ధర్మసూక్ష్మాలు
>> Tuesday, April 20, 2010
సమస్త ధర్మాలకు వేదమే ఆధారమని మహర్షులు ప్రబోధించారు. ధర్మమనేది మానవజాతికి వెన్నెముకవంటిది. ధర్మాన్ని విడిచిన మనిషి మనిషిగా జీవించలేడు. ధర్మసూత్రాలతోనే సమాజం వికసిస్తుంది. ఈ మానవ మర్యాదలతోనే సమాజం హద్దుల్లో ఉంటుంది. అందుకే మన పూర్వీకులు మానవ సమాజ సర్వతోముఖ వికాసం, ప్రగతి, అభ్యుదయాల్ని కాంక్షించి ధర్మశాస్త్రాలు రచించి అందించారు. వాటిని పరిశీలించి పాలించడమే మన ధర్మం.
రుషులు త్రికాలజ్ఞులు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఏమి జరుగుతుందో వారికి తెలుసు. అందుకే వారు రచించిన గ్రంథాల ద్వారా సమస్త మానవజాతిని ధర్మమనే మణిహారంలో ముడివేయాలనుకున్నారు. శాస్త్ర ధర్మాలు మనకు బోధించారు. శాస్త్ర నిషిద్ధ కర్మలను చేయకూడదు. వేదం జూదం ఆడవద్దని ఆదేశించింది. దుష్టకార్యాలు చేయవద్దని హెచ్చరించింది. శ్రేయం కలిగించే ధర్మ సూక్ష్మాలు అన్ని కాలాల్లో అందరికీ వర్తిస్తాయి. ఈ ధర్మ జ్ఞానం వేద ప్రతిపాదిత జీవన విధానం వల్ల మనకు కలుగుతుంది.
మనం ఈ లోకంలో అనుభవించే సుఖాలన్నీ భగవంతుడిచ్చినవే. దుఃఖాలన్నీ మనం కోరి తెచ్చుకొన్న పాప ఫలాలే. గృహస్థులు ధర్మబద్ధంగా వస్తువులు సంపాదించుకొని వాటిని త్యాగభావంతో అనుభవించాలి. ఇది నాదికాదనే పరార్థ భావన ఉండాలి. ఇది అందరిదీ అనే విశాల మనస్తత్వం అందరిలో కనిపించాలని వేదమంటుంది.
మనిషి కోరికలకు లొంగిపోకూడదు. విషయసుఖాలు మనిషిని బంధిస్తాయి. అందుకే వివేకవంతుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అందని కోరికలకు ఆశించి భంగపడకూడదు. కోరికలు మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. కోరికలు తగ్గించుకుంటే మనిషి విశ్రాంతిగా ఉంటాడు. దుఃఖానికి కారణం కోరికలేనని బుద్ధుడన్నాడు. అవి తీర్చే కొద్దీ కొత్తవి పుట్టుకొస్తాయి. అందుకే వాటిని అదుపులో ఉంచుకోవాలి. మనస్సు నిగ్రహించుకోవాలి. సంయమనం పాటించాలి. సాధారణ జీవనం సుఖదాయకం. అవసరాలు మనిషిని వేధించి బాధిస్తాయి. అందుకే రుషులు ధర్మాన్ని అతిక్రమించవద్దని పదేపదే హెచ్చరించారు. ధర్మమే ప్రధాన లక్ష్యమని ఉపదేశించారు.
భార్యబిడ్డలు, బంధుబాంధవులు, మనం ప్రేమించిన వస్తువులన్నీ మనల్ని విడిచిపోతాయి కాని- ధర్మం మాత్రం ఎప్పుడూ విడవదు. ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాల్లో మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షాన్ని విడిచి మధ్యలోని అర్థ కామాల వెంట నేటి మనిషి పరుగులు తీస్తున్నాడు. అశాంతికి లోనవుతున్నాడు. బాధ్యతలను విడిచి హక్కుల కోసం ఆరాటపడుతున్నాడు. మన పూర్వులు అందించిన సురక్షిత మార్గాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం అన్వేషిస్తున్నాడు. సహజమైన సుఖశాంతుల్ని విడిచి కృత్రిమమైన ఆనందాలకోసం అర్రులు చాస్తున్నాడు. సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు. జీవనాన్ని భగ్నం చేసుకుంటున్నాడు.
మానవ జన్మ మనకు దివ్యవరంగా లభించింది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. మహా పురుషులను ఆశ్రయించాలి. ఆత్మ పరమాత్మల జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం లేకుండా ముక్తి దొరకదు.
- డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి [ఈనాడు నుండి]
3 వ్యాఖ్యలు:
రుషులు కాదు ఋషులు అని ఉండాలి. గమనించగలరు.
ఆర్యా చక్కని వ్యాసం ఎంచి వ్రాసారు. సంతోషం.
(కంద గీత గర్భ చంపక మాల:-)
ధన కమలాక్షులన్ మదిని ధర్మముఁ వీడుచు; మాయఁ దేలి; మా
ధనమనినన్; మహా భయద ధర్మ విరుద్ధపు భావమొందగా;
మన భ్రమలంచిటన్ సకల మాన మహావినశంబటంచు నా
మనమెఱుగున్ గదా! తెలియుమా! దురవస్తల తేల బోకుమా!
(చంపకమున గల కందము:-
కమలాక్షులన్ మదిని ధ
ర్మముఁ వీడుచు; మాయఁ దేలి; మా ధనమనినన్;
భ్రమలంచిటన్ సకల మా
న మహా వినశం బటంచు నామనమెఱుగున్!
(చంపకమున గల తేట గీతి:-)
మదిని ధర్మముఁ వీడుచు; మాయఁ దేలి;
భయద ధర్మ విరుద్ధపు భావమొంది;
సకల మాన మహావినశంబటంచు
తెలియుమా! దురవస్తల తేల బోకు!
నమస్కారములు.
మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్య వాదములు.
Post a Comment