శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నక్క రామేశ్వరం అనే ఈ బెస్తపల్లెను చూసి నేర్చుకోవాలి మనం ధర్మనిష్ఠ అంటే ఏమిటో !

>> Thursday, February 17, 2011

బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం|

జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం||

తూర్పుగోదావరిజిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామశివారైన పల్లవపాలెం పంచాయితీకి చెందిన నక్కారామేశ్వరం ఒక చిన్నమారుమూలగ్రామం. కోనసీమలో ఈగ్రామానికి గొప్పశివక్షేత్రంగా మంచిప్రసిద్ధి ఉంది. వశిష్ఠగోదావరి పాయలుగా చీలి, సముద్రంలో కలిసేటప్పుడు ఏర్పడిన చిన్నద్వీపం ఈగ్రామం. గ్రామంలో స్త్రీలు, పురుషులు కలిసిన మొత్తం జనాభా 4,500మంది. . సముద్రంమీద వేటకు పోయి, చేపలు పట్టుకుని జీవించటమే వీరి ప్రధానవృత్తి. అయితే ఈగ్రామస్తులందరూ వందలఏళ్ళుగా గొప్పశివభక్తులు. ఇందుకు కారణం ఆగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీసమేత రామేశ్వరస్వామివారు. ఈస్వామి మహిమల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఈగ్రామంలోకి పాదం మోపి ప్రచారం చేసుకోవడానికి అన్యమతాలవారు వందలఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మహమ్మదీయుల ప్రాబల్యం దేశమంతటా ఉన్నప్పుడు ఇక్కడికి ఒకానొక ఫకీరు వచ్చి, ఇక్కడ ఉండే స్వామివారి మహిమకు ఆకర్షింపబడి, తానే శివభక్తుడుగా మారాడనీ చెబుతారు. ఆయన పేరు నాగూరు మీరాసాహెబ్‌. ప్రజలు ఆయన భక్తికి, ఆయన ద్వారా ప్రదర్శింపబడిన మహిమలకు ఆకర్షింపబడి, ఆయనను సేవించేవారని తెలుస్తోంది. ఆయన దేహం చాలించిన తరువాత ఆయన సమాధిపై నిర్మించిన దర్గా ఒకటి ఇప్పటికీ అక్కడి ప్రజలచే గౌరవింపబడుతోంది. ఇంతటి మహిమాన్వితమైన శైవక్షేత్రంలో పాదంమోపి, ఎలాగైనాసరే తమమతాన్ని ప్రజలలో వ్యాపింపజేసుకుందామని కొన్ని మిషనరీలవాళ్ళు ఎంతోకాలంగా ప్రయత్నిస్తూవచ్చారు. అలాంటి ప్రయత్నాలలో ఒకటి ఈమధ్యనే విఫలమైన వైనం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఒక మిషనరీకి చెందిన మతప్రచారకుడు ఒకాయన ఈగ్రామంపై కన్నువేసి, కొంతమంది యువకులను చేరదీశాడు. గ్రామంలో ఒక ఆస్పత్రి, పాఠశాల, వసతిగృహం, కమ్యూనిటీహాలు నిర్మిస్తామని, అవి స్థానికులకు ఎంతో ఉపయోగపడతాయనీ మాయమాటలు చెప్పాడు. పంచాయితీవారినుండి ఆరుసెంట్లస్థలం సంపాదించాడు. అక్కడొక కమ్యూనిటీహాలు కడుతున్నాం అని చెప్పి, ఒకభవనాన్ని నిర్మింపజేశాడు. 2002వ సంవత్సరం అక్టోబర్‌ 29వ తేదీన ఉదయం 7గంటలకు ప్రభువుతోపాటు అందులో ప్రవేశించుదాం అని చెప్పి, ముహూర్తం కూడా నిర్ణయించాడు. గ్రామంలోని పెద్దలకు అక్కడ సిద్ధమైనది కమ్యూనిటీహలు కాదనీ, చర్చిభవనమనీ తెలిసిపోయింది. ఎలాగైనా సరే అక్కడ బలవంతపు మతాంతరీకరణలు జరగకుండా ఆపాలని వారు నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ఉండే విశ్వహిందూపరిషత్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ వంటి సంస్థల కార్యకర్తలను సంప్రదించారు. వారంతా కలిసి ఆయ్రత్నాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ 28వ తేదీ రాత్రికే గ్రామస్థులంతా సమావేశమై, అన్యమతప్రవేశాన్ని అడ్డుకోవాలని ముక్తకంఠంతో తీర్మానించారు. 29వ తేదీ బ్రాహ్మీముహూర్తంలో గ్రామస్థులందరూ సీతారామలక్ష్మణహనుమల విగ్రహాలతో సిద్ధమైపోయారు. అమలాపురం నుండి కార్యకర్తలందరూ ఉదయం 5గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. మేళతాళాలతో దేవతావిగ్రహాలను ఊరేగించి, హరేరామహరేకృష్ణ, జైజైరామ జానకిరామ, జైశ్రీరాం అంటూ సరిగ్గా ఉదయం 6గంటలకు నూతనంగా నిర్మించిన భవనంలో ప్రవేశించి, దేవతావిగ్రహాలను ప్రతిష్ఠించి, భజనను కొనసాగించారు. మరో అరగంటలో 7గంటల ముహూర్తానికని శిలువతో అక్కడికి చేరుకున్న మతప్రచారకునికి మతిపోయినట్లయింది. కాసేపు అటూఇటూ తచ్చాడాడు. అందరూ ఆయనకేసి చూశారు గానీ, ఒక్కరూ పలుకరించలేదు. జైజైరామ జానకిరామ అంటూ మరింత గట్టిగా గ్రామస్థులు భజన చేస్తుంటే, పరిస్థితిని అర్థంచేసుకున్న ఆపెద్దమనిషి కిమ్మనకుండా కారువెనక్కి త్రిప్పుకుని పలాయనం చిత్తగించాడు.

ఈగ్రామం కథాకమామీషు

ఈవిధంగా మతాంతరీకరణను త్రిప్పికొట్టిన ఈపల్లెకు పెద్దచరిత్రే ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని అపహరించిన రావణాసురుని సంహరించి, అయోధ్యకు తిరిగివెడుతూ, సముద్రతీరానగల ఈప్రాంతంలో కొంతసేపు విశ్రమించాడట. బ్రాహ్మణుడైన రావణుని సంహరించడంవల్ల తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని బాధపడ్డాడట. పాపపరిహారార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని సంకల్పించాడట. అందుకు తగిన ముహూర్తాన్ని నిర్ణయించుకుని, ఆసమయానికి తిరిగివచ్చేలా కాశీనుండి శ్రేష్ఠమైన శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయస్వామిని ఆదేశించాడట. హనుమ శివలింగంతో తిరిగిరావటం ఆలస్యమైందట. ముహూర్తం మించిపోకూడదని రాములవారు ఆసముద్రతీరాన ఇసుకతోనే ఒక శివలింగాన్ని చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, తన సంకల్పం నెరవేర్చుకున్నాడట. ఇక్కడ ఈప్రతిష్ఠ జరుగుతుండగా ఆంజనేయస్వామి కాశీనుండి శివలిగాన్ని తీసుకువచ్చాడు. దానిని ఏమి చెయ్యాలి అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో ''ఈలింగాన్ని నీవు ఈగోదావరిపాయకు ఆవలివైపున ప్రతిష్ఠ చెయ్యి. ఈరెండు శివలింగాలలో ఒకటి నాపేరుతో శ్రీరామలింగేశ్వరస్వామిగాను, మరియొకటి నీపేరుతో లక్ష్మణేశ్వరస్వామిగాను ప్రసిద్ధికెక్కి, ప్రజలచే పూజింపబడతాయి. వారిపాలిట ఈరెండుక్షేత్రాలూ కల్పవృక్షాలవలె కోరికలు తీరుస్తూ, వారిని తరింపజేస్తాయి'' అని చెప్పాడట. ఆవిధంగా రాములవారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీరామలింగేశ్వరస్వామివారు పార్వతీసమేతంగా ఇప్పటికీ ఈప్రాంతప్రజలచే ఆరాధింపబడుతున్నారు. ఈఆలయం పశ్చిమముఖంగాను, లక్ష్మణేశ్వరస్వామి ఆలయం తూర్పుముఖంగాను ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండటం విశేషం. రాములవారు ఇక్కడ ఈప్రతిష్ఠ చేసిన సమయంలో నక్కలు కూశాయనీ, అందువల్ల ఈప్రాంతానికి నక్కారామేశ్వరం అనేఖ్యాతి వచ్చిందనీ ఇక్కడి పెద్దలు చెబుతారు. చాలాకాలం క్రితం ఇక్కడ కంచుతో నిర్మించిన ఆలయం ఉండేదనీ, అది సముద్రం పొంగిరావటంవల్ల కొట్టుకుపోయిందనీ, తరువాతికాలంలో ఇక్కడి ప్రజలు లింగప్రతిష్ఠ చేసి గుడి కట్టించుకున్నారనీ స్థానికులు చెబుతారు. పెద్దాపురం మహారాజులు ఈక్షేత్రమహిమను గురించి తెలుసుకుని ఈదేవుడికి మడిమాన్యాలు సమర్పించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పోయిన ఆస్తి పోగా, ఇప్పుడు స్వామివారిపేరున నలభయ్యెకరాల భూమి మిగిలింది. యాభైసంవత్సరాల క్రితంవరకు ఈఆలయంలో బంగారపు అమ్మవారి విగ్రహం, దేవుని ఊరేగింపుకు వాహనాలు ఉండేవిట. అయితే ఆలయానికి సరయిన రక్షణ లేకపోవటంవల్ల సమీపగ్రామమైన సామంతకుర్రు గ్రామస్తులు ఆవిగ్రహాన్నీ, వాహనాలనూ తమ ఊరి దేవాలయంలో భద్రపరుస్తామని చెప్పి తీసుకువెళ్ళారట. ఆనాటినుండి ఈనాటివరకూ అవి అక్కడే ఉన్నాయని ఈగ్రామప్రజలు చెబుతున్నారు.

శ్రీరామలింగేశ్వరస్వామి మహిమలు

గోదావరీ సంగమస్థానంలో నెలకొని ఉన్న ఈపార్వతీసమేత రామలింగేశ్వరస్వామివారి గురించి, వారి మహిమల గురించి ఎన్నెన్నో కథలూ, గాథలూ ప్రచారంలో ఉన్నాయి. చొల్లంగి అమావాస్యనాడు ఇక్కడ పెద్దతీర్థం జరుగుతుంది. పరిసరప్రాంతాలనుంచే గాక, సుదూరప్రాంతాలనుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. సముద్రస్నానం చేసి, శ్రీరామలింగేశ్వరస్వామిని సందర్శించి, ఫలపుష్పాలు సమర్పిస్తారు. సంతతిలేని దంపతులు ఇక్కడ సముద్రస్నానం చేసి, ఒకరాత్రి స్వామి సమక్షంలో నిద్రించి, గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తూ, స్వామిని సేవించుకుంటే తప్పకుండా వారికి పిల్లలు పుడతారట. అనారోగ్యంతో బాధపడేవారు తమకు స్వస్థత కలగాలని స్వామివారికి మ్రొక్కుకుంటే ఎలాంటివ్యాధులైనా తగ్గిపోతాయని, ఆతరువాత వారు వచ్చి, ఇక్కడ మ్రొక్కులు చెల్లించుకుంటారనీ తెలుస్తోంది. స్వామికి అర్చన చేసిన తీర్థజలాలు ఎంతోమహిమ గలవని, సర్వవ్యాధినివారకములని కూడా ప్రజల విశ్వాసం. శివరాత్రి పర్వదినమున, రధసప్తమినాడు ఇక్కడ విశేషపూజలు జరుగుతాయి. కార్తీకమాసంలో స్వామిని దర్శించి, అభిషేకాలు చేయించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

