శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధర్మాచరణం

>> Saturday, July 7, 2012

ధర్మాచరణం

«ధర్మాచరణం ఫలాపేక్ష రహితమైనది, లోకరక్షకమైనది. హితకరము, జనప్రియకరమూ అయిన ధర్మనే కర్మాచరణం పట్ల ఆసక్తి జనులలో పెరగాలి అని వేదాలు, పురాణాలు పదేపదే ఘోషించాయి...ఆ దివ్యత్వాన్ని సమున్నతంగా బోధించాయి...ప్రబోధాత్మకంగా అణువణువునా శ్వాసించాయి. ధర్మాచరణమే మానవకోటికి నిజమైన కర్మాచరణమని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన విధానం, సంవిధానం శుద్ధమైన రీతిలో ఈ కర్మభూమికి సిద్ధమంత్రాలుగా నిలిచాయి. అసలు ధర్మమంటే ఏమిటి? అన్న శేష ప్రశ్న యుగయుగాలుగా, తరతరాలుగా మనలను వెంటాడుతూనే ఉంది. దేనిచేత ఈ చరాచరాత్మకమైన జగత్తు నశించకుండా నిలబెట్టబడుతుందో, ఏది ఈ జగత్తును నిలబెడుతుందో అదే ధర్మం. ధర్మం అంటే మంచి పని, కర్తవ్యం అని చెప్పవచ్చు. పురుషార్థాలలో మొదటిది ధర్మం. మానవజీవితానికి పరమధ్యేయం ధర్మం. "ధారయతీతి ధర్మః''అంటే ఈ జగత్తును ధరించేది ధర్మం.

ఏవీ ఉత్తమ ధర్మాలు?
ఏ జాతి అయినా స్వచ్ఛంగా పేర్కొనబడుతూ, విశ్వపటంలో ఉన్నతమైన శ్రేణిలో నిలబడుతుందో అదే ఆ జాతికి ఉనికి, నిజమైన ఘనత. అయితే జాతి నిజాయితీకి, సాంద్రతకు మారుపేరుగా ఉండాలంటే ఉండవలసిన విహితమైన లక్షణాలు యాజ్ఞవల్క్యస్మృతిలో చెప్పబడ్డాయి. జాతిని పరిపూర్ణమైన క్రియపరత్వంలో ఉంచుకోవడం, సర్వజనులను గౌరవించగలగడం, సహనాన్ని, సమధర్మాన్ని కలిగి ఉండటం, చేసే వ్యవహారంలో మోసం లేకపోవడం, ఇతరులను అవమానించకపోవడం వంటివి ఉత్తమ ధర్మాలుగా చెప్పబడ్డాయి.

విహితమైన రీతిలో తన జన్మకు కారకులైన వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం, సంతానానికి ఉత్తమ సంస్కారాన్ని కలుగచేయడం, ఉన్నత విద్యాబుద్ధులు గరపడం వంటివి కూడా తప్పక ఆచరించవలసిన ఉత్తమ ధర్మాలుగా స్మృతిప్రోక్తంగా యుక్తమైన రీతిలో చెప్పబడింది. ఇవి జాతికి, సంఘానికి యుక్తమైనవిగానే గాక, శక్తి నొసగేవని ప్రజ్ఞాశీలురైన మునులు, ఋషులు పదేపదే వచించారు. ఈ ఉన్నత లక్షణాలు మనిషికి అలవడితే తన కుటుంబానికే గాక, సంఘానికి కూడా ఉత్తమ సేవలు అందించగలుగుతాడు. ఇటువంటి ఉత్తమమైన అలవాట్లు బాల్యం నుంచే అలవడాలని గురువులు శిష్యులకు వేదవేదాంగాలను బోధించేవారు. ఉన్నత శ్రేణికి చెందిన చతుర్వేదాలలో చెప్పబడని ఉత్తమ ధర్మం ఎక్కడా కానరాదు. ఉత్తమ లక్షణ సంపన్నులు దుర్జన సాంగత్యానికి దూరంగా ఉంటేనే ధర్మాచరణంలో క్రియాశీలకంగా ఉండగలరని భర్తృహరి శుభాషితాలు ప్రభావశీలంగా పేర్కొన్నాయి.

నిస్సహాయులైన ధర్మవర్తనులు
హితబుద్ధి, ధర్మవర్తన కలిగి ఉండీ ఆచరణలో చూపించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పాత్రలు ధర్మార్థ నిధులైన రామాయణ, మహాభారతాలలో మనకు తారసపడతాయి. అందులో మహాభారతంలోని అగ్రగణ్యమైన పాత్ర భీష్మ పితామహునిది. వేద వేదాంగాలను ఎరిగిన మహాజ్ఞానియే కాక, యుద్ధభూమిలో నృసింహుని తలపించే పరాక్రమం గాంగేయుడైన భీష్ముని సొంతం. భరతజాతి భక్తి జీవితంలో అతి విశిష్టమైన 'విష్ణుసహస్రనామం' భీష్మునిచే వెలయించబడిందనేది విదితమైన విషయమే. కృష్ణార్జునులు నరనారాయణులే అని తెలిసినా వారివైపు యుద్ధం చేయలేక హస్తినాపుర సింహాసన రక్షలోనే జీవితాన్ని గడిపాడాయన.

ధర్మం పాండవుల వైపే ఉందని విస్పష్టంగా తెలిసినా, పెద్దవాడిగా తన అభిప్రాయాలను చెప్పేవాడే గానీ కౌరవులను ధర్మాచరణం వైపు ఒప్పించలేక ఎండబెట్టిన వడియాలతోపాటు చేట ఎండిపోయిన విధంగా మహాభారత యుద్ధంలో దుష్ట కౌరవులతోబాటు తానూ తనువు వాల్చాడు. మహాభారతంలోని మరొక పాత్ర కర్ణుడు. అత్యంత దానగుణ సంపన్నుడైన కర్ణుడు తాను స్నేహధర్మానికి ప్రాణం ఇస్తున్నానని తలపోస్తూ దుష్టుడైన దురోధనుడి సంగత్యంలో తన జీవితమంతా గడిపి శకుని, దుశ్శాసనాదులతో కలిపి తానూ 'దుష్ట చతుష్టయం'లో ఒకడిగా నిలిచాడు.

పాండవులతో జరిగిన ధర్మయుద్ధంలో నిహతుడయ్యాడు. అయితే రామాయణంలోని విభీషణుని పాత్ర వీరికి భిన్నంగా కనపడుతుంది. విభీషణుడు సరి అయిన సమయంలో ధర్మనిర్ణయం తీసుకుని హితబుద్ధికి నిజమైన ఉదాహరణంగా నిలబడతాడు. సీతాపహరణాన్ని, శ్రీరామచంద్రుడితో యుద్ధాన్ని నిరసించి, తన సోదరుడైన లంకాధీశుడు రావణునితోకాక, మొత్తం రాక్షసులందరితోనూ విభేదించి లంక నుంచి నిష్క్రమించాడు. పురుషోత్తముడు, ధర్మపురుషుడూ అయిన శ్రీరాముని శరణు వేడి, ధర్మ పరిరక్షణలో తన పాత్రను ప్రశంసనీయంగా నిర్వహించడమేగాక రావణ వధానంతరం లంకా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. రమణీయ ధర్మాచరణంలో కమనీయ పాత్రగా లోకాన సుస్థిరుడయ్యాడు.

నిరంతర వాహిని
ధర్మాచరణం అనేది ఒక నిరంతరంగా ప్రవహించే స్వచ్ఛమైన, నిరంతరాయమైన వాహిని. అది వెళ్లే మార్గంలోనే మన గమనం, పయనం ఉండాలి. ఆ ప్రవాహఝరికి ఎదురుగా నిలిస్తే ఎటువంటివారైనా కొట్టుకుపోక తప్పదని భీష్మ, కర్ణుల చరితాలే గాక, నాటి నుంచి నేటివరకు ఎన్నో ఉదాహరణలు సజీవ సాక్ష్యాలుగా సాక్షాత్కరిస్తాయి. అందుకే, ధర్మాచరణం సదా ఆచరణీయం! ధర్మవిధిని ఒక అపురూప నిధిగా తలపోసి నిరతమూ త్రికరణశుద్ధిగా పాటించిన సుజన జీవనుల చరితలు ప్రాతఃస్మరణీయం! వారిని సతతం అనుసరించిన జనుల జీవితాలు నిత్య స్తవనీయం!

ధర్మాచరణం సదా ఆచరణీయం! ధర్మవిధిని ఒక అపురూప నిధిగా తలపోసి నిరతమూ త్రికరణశుద్ధిగా పాటించిన సుజన జీవనుల చరితలు ప్రాతఃస్మరణీయం! వారిని సతతం అనుసరించిన జనుల జీవితాలు నిత్య స్తవనీయం!

- వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు, వ్యాఖ్యాత

1 వ్యాఖ్యలు:

anrd July 7, 2012 at 3:13 AM  

చక్కటి విషయాలను అందించిన అందరికి కృతజ్ఞతలండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP