీల్దారు విద్యార్థులను ప్రశ్నించి,
బాధిత విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఆంగ్ల మాధ్యమం అయినా
రెండో భాష కింద తెలుగు ఉంది కదా? దాన్ని కూడా నేర్పించాలి కదా? అని ఎంఈఓ
ప్రశ్నించారు. ఇలా విద్యార్థుల మెడలో బోర్డులు వేయడం తప్పని మందలించారు.




8 వ్యాఖ్యలు:
పసి పిల్లల మీద, ఇలా బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్ది వాటిని ప్రదర్శింప చేయటం హేయమైన చర్య. అతను స్కూల్ టీచరా? హీనాతి హీనమైన వాడు. ఎప్పుడు తెలుసుకుంటారు ఈ తల్లిదండ్రులు!!
రక్తం ఉడికిపోవడం కాదు, ఆ ఫొటో చూస్తుంటేనే దుఃఖం వస్తోంది. ఆ పిల్లల మొహాలు ఎంత దీనంగా ఉన్నాయో చూడండి, మాతృభాష మాట్లాడటమే నేరమా అని ప్రశ్నిస్తున్నట్లుగా!
తహసిల్దారు కి ఫిర్యాదు చెయ్యడం కాదు, పిల్లల్ని వేధిస్తున్న ఆ టీచర్ మీద పోలీస్ కేసు పెట్టాలి. మాతృభాషా ద్రోహి అనే బోర్డు అతగాడి మెడలో కూడా కట్టి ఒక రోజంతా ఎండలో నిల్చోబెట్టాలి. ఇంకా చాలా చాలా చేయాలి.
నిజంగానే రక్తం ఉడికిపోతోంది.
>>>మాతృభాషా ద్రోహి అనే బోర్డు అతగాడి మెడలో కూడా కట్టి ఒక రోజంతా ఎండలో నిల్చోబెట్టాలి. ఇంకా చాలా చాలా చేయాలి.
సుజాత గారి కోపం సమంజసమే! ఇంత కోపం అందరికీ రావలసిందే!
అనకూడదుగానీ ఈ మిషనరీ స్కూలు వాళ్ళు మన సంప్రదాయలను( బొట్టు పెట్టుకోవటం..గాజులేసుకోవటం లాంటివి..) ఎలాగూ స్కూళ్ళో పాటించనీయరు...ఇప్పుడేమో అసలు మాతృభాషే మాట్లాడొద్దంటున్నారు...
@సుజాత గారు, కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే మనలాంటి వాళ్ళకు ఆ పిల్లలు దీనంగా ఉన్నట్టు కనిపిస్తారు..కానీ తల్లిదండ్రులకు మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకుండా నేరం చేసినట్టు కనిపిస్తారు..ప్చ్..ఏం చేస్తాం..
ఆ బడివాళ్ళ తప్పేమీ లేదు. ఇలా చేస్తే ఆ పిల్లల తలిదండ్రులు చాలా సంతోషిస్తారనీ తమ బడికి మఱుసటి సంవత్సరం అడ్మిషన్లు పెఱుగుతాయనీ వాళ్ళు అనుకున్నారు. అలాంటి బళ్ళు రాష్ట్రం నిండా వేలాదిగా ఉన్నాయి. హైదరాబాదు బళ్ళల్లో ఇలాంటి శిక్షలు చాలా మామూలు. వాళ్ళు ఇలా మెడలో పలకలు వేళ్ళాడదీయక పోయినా తెలుగులో మాట్లాడితే నగదు రూపేణ జరిమానా విధిస్తారు.
మన తెలుగు తల్లిదండ్రుల మనస్తత్త్వాన్ని బట్టి చూస్తే బడివాళ్ళలా అనుకోవడం వ్యూహాత్మకంగా సరైన చర్యే. మన తెలుగువాళ్ళలో చాలామంది దృష్టిలో చదువంటే ఇంగ్లీషు మాట్లాడగలగడమే. ఇహ ఏ సబ్జెక్టూ, నైపుణ్యమూ పిల్లలకి రానక్కఱలేదు. ఆ బడివాళ్ళ తప్పేంటంటే ఒక భాష నేర్పేటప్పుడు ఇంకో భాషని కించపఱచకుండా, ఇంకో భాషలోని నైపుణ్యాల్ని దెబ్బదీయకుండా నేర్పాలనేది. ఈ రకమైన సంస్కారం ఈ జాతిలోనే లేనప్పుడు బళ్ళవాళ్ళకి ప్రత్యేకంగా అదొస్తుందనుకోవడం మన మూర్ఖత్వమే.
మనిషి ఎన్ని భాషలు నేర్చుకుంటే అంతమంచిదని చెప్పేవాళ్లున్నారు, ఇతర భాషల్ని మన నెత్తిన బలవంతంగా రుద్దడం కోసం. ఆ భాషల జాబితాలో తెలుగుంటే మాత్రం సహించలేరు. ఎందుకు ? అని అడగాల్సి ఉంది. ఏం ? ఇతర భాషల పట్ల చూపిస్తున్న ఈ విశాలహృదయం తెలుగు దగ్గఱి కొచ్చేసఱికి ఎందుకలా మంత్రం వేసినట్లు మాయమైపోతుంది ? తెలుగు చేసిన పాపమేంటి ? తెలుగువాళ్ళ భాష కావడం తప్ప ?
అవునండి మాస్కూల్ లో వినుకొండనుంచి వచ్చి పనిచెసే ఒక మాశ్టర్ గారు వినుకొండలోని నిర్మల కాన్వెంట్ లో చదివిస్తున్నాడట . తెలుగు మాట్లాడినందుకు ఐదురూపాయల ఫైన్ తెమ్మన్నారని ఏడుస్తుంటే పిల్లవాని కోసం డబ్బుపంపామండి అని నవ్వుతూ ఇందాక నాతో చెబుతుంటే కడుపుమండిపోయింది. ఏం సార్ ! మరీ వెన్నుముకలేకుండా బ్రతకాలా ? జాగ్రత్త రేపు మీనాన్నపేరు తెలుగులో వుంది కాబట్టి వాడు మీనాన్నకాదు అనికూడా నేర్పగలరు అని ,కోపగించుకున్నాను.
ఈ జాఢ్యం పట్టుకున్న జనానికేమి చెప్పగలం . నిన్నటివరకు ఎల్.ఇ.పి మీద మాకు ట్రైనింగ్ క్లాసులు జరిగాయి .అందులో ఒక సీనియర్ టీచర్గారు
సంపాదించటం లక్ష్యంగా చెప్పాలండీ పిల్లలకు అప్పుడే బాగా చదివి పైకొస్తారన్నాడు.
అవునండి మీలాంటీవాల్లు చెప్పబట్టే ఇదిగో ఈదౌర్భాగ్యం మాత్రమే నేర్చుకుంటూన్నారు ఇవాళ్ అని ఈమధ్య పేపర్లలో వచ్చిన పిల్లవాడ్నికూడా చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వుదంతాలు కొన్ని చెప్పాను .
మనీ బ్రతుకుతుంది మనచదువులతో మనిషిబ్రతకడు అని హెచ్చరించాను .కంఠశోష మిగిలిందినాకు .ఎందుకంటే క అందరూ పరిగెత్తే పనిలోనే ఉన్నట్లనిపించింది నాకక్కడ.
అబ్బ ఎంత అమానుషం కదు.. చూస్తుంటేనే ఒళ్ళు మండుతోంది, ఇంక తల్లి తండ్రులకు ఎలా వుందో... పాపం వాళ్ళ బిక్క మొకాలు చూడండి.. చీ... సుజాత చెప్పినట్లు ఆ టీచర్ మీద హరాస్మెంట్ కేస్ పెట్టాలి.
>>>మాతృభాషా ద్రోహి అనే బోర్డు అతగాడి మెడలో కూడా కట్టి ఒక రోజంతా ఎండలో నిల్చోబెట్టాలి
ఆ మాష్టారే కాదు, ఆ పాఠశాల యాజమాన్యాన్ని కూడా ఇలా చేయాలి.
Post a Comment