ఆలయపునరుద్ధరణ

అతిప్రాచీనమైన ఈశివాలయం శిధిలావస్థకు చేరుకోగా గ్రామపెద్దలు పూనుకుని 1982వ సంవత్సరంలో ఈఆలయానికి ప్రాకారం నిర్మింపజేశారు. వాస్తుశాస్త్రప్రకారం జరిగిన ఈప్రాకార నిర్మాణంవల్ల ఈఆలయానికి మంచిరోజులు వచ్చాయనే చెప్పాలి. 2004వ సంవత్సరంలో ఆలయపునఃప్రతిష్ఠ మహావైభవంగా జరిగింది. శిధిలమైన పానవట్టాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మార్చి, క్రొత్తవాటిని ప్రతిష్ఠించి, పూజలు జరిపించారు. శ్రీపుల్లేటికుర్తి పురుషోత్తమశర్మగారు ఈఆలయ ప్రధానార్చకులు. స్వామివారికి నిత్యపూజలు, మహానైవేద్యములు భక్తితో సమర్పిస్తూ, భక్తులకు పూజాదికములను జరిపిస్తున్నారు.

ప్రజల సహకారం

 . ఈఆలయమన్నా, శ్రీరామలింగేశ్వరస్వామివారన్నా వీరికి ఎంతో భక్తివిశ్వాసాలు ఉన్నాయి. తమకు ఏకష్టం వచ్చినా స్వామికి నివేదిస్తే గట్టెక్కుతామని వారందరూ నమ్ముతారు. సునామీలవంటి ప్రకృతిభీభత్సాలను కూడా తట్టుకుని నిలబడగలిగామంటే అంతా ఆస్వామిదయే అంటారు ఇక్కడి ప్రజలు. ఈమత్స్యకారులకు ఒక సహకారసంఘం ఉంది. అసంఘానికి అధ్యక్షులైన శ్రీఅంగాడి కాళీస్వామిగారు ఈఆలయవిశేషాలను సహృదయంతో తెలియజేశారు. గ్రామస్తులంతా కలసి ఈఆలయ అభివృద్ధికి ఒకలక్షా ఎనభైవేల రూపాయిలు విరాళాలుగా సేకరించామని, ప్రభుత్వంవారు తమవంతుగా మరొక నలభైవేలరూపాయిలు ఇచ్చారనీ, ఈమొత్తమంతా స్వామిపేరున బ్యాంకులో ఉన్నదని చెప్పారు. దీనిపై వచ్చే వడ్డీతో ఇక్కడి కార్యక్రమాలు నడుస్తున్నాయని, అంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు దేవాదాయశాఖవారి సహకారం లేకపోవటమే కారణమని కూడా ఆయన చెప్పారు.

చేయవలసిన సదుపాయాలు

ప్రసిద్ధమైన ఈశైవక్షేత్రానికి సరయిన ప్రయాణసదుపాయం లేకపోవటం పెద్ద లోపంగా ఉంది. అమలాపురం నుండి చల్లపల్లిమీదుగా సామంతకుర్రు వెళ్ళేందుకు ఒకటిరెండు ఆర్‌టిసి బస్సులు తిరుగుతున్నాయి గానీ, రోడ్డు పెద్దపెద్ద గోతులతో ప్రమాదభరితంగా ఉండటంవల్ల ప్రయాణీకులు అసౌకర్యానికి లోనవుతున్నారు. పాడయిన ఈమార్గాన్ని తక్షణమే బాగుచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భక్తులు మ్రొక్కులు చెల్లించుకోవటానికి వచ్చినప్పుడు విడిదిచేసేందుకు వసతిగృహాలు లేక చాలా ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి ఇక్కడ దూరప్రాంతాలనుండి వచ్చే భక్తులకోసం వసతిగృహాలు నిర్మించవలసి ఉంది. దేవుడి భూములను కొంతమంది స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించుకుని పక్కాభవనాలు నిర్మించుకున్నారు. ఆభవనాలను స్వామివారి ఆస్తిగా ప్రకటించి, స్వామివారికి దక్కేలా చెయ్యవలసి ఉంది.

కొమరగిరిపట్నంనుంచి గోదావరిపాయల మీదుగా ఈగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. గోదావరిపాయలపై వంతెనల నిర్మాణానికి జరిగిన ప్రయత్నం శంకుస్థాపన ఫలకాల వరకు వచ్చి ఆగిపోయింది. రాజకీయాలకు అతీతంగా ఈప్రయత్నాన్ని కొనసాగించి వంతెనలను నిర్మిస్తే, ఈగ్రామం మరింత అభివృద్ధికి నోచుకుంటుంది. అంతేకాక, దేవాలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈమార్గం ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. ఈఆలయానికి ఎదురుగా తూర్పుముఖంగా ఉండే శ్రీలక్ష్మణేశ్వరస్వామిని లక్ష్మణేశ్వరం వెళ్ళి సేవించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామికి సరయిన ఆవాసం కల్పించవలసి ఉంది. ఆస్తీ, ఆదాయమూ కూడా ఉన్న ఈపురాతన శైవక్షేత్రన్ని భక్తులందరికీ దర్శనీయమైన క్షేత్రంగా చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోనసీమప్రజలందరూ కోరుకుంటున్నారు.

శ్రీరాములవారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా చెప్పబడుతున్న ఈరామేశ్వరస్వామివారు తనప్రతిష్ఠకు కారకుడైన శ్రీరాములవారిని కూడా ఇక్కడ స్థాపించుకుని పూజింపవలసి ఉన్నది అనే సంకల్పాన్ని ఇక్కడి ప్రజల హృదయాలలో కలిగించి, శ్రీరామప్రతిష్ఠ తన భక్తులచే జరిపించటం విశేషం. ''శివస్యహృదయం విష్ణోః'' అని కదా అంటారు. వాస్తవానికి దైవం విషయంలో నామభేదమే తప్ప వస్తుభేదం ఉండదు.

మహేశ్వరే వా జగతామధీశ్వరే

జనార్దనే వా జగదన్తరాత్మని|

నవస్తుభేద ప్రతిపత్తిరస్తిమే

తథా-పి భక్తిస్తరుణేన్దుశేఖరే||

అని కదా ఆర్యోక్తి.క్రొత్తగా నిర్మించుకున్న శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో భక్తులు నిత్యపూజలు జరిపించడంతోపాటుగా, కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామి అయ్యప్పదీక్షలను చేపట్టి, పూజలు నిర్వహించడం విశేషం.
నక్కరామేశ్వరంఆలయ ముఖ మండపం

నక్కరామేశ్వరుడు
రామాలయం లోపల
ఇది రామాలయం[ ఇంతవిలువైన సమాచారం ఇచ్చిన మితృనునుండి వచ్చిన మెయిల్]
దుర్గేశ్వర గారు
నమస్కారములు.
నాపేరు .........కృష్ణ. నేను వెబ్ డిజైనింగ్ మరియు డి.టి.పి చేస్తూ ఉంటాను. నాకు సనాతనధర్మము అన్నా, సాంప్రదాయాలు అన్నా నాకు చాలా గౌరవం ఉంది. వాటిగురించి తెలుసుకోవడం మరియు వాటిని ప్రోత్సహించడం నాకు చాలా ఇష్టం నేను ప్రస్తుతం
ముంబాయి నగరంలో ఉంటున్నాను. మాది అసలు కోనసీమలోని అమలాపురం పట్టణము. మా తండ్రిగారు ........... కళాశాలలో తెలుగు విభాగాధిపతిగా పనిచేసి మూడు సంవత్సరములక్రిందట కాలం చేసినారు. ఆయన అధ్యాపకవృత్తితో పాటు, మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యగారి మార్గదర్శకత్వంలో ఉచిత హోమియో వైద్యసేవ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరియు రచనావ్యాసంగము చేసేవారు. ఆయన మహాభారంలో ద్రౌపది పాత్ర మీద పరిశోధన చేసి యాజ్ఞసేని అనే పుస్తకముగా వెలువరించారు.
ఆయన అడుగుజాడలలోనే మాకుటుంబసభ్యులమంతా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యగారా మార్గదర్శకత్వంలో నడుస్తున్నాము. నేను శారీరకవైకల్యం కలవాడిని అయినప్పటికీ ఢి.టి.పి, మరియు వెబ్ డిజైనింగ్ నేర్చుకుని పనిచేసుకుంటున్నాను. మా తండ్రిగారి ఆశీస్సులవల్ల నాకు ఆధ్యాత్మిక చింతన, పూజలు పునస్కారాల పట్ల నమ్మకం, క్రమశిక్షణ అలవడ్డాయి.
మీబ్లాగు తరచుగా చూడటమే గాని ఇంతవరకు కామెంట్ ఇవ్వలేదు. మొదటిసారిగా మీరు రాసిన ధర్మం పైన అభిమానమే కాదు ధర్మనిష్ఠ ఉన్నదా మనకు? అనే వ్యాసం చూసి కామెంట్ రాస్తున్నాను. మీరు మనకు మనధర్మం పట్ల అభిమానం మాత్రమే ఉంటోంది కానీ ఆధర్మం పట్ల నిష్ఠ ఉండటం లేదని, మనధర్మాన్ని విమర్శిస్తే మనం మౌనంగా ఉండిపోతున్నామని, వేరే ధర్మాలను మనం విమర్శిస్తే తీవ్రపరిణామాలను ఎదుర్కొనవలసివస్తుందని ఆవేదనను ఈవ్యాసంలో వెలిబుచ్చారు. నిజమే నీతల్లినో, నీబిడ్డనో పదిమందిలో నీవే చులకనచేస్తూ మాట్లాడితే ఆపదిమంది కూడా లోకువ చేస్తారు కదా. ఎవడైనా మనవాళ్ళను మనధర్మం నుంచివేరుచేయటానికి చేసే కార్యక్రమంలో భాగంగా కానుకలు, ధనం ఆశ చూపటంవంటివి నాకు కొన్ని తెలుసు. మా ఊళ్ళో మాతండ్రిగారి దగ్గరకు వైద్యానికి వచ్చే పనిపాటలు చేసుకునేవారు ఎక్కువగా క్రిస్టియానిటీకి ఆకర్షితులయ్యేవారు. వారు నియమానుసారం దేవాలయాలకు వెళ్ళకపోయినా చర్చికి మాత్రం వెళ్ళేవారు. ఆవిషయం గురించి వాళ్ళను నియమానుసారం దేవాలయానికి వెళ్ళకుండా చర్చికే ఎందుకు వెడతారు అని అడిగితే మాకు వాళ్ళు మాఅవసరాలకు పండుగలుపబ్బాల పేరుతో కానుకలు, డబ్బు ఇస్తున్నారు. మరి దేవాలయానికి వెడితే ఇస్తారా అని అడిగారు. దాంతో మాకు ఏమి చెప్పాలో తెలియక ఊరుకున్నాము. అలాగే మాఊరిలోని రామకృష్ష సమితివారు కార్యక్రమం పెట్టాము రండి అని పిలిస్తే ఒక్కరూ రారు నిర్వహించేవారు తప్ప. చర్చివారు ఏదైనా కార్యక్రమం చేస్తే పిలవకపోయినా వెడతారు కానుకలు, డబ్బు వస్తాయని. వెళ్ళకపోతే రావుగా మరి. అంతేకాకుండా రోగాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని నాలుగు ఆదివారాలు రండి ప్రార్థనలు చేసి కొబ్బరినూనె ఇస్తాం, దాంతో మీసమస్యలు పరిష్కారమైపోతాయ్ లాంటి ప్రచారాలు కూడా. ఇలాంటి విషయాలవల్ల మనధర్మం ఎంత పలచనైపోతోందో కదా. మీలాంటివారే ఈవిషయంలో ఏదైనా పరిష్కారం ఆలోచించాలి.
కానీ ఇలాంటి ధర్మవ్యతిరేకమైన విషయాలను పట్లించుకోకుండా ధర్మంపట్ల నిష్ఠ, నిబద్ధత చూపి ఒక గ్రామం గురించి మాకు తెలుసు. ఆగ్రామం గురించి హరేఈశ! హరేరామ! హరేక్రీస్తు! హరే హరే!! అనే పేరుతో భక్తిప్రపంచం మాసపత్రిక జూన్ 2007 సంచికలో ఒక వ్యాసం కూడా రాసారు. ఆవ్యాసాన్ని, ఆయన ఆగ్రామాన్న సందర్శించినప్పుడు తీసిన ఫొటోలను పంపుతున్నాను. మాకు ఆగ్రామాన్ని చూసాక మనధర్మం ఎన్ని వ్యతిరేతలు వచ్చినా ఇలాంటి సంఘటనలవల్ల ఇంకా సురక్షితంగా ఇంది అనిపించింది. భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్పిన యథాయథాహి ధర్మస్య_____ అనేది అక్షరసత్యం. దానికి ఉదాహరణలే భగవాన్ శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, రమణమహర్షి, కంచిపరమాచార్చ చంద్రశేఖరేంద్ర సరస్వతి, మాస్టర్ ఇకె లాంటి వారే కదా!
నమస్కారాలతో
(నోట్: నాయొక్క ఈ కామెంటును నలుగురికి తెలియజేయదలచిన యెడల నాపేరు మరియు మాతండ్రిగారి వివరాలు వాడవద్దని మనవి)
Mandapam-Nakka-Rameswaram.jpgMandapam-Nakka-Rameswaram.jpg
1481K View Download
Ramalayam-inside1-Nakka-Ram.jpgRamalayam-inside1-Nakka-Ram.jpg
1181K View Download
Ramalayam-inside2-Nakka-Ram.jpgRamalayam-inside2-Nakka-Ram.jpg
1140K View Download
Ramalayam-inside-Nakka-Rame.jpgRamalayam-inside-Nakka-Rame.jpg
1255K View Download
Ramalayam-Nakka-Rameswaram.jpgRamalayam-Nakka-Rameswaram.jpg
1534K View Download
Rameswarudu1-Nakka-Rameswar.jpgRameswarudu1-Nakka-Rameswar.jpg
1196K View Download
Rameswarudu--&-Parvati1-Nak.jpgRameswarudu--&-Parvati1-Nak.jpg
1433K View Download
Rameswarudu--&-Parvati-Nakk.jpgRameswarudu--&-Parvati-Nakk.jpg
215K View Download
Rameswarudu-Nakka-Rameswara.jpgRameswarudu-Nakka-Rameswara.jpg
806K View Download


Reply

Forward

Ramakrishna is not available to chat


4 వ్యాఖ్యలు:

veera murthy (satya) February 18, 2011 at 3:38 AM  

chakkani post ni andinchaaru ...dhanyavaadaalu

shiva February 25, 2016 at 2:09 AM  

I need more information can i have your email address or contact information

Kommireddi Pavan December 1, 2016 at 11:15 PM  

చక్కటి సమాచారము అందించినందుకు ధన్యవాదములు..
ఈసారి అమలాపురం వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్సిస్తాము..

శ్యామలీయం December 2, 2016 at 7:29 AM  

ఈ సమాచార‌ం‌ చాలా ఆనందం‌ కలిగించింది.
బ్లాగర్లము అందరమూ కాకపోయినా ఆసక్తి ఉన్న కొందరమైన ఉడుతాభక్తిగా ఆ రామాలయానికి అర్థికసహాయం చేయటం‌ బాగుంటుందని అభిప్రాయ పడుతున్నాను. మరికొన్ని సదుపాయాలైనా దైవమందిరానికి అమరేటట్లు చేయటం మంచిదే కదా.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP