ధ్యానం-సాధనా గానం
>> Monday, April 19, 2010
- [చక్కిలం విజయలక్ష్మి]
ధ్యానం విషయంలో చాలామంది అపోహలో ఉంటారు. కళ్లు మూసుకుని వూరికే కూర్చుని ఉండటమనీ, శూన్యంలోకి గానీ లేదా ఒక వస్తువునుగానీ తదేకంగా చూస్తూ ఉండటమనీ భావిస్తారు. ఇది కొంతవరకు మాత్రమే సరైనది. పూర్తిగా సమర్థించవలసినది కాదు. ఆరోగ్యం వేరు, ఆధ్యాత్మిక విషయం వేరు. పూర్వం రుషులు, విజ్ఞులు ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాలను సమ్మేళించి బోధిస్తూ వచ్చారు. ఎందుకంటే మరీ తీవ్ర తపోధనుల విషయం పక్కనపెడితే- ఆధ్యాత్మిక సాధన యావత్తూ సాధకుడి ఆరోగ్యంతోనే ముడివడి ఉంది. గౌతమ బుద్ధుడు కూడా ఒకానొక సందర్భంలో నిరాహారం వల్ల ఆరోగ్యం సహకరించక ధ్యానం నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఆహారం మన ఆధ్యాత్మికతకు తోడ్పడే స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితి మన ఆహారంగా, ఆరోగ్యంగా మారే దశ వచ్చేవరకు- సాధకుడు ఆరోగ్యానికి ఆధ్యాత్మికత కంటే అధిక ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంది. శరీరం ఖలు ధర్మసాధకం అన్నారు మరి. భగవత్ స్పృహ బొత్తిగా లేని వ్యక్తి మౌనంగా, కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ ఉండటమనేది ధ్యానం అనిపించుకోదు. ఆలోచనల తీవ్రత తగ్గి ఆ రీత్యా అలజడి మందగించి, కొంతవరకు మానసిక ప్రశాంతత ఏర్పడవచ్చు. అంతే! ఏ పనైనా అవగాహనతో చేసినప్పుడే పూర్తి ఫలితాలు లభిస్తాయి. ధ్యానం కేవలం ఆరోగ్యం కోసం చేసినట్లయితే... మంచిదే. దానికి హృత్-పూర్వక నమస్కారం. కానీ మనం ఆ అంతర్యామి కోసం చేస్తున్నాం. అక్కడికి దారి వేసే ఆధ్యాత్మికత కోసం చేస్తున్నాం. ఆ మౌలిక సూత్రాల ఆధారంగానే మన పయనం సాగాలి. ఆ ధ్యేయ వస్తు జ్ఞానంతోనే మన అన్వేషణ సాగాలి. దీనికంతా ధ్యానం ఒక మార్గం మాత్రమే. గమ్యం తెలిసి ఉండాలి. ఆ గమ్యాన్ని ఎందుకు చేరాలనుకుంటున్నామో ఆ స్పృహ ఉండాలి. అప్పుడు ప్రారంభించాలి ధ్యానం.
ధ్యానం భావనామయ ప్రపంచ వ్యవహారం. మనసు కూడా దాటి మహా శూన్యంలోకి, మహా మౌనంలోకి నిరామయంగా వెళ్లిపోయే అద్భుత దశ. ఈ దశ కేవలం ఆలోచనల మందగింపుతోనో, మళ్లింపుతోనో రాదు. ఆ మహాశూన్యంలోకి మళ్లింపదలచిన మనోపుష్పానికి 'భగవత్ స్పృహ' అనే పరిమళం కావాలి. అది లేకపోతే మనసు కాగితం పువ్వే.
నిజమే. అందరికీ అనుకున్నప్పుడే భగవంతుని పట్ల ప్రేమ ఏర్పడదు. ప్రేమించాలనే ఆశ ఉంటుంది. ఆయనను సాధించాలనే తపనా ఉంటుంది. కానీ ఎండమావిలాంటి మనసు భక్తిజల రహితంగా ఉంటుంది. బండరాయిలా ఉంటుంది. దానికి స్పందన కావాలి. ఆర్ద్రత కావాలి. పరమ ప్రేమ అనే అరణి రగలాలి. అప్పుడు... అప్పుడు... హృదయం హోమగుండం అవుతుంది. భగవంతుడనే యజ్ఞఫలం కోసం యజ్ఞం ప్రారంభమవుతుంది. అందుకు గురువనే రుత్విక్కును అన్వేషించాలి. భగవంతుని పొందాలనే తపన మనలో నిజాయతీగా అంకురించినప్పుడు గురువే మనను వెతుక్కుంటూ వస్తాడు. లేదా మనం తన దగ్గరకు వెళ్లేలా చేస్తాడు. జీవాత్మ పరమాత్మల సంయోగానికి సుముహూర్తం కుదిరిపోతుంది. గురువు మనలో మంత్రోపదేశంతో ఆధ్యాత్మిక బీజాలు నాటుతాడు. సాధనా బలంతో దాన్ని పెంచి పోషించుకుని ఫలాలనందుకోవాలి. ఈ పూర్తి యజ్ఞంలో మన తను ధన ప్రాణాలు గురువుకే అంకితం చేయాలి. అప్పుడు ఆయన చూపే మార్గమే ధ్యానసాధన.
అందుకే... భగవంతుని పట్ల ప్రేమ, పూర్ణ అవగాహన పెంచుకునే ప్రయత్నానికి నాందిగా గురువును ఆశ్రయిద్దాం. ఆయన ఆశీస్సులు పొందుదాం!
0 వ్యాఖ్యలు:
Post a Comment