శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చఠిత్ర 58;59;60;61

>> Thursday, July 5, 2012

బాహ్య విషయాలలో ఆసక్తిశూన్యులై, అంతరంగంలో పరమానందాన్ని అనుభవించేవారు బ్రహ్మ సంయుతులై అక్షయ సుఖాన్ని పొందుతారు. ఒక ప్రజాపాలకుని కన్నను, ప్రజారంజకుడైన రాజు కన్నను, యుద్ధములో విజయం సాధించి యోధుని కన్నను, మనస్సును స్వాధీనం చేసుకొన్నవాడు మహాపురుషుడనిపించుకొంటాడు. ఈదుతూ సముద్రమునైనా దాటడం సహజం కావచ్చును కాని, మనస్సును వశపరచుకొనటం మాత్రం చాలా కష్టమైనది.
ఒకవేళ భక్తి విశ్వాసములతో పనులు చేయగలిగితే మనస్సుపైన విజయం సాధించటం సహజం కావచ్చును. దయయే సాధనకు మూలము. అభిమానము నరకానికి త్రోవ. అహంకార శూన్యుడు, క్షమాశీలి, సుఖదుఃఖములందు సమభావన కలవాడు, నిత్య సంతోషి, మనస్సును బుద్ధిని భగవదర్పితం చేసినవాడు, ఎవరికీ దుఃఖము కలిగించనివాడు, భయక్రోధ విముక్తుడు, కోరికలు లేనివాడు, సుఖములు కల్గినప్పుడు సంతుష్టుడు-దుఃఖములు కల్గినప్పుడు దుఃఖితుడు కానివాడు, పాప పుణ్య రహితుడు, శత్రువులపట్ల మిత్రుల పట్ల సమభావన కలవాడు, మానావమానాలను సమభావంతో చూపేవాడు, నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు, శరీర రక్షణార్థము దొరికినదానిని మాత్రమే తిని సంతోషపడేవాడు, శరీరరక్షణార్థము దొరికిన దానిని మాత్రమే తిని సంతోష పడేవాడు, ఈశ్వర పరాయణుడు, శ్రద్ధాళువు, భక్తిపరాయణుడు అయినవారే భగవంతుని పొందగలుగుతారు. వారికి ముక్తి తప్పక లభిస్తుంది.
ఇతర సాధనములన్నిటికన్నను జ్ఞానమే ముక్తికి ప్రధాన కారణము. అగ్ని లేకపోతే వంట సాధ్యం కాదు. అజ్ఞానంవలన నిర్మలమైన ఆత్మ మలినంగా అనిపిస్తుంది. మేఘాలు తొలగిపోయిన తరువాత సూర్యుడు ప్రకాశించినట్లు ఆత్మయే స్వయంగా ప్రకాశిస్తుంది. జీవుడు అజ్ఞానం కన్న మలినమైనవాడు. జ్ఞానమే అతనిని నిర్మలంగా చేయగలుగుతుంది. స్వప్నావస్థలో నిద్రలోచూసిన వస్తువులు సత్యంగా కన్పించి, జాగ్రదవస్థలో మిథ్యగా ప్రతీయమానమైనట్లు, రాగద్వేషములతో నిండిన ఈ సంసారము అజ్ఞానం చేత వాస్తవంగా కన్పించి, ఆ అజ్ఞానం నశించగానే మిథ్య అని విశదమవుతుంది.
ఈశ్వరుడు కేవలం నిరాకారుడేకాదు శబ్దస్పర్శరూప రస గంధాదులకు భక్తి, దయాది గుణాలకు అతీతుడు. ఈనాడు నిరాకారోపాసన చేస్తున్నవారికి, తాము చేసే ఉపాసన సరిగ్గా జరుగుతన్నదో లేదో తెలియదు. భక్తిని గురించి చర్చించటంవలన వారికి మానసికోన్నతి కలుగుతున్నదే కాని, అసలైన ఫలితం కానీ, అంతకన్నా అధికంగా కానీ ఏమీ లభించటంలేదు. నిరాకారోపాసనలో జ్ఞానలాభానికి భక్తి- మానసిక వృత్తుల స్ఫురణ ఆవశ్యకమని వారికి తెలిసినప్పుడు, ఈశ్వరతత్త్వజ్ఞాన ప్రాప్తికి ఏదోరకమైన ఇతర సాకారమైన పదార్థముయొక్క ఆలంబనం లేకుండా అన్నివృత్తుల స్ఫురణ చేయగల కోరిక ఉండాలి. అదే నిరాకారోపాసన. ఈశ్వర తత్త్వజ్ఞానానికి సాకార చింతనను ఆలంబనంగా చేసుకొంటే అది సాకారోపాసన అవుతుంది. అట్లాకాక, సాకార చింతన లేక జగద్వ్యాపియైన ఈశ్వరుని మహిమ - శక్తి- గుణము మొదలైన విషయాలను హృదయంలో నిలుపుకోవటం నిరాకారోపాసన అవుతుంది. సగుణోపాసనను వదలి నిర్గుణోపాసన ఉండదు.
ఉపాసన నాలుగు రకాలుగా ఉంటుంది. మొదటిది ఈశ్వరోపాసన. రెండవది దేవతోపాసన. మూడవది సూర్యుడు అగ్ని మొదలైన శక్తిమంతమైన పదార్థముల ఉపాసన. నాల్గవది ధార్మిక మనుష్యుల ఉపాసన. గోవు, వృక్షము, నంది, గంగ, ధ్యానములు మొదలైన వాటి ఉపాసన కూడా ఒక రకమైన ఉపాసనయే. హిందువైన కమ్మరి కొలిమిని, వడ్రంగి సుత్తిని, రంపాన్ని, కుమ్మరి చక్రాన్ని, బ్రాహ్మణులు పుస్తకాలను పూజిస్తారు. అట్లా ఉపాసన చేసేటప్పుడు అచేతన వస్తువులను సచేతనములుగా భావించి పూజిస్తారు. ఆదిమ మానవులు ఇలాంటి ఉపాసనే చేసేవారు
 వేరే తరహా ఉపాసనలో అచేతనములో అచేతన భావనే ఉంటుంది. అలాంటి ఉపాసనము జడ - ఉపాసన అంటారు. అలాటిది చేయటం కూడా తప్పు కాదు. ఎందుకంటే అలాంటి దానివలన కూడా కొన్ని రకాల చిత్తవృత్తి స్ఫూర్తులను సాధించవచ్చును.
భగవంతుని మనం చూడలేము. కాని ఆయన పనులను, శక్తిని, దయా లక్షణాన్ని తెలిసికొన్న తరువాత సాకారమైన దేవతోపాసన కాక ఇతరములైనవి ఆకులు లేని చెట్లలాగా అంగహీనోపాసనలని గ్రహిస్తాము. హిందూ ధర్మంలోని వివిధోపాసనా పద్ధతులను బాగా తెలుసుకొన్న తరువాత, ఆ హిందూ ధర్మం ఎంత గొప్పదో స్పష్టమవుతుంది. కాని దౌర్భాగ్యవశాత్తు హిందూ ధర్మం వికృతిని పొందుతున్నది. హిందూ ధర్మంలో ఒక్క ఈశ్వరుడు తప్ప, అంతకన్నా భిన్నమైన అన్యదేవతలు లేరు. అందుకు అనేక ప్రమాణాలు ఉన్నాయి. హిందూ ధర్మంలోని ఉన్న సారవంతములైన మాటలు కాని, అంతకన్నా ఉన్నతములైన ఉదార భావములు కాని ఇతర మతాలలో కన్పించవు. ఈశ్వరుడు విశ్వస్వరూపుడు. అందువలన అన్ని చోట్లా ఆయనను ఉపాసించవచ్చును.
ఏ ప్రణాళిక ద్వారా అజ్ఞానాంధకారం దూరమవుతుందో ఆ ప్రణాళికను అనుసరించటమే అసలైన ఈశ్వరోపాసనము. ఈశ్వరుని అస్తిత్వమును మన అంతరంగములో అనుభవించటమే అసలైన ఈశ్వరోపాసనము. దేనివలన చిత్తము శుద్ధము, ఉన్నతము, నిర్మలము అవుతుందో అదే ఉపాసన. మసకబారిన అద్దంలో వస్తువు యొక్క ప్రతిబింబము సరిగ్గా కన్పించనట్లు, చిత్తము నిర్మలము కానంతవరకూ అందులో ఈశ్వరుని జ్యోతి ప్రతిబింబించదు. చిత్తమును పరిశుద్ధంగా చేసుకోటానికి ఎవరైనా ఏ దేవత సూక్ష్మశక్తినైనా సహాయంగా తీసుకొంటే, ఆ దేవతారాధన కూడా ఉపాసనే అనిపించుకొంటుంది.
హిందూ శాస్తక్రారులు ఈశ్వర స్వరూపాన్ని గురించి చెబుతూ- ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, విశ్వవ్యాపి, విశ్వరూపి, అనాది, అనంతుడు, సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, శుద్ధుడు, జరారహితుడు, అమరుడు, శాంతుడు, నిర్మలుడు, అంతర్యామి, విశ్వవేత్త, విశ్వజన్మస్థానము, సృష్టి - స్థితి - లయ ఉద్ధారణ కారణుడు అని వర్ణించారు. అతడు వాక్కులకు- మనస్సుకు అగోచరుడు అన్నారు. వాటి అర్థాలను సరిగ్గా తెలుసుకోవాలి. మొదట నిరాకార శబ్దం యొక్క అర్థం తెలుసుకొందాము.
రూపము ఆకారము అనే రెండు శబ్దాలను చాలా సార్లు ఒకే అర్థంలో వ్యవహరిస్తూ ఉంటాము. ఒక పదార్థము యొక్క రంగును రూపం అంటాము. కాని ఆకారం కూడా రూపమే. కళ్లకు కనిపించని వస్తువులకు రూపం లేదని చాలామంది అనుకొంటూ ఉంటారు. అట్లాగే కళ్లకు కనిపించే వస్తువునే ఆకారం కలది అని అనుకొంటారు. వాయువు కళ్లకు కన్పించదు. కాని వాయువుకు కూడా ఆకారం ఉన్నది. శబ్దము, గంధము, చిన్న చిన్న కీటములు వంటివి కళ్లకు కనిపించకపోయినా వాటికీ ఆకారం ఉన్నది.
కేవలం నోటితో మనము ‘్భగవంతుడు, భగవంతుడు’ అని అనటం వలన అది ఆయనను ఉపాసించటం కాదు. ఉపాసన చేసే ముందు ఈశ్వర శబ్దం యొక్క అర్థమును ముందు మనము హృదయంలో పదిలపరచుకోవాలి. ఈ విశ్వవ్యాప్తమైన జగత్తు ఏశక్తి చేత నడిపింపబడుతున్నదో అదే ఈశ్వరుని అనంత శక్తి. స్థూల జగత్తు సూక్ష్మ జగత్తులలో ఎన్ని రకాల శక్తి క్రియలు కన్పిస్తాయో, అవే ఈశ్వరుని అనంత శక్తి రూపాలు. ఆ శక్తినే మనం చైతన్య శక్తి అని ఒప్పుకోవాలి. ఎవరు తన శక్తిని ఆ అనంత శక్తితో సమ్మిళితం చేయగలడో, అతడే సాక్షాత్తు ఈశ్వరుని చక్కగా తెలుసుకోగలుగుతాడు. ఈ అన్ని జగత్తుల సమిష్టి భావనే ఈశ్వరుడు. దానిని బాగా అర్థం చేసుకోగలడు. ఈ అన్ని జగత్తుల సమిష్టి భావమే ఈశ్వరుడు. దానిని బాగా అర్థం చేసుకొంటే ఈశ్వరుడు నిరాకారుడు, నిర్గుణుడు, అనంతుడు అన్న పదాలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు.
 ఈశ్వరుని పనులను, శక్తిని భక్త్భివంతో అర్థం చేసుకొంటే సాధకుడు క్రమంగా పూర్ణుడవుతాడు. సృష్టికర్తను గురించి తెలుసుకోవటానికి సృష్టిని గురించిన అధ్యయనము, దాని భావ గ్రహణము, అవశ్యకము. ప్రళయకర్తను గురించి తెలుసుకోవాలంటే ప్రళయతత్త్వాన్ని తెలుసుకోవాలి. అట్లాగే పాలనకర్తను గురించి తెలుసుకోవాలంటే పాలనతత్త్వాన్ని తెలుసుకోవాలి. దృఢచిత్తముతో అనాది రూప సర్వకారణుడైన ఈశ్వరుని స్వరూపాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే ఉపాసన. ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోతే, నదీ తీరంలోనో దేవాలయంలోనో కూర్చొని ప్రార్థన చేయటమో, ఏ దేవతనో గురించి భజన చేయటమో ఈశ్వరోపాసన అనిపించుకోదు. కాళికాదేవి శక్తి అనంతమైనది. ఆమెను ఉపాసించటం వలన ఐహితమైన- పారలౌకికమైన అనేక ఫలితాలు లభిస్తాయి. అలాంటి విశ్వాసంతో, కాళికాదేవి విగ్రహాన్ని ముందుంచుకొని ఉపాసిస్తే, అది కాళికాదేవిపాసన అవుతుంది. కాని అది ఈశ్వరోపాసన కాదు. ఒకవేళే ఏదైనా సాకారమైన పదార్థాన్ని ఈశ్వర స్వరూపమని ఉపాసిస్తే అది ఈశ్వరోపాసన అవుతుంది.
ఏదైనా సాకార రూపాన్ని అదొకటే ఈశ్వరరూపమని భావిస్తే ఈశ్వరుని మహిమపట్ల గర్వించినట్లు అవుతుంది. అట్లా చేస్తే ఉపాసకుడు భ్రాంతిలో పడిపోతాడు. కాళికాదేవి రూపాన్ని మనము ఈశ్వరుని మరొక రూపమని భావించి ఆ కాళీ రూపాన్ని మన అంతరంగంలో అనుభూతి పొందితే, అప్పుడు మనము ఈశ్వరుని ఆ రూపాన్ని కూడా వాస్తవమని తెలుసుకొంటాము. అలాంటి ఉపాసనకు తగిన ఫలం ఉండదనుకోకూడదు. ఎందుకంటే- అలాంటి సాకారోపాసన వలననే నిరాకారుడు, సర్వవ్యాపి, నిర్గుణుడు అయిన ఈశ్వరుని మహిమను తెలుసుకోగలుగుతాము.
మనుష్యులు చేసిన కర్మలకు తగిన ఫలమునిచ్చే శక్తి దేవత. అనిత్య సుఖమనే ప్రలోభంతో దేవతలు మనుష్యులను ముగ్ధులను చేసి ఉంచారు. అందువల్లనే మనుష్యుడు ఈశ్వర సంబంధం విషయంలో ఘోరారంధకారంలో పడి ఉంటాడు. మనిషి హృదయంలో సామాన్యమైన అనిత్య సుఖ సంబంధమైన కోరికలు ఎప్పటివరకు ప్రబలంగా ఉంటాయో, అప్పటివరకూ సాధకుడు నిత్య సుఖాన్ని ఇచ్చే ఈశ్వరుని తెలుసుకోలేడు. భగవంతుని చేరాలన్నా- చూడాలన్నా మొదట కోరికలను వదిలిపెట్టాలి. ఈ సకామకర్మ దేవతోపాసన, నిష్కామ కర్మ ఈశ్వరోపాసన అవుతుంది.
మట్టితోనో, లోహంతోనో, రాతితోనో చేసిన విగ్రహాన్నిచూసి, అదే ఈశ్వరుడని భావించే అజ్ఞాని కేవలం భ్రమలో పడతాడు. కల్పిత విగ్రహాలు ఈశ్వరుడైతే, కలలో లభించిన రాజ్యం కూడా వాస్తవమే కావాలి. ఈశ్వరుని మనము సహజరూపంలో చూడలేము. అందువలననే ఆ దేవతా స్వరూపాలను అజ్ఞానంతో నిర్మించుకొని పూజలు అర్చనలు చేసి మన కోరికలను పూర్తిచేసుకొంటాము. అలాంటి విగ్రహాలు ఆయన శక్తి స్వరూపాలు కలిగినవి కావాలి. కాని, జగత్తంతా వ్యాపించిన ఆ ఈశ్వరుని శక్తి అంతా ఆ విగ్రహాలలో లేకపోవటంవలన అవి పూర్తి ఈశ్వర స్వరూపాలు కాలేవు. మనిషి చేసిన కర్మయే శుభాశుభఫలములను ఇస్తుంది. ఆ కర్మాత్మక శక్తియే దేవత అని తెలుసుకొని వేదాంత శాస్త్రంలో చెప్పిన బ్రహ్మను, సాంఖ్యంలో చెప్పిన నిర్గుణ పురుషుని, యోగ శాస్త్రంలో చెప్పిన నిర్వికల్ప సమాధి ద్వారా పొందవలసిన గమ్యం వరకూ పోవచ్చును. బ్రహ్మ సాక్షాత్కారం కాకుండా నిత్యసుఖము, నిర్వాణముక్తి లభించవు. దేవతోపాసనవలన భోగములు- ఐశ్వర్య లాభము కలుగుతాయి. అందువలన సమాధి సుఖం నుంచి వంచింపబడతారు. ఏకాగ్ర చిత్తంతో ఎవరు ఎలాంటి కోరికలను కోరుకొంటే, వారి వారి ఏకాగ్రతా కారణంగా వారు కోరుకొన్న ఫలితాలు లభిస్తాయి. భోగములు ఐశ్వర్యముల కోరికలు ఉంటే, ఆ భోగ ఐశ్వర్యములను ఇచ్చే దేవతానుగ్రహం కలుగుతుంది. అట్లా కాక నిష్కామములయితే అంటే బ్రహ్మజ్ఞానం తప్ప ఇతర కోరికలు లేకపోతే, నిర్గుణ నిరాకారశక్తి యొక్క సహాయం లభిస్తుంది.

బ్రహ్మసాక్షాత్కారము, కామకర్మలతో దేవతోపాసన, నిష్కామకర్మలు- అవే ఈశ్వరోపాసన. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరిక కలిగి, భోగములు ఐశ్వర్యములపట్ల కోరికలు లేక సాకారోపాసన చేస్తే యథార్థంగా ఈశ్వరోపాసన చేసినట్లు అవుతుంది.
మనము దేనిని చేస్తామో దానిని కర్మ అంటారు. కర్మ రెండు రకాలు. 1.స్థూలకర్మ 2.సూక్ష్మకర్మ. మనం ఎక్కడికన్నా వెళ్లాలని అనుకొని, అక్కడికి వెళ్తే అది స్థూలకర్మ అవుతుంది. ఎందుకంటే శరీరంలో అంగపరిచాలనశక్తి వ్యయం అయింది కనుక. ఒకవేళ కేవలం ఆలోచన మాత్రం చేసి అక్కడికి వెళ్లకపోతే మానసిక శక్తి మాత్రమే వ్యయమవుతుంది. చితె్తైకాగ్రత రూపమైన కర్మబీజములు ఉత్పన్నమై అవి చాలాకాలం స్థిరంగా ఉండిపోతాయి. దేవతోపాసనే వేదంలోని ఉపాసనకాండ వంటిది. ఈశ్వరుడు నిష్కాముడు. అందువలన నిష్కామోపాసన చేస్తేనే ఈశ్వరుడు లభిస్తాడు. కోరిక - ఆశలు ఉంటే ఈశ్వరప్రాప్తి కలుగుతుందనే ఆశ ఉండదు. హిందువులు మాత్రం మోక్షం తప్ప ఈశ్వరుని ఏమీ కోరరు. నిత్యస్వరూపుడైన ఈశ్వరునికి నిత్యఫలకమైన మోక్షం తప్ప ఇంకేరకమైన ఫలం ఇవ్వటం తెలియదు. ఉపాసన లేకుండా ఏకాగ్రచిత్తుడై నోటితో కేవలం ఈశ్వరుడు జగద్రచయిత, అద్వితీయుడు, దయాయుడు, సర్వశక్తిమంతుడు, అచింత్యుడు, అవ్యక్తుడు మొదలైన మాటలు అనటంవలన, ఈశ్వరసంబంధమైన జ్ఞానం అతనికి ఏ మాత్రం కలగదు.
రాగద్వేషాదిదోషమువలన శుభాశుభకర్మలు ఉత్పన్నమవుతాయి. కర్మయే ప్రపంచం యొక్క ఉత్పత్తి కారణము. అందువలన అవిద్యను అన్ని విధాలా వదిలి పెట్టడమే కర్తవ్యము. ఒకవేళ ఎవరైనా అపకారం చేస్తే అపకారం పొందిన వ్యక్తి ఆ అపకారం ఎవరికి చేశారు అని ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తే, ద్వేషం అసలు కలగనే కలగదు. ఆత్మవదిలిపోయిన తరువాత పంచభూతమయమైన ఈ శరీరము జడపదార్థమైపోతుంది. దానిలో జ్ఞానము చైతన్యము ఏమీ ఉండవు. అప్పుడు దానిని నిప్పుతో కాల్చినా, నక్కలు మొదలైనవి తిన్నా, దానికి ఏమీ తెలియదు. అలాంటి జడపదార్థానికి అవమానం ఏమిటి?
తన ఆత్మతో జగత్తు యొక్క ఆత్మను కలపటమే యోగము అంటారు. ఇలాంటి యోక యుక్తాత్ముడు ఆత్మ కలవాడు (యోగి) తనను సర్వభూతస్థుడనుకొంటాడు. జనమంతా ఒక్క చోట కూడినప్పుడు ఒక రకమైన పెద్దశబ్దం వినబడుతుంది. అంతేకాని వేరు వేరు శబ్దములు ప్రత్యేకంగా వినబడవు. కేవలము హూ హూ అన్న ధ్వనులేవినబడతాయి. దాని పేరే యోగము. అనేక స్వరములను ఒకే లయలో కలిపి వాయించినపుడు కేవలం ఒక్క శబ్దంమాత్రమే వినబడుతుంది. ఆ స్వరమే యోగము. ఆ చైతన్యమే జగత్తు యొక్క ఆత్మ.
ఉపాసన ద్వారా ఉపాస్యదేవతతో ఉన్న సంబంధం ‘సోహ’ అనే దాని అర్థంగా ‘సః ఏవ అహమ్’అన్న జ్ఞానం కలుగుతుంది. అతడే మనమెవరమో అని చక్కగా తెలుసుకోగలుగుతాడు. మన సంబంధము హస్తపాదాదులతోను, మనస్సుతోను గట్టిగా ముడిపడి ఉన్నది. అలాంటి అనుభవంవల్లనే హస్తపాదాదులు మనస్సు పట్ల మనవి అనే భావన కల్గింది. అట్లాగే మనకు ఈ ప్రపంచంతో ఎంత గట్టి సంబంధం ఉన్నదో అన్న విషయాన్ని మనిషి ఎంత ఉన్నతిని సాధిస్తే అంత ఎక్కువగా తెలుసుకోగలుగుతాడు. అనుభవశక్తి వికసించిన కొద్దీ మనుష్యులు ఈ సంబంధాన్ని స్పష్టంగా అనుభవిస్తారు. తన ఆత్మజ్ఞానముతో ఈ జగత్తును కలుపుకోవటమే అసలైన యోగము. ఏ భిన్న శక్తులతో ఈ జగత్తు నడుస్తున్నదో ఆ శక్తులన్నింటి క్రియలను మానవుడు ప్రయత్నించి తనలోనే చూడగలుగుతాడు. అందుకే మానవుని ఒక చిన్న బ్రహ్మాండమన్నారు.
5.పూరజన్మము - పర జన్మము
పూర్వజన్మ- పర జన్మలు ఉన్నాయా? లేవా అని తెలుసుకోవాలనే కోరిక ఉంటే వాటిని గురించి స్థిరమైన మనస్సుతో ఆలోచించాలి. అప్పుడు పూర్వజన్మ వర్తమాన జన్మ భవిష్యత్ జన్మ అనే మూడు జన్మలుగా స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
- ఇంకాఉంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP