శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విప్రులపై ఎందుకీ విపరీత భాష్యాలు?

>> Monday, April 16, 2012

విప్రులపై ఎందుకీ విపరీత భాష్యాలు?
- కె.అరవిందరావు[మాజీ డిజీపీ]

ఏ ప్రిల్ 9న దినపత్రికల్లో 'బలి-వామన' నాటకంపై వచ్చిన సమీక్షలు చూసిన తర్వాత ఈ వ్యాసం వ్రాయ డం అవసరమనిపించింది. నేడు వామనుడు లేడు, బలిచక్రవర్తి లేడు, వారి కథ పురాణాల్లో ఉంది. జనజీవనంలో ఒక నీతికథ రూపంలో ఉంది. నా చిన్నతనంలో రాయలసీమ గ్రామాల్లో దీపావళి సందర్భంగా జరిపే కోలాహలం గుర్తుంది. బలిచక్రవర్తి కోట అంటూ ఒక పెద్ద చెక్కపీటపై కోట ఆకారంలో మట్టితో గోడలు, గుమ్మాలు తయారుచేసి వాటిపై పూలు అలంకరించి బలిచక్రవర్తి పూజ అంటూ టపాకాయలు కాల్చడం.

ఎంతో సంబరంగా పండుగ చేసుకోవడం ఆచారంగా ఉండేది. బలి ఒక ధార్మిక చక్రవర్తి అయినప్పటికీ కేవలం గర్వం అనే దోషం ఉండడం వల్ల విష్ణువుచే అణచబడ్డాడని, గర్వం వదులుకోవాలని ఒక నీతి చెప్పేవారు. ఇప్పటికీ ఆ ఆచారం ఉందని అనుకుంటాను. అనేక ప్రాంతాల్లో బలిచక్రవర్తి మళ్లీ భూమిపైకి రావడం, ప్రజలు అతన్ని పూజించడం అనేది ఉంది. ముఖ్యంగా కేరళ దేశీయుల ఓణం పండగలో బలిపూజయే ప్రధానం.

ఇటీవలి కాలంలో పురాణాలపై వస్తున్న విపరీత భాష్యాల నేపథ్యంలో 'బలి-వామన'పై వచ్చిన సమీక్షలు చాలా బాధ కల్గించాయి. కేవలం ఒక వర్గం వారిని దోషిగా నిలబెడుతూ ద్వేషాన్ని రెచ్చగొట్టే రీతిలో సాహిత్య రచనలు రావడం, ఎలా వస్తున్నాయో, ఎవరి ప్రేరణ వల్ల వస్తున్నాయో తెలియని స్థితి. సమాజంలోని వివిధ వర్గాలను విడగొట్టడం వల్ల మరెవరికి లాభమో కూడ అర్థం కాని స్థితి. ఒక వర్గానికి మాత్రం తీవ్ర మనస్తాపం కల్గించే రీతిలో ఈ రచనలున్నాయి.

పై సమీక్షలు చూసిన తర్వాత ఆ పురాణకథకు సంబంధించిన గ్రంథాలు తిరగేశాను. మొదటిది వామనపురాణం. తెలుగులో లభ్యమవుతూంది. వేంకటేశ్వర ఆర్ష భారతీ ట్రస్టువారు సంస్కృత మూలం, తెలుగు అనువాదం ప్రచురించారు. దాదాపు 80 కి పైగా అధ్యాయాలున్న గ్రంథంలో కేవలం 10 అధ్యాయాల్లో వామన చరితం ఉంది.

మిగతా భాగంలో దక్షయజ్ఞం, మహిషాసుర వధ లాంటి కథలు అనేకాలున్నాయి. వామన పురాణంతో పాటు భాగవత (మూలం+తెలుగు అనువాదం, టీటీడీ వారు ప్రచురించినది) 8వ స్కంధం కొంత చదివాను. అంతేకాక మన పండుగల్ని వివరించే నిర్ణయసింధు (సంస్కృతం+కిడాంబి నరసింహాచార్య తెలుగు అనువాదం) పుస్తకం కూడ పరిశీలించాను. ఈ పుస్తకాలు ఈనాడు లభ్యమవుతున్నాయి. ఎవరైనా పరిశీలించవచ్చు. ఇవి మూలగ్రంథాలు (ఞటజీఝ్చటడ టౌఠటఛ్ఛిట) వీటిని వదిలి ఏ పాశ్చాత్యులో, వామపక్షం వారో వ్రాసిన రచనల్నో ఆధారంగా తీసుకోవడం విద్యావంతుల ధర్మం కాదు.

పురాణం లేదా భాగవత కథను నమ్మి ఈ వ్యాసం రాయడం లేదని మొదటగా మనవి చేస్తున్నాను. పుస్తకంలో ఏమున్నదనే విషయం మాత్ర మే చెపుతున్నాను. మొదటగా వామన పురాణం పరిశీలిస్తే దేవతలు, అసురులు అని ప్రకృతిలో రెండే విభాగాలు. ఇద్దరూ కశ్యప మహర్షి లేదా కశ్యప ప్రజాపతి సంతానమే. కశ్యపుడు బ్రాహ్మణుడైతే ఆయన సంతానం కూడ బ్రాహ్మణులే. బలిచక్రవర్తి ప్రఖ్యాత విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మనుమడు. ఎంతో ధార్మికంగా రాజ్యం చేస్తున్నాడు, కాని దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుడి రాజ్యం లాక్కుంటాడు.

దేవతలకు వెళ్లాల్సిన యజ్ఞభాగాలు ఆగిపోతాయి. యజ్ఞా లు, వాటి ఫలాలు, యజ్ఞంలో ఇచ్చిన హోమాలు దేవతలకు వెళ్లడం లాంటివి ఆనాటి సమాజంలో ముఖ్యమైన విషయాలు. హవిస్సులు నిజంగా దేవతలు తీసుకుంటారా లేదా మనం ఈనాడు నమ్మకపోవచ్చు. ఆనాడు కర్మకాండ అంతా ఈ విశ్వాసంపై ఆధారపడి ఉంది. కర్మకాండ తప్ప మిగతావన్నీ వ్యర్థమనీ చెప్పే మీమాంసకుల ప్రభావం చాలా బలంగా ఉన్న రోజులవి. కర్మకాండ విపరీత ధోరణుల్లో వెళుతున్నప్పుడు దానికి చెక్‌గా ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానం ప్రాముఖ్యం ప్రతిపాదించాయి.

తత్వజ్ఞానం లేనట్టి కేవల కర్మకాండను వేదాంతులు నిరసించారు. మూర్ఖపు పట్టుదలతో కేవలం స్వార్థం కోసం చేసే యజ్ఞాల్ని అసురయజ్ఞాలుగా భగవద్గీతలో కూడా చూడగలం (16-17 అధ్యాయాలు). అసురప్రవృత్తితో యజ్ఞాలు చేసినవారూ బ్రాహ్మణులు, మిగతా ద్విజులు (క్షత్రియులు, వైశ్యులు). వేదాంతశాస్త్రం జ్ఞానానికి ప్రముఖస్థానం ఇచ్చింది. ఆ ధోరణిలో వచ్చి న కథలు దేవతలు, అసురులు వారి యజ్ఞభాగాలు మొదలైనవి. దైవీగుణాలున్న వారికే హవిస్సులివ్వాలి. ఆసురీ గుణాలున్న వారికివ్వ డం ధర్మవిరుద్ధం. దేవాసురుల యుద్ధం మంచికీ చెడుకు మధ్య జరిగే యుద్ధమని ఎన్నోసార్లు పురాణాల్లో చెపుతారు. ఎప్పటిలాగ దేవతలు విష్ణువు వద్దకు వెళ్లడం, ఆ విష్ణువే అదే కశ్యపమహర్షి భార్య అయిన అదితి గర్భంలో జన్మించడం జరుగుతుంది.

అంటే దేవాసురులు ఎలా అన్నదుమ్ములో వామనుడు కూడ వారి తమ్ముడు. వామనుడు పుట్టగానే ప్రకృతిలో కొన్ని మార్పులు కల్గుతాయి. అసురుల శక్తి సామర్థ్యాలు క్షీణించడం, దేవతల శక్తి పెరగడం మొదలైన వీటిని గమనించిన బలి తన తాత అయిన ప్రహ్లాదుణ్ణి వీటి కారణమేమిటని ప్రశ్నిస్తాడు. ప్రహ్లాదుడు విష్ణువును ధ్యానించి ఆ విష్ణువే వామనుడిగా జన్మించడం వల్ల ఇలా జరుగుతూందని బలిచక్రవర్తికి చెపుతాడు. బలిచక్రవర్తి అహంకారంతో ఉండేవాడు కాబట్టి విష్ణువెంత? అతని బలమెంత? మన యోధులు అత ణ్ణి ఓడించగలరు అని ప్రహ్లాదుడి ఎదుట విష్ణువును కించపరచడంతో కోపావేశంలో ప్రహ్లాదుడతణ్ణి నీవు రాజ్యభ్రష్టుడవవుతావని శపిస్తాడు. బలి పశ్చాత్తాపం పొంది తన తాత చెప్పినట్లు విష్ణువు రాకకోసం ఎదురుచూస్తుంటాడు.

తర్వా త వామనుడు యజ్ఞవాటికకు రావడం, మూడడుగుల నేల అడగడం, ఇవన్నీ మనకు తెలిసినవే. అహంకారం అనే పదానికి రెండు స్థాయిల్లో అర్థాలు, ఒకటి మనం వ్యవహారంలో చెప్పుకునే గర్వం. వేదాంత స్థాయిలో 'అహంకారం' అంటే నేను కర్త అనుకునే బుద్ధి. పరమాత్మ ఇతనిలోని అహంకారం తొలగించడం అంటే ఇతనికి జ్ఞానాన్ని ప్రసాదించడమని అర్థం. వామనుడి రాకతో బలి తన జన్మ సఫలమైందని భావిస్తాడు. పురాణ సిద్ధాంతం ప్రకారం దేవేంద్ర పదవి అనేది ఒక అధికారిక పదవి. అంటే ఆయనకు కొన్ని యుగాలపాటు పాలించే అధికారం ఉంటుంది. అందుకే ఇంద్రుడి రాజ్యం అతనికి ఇప్పించి వచ్చే మన్వంతరంలో నీకు ఇంద్రపదవి లభిస్తుందని విష్ణువు బలికి వరమిస్తాడు.

బలి చక్రవర్తి విష్ణువుకు భక్తుడుగా మారినట్లే విష్ణువు కూడ అతని కోటకు రక్షకుడుగా ఉంటాడు. నీ స్మరణే చేస్తున్న నాకు భోగ్యపదార్థాలేమిటి! అని బలి ప్రార్థిస్తే అశ్రద్ధతో గాని, విధి పూర్వకంగా లేనివిగాని అయిన యజ్ఞ ఫలాలు నీకు లభిస్తాయని విష్ణువు చెపుతాడు.

ఇక భాగవతం తీసుకుందాం. ఇది భక్తి ప్రధాన గ్రంథం. 8వ స్కం ధంలో వామనుని కథ. దీని ప్రకారం మొదట్లో ఇంద్రుడు బలిని ఓడించి దాదాపు అతని ప్రాణాలు తీసినప్పుడు భృగువంశీయులైన బ్రాహ్మణులు అతణ్ణి కాపాడి తమ తపశ్శక్తితో అతడితో యజ్ఞాలు చేయించి గొప్ప ప్రభావంతుణ్ణి చేస్తారు. యజ్ఞం ద్వారా అనేక యుద్ధ పరికరాలు సమకూరుస్తారు.

ఆయన వాళ్లందరికీ ప్రదక్షిణ నమస్కారాలు చేసి రాజ్యమధిరోహిస్తాడు. భృగువంశీయులైన ఋషులు తమ శిష్యుడైన బలియందు తేజస్సు నింపినారు (భాగ. 8-15-28). తర్వాత తేజోబలంతో బలి దేవలోకానికి వెళ్లడం, ఇంద్రుడు, దేవతలు పలాయనం చేయడం జరుగుతుంది. ఇతడు అధర్మ మార్గాన్ని పొందినప్పుడే వినాశం పొందగలదు అని దేవతలు తమ సమయం కొరకు ఎదురుచూస్తుంటారు.

దేవతల తల్లి అదితి విష్ణువును గూర్చి తపస్సు చేయడం, విష్ణువు ఆమె గర్భంలో జన్మించడం, పుట్టినప్పుడు నాలుగు చేతులు, శంఖచక్ర గదాపద్మాలతో పుట్టి ఆ తర్వాత వారు చూస్తూండగానే పొట్టి బాలకుడిగా మారతాడు.బలిచక్రవర్తి అనేక అశ్వమేధ యాగాలు చేసి మళ్లీ దీక్షలో ఉన్నప్పుడు వామనుడు అక్కడికి వెళ్లడం, బలిచక్రవర్తి అతనికి అతిథి సత్కారాలు చేసి అతనికేం కావాలో అడగడం, తర్వాతి కథ మనకు తెలిసిందే.

ఈ కథలో బలిచక్రవర్తి భృగువంశీయులైన బ్రాహ్మణులతోనే యజ్ఞాలు చేయిస్తాడు. వాళ్ల తపోబలంతో వృద్ధి పొందినవాడు. యజ్ఞయాగాదులు చేయడం బ్రాహ్మణ సంస్కృతి అంటే బలి కూడ అదే సంస్కృతిలో ఉన్నవాడు. పోతే అహంకారం (నేనే కర్త) అనే భావనలో ఉన్నాడు. వామనావతార సమయంలో విశ్వరూప దర్శనం (భాగవతంలోనూ, వామన పురాణంలోనూ) కన్పిస్తుంది. విశ్వమంతా పరమాత్మలోనే ఉంది. బలి చక్రవర్తి అందులో భాగమే కాని అందుకు భిన్నంగా లేడు అనేది అక్కడ చూపబడుతుంది. ఆ సందర్భంలో బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుడు అక్కడకు రావడం, విష్ణువును పూజించడం జరుగుతుంది.

ఇక్కడ బలి భార్య తన భర్త గురించి చెపుతూ 'కొందరు దుర్బుద్ధులు తామే కర్త అనే భావనతో గర్వించి ఉంటారు. నీవే అన్నీ అయి ఉండగా నీకు సమర్పించేదేమిటి' అంటుంది. యజ్ఞాలు చేసేవారు త్యాగబుద్ధితో చేయాలి కాని అహంబుద్ధితో చేయకూడదు. అహం బుద్ధి ఆసురీ ప్రకృతి అని కథ సారాంశం. ఈ కథలో కూడ వచ్చే మన్వంతరంలో బలికి ఇంద్ర పదవి వస్తుందని విష్ణువు వరమిస్తాడు. 'అహంకారం' అనేది తత్వశాస్త్రంలో ఒక సూక్ష్మమైన విషయం. వేదాంత శాస్త్రమంతా 'అహం' తగ్గించుకోవడం, విశ్వమంతా బ్రహ్మను చూడడం అనే అభ్యాసం గూర్చి చెపుతుంది. ఈ కథలో ఎక్కడే గాని వర్ణానికి సంబంధించిన వ్యాఖ్యానానికి అవకాశమే లేదు.

రాక్షసుల్లో చాలామంది బ్రాహ్మణులు. రావణాసురుడు, వృత్రాసురుడు మొదలైన వారంతా బ్రాహ్మణులే. పైన చెప్పినట్లు అసురులందరూ కశ్యప మహర్షి కొడుకులే.

నిర్ణయ సింధు అనేది ధర్మశాస్త్ర గ్రంథం. దీనిలో అనేక పండుగలు వర్ణింపబడ్డాయి. కార్తీక అమావాస్య రోజు బలి చక్రవర్తి పూజ, బలికి నమస్కరిస్తూ మంత్రాలు ఇందులో గమనించవచ్చు. విష్ణు సాన్నిధ్యాన్ని మాకు కలుగజేయి, అంటూ ఆ రోజు బలిని ప్రార్థిస్తారు. ఇందులో ఎలాంటి కుల ప్రస్తావన కన్పించదు.

మన పురాణాల్లో బ్రాహ్మణుల్ని అపహాస్యం చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇదే వామన పురాణంలో శివుడు దారుకావనంలోని ఋషులు కామక్రోధాదులకు అతీతులు కారని పార్వతికి చూపించడానికై బ్రాహ్మణ భార్యలతో తిరగడం, అలాగే భాగవతంలో శ్రీకృష్ణుణ్ణి పూజించడానికై బ్రాహ్మణ భార్యలు తమ భర్తల్ని వదిలివేసి వెళ్లడంలాంటి కథలనేకాలు కన్పిస్తాయి. బ్రహ్మజ్ఞానం లేని బ్రాహ్మణుల్ని గూర్చి కథలు చెప్పబడ్డాయి. పురాణాల్లో కేవలం రాగద్వేషాలు, అహంకారం లాంటి గుణాల్ని అసుర గుణాలుగా చూపించారు.

మనకీనాడు వికృత భాష్యాలు రావడానికి కారణాలు అనేకాలు. - ఆంగ్ల మేధావులు సృష్టించిన సిద్ధాంతాలు. - మన ప్రజాస్వామ్యంలో కులప్రాతిపదికపై రాజకీయాలు నడవడంతో కులతత్వం నానాటికీ బలపడుతూ ఉండడం. - సంస్కృత పండితులకు సామాజిక అవగాహన లేకపోవడం. - విదేశీ పండితులు ఒక బృహత్ప్రణాళిక ప్రకా రం పురాణాల కథల్ని వామపక్ష మేధావుల రచనల ఆధారంతో వ్యాఖ్యానిస్తూ (ఉదా : వెండీ డానిగర్ 'ఖీజ్ఛి ఏజీnఛీఠట' గ్రంథం) వాటిని కులపోరాటాలుగా చిత్రీకరించి సమాజాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తూండడం. ఇలా అనేక కారణాల్ని గమనించవచ్చు. ఖ్చిఝఠ్ఛజూ ఏఠn్టజీnజ్టౌn చెప్పినట్లు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న 'ఇజ్చూటజి ౌజ ఛిజీఠిజీజూజ్డ్చ్టీజీౌnట' అనగా సంస్కృతీ పోరాటాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో మనం గమనించగలం.

దళిత విద్యావంతులకు ఒకే విజ్ఞప్తి- మూలగ్రంథాలు తెలుగులో ఆంగ్లంలో కూడ ఉన్నాయి. వీటిని అందరూ పరిశీలించాలి. అసురులందరూ బ్రాహ్మణులే. కులాల సంఘర్షణ అనే వాదం ఎవరు ప్రారంభించారో, వారి నేపథ్యం, అజెండా ఏమిటో కూడ గమనించండి. కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాల్సిందే. కుల వివక్ష చరిత్రలో కేవలం బ్రాహ్మణులు చేసిందే కాదు. ఈనాడు కూడ దళితుల్లోనే ఒక వర్గం వారు మరొక వర్గంపై అనేక సంవత్సరాలుగా తమకు న్యాయం జరగడం లేదని పోరాటం చేయడం చూస్తున్నాం. ఈనాటి సమస్యల్ని వదిలి పురాణ కథల ఆధారంతో గ్రంథాల్లో లేని విషయాల్ని ఊహించుకొని ఒక వర్గాన్ని దోషిగా, విలన్‌గా చిత్రీకరించడం చాల బాధాకరం.

- కె.అరవిందరావు

2 వ్యాఖ్యలు:

Anonymous April 16, 2012 at 1:49 AM  

చాలా బాగా చెప్పారు, రావణుడు కూడా అంతే కదా.
దళిత మేధావులు రాక్షసులను తమ పూర్వీకులుగా ఎందుకు ఎంచుకుంటున్నారో లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏదో గలాటా చేసి తాయిలాలు పొందుదామనే రాజకీయ కక్కుర్తే కాని, వేల ఏండ్ల పురాణాల్లో బంధుత్వాలు వెతుక్కోవాలా! :D

మైత్రేయి April 16, 2012 at 4:20 AM  

దీనికి ఒక చిన్న ఉదాహరణ.
కృష్ణుడు స్వంత మేనమామ కంసుణ్ణి చంపాడు. కృష్ణుణ్ణి దేవుడని, కంసుణ్ణి రాక్షసుడని అంటారు. ఇద్దరూ చెరో కులమని, ఒకళ్ళు ఆర్యులు మరొకరు అనార్యులనీ చెత్తగా ఎవరో రాస్తే మరింత పిచ్చిగా నమ్మటం చిత్రంగా ఉంటుంది.
అసలు రాక్షసులు మీవంశం వారు అంటే అన్నవాళ్ళని ఏదీ రుజువు అని అడిగి పట్టి పీకాల్సింది పోయి అవునని ఒప్పేసుకోవటమే కాక వాళ్ళే దేవుళ్ళ కంటే మంచి వాళ్ళని అనటం మరీ హాస్యాస్పదంగా అన్పిస్తుంది.
అసలు నాస్తికులు పురాణాలు ఎలా నమ్ముతారో అర్ధంకాదు. ఇవి కధలైనప్పుడు , జరిగిన గాధలు కానప్పుడు ఆ కారెక్టర్లతో మనుషులకు చుట్టరికం ఏమిటి?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP