శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శరన్నవరాత్రి ఉత్సవములు

>> Sunday, October 3, 2021
శరన్నవరాత్రి ఉత్సవములు
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం   రవ్వవరం


7.10.2021 ఆశ్వీయుజ శుద్ధ       పాఢ్యమి నుండి   15.10.2021   విజయదశమి వరకు.

ప్రతిరోజు  సుప్రభాత సేవ.బాల భోగం. శ్రీసూక్త. పురుషుసూక్త రుద్రసూక్త విధిగా  అభిషేకములు .
అలంకరణ.పుష్ప.కుంకుమార్చనలు
లలితా సహస్ర నామపారాయణములు.హోమములు
మహానైవేద్యములు నివేదన హారతి.      సంధ్యాకాల హారతులు.  నామసంకీర్తన   ఊ0జల్ సేవ మహాహారతి
అమ్మవారికి సమర్పించబడును.
విజయ దశమి రోజున పూర్ణాహుతి

అన్నప్రసాద వితరణ 


                              పీఠ ప్రధాన సేవకుడు
.                                 దుర్గేశ్వర
                              వివరములకు

                  Durgeswara@gmail.com
                   Durgeswara.blogspot.in
                          9948235641Read more...

వినాయక చవితి శుభాకాంక్షలు

>> Thursday, September 9, 2021


మహాగణపతిమ్ మనసాస్మరామి. 

మహాగణపతి కరుణవలన మీ జీవితాన విఘ్నములన్నీ తొలగి  విజయత్సాహములు ,వైభవోపేతములతో విలసిల్లాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు 

Read more...

మంగళా దేవి కరుణ

>> Thursday, August 12, 2021

🌼🌿కర్ణాటక లోని కన్నూరు గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తుండేది. ఆ కుటుంబ పెద్ద శివరామకృష్ణ హెగ్డే, ఆయన భార్య మీనాక్షి. వారికి పెళ్లై 15 సంవత్సరాలు దాటినా సంతానం కలుగలేదు. ఎన్నో వ్రతాలు , నోములుచేసారు నోచారు, ఎన్నో తీర్ధయాత్రలు చేసి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు కానీ సంతానం కలుగపోయేసరికి ఎంతో నిరాశకు గురయ్యారు. కానీ వారెప్పుడూ దైవాన్ని దుషించలేదు. వారి ప్రారబ్ధం అలా ఉన్నదనుకుని సర్దిచెప్పుకునేవారు. ఒకరోజు శివరామకృష్ణ ఏదో అత్యవసరమైన పని మీద పొరుగూరు వెళ్ళలని చెప్పాడు. అది శ్రావణ మాసం, వర్షాకాలం అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది.పైగా రేపు మంగళ వారము,మంగళ గౌరీ పూజ ఉన్నది,మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పింది మీనాక్షి. అలానే అని చెప్పి, దేవునిపై భారం వేసి, భార్యను జాగ్రత్తగా ఉండమని చెప్పి తను బయల్దేరాడు.

తను వెళ్ళిన కాసేపటికే ఆకాశం మేఘావృతమై భోరున వర్షం కురవడం మొదలయ్యింది. చిమ్మ చీకటి ఆవరించింది. బయట ఒకటే కుండపోత. వారిది పెంకుటిల్లు, ఇంట్లోకి వర్షం చినుకులు కారడం మొదలయ్యింది. మీనాక్షికి ఎంతో భయం వేసి భగవంతుడిని ప్రార్ధించ సాగింది. అంతలోనే తలుపు తడుతున్న శబ్దము వినిపించింది. ఆ సమయంలో ఎవరయ్యుంటారు,ఒకవేళ తన భర్త తిరిగి వచ్చాడేమో అనుకుని వెళ్ళి తలుపు తీసి చూసింది. మొదటగా సుగంధ పరిమళాల గుబాళింపు, సాంబ్రాణి ధూపం వేసినట్లు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది. నిదానంగా ఆ పొగ తరిగిపోయి ఎదురుగా చేతిలో ఒక దీపం పట్టుకుని ఒక పండు ముత్తైదువ నిలబడి ఉంది. తెల్లటి జుట్టుతో,ఎర్రని చీర కట్టుకుని, పెద్ద రూపాయి బిళ్ళంత ఎర్రని బొట్టు నుదిటిన పెట్టుకుని, కనకాంబరం పూలు పెట్టుకుని, ముఖమంతా పసుపు రాసిన ఛాయతో కళగా ఉంది.

ఎవరమ్మా నువ్వు అని అడిగింది మీనాక్షి, " నేను మీకు దూరపు బంధువును అవుతాను, మీ ఆయనకు నేను బాగా తెలుసు, మాది మంగళూరు అని సమాధానం చెప్పింది ఆ పెద్దావిడ. లోపలకి రామ్మా అంటు పిలిచింది మీనాక్షి, ఆ పెద్దావిడ లోపలికి వచ్చింది. పైకప్పు నుండి వర్షపు చినుకులు పడుతుడడం వలన ఇల్లంతా తడిగా ఉంది. అక్కడే కూర్చున్నారు ఇద్దరు, నేను మిమ్మల్ని ఎరుగను, మావారు కూడా ఎప్పుడ్డూ వాళ్ళ బంధువులను గిరించి నాతో చెప్పలేదు, మీరు ఏ విధంగా మాకు బంధువులు అవుతారో చెప్పమ్మా అని అడిగింది మీనాక్షి. నీ భర్త నీతో చెప్పి ఉండకపోవచ్చు కానీ వాడు నన్ను రోజూ తలచుకుంటాడు. నీక్కూడా నేనెవరో తెలుస్తుందిలే అనింది. అంతలోనే పెద్ద పిడుగు దగ్గరలోనే పడిన పెద్ద చప్పుడయ్యింది.

కంగారు పడకు నేనున్నాను కదా అనింది ఆ పెద్దావిడ. మీనాక్షి కాస్త ధైర్యం తెచ్చుకున్నది, పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నన్ను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే మొదటిసారి అన్నది. అందుకేగా నేనొచ్చాను అన్నది ఆవిడ. వినడానికి వింతగా అనిపిస్తున్నాయి ఆవిడ మాటలు,చేష్టలు. బాగా పొద్దుపోయింది, ఇక నిద్రపో రేపు గౌరీ పూజ చేసుకోవలిగా అనింది ఆ పెద్దావిడ. అవునవును బోలెడంత పనుంది,కానీ నిద్ర పట్టడం లేదమ్మా, భయంగా ఉంది అని చెప్పింది మీనాక్షి. భయపడకు నా వొళ్ళో తలపెట్టుకుని పడుకో,నేనెలాగూ మెలకువగానే ఉంటాను, నీకే భయము అక్కర్లేదు అని చెప్పింది ఆవిడ. అలా పడుకుని నిద్రలోకి జారిపోయింది మీనాక్షి, తెల్లారుతూనే మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పెద్దావిడ వొళ్లోనే పడుకుని ఉంది అని తెలిసింది. అయ్యో ఎంత పని చేసాను , రాత్రంతా నీ వొళ్లోనే పడుకున్దిపోయాను, నిన్నూ నిద్రపోనివ్వలేదే అంటుండగానే, నేను నిద్రపోతే ఎలా ? సరే వెళ్ళి నీ పనులు చేసుకో పూజకు వేళవుతోంది అని చెప్పింది ఆవిడ.

మీనాక్షి చకచకా పనులన్నీ పూర్తి చేసి పూజ ప్రారంభించేముందు ఆవిడ వంక చూసింది. నీవు తయారయ్యావు నన్ను తయారుచేయవా అని అడిగింది ఆ పెద్దావిడ. ఈరోజు మంగళవారము, ఈవిడలోనే ఆ మంగళ గౌరీ దేవి ఉండచ్చు కదా అనుకుని, నలుగు పెట్టి స్నానం చేయించింది. ఆవిడ కట్టుకోవడానికి తనకోసం కొనుక్కున కొన్న కొత్త చీరను ఇచ్చింది మీనాక్షి. కొత్త చీరను కట్టుకుని మీనక్షితో పాటూ పూజ చేయడానికి కూర్చుంది ఆ పెద్దావిడ. పుజంతా పూర్తయ్యాక వాయనం పుచ్చుకుని భోంచేసి తాంబూలం తీసుకుని బయల్దేరింది ఆ పెద్దావిడ.

కాసేపటికి శివరామకృష్ణ వచ్చి ఆలస్యం అయ్యింది, రాత్రంతా కంగారు పడ్డావా, పూజ చేసావా అని హడావిడిగా అడిగాడు. మీరు నిదానంగా కుర్చుని చెప్పేది వినండి. నిన్న సాయంత్రం మీ బంధువులోకరు పెద్దావిడ మంగళూరు నుండి వచ్చింది. రాత్రంతా ఇక్కడే ఉంది, పొద్దున్న పూజ చేసుకుని,వాయన తాంబూలాలు తీసుకుని వెళ్ళింది అని చెప్పింది. మా బంధువులు ఎవరూ మంగళూరులో లేరే, ఎవరయ్యుంటారు అని ఆలోచిస్తుండగా అప్పుడు మదిలో మెదిలింది, మన ఇంటికి వచ్చింది మరెవరో కాదు ఆ మంగళా దేవే, మా పూర్వీకులు మంగళా దేవి భక్తులు. ఆవిడే వచ్చింది అని చెప్పగానే మీనాక్షి ఒళ్ళు గగురుపోడిచింది, ఆనందబాష్పాలు రాలాయి. ఇద్దరూ ఎంతో సంతోషించారు. మనము మంగళూరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నారు.

మంగళూరు వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకోగానే అక్కడ అమ్మవారికి మీనాక్షి పెట్టిన చీరే కట్టి ఉంది. ఇద్దరూ ఎంతో ఆశ్చర్యపోయి, అమ్మవారు చూపిన అసామాన్య ప్రేమకు ఆనందబాష్పాలు రాల్చారు. ఆ రాత్రి వారు ఆలయం ఆవరణ లోనే నిద్ర చేసారు. వారిద్దరికీ ఒకే స్వప్నం వచ్చింది అందులో ఆ పెద్దావిడ కనిపించి తానే మంగళా దేవి అని చెప్పి, వారికి త్వరలోనే ఒక పుత్రిక జన్మిస్తుంది అని చెప్పి, మీకు ప్రసాదంగా ఈ అరటి పండు తీసుకోండి అని చెప్పి అంతర్ధానం అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి వారి ప్రక్కనే ఒక అరటి పండు ఉంది, అది ప్రసాదంగా స్వీకరించారు ఇద్దరూ, మరల అమ్మవారి దర్శనానికి వెళ్ళగా, ఆ ఆలయ అర్చకుడు మీనాక్షి చీరను ఇచ్చి, అమ్మవారు స్వప్నంలో కనిపించి ఈ చీర మీకు ఇవ్వమని చెప్పింది అని చెప్పాడు. వారి ఆనందానికి అవధులు లేవు. అమ్మవారి అనుగ్రాహన వారికి ఒక శుభ దినాన సుపుత్రిక జన్మించింది. ఆ పుత్రికకు
" సర్వ మంగళ " అని పెట్టారు. ఈ లీలను కన్నడ దేశంలోని మంగళూరు ప్రాంతంలో శ్రావణ మాసంలో చెప్పుకుంటారట. ఇటువంటి అనుగ్రహ లీలలు నమ్మి కొలిచే భక్తుల జీవితాలలో లెక్క పెట్టలేనన్ని కలవు. మనకు అమ్మ అనుగ్రహం ఉంటే వాటిలో కొన్నైనా తెలుసుకునే భాగ్యం కలుగుతుంది, వాటిని నమ్మి అంతటి భక్తి శ్రద్ధ నమ్మకం కలిగి ఉంటే మన జీవితాలలోనూ ఇటువంటివి అనేకము జరుగుతూనే ఉంటాయి.

నమ్మి కొలిస్తే అమ్మ పలుకకుండా ఉంటుందా ...

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే

🌼🌿అందరికీ ఆ మంగళ దేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ.....
                         
🌼🌿ఓం శ్రీ మంగళా దేవ్యే నమః🌼🌿🙏

Read more...

కరోనా కూల్చలేని బలమైన తులసి కోట

>> Tuesday, August 3, 2021

కరోనా కూల్చలేని బలమైన తులసికోట!

చనిపోయే వారికి తులసి తీర్థం ఎందుకుపోస్తారు?
అతిముఖ్యమైన రోగనిరోధకశక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ఎక్కడ ఉంది?

కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోవడం తప్పు కాదు. ఎందుకంటే వాటి సమాధానాలు మహారహస్యాలు అయినప్పుడు, ఆ సత్యాలు తెలిస్తే తమ మనుగడకే ముప్పు అయినప్పుడు మహారాక్షసులు ఆ అక్షరసత్యాలను భూస్థాపితం చేస్తారు. అలా పాతిపెట్టిన రహస్యాల్లో ఈ రెండు ప్రశ్నలూ ఉదాహరణ మాత్రమే. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే భారతీయులను ఎవరు అజ్ఞానంలో ముంచివేసి తమపబ్బం గడుపుకుంటున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.

గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు అష్టాదశమహాపురాణాలు అనువదిస్తూ శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతిఖండం తెలుగు చేశారు. ఈ ఖండం చాలా ప్రధానమైంది. అనంతసాహితికి కీలకమైన పితృదేవతారహస్య ప్రచారంలో అతిముఖ్యమైన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక స్వధా మాత జన్మరహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటుగా మహాసాధ్వి తులసీదేవి మాహాత్మ్యం కూడా ఇందులో ఉంది. ఈ భాగాలు అనువదిస్తూ ఆంధ్రవ్యాసులవారు ఎన్నో రహస్యాలు చెప్పారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా విజృంభిస్తున్న నేటి తరుణంలో ఎవరు అదృష్టవంతులు అంటే   తిప్పతీగ నుంచీ తయారు చేసే  గిల్లోయ్ ఘనవతి, అశ్వగంధ కాప్యూల్స్ (లేదా చూర్ణం), నువ్వుల నూనె (లేదా తినే కొబ్బరినూనె), తాంబూలం వేసుకునేవారు, ఆయిల్ పుల్లింగ్ చేసేవారు. వీరంతా అదృష్టవంతులు అయితే వీరిలో మహాదృష్టవంతులు తులసీమాతను సేవించేవారు.  ఎందుకంటే కరోనా కాలంలో చాలా మందికి తెలియని రహస్యం ఒకటుంది. 

గత ఏప్రెల్ మొదటి రోజునుంచీ తులసీ ఘనవటి దొరకటం లేదు. ముఖ్యంగా పతంజలి సంస్థ ఉత్పత్తుల్లో తులసీ ఘనవతి నేటికీ ఔట్ ఆఫ్ స్టాకే అవుతోంది. కేవలం పతంజలి మాత్రమే కాక శ్రీశ్రీ, డాబర్, బైద్యనాథ్, జండూ, హిమాలయ వంటి కంపెనీల నుంచీ కూడా తులసి ఉండే మందులు గత మూడు నెలలుగా దొరికిన వారిది పండుగ. దొరకని వారు దురదృష్టంతులు. ఇది కేవలం ఆయుర్వేద ప్రేమికులకు మాత్రమే తెలిసిన సంగతి. ముఖ్యంగా ఉత్తరాదిలో డేగల్లా తులసీ వస్తువులు ఎగరేసుకుపోతున్నారు. 

తెలుగు వారికి పరిచయం లేని ఆయుర్వేద తులసి గురించి గురుదేవుల అనుగ్రహభాషణాల నుంచీ తెలుసుకుందాం.

ఆయుర్వేదం వైద్య విధానంలో అతి ప్రధానమైంది ఓజస్సును పెంపుదల చేయడం. ఈ వైద్యరహస్యం నేటికీ ఆంగ్లవైద్యులకు తెలియదు. అందరికీ రోగనిరోధక శక్తి గురించి తెలుసు. కానీ ఈ శక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే కర్మాగారం ఎక్కడ ఉందో అల్లోపతి వారికి తెలియదు. శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేసేదే ఓజస్సు. ఆయుర్వేదం ఈ ఓజస్సు అనే అణువిద్యుత్తుకర్మాగారంలో సమిధలు వేయడం ద్వారా వ్యాథులను అంతం చేస్తుంది. అంటే శరీరంలో ఓజస్సును పెంచితే, అది రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. ఈ రోగనిరోధక శక్తి వ్యాథులతో పోరాడి వాటిని శరీరం నుంచీ పారదోలుతుంది. ఈ రహస్యం నేటికీ ఆయుర్వేదం దగ్గర మాత్రమే ఉంది. 

దీన్నే ఆయుర్వేద గ్రంథాలు ఈ విధంగా చెప్పాయి.

తేజోయత్సర్వంధాతూనామోజస్తత్ పరముచ్యతే
మృదు సోమాత్మకం శుద్ధం రక్తమీషత్సపీకమ్
యత్సారమాదౌ గర్భస్య యచ్చ గర్భరసాద్రసః
సంవర్తమానం హృదయం సమాశ్రయతి యత్పురా
ఓజస్తు తేజో ధాతూనాం శుక్రాంతానాం పరం స్మృతం
హృదయస్థమపి వ్యాపి దేహస్థితినిబంధనమ్
న్నిగ్ధం సోమాత్మకం శుద్ధమీషల్లోహితపీతకమ్
యన్నాశే నియతం నాశో యస్మిం స్తిష్ఠతి తిష్ఠతి
నిష్పద్యం తె యతో భావా వివిధా దేహసంశ్రయాః
ఓజః క్షియేత కోపక్షుద్ధ్యానశోకశ్రమాదిభిః
బిభేతి దుర్బలో2భీక్ష్ణం ధ్యాయతి వ్యథితేంద్రియః
విచ్ఛాయో దుర్మనా రూక్షో భవేత్ క్షామశ్చ తత్క్షయే
జీవనీయౌషధక్షీరరసాద్యాస్తత్ర భేషజమ్
ఓజోవివృద్ధౌ దేహస్య తుష్టిపుష్టిబలోదయః

(శరీరంలో ఉన్న అన్నిధాతువులకూ మూలం ఓజస్సు, ఇది చాలా ఉత్తమమైనది. చాలా మృదువైనది. నీటి తత్త్వం ఉన్నది. పరిశుద్ధమైనది. ఎరుపు పసుపు మిశ్రమ రంగులో ఉంటుంది. గర్భంలో శుక్రశోణితాల కలయికతో ఏర్పడే మొదటికణం జీవికి ప్రధానమైనది. అంటే స్త్రీ అండం, పురుష వీర్యం ఫలదీకరణం చెందిన తరువాత ఏర్పడిన పిండకణంలో కూడా ఈ ఓజస్సు ఉంటుంది. అప్పటి నుంచీ ఇదే హృదయంగా (కేంద్రంగా) ఉంటుంది.  ఇదే శరీరంలోని అనేక అంగాలను, భాగాలను ఏర్పరస్తుంది. కనుక శరీరం మొత్తం ఆవరించి, దీని అదుపులో ఉంటుంది. దీని ద్వారానే శరీరం మొత్తం పనిచేస్తుంది. ప్రాణ శక్తి మొత్తం ఈ ద్రవపదార్థం మీదే ఆధారపడి ఉంటుంది. 

శరీరంలో ఓజస్సు నష్టం అయ్యే కొద్దీ కోపం పెరుగుతుంది. ఆకలిలో తేడాలు వస్తాయి. ధ్యానం చేయలేరు. దుఃఖం పెరుగుతుంది. శరీరం తొందరగా అలసిపోతుంది. ఎక్కవగా భయం ఏర్పడుతుంది. ఇంద్రియాలు అదుపులో ఉండవు. ఫలితంగా మానసిక వ్యథ పెరుగుతుంది. డిప్రషన్ లోకి వెళిపోతారు. శరీరం కాంతి రహితం అవుతుంది. 

ఈ ఓజస్సును పరిరక్షించేవి, వృద్ధి చేసే పదార్థాలను తీసుకోవాలి. ఇది ఔషథాల ద్వారా పెరుగుతుంది. తీపి పదార్థాలతో పెరుగుతుంది. పాలలో ఉంటుంది. మాంసకృత్తులలో ఉంటుంది. నెయ్యిమొదలైన వాటిలో ఉంటుంది. 

పై వస్తువులను సేవించడం వలన మరలా శరీరంలో సంతోషం, బలం, ధాతుపుష్టి పెరుగుతాయి. వీర్యవంతులు అవుతారు.)

ఆయుర్వేదం శరీరానికి కీలకమైన ఓజస్సును కనుగొంది. నేటికీ ఆంగ్ల వైద్యం దీన్ని సాధించలేదు. కనుకనే రోగి చెప్పే ప్రతీ లక్షణానికి ఒక మందు చొప్పున వేస్తూ క్వింటాళ్ళ కొద్దీ తినిపిస్తుంది. ఈవిధంగా వారు ఇచ్చే మందులు మింగి హరాయించుకోలేక మైఖేల్ జాక్సన్ అనే డాన్సర్ చనిపోయాడు. అతని శవాన్ని పరీక్షిస్తే జీర్ణం కాని అనేక మందుబిళ్ళలు కనిపించాయి. 

నేటికీ లక్షణాలకు వైద్యం చేస్తూ ఆంగ్ల వైద్యం కారణాన్ని చేరుకోలేదు. దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా ఆయుర్వేదం శరీరంలో రోగనిరోధక శక్తిని కల్పించే పవర్ హౌస్ను పనిచేయించే మందులు కనిపెట్టింది.

ఇటువంటి మందులు ఆయుర్వేదంలో చాలా కీలకం.

అవే అశ్వగంధ, అమృతం అనిపిలిచే తిప్పతీగ, ఉసిరి వంటివి. వీటికి తోడుగా మరో మహిమాన్వితమైన మూలిక ఉంది. అదే తులసి. ఆధ్యాత్మికంగా కూడా తులసికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయుర్వేదంలో కూడా తులసికి అంతే ప్రాధాన్యత ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం అనే జీవ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన యురేనియం వంటిది తులసి.

నిజానికి మరణించేవాని నోట్లో తులసి తీర్థం పోయడం అంటే నాలుగు చేతుల వాడిని చేర్చే ద్రవం కాదు. రోగి శరీరంలో ప్రాణవాయువులను కూడా పనిచేయించే ఓజశ్శక్తిని తిరిగి ప్రజ్వలింప చేసేటటువంటి జలకర్మ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గుండె ఆగిపోయిన వ్యక్తికి ఆధునిక వైద్యులు ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్ వంటిది. ఈ విధంగా తులసి తీర్థం పోయడం వలన కొట్టుమిట్టాడుతున్న కొనప్రాణదీపంలో మరలా నూనె పోసి వత్తిపెద్దది చేయడం వంటిది. దీన్నే దింపుడు కళ్ళం ఆశ అంటారు. దీనితరువాత కూడా రోగి కోలుకోపోతే అతడు మృతుడైనట్టు లెక్క.

చాలా ఆశ్చర్యమేమంటే తులసిలోని ఈ పవర్ హౌస్ లక్షణాలు ఆధునిక వైద్యలు గ్రహించారు. అయితే ఇది బయటికి చెబితే తమ వైద్యవ్యభిచారం బయటపడుతుందని నొక్కిపెడుతున్నారు. ఆధునిక పరిభాషలో   ఎడాప్టోజెన్స్ పేరుతో కొందరు  తులసి, ఉసిరి, తిప్పతీగ వంటివాటి మీద పరిశోధనలు చేస్తున్నారు. అయితే వీరు అత్యంత ప్రమాదకారులు. ఎందుకంటే వీరు రేపు పసుపు మాదిరిగా తులసి, ఉసిరి కూడా మావే అని దోపిడీ లైసెన్సులు పొందుతారు. వీటి మీద మందులు చేయరాదని శాసిస్తారు. 

తులసిని సేవించడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

మార్చి నెల నుంచీ మేము అనేక మందిని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు, సైనికులు, పారిశుధ్య కార్మికులు, వైద్యులు, వైద్యసిబ్బంది, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, డ్రైవర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు. ఇలా ఎన్నో వర్గాల వారిని పరిశీలించాము. వీరందరిలో మానసికంగా ఒక భయం గుర్తించడం జరిగింది. ఇది మానసిక వత్తిడి వల్ల కలుగుతున్న భయం. దీన్ని మానసిక శాస్త్రంలో అనేక విధాలుగా విశ్లేషించినా సూక్ష్మంగా చెప్పాలంటే కరోనా భయంవల్ల వచ్చిందని చెప్పవచ్చు. కరోనా భయం వల్ల వస్తున్న మానసిక సమస్యలు. 

ఇటువంటి వారిలో సి క్లాసు ఉద్యోగులు నిర్భయంగా ఉంటున్నారు. హాయిగా పనిచేస్తున్నారు. సాయంత్రానికి స్వర్గం చేరుకుంటున్నారు. కానీ మధ్యతరగతి ఎగువ తరగతి ఉద్యోగులు ఈ విధమైన మానసిక నరకయాతన పడుతున్నారు. వీరికి అతి తేలిక పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది. అది తులసి నుంచీ లభిస్తుంది.

పైన చెప్పిన ఉద్యోగులు తమ వద్ద ఎప్పుడూ పదో ఇరవయ్యో తులసీ దళాలు ఉంచుకోవాలి. వీటిలో కొన్నింటిని వాటర్ బాటిల్లో నలిపి వేసి ఉంచుకోవాలి. మరికొన్నింటిని చిన్న భరిణలోనో జిప్ప్డ్ ప్లాస్టిక్ చిన్న కవర్ లోనో పెట్టుకోవాలి. తాము తాగే టీలో వాటిని వేసుకోవాలి. అన్నంతిన్నతరువాత, టిఫెన్ చేసినప్పుడూ మౌత్ రిఫ్రషర్గా ఒక తులసీదళం నోట్లో వేసుకోవాలి. 

గృహిణులు కూడా నీటిలో ఈ తులసీదళాలు వేసి ఉంచుకోవాలి. ఇలా చేయాలంటే తులసికోటల సంఖ్య పెంచుకోవాలి. నిర్ణీత ప్రమాణాన్ని మించి మొక్కల నుంచీ తులసి తుంచకూడదు. కుటుంబ సభ్యులు అందరినీ తరచుగా తులసి ఉన్న నీటిని తీసుకునేలా చేయాలి. దీని వల్ల ప్రధానంగా మానసిక సమస్యల నుంచీ దూరం అవుతారు. అందువల్ల ఇతర సమస్యలు రావు. 

ఈ చిట్కాలు ఆయుర్వేదం చెప్పిందని భారతప్రభుత్వ ప్రత్యామ్నాయ వైద్యాభివృద్ధి సంస్థ బుద్ధి ఉన్నరోజుల్లో చెప్పింది. (ఇప్పుడు బుద్ధిలేని దయింది.)

దీనికి ప్రత్యేకమైన కారణాలు చాలా ఉన్నాయి. 

తులసి అద్భుతమైన స్ట్రెస్ రిలీవర్. మానసిక వత్తిడిని క్షణంలో దూరం చేస్తుంది. అజీర్ణతను నిరోధించి ఆహారం జీర్ణం అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ విధంగా చెప్పుకొంటూ పోతే ఒక పుస్తకం చాలదు. మహా ఉద్గ్రంథాలు వ్రాయాల్సి వస్తుంది. కనుక క్లుప్తంగా చెప్పాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిపెంచి, రక్త మాంస ఎముక మూలుగు చర్మ కేశాది సమస్తధాతువుల చేతా పనిచేయించే పవర్ హౌస్ ఓజోస్సును క్షణంలో పెంచుతుంది.

కనుక నిన్నమొన్నటి వరకూ అమ్మానాన్నలు తాతమామ్మలు తిడతారని  తులసిమొక్కను కోటలో కాకుండా విరిగిపోయిన ప్లాస్టిక్ పాత్రల్లో పెంచినవాటిని  విరివిగా ఎపార్ట్ మెంట్లలో పెంచుకొని ప్రతి ఒక్కరూ కనీసం పది తులసి దళాలు స్వీకరిస్తే కరోనా కాదు కదా దాని బాబులు, అక్రమబాబులు వెయ్యిమంది కూడా ఏమీ చేయలేరు. 

లేదా, మీకు ఓపిక ఉంటే ఆయుర్వేద మందుల దుకాణాలు గాలించి తులసీ ఘనవటీ సాధించండి. లేదా తులసితో తయారు చేసిన ఏ ఔషథం దొరికినీ సేవించండి. అయితే ఇవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఉత్తరాదిలో ఉత్పత్తి అవుతున్న ఈ తులసీ ఘనవటి అక్కడే ఖర్చైపోతోంది. వారి పంపిణీ ఇక్కడి వరకూ రావడంలేదు.  

తులసి ఒక నమ్మకం కాదు. వైద్య శాస్త్ర నిజం. ఒక మతానికి పరిమితం అయింది కాదు. విశ్వమానవశ్రేయస్సు కోసం పరమాత్మ ఇచ్చిన దివ్యఔషథం.

తులసి మానసిక వ్యాధులకు పనిచేస్తుంది. కిడ్నీని, లివర్ ను కాపాడుతుంది. చర్మవ్యాథుల నుంచీ కాపాడుతుంది. జ్వరాలు రానివ్వదు. ఊపిరితిత్తులు, గుండెజబ్బులు, కేన్సర్ వంటివాటిని చేరనివ్వదు. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

నిజానికి గత మూడు నెలల నుంచీ ఈ అంశాలు చెబుతున్నారు. వీటిని పాటిస్తున్నవారు నిర్భయంగా ఉన్నారు. కనీసం నేడైనా దీన్ని పాటిస్తే రేపు సుఖంగా ఉండవచ్చు. వంగదేశంలో సామాజికవ్యాప్తి మొదలైందనే వార్తల నడుమ ఇదే చివరి అవకాశం. కనుక కరోనాతో యుద్ధం చేయాలంటే ఒక బిళ్ళ గిల్లోయ్ ఘనవటి, ఒక గోళీ అశ్వగంధ, పదో ఇరవయ్యో తులసీ దళాలు, నాలుగు చుక్కల నువ్వుల నూనె  చాలు. మొత్తం మీద 4 రూపాయలు మించదు. కాదంటే? లాల్ దర్వాజా దగ్గర నుంచీ లాల్ ఖిల్లా వరకూ అన్నీ  అమ్ముకోవడానికి సిద్ధం అయినా కరోనాను జయించలేరు. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఆంగ్లవైద్యబకాసురులకు చాలవు.

 చివరిగా ఒకమాట, ‘‘ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి విశ్వమసి, విశ్వాయుః సర్వమసి ......‘‘ అనే మంత్రాన్ని రోజుకు మూడు సార్లు స్మరించేవారున్నారు. వేలకొలదీ సంవత్సరాల నుంచీ ఉన్న ఆయుర్వేదం ఈ మంత్రంలోని ఓజస్సును ప్రమాణంగా చేసుకొని దీన్ని అందించే తులసిని పరదేవతగా చేసి పెరటి వైద్యం చేస్తోంది. 

ఈ సమయంలో తులసి ప్రాధాన్యలతో పాటు ఆయుర్వేద రహస్యాలు మరిన్ని ముందు ముందు తెలుసుకుందాం.

స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం

Read more...

వ్యాసభగవానుని అవతరణ రోజే గురుపౌర్ణమి.

>> Friday, July 23, 2021


    #గురుపూర్ణిమ  లేదా  #వ్యాసపూర్ణిమ

భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున ... ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన " గురుపూర్ణిమ " గా మారినది అని చరిత్ర చెబుతోంది .

ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. 

నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు'- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పదై ఉండాలి? ఆ విధంగా అని 'నిజమే!' అని నిరూపించుకొన్న కవివృషభుడు వేదవ్యాసుడు. ఆ ఇతిహాసం మహాభారతం. శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియజెబుతోంది. 

ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. 

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. 

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు 
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు. 

వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు. 

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. 
ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. 

ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే. 

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. 
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. 

గురు సందేశము : 

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది 

వ్యాసుని జన్మ వుత్తాంతము : 
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్లు ఎన్నోమార్పులు చేసి చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది. 

పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పడెస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు , వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు ని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు. 

దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది స్నానానికి అక్కడ కు వస్తాడు. 
పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు . ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు . ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా.. 

ఆ నియమాలు...

దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి,
బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి,
వదువు కన్య అయి ఉండాలి,
వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి,
లంక లో పెండ్లి జరగాలి,
పిండోత్పత్తి  ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి,

ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి , బ్రహ్మసమానుడై ఉంటాడని అలోచిస్తూ నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి ... తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన కలిగి చుట్టు చూడగా అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, ఆ రతి వెనక ఉన్న జన్మరహస్యాన్ని వివరిస్తాడు . 

అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది ... అని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. నదిలో లంక ఉండనే ఉన్నది , బ్రాహ్మణునికై బ్రహ్మదేవుని రమ్మని కోరగా తన శక్తి స్వరూపాలతో పుట్టె బిడ్డకు (తన డిటో) తాను సహకరించే ప్రశ్నేలేదని ఖరాకండిగా చెప్పడంతో, నారదముని సహయము తో వివాహం జరిపించి ఆ మహత్తర కార్యానికి నాందిపలికేరు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు. 

భారతంలో వ్యాసుని పాత్ర 

వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరవాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరవాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరవాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరవాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరవాత లక్క ఇంటి దహనం తరవాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలదని సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరవాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.

    🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP