శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పత్రి పూజ పరమార్థం

>> Sunday, August 28, 2011

పత్రి పూజ పరమార్థం

సృష్టిలో అన్ని వైద్య విధానాలకూ ఆయుర్వేదం తల్లిలాటిదని అంటూంటారు. కానే కాదు, అదంతా ట్రాష్ అంటారు వెంఠనే మరికొందరు సృష్టి మొదలైనప్పట్నుంచీ అన్నిరకాల వైద్యవిధానాలకూ ఆయుర్వేదమే ‘తల్లి’లాటిదనడంలో సందేహం లేదు. సిద్ధవైద్యం, యునాని వైద్యం, హోమియో వైద్యం, అల్లోపతి వైద్యం- అన్నిటికీ ఆయుర్వేదమే ఆధారమని చెప్పక తప్పదు. అసలు మన భారతదేశమే పుణ్యభూమి. ప్రతి యుగంలోనూ, అనుక్షణమూ సంభవించే పండుగల్లో, పబ్బాల్లో నిర్దేశించిన పూజా విధుల్లో, ఆహారపు విషయాల్లో- ప్రతి అంశంలోనూ ఏదో ఒక నిగూఢమైన అంశం ఇమిడి ఉంటుంది. ఆధ్యాత్మికమంటే గిట్టినా, గిట్టక పోయినా, ఆ పేరుతో చెబితే జనాలకు భయం, భక్తి అంటూనైనా ఆచరిస్తారనీ మన పెద్దలు ఆశించారు. ఈ పూజలూ, పునస్కారాల వెనక ఎంతో సైన్సు దాగి ఉంది. సైన్సుకందనిది ఆధ్యాత్మికం. కానీ ఆధ్యాత్మికానికి అందనిదేదీ లేదు.
వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి ‘మతం’ అంటే ‘మానవత్వా’న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త’మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.
అసలు ప్రాచీన భారతంలో ఇలానే పూజ ఎందుకు చేయాలని నిర్దేశించి ఉంటారో కొద్దిగా ఆలోచించండి. కొత్త మట్టి ఎక్కడ దొరుకుతుంది? భాద్రపద మాసం అంటే, అపుడే వానలు బాగా వచ్చి ఉండటంవల్ల గ్రామాల, పట్టణాల్లో ఉండే చెరువులు, నదులు కొత్త నీటితో, కొత్తమట్టితో నిండుగా ఉంటాయి. వానలవల్ల నీరు చేరితే మంచిదే. కానీ దానితోబాటు మట్టికూడా పేరుకునిపోతే నదుల్లో, చెరువుల్లో పరిస్థితేంటి? కాబట్టి పూడిక తీయడం రైటు. ఈ పూడిక తీయడంతో వచ్చే బంకమట్టితో చక్కగా వినాయకుడి ప్రతిమలు చేయడంవల్ల, దానికి 21 రకాల పత్రులతో 9 రోజులు పూజ చేయడంవల్ల మరో ప్రయోజనం ఉంది. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం. నేడు సైన్సు అనే వాళ్ళంతా ‘ఎకో-ఫ్రెండ్లీ’అంటూ ఎనె్నన్నో ‘తంతులు’ నిర్వహించనారంభించారు. ఐతే, ఇది భారతీయులకు కొత్తేమీ కాదు. వేద కాలంనించీ ‘పర్యావరణ పరిరక్షణ’అనేది మనకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిర్దేశించారు. మనం ఏమిచేసినా శ్రద్ధగా, నిష్టగా చేయడమే ముఖ్యం. అదే ఆధ్యాత్మిక రహస్యం. శ్రద్ధతో, నిష్టగా మనం ఏ పనిచేసినా, దానిలో మనకు విజయం తథ్యం. సంక్రాంతికి ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెట్టినా, దీపావళికి మతాబాలు కాల్చినా కూడా ఆ సంబరాల వెనక ఎంతో సైన్సు ఉంది. వాటి గురించి మరోసారి చర్చిద్దాం. కానీ ప్రస్తుతం వినాయక చవితిలో మనం చేసే పత్రి పూజ గురించి ప్రస్తావిద్దాం. ఈ ప్రతి పూజలో 21 రకాల ఆకులున్నాయి. ఆకులు ఎందుకు ఎంచుకొన్నారూ? అంటే, మనకు అనాదిగా ఋషిపరంపర ఓషధులను, మూలికలను పూజాద్రవ్యాలుగా, యజ్ఞయాగాది కార్యక్రమాల్లో సమిధలుగా కొన్ని ఆకులను, మూలికలనూ, సమిధలనూ ప్రస్తావించారు. వీటి వెనక ఉన్నదంతా సైనే్స.
వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి పేర్లు, శాస్ర్తియ నామాలతోబాటు వ్యావహారికంగా తెలుగులో పేర్లు పట్టికలో చూడవచ్చు.
కొన్ని పూజా విధానాల్లో భృంగరాజపత్రం, మాలతీ పత్రం, కేతకీ పత్రం, అగస్త్య పత్రం- వీటి ప్రస్తావన కూడా ఉంది.
మాచీ పత్రం లేదా మాచిపత్రిని సంస్కృతంలో శుక బర్హ, శుక పుష్ప అనీ, స్థౌణీయకా అనీ పిలుస్తారు. ఇది త్రిదోషహారి. దుర్గంధాన్ని తొలగిస్తుంది. క్రిమిహారి కూడా.
వినాయకుని పత్రి పూజలో మాచీపత్ర రహస్యాన్ని మొదటి నామంలోనే ఇమిడ్చారు మన ఋషులు. సుముఖాయనమః - అంటూ మాచీపత్రం సమర్పయామి అంటాం. సుముఖం అంటే చక్కటి ముఖం. ముఖం అంటే పెదాలు, దంతాలు, చిగుళ్ళు, నాలుక, కంఠము, అంగిలి, నోరు- ఇలా ఏడు భాగాలు కల్గింది కదా! అలాటి ముఖంనించి వచ్చే దుర్గంధాన్ని హరించి సుఖాన్నిచ్చేదే మాచీ పత్రం.
బృహదీ పత్రం అనే దాన్ని సంస్కృతంలో కంటకారి, మహతీ, కులీ, వార్తకీ- ఇలా పలురకాలుగా పిలుస్తారు. తెలుగులో ‘ములక’ అంటాం. ఈ ఆకు వంకాయ ఆకులా ఉంటుంది. తెల్లని చారలతో ఉంటుంది. దీని పండ్లు పసుపుపచ్చగా బంగారు రంగులోని ముళ్ళతో ఉంటాయి. ఇది శ్వాస, కాస వ్యాధుల్లో విశేషంగా గుణాన్నిస్తుంది.
బిల్వపత్రాన్ని సంస్కృతంలో శ్రీ్ఫల, శాండిల్య, మాతార, శైలూష అని పిలుస్తారు. మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఏక బిల్వం అంటే ఒకే పత్రం మూడుగా చీలి ఉంటుందన్నమాట. మూడు దళాలూ ఒకే మూలాన్నుంచి వచ్చినట్లే, త్రిగుణాలు (సత్వ, రజ, తమోగుణాలు) కూడా ఒకే మూలాన్నుంచి వస్తాయి. త్రిమూర్తులు ‘ఒక్కటే’ రూపమనీ సూచిస్తుంది. ఈ బిల్వం అనేది మధుమేహంలో (ఆకు, బెరడు) ఔషధంగా వాడతారు. ఇది రక్తాన్ని శుద్ధిచేస్తుంది. దీని పండ్లు బంగారు రంగులో వుంటుంది. లోపలి గుజ్జు మంచి వాసనలు వెదజల్లుతూంటుంది. అందులో బంగారు రంగులో తేనె లాటి ద్రవం ఉంటుంది. ఈ గుజ్జును రక్తశుద్ధికీ, మలబద్ధకాన్ని తొలగించడానికీ వాడతారు.
దూర్వాయుగ్మం అంటే గరిక (లేదా గడ్డి). ఈ గడ్డి మూడు రకాలు: శే్వతదూర్వా, నీలదూర్వా, గండదూర్వా. ‘గండ దూర్వా’నే గండాలి అంటారు. శే్వత (తెల్ల)గరికనే శతవీర్యా అంటారు. నీల దూర్వా లేదా నల్ల గరికనే సహస్రవీర్యా అంటారు. శే్వత గరికనీ నల్లగరికనీ కలిపి దూర్వాద్వయం అని (ఆయుర్వేద వైద్యశాస్త్రంలో) అంటారు. దూర్వాయుగ్మం అంటే రెండు ఆకులు/ దళాలు కల్గినవి అని అర్థం. ఇవి దాహం, చర్మ రోగం, చుండ్రు- వీటి నివారణకు వాడతారు. చెడ్డ కలలు వచ్చినపుడు మూత్ర విసర్జనలాటి సమస్యలను నివారిస్తుంది గరిక.
దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు. దీనే్న కనక, ఉన్మత్త, శివప్రియ అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. ఇది వంకాయ జాతికి చెందిందే. ఉన్మాద లక్షణాలుండటంవల్ల దీనికి ఉన్మత్త అనీ పేరు. ఉన్మత్త కాస్త ఉమ్మెత్త అయ్యింది. ఇది జ్వరాన్ని, కుష్ఠు, కృమి తగ్గించడానికి, పుండ్లు మానడానికి, నొప్పి/ వేదన తగ్గించడానికీ పనికొస్తుంది. శ్వాస, కాస వ్యాధులనీ తగ్గించే ప్రత్యేక ఔషధంగా కూడా ఉమ్మెత్తను వాడతారు. విష ప్రభావాన్ని శరీరమంతా వ్యాపించకుండా నిరోధించే విశేష గుణం ఉమ్మెత్తది.
బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకు అజప్రియ, కోల, ఫేనిల, ఉభయ కంటక అనీ వ్యవహరిస్తారు. దీని గుండ్రని ఆకులు, ముళ్ళు చూడటానికి అందంగా ఉంటాయి కూడా. భోజనం తర్వాత ప్రతిరోజూ బదరీ ఫలం అంటే రేగుపండ్లు గనక తింటే, మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణవౌతుంది. అంతేకాదు. లంబోదరం- పొట్ట పెరగడం తగ్గుతుంది. (అందుకే ఆరో మంత్రం లంబోదరాయనమః బదరీ పత్రం సమర్పయామి అని ఉంటుంది గమనించండి).
అపామార్గ పత్రం అనేది ఉత్తరేణి చెట్టు ఆకు. ఉత్తరేణి చెట్టు వేరు ఉత్తర దిశగా వ్యాపించి ఉంటుంది. దీనే్న ఖరయాజరి, శిఖరి, ప్రత్యేక పుష్టి అని సంస్కృతంలో అంటారు. అధర్వణ వేదంలో దీని గురించి చాలా చక్కగా వర్ణన ఉంది. దీని విత్తనాలతో పాయసం చేసి సేవిస్తే, చాలాకాలంపాటు ఆకలి ఉండదని అంటారు. ఇది కడుపునొప్పి, చర్ది, శ్వాస వ్యాధుల నివారణకు విశేషంగా పనిచేస్తుంది. ‘అతి ఆకలి’నీ నివారిస్తుంది.
తులసీ పత్రం- అంటే తులసి ఆకు. తులసికే సురసా, సులుభ, బహుమంజరి, వృందా దేవదుంధుభి అని సంస్కృతంలో పేర్లున్నాయి. తులసీ తీర్థం ఎంత పవిత్ర స్థానాన్ని కల్గిందో వేరే చెప్పనక్కర్లేదు. తులసి ఇంట్లో ఉంటే విష పురుగులు దరిచేరవు. ఇది మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది ‘గజకర్ణ’మనే చర్మవ్యాధి నివారణకు దివ్యౌషధం (8వ మంత్రమూ అదే- గజకర్ణాయనమః తులసీ పత్రం సమర్పయామి).
చూతపత్రం అంటే మామిడి ఆకు. దీనే్న సంస్కృతంలో శుకప్రియ, వసంతదూత అంటారు. మామిడి ఇంట్లోని దుష్టశక్తులని (నెగటివ్ ఎనర్జీ) తొలగిస్తుంది. దీని గాలి సోకడంవల్ల, ఆరోగ్యం బాగుంటుంది. అతి మూత్రవ్యాధికి మామిడి చక్కని ఔషధం. మామిడి చిగుళ్ళు చక్కని కంఠ స్వరాన్నిస్తాయి. మామిడి ‘జీడి’వాడితే ‘పేను కొరుకుడు’వ్యాధిని తొలగించుకోవచ్చు. గుండెల్లో మంట, వాంతులు, అతిసారం- వీటి నివారణలో ‘మామిడి’కి ఎంతో పేరు ఉంది.
కరవీరపత్రం అంటే గనే్నరు ఆకు. దీనే్న సంస్కృతంలో గౌరీపుష్ప అనీ, గణేశ కుసుమ, చండీ కుసుమ అనీ అంటారు. హరప్రియ, అశ్వమారక, హయ మారక అనీ కూడా అంటారు. గనే్నరు పాలు మొండి పుండ్లను మానే్పయగలదు. వాపులనీ, గడ్డలనీ పోగొడ్తుంది. తేలుకాటుకు దీని పాలు ఎంతో ప్రశస్తమైన ఔషధం.
విష్ణుక్రాంత పత్రం అంటే సంస్కృతంలో శంఖపుష్టి, సుపుత్ర, అపరాజిత అనే పేర్లు కల్గి ఉన్నాయి. దీని పూలు నీలిరంగులో ఉంటాయి. ఇది మంచి దృష్టినీ, కంఠస్వరాన్నీ, జ్ఞాపక శక్తినీ ఇస్తుంది. మూత్ర దోషాలను తొలగించడంలో, కుష్టువ్యాధిలో కూడా దీన్ని వాడతారు.
దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. దీనే్న దంత బీజ, రక్తపుష్ప అనీ అంటారు. ఇది అజీర్ణాన్ని పోగొడ్తుంది. వాంతుల నివారణలో, జలుబును తగ్గించడంలో బాగా వినియోగిస్తుంది. ఆకలి లేని వారికి దానిమ్మ తింటే చక్కగా ఆకలి వేస్తుంది.
దేవదారు పత్రం అనే దాన్ని సంస్కృతంలో సాల, భూతహారి, దేవకాష్ట అనీ అంటారు. ఇది హిమాలయాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఈ చెట్టు మానుతో విగ్రహాలు కూడా చెక్కుతారు. దీన్నించి తీసే పైన్ ఆయిల్ రంగుల పరిశ్రమలో వాడతారు. ఈ పైన్ ఆయిల్ కీళ్ళనొప్పుల్ని నివారిస్తుంది.
మరువక పత్రానికి ధవనం, మరువకం అనే పేర్లూ ఉన్నాయి. ఈ మరువం ఎండిపోయినా దాని సుగంధాన్ని ‘మరువం’. ఇది పురుగులను పారద్రోలుతుంది. దుర్గంధాన్ని తొలగిస్తుంది. ఇది ‘విషహారి’గా కూడా పేరుపొందింది.
సింధువార పత్రం అనేది తెలుగు లోగిలిలోని వావిలి చెట్టు ఆకు. వాత రోగానికి వావిలి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ వావిలి ఆకులను పొగ వేస్తే దోమలు పోతాయి.
జాజి పత్రం లేదా సన్నజాజి ఆకును సంధ్యాపుష్పి అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. దీని పూలనుంచి తీసే సుగంధ తైలాన్ని తలనొప్పి నివారణకీ, చెవిపోటు నివారణకీ వాడతారు.
గండలీ పత్రం అనేది 17వ పత్రంగా వినాయక పూజలో చెబుతాం. దీనికే లతాదూర్వా అనీ సర్పాక్షి అనీ అంటారు. ఇది జ్వరాన్ని తగ్గించడానికి, దాహం తగ్గించడానికి బాగా వినియోగిస్తుంది.
శమీ పత్రమనేది తెలుగులో జమ్మి చెట్టు ఆకు. శమీవృక్షం, లక్ష్మి, సక్త్ఫుల అని సంస్కృత నామాలున్నాయి. విజయదశమి అంటే మనకు గుర్తొచ్చేది శమీవృక్షమే. దీని పండ్లలో ఉండే గుజ్జు, దీని కషాయం త్రిదోష జన్యమైన వ్యాధులను తొలగిస్తాయి.
అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఆకు. బోధితరు, పిప్పల, యాజ్ఞీక అని సంస్కృతంలో దీన్ని పిలుస్తారు. ఇది స్ర్తిసంబంధ వ్యాధులను నివారించడంలో మహత్తర ఔషధం.
అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకు. ఇది అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. సాధారణంగా దీన్ని ఇళ్ళ నిర్మాణంలో ఎక్కువగా వాడతారు. మర్రి ఆకుల్లా ఉంటాయి దీని ఆకులు. ఇది రక్తదోషాన్నీ, టీబీ లాటి వ్యాధుల్లో, గుండెకు సంబంధించిన రోగాల్లో ఎక్కువగా వాడతారు.
జిల్లేడునే ‘అర్క’అంటారు. జిల్లేడు ఎర్రని, తెల్లని పూలతో రెండు రకాలుగా వుంటుంది. వీటిలో తెల్ల జిల్లేడు ప్రశస్తం. దీని ఆకుల నించి తీసిన రసాన్ని పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. దీని పూలు శ్వాసకోశ విరుగుడుగా పనిచేస్తుంది. దీని పూలు శ్వాసకోశ వ్యాధుల్లో, దీని పాలు నపుంసకత్వ నివారణలో, పుండ్లను మాన్పడానికి వినియోగిస్తారు.
ఐతే, మనం ఈ 21 పత్రాల గురించీ, వాటి విశేష గుణాల గురించీ ఎపుడూ పట్టించుకోం. అసలు పత్రిలో 21 రకాలలో ఎన్ని మనకు దొరుకుతున్నాయో కూడా తెలీదు. ఏది ఏ ఆకో మనకు వద్దేవద్దు. మార్కెట్లో ‘‘పత్రి’’పేరుతో క్రోటన్ ఆకులు సైతం ఇచ్చేస్తారు. మనం తెచ్చేస్తాం. పూజ కానిస్తాం. ఇదీ మన తీరు. జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి క్రోటన్ ఆకుల పూజవల్ల ఎంత ప్రమాదమో! ఏదో దేవదారు, మద్ది తప్ప మిగిలినవన్నీ మన ఇళ్ళచుట్టూ ఉండే చెట్లే. అంచేత ఈసారి వినాయకుని పత్రి పూజ ఎలాచేయాలో మీరే నిర్ణయించుకోండి. ఇది భక్తి, ఆడంబరాలకోసం కాదు. మన ఆరోగ్యంకోసం అనేది గుర్తుంచుకొని మరీ చేయండి!
===

21 పత్రాల శాస్ర్తియ నామాలు

పత్రి పేర్లు శాస్ర్తియ నామాలు తెలుగు పేర్లు
మాచీ పత్రం Artemisia.vulgaris మాఛిపత్రి
బృహతీపత్రం Solanum.indicum బృహతీపత్రం (ములక)
బిల్వపత్రం Aegle.marmelos భిల్వం (మారేడు)
దూర్వాయుగ్మం cyandon.Dactylon (శే్వత) గరిక
cyandon.linearis (నీల)
దత్తూర పత్రం Datura.stramonium ఉమ్మెత్త
బదరీపత్రం Zizyphus.jujuba గంగరేగ (రేగు)
అపామార్గపత్రం Achyranthes.Aspera ఉత్తరేణి
తులసి పత్రం Ocimum Sanctum తులసి
చూతపత్రం Mangifera.Indica మామిడి
పత్రి పేర్లు శాస్ర్తియ నామాలు తెలుగు పేర్లు
కరవీర పత్రం Nerium.Odorum గనే్నరు
విష్ణుక్రాంత పత్రం Evolvulus.Alsinoides అపరాజిత
దాడిమి పత్రం Punica.Granatum దానిమ్మ
దేవదారుపత్రం Cedrus.Deodara దేవదారు
మరువక పత్రం Origanum.Majorana మరువం
సింధువారపత్రం Vitex.Negundo సింధువారం (వావిలా)
జాజి పత్రం Jasminum.Auriculatum జాజి
గండలీ పత్రం Cynodon.Dactylon సర్పాక్షి
శమీ పత్రం Prosopic.spicigera జమ్మి
అశ్వత్థ ఫత్రం Ficus.Religiosa రావి
అర్జున ఫత్రం Terminalia.Arjuna మద్ది
ఆర్క పత్రం Pterocarpus.Santalinus జిల్లేడు


suresh battula

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP