ఎల్ కేజీ నుంచే ఎమ్ సెట్ కోచింగ్ మనం ఎందుకివ్వలేకపోతున్నాము ?
>> Monday, June 21, 2010
ప్రస్తుతం విద్యారంగం లో చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది . ప్రతివారికీ ఎంతఖర్చు పెట్టైనానాసరే పిల్లలను మంచి చదువులు చదివించాలనే తపన ఎక్కువయింది . రిక్షావాడిదగ్గరనుంచి కోటీశ్వరుని దాకా ఈ మనోస్థితి ఒకేరకంగా ఉంది . ఒకరకంగా ఇది మంచి పరిణామమే . కాకపోతే ఈ తపన పరుగుగామారి , ఈపరుగు పందెం లో వ్యాపారవలయాలలో చిక్కుకుని ఎటు వెళుతున్నామో కూడా ఆలోచించుకోవటం లేదు. ఇది దురదృష్టకరం. పిల్లవాడి విద్యాభ్యసనం లో ఇప్పుడు నెలకొన్న అవాంచిత ధోరణులు ఎటువంటి విపరీతాలకు దారితీస్తాయో విద్యావేత్తలు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా వినేవారు లేరు. ఇంగ్లీషు వాడి పాలనలో వాడి గుమస్తాగిరీ కోసం పోటీ పడి చదివినట్లుగానే ఈ రోజు అమెరికాలో రాత్రింబవళ్ళు గొడ్డుచాకిరీ చేసేందుకు నిద్రాహారాలు ,ఆటపాటలు మరచిపోయి మార్కులయంత్రాలుగా మారి పోతున్నారు . వాటికన్నా విశ్రాంతి ఉందిగాని పిల్లలకు ఆమాత్రం కూడా విశ్రాంతి లేదు .
ఖాళీ లేకుండా చదవాలి .అలాచదివించగలిగి తే చాలు .బట్టీ పట్టించి మార్కులు పిండగలిగితేచాలు ఎంతఫీజైనా కట్టి ఆసంస్థలలో పిల్లలను చేర్చటానికి డబ్బున్నవాల్లు ఎగబడుతున్నారు . ఇది చూసిన మద్యతరగతి, పేదవాల్లుకూడా అటువంటి బిల్డప్ లివ్వగల పాఠశాలలకు తరలిస్తున్నారు . ఆటపాటలకు కూడా పీరీయడ్ ల ను కేటాయించే ప్రభుత్వపాఠశాలలు పనికిమాలినవిగా పరిగణించబడుతున్నాయి . అక్కడున్న వ్యవస్థాపరమైన చిన్నలోపాలు కూడా వీటిని నిరాదరణకు గురిచేస్తున్నాయి . ఇక విద్యారంగం మీద ప్రేమతో విలువలు నమ్మి ఆటుపోట్లు తట్టుకుని నిలబడుతున్న విద్యాసంస్థలు ఈ భీకర తుఫానుకు అల్లలాడిపోతున్నాయి , కూకటివేళ్లతూ సహా పెల్లగించబడుతున్నాయి .
ఇక అర్ధమైనా కాకపోయినా పంజరం లో చిలకల్లా బట్టిపట్టి పలికే ఇంగ్లీషు మీడియంపిల్లలను చూసి జనం పల్లెపట్నం అన్న తేడాలేకుండా అందరూ ఇంగ్లీషుమీడియం మాత్రమే చదివంచాలనే నిర్ణయాలు ఉత్సాహంగా తీసుకుంటున్నారు . ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో పెద్దపట్టణాలకు మాత్రమే ఇప్పటిదాకా పరిమితమైన కార్పోరేట్ విద్యాబేహారులుచిన్న పట్టణాలలో సైతం తమ దుకాణాలు తెరుస్తున్నారు . మాతృభాషలో విద్యాబోధన అంతరానితనమై పోతుంది రానురాను .
ఉదాహరణకు చూడండి . మా మండలం లో మూడు జిల్లాపరిషత్ పాఠశాలలు మరో మూడు ప్రైవేట్ పాఠశాలలు ఉండేవి మొన్నటిదాకా . వాటిలో పోటాపోటీగా చదువులు సాగుతున్నా ఆటపాటలకు కొదవలేదు , మన పాఠశాలకు రెండెకరాలస్థలం ఉన్నందున ,ఆటలు విద్యాభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగమని నమ్మి ఉన్నందున ఆటలకు కొదువలేదు. దరిదాపు ప్రారంభించిన పదహారుసంవత్సరాలలో పదకొడుస్సార్లు రిజల్ట్స్ లో మన పాఠ శాల ప్రథమస్థానంలో నిలచింది .అంతే కాదు వేలరూపాయలు వసూలు చేసే వినుకొండలో పెద్దసంస్థలకు తగ్గకుండా మార్కులసాధించారు మన పిల్లలు .ఈ పోటీలో కొందరు కాపీ సెంటర్లకు పిల్లలను తరలించే అనైతిక మార్గాలు ఎన్నుకున్నారు. ఈపోటిలన్నీ తట్టుకుంటూనే ఉన్నాము సరే నిరుడు కేరళానుంచి కొందరువచ్చి సెయింట్ జూడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రారంభించారు. అదీ ఇరుకు గదులున్న ఒక బిల్డింగ్ తీసుకుని . ఇక చూడండి రెండవతరగతి చదివేపిల్లల కూడా ఇంగ్లీష్ మీడియం కుమార్చి ఎల్ కీజీ లో చేర్చటానికి రైతులు విత్తనాలకెగబడ్డట్టు ఎగబడ్డారు.
మూడువందలమంది [పదవతరగతి తో సహా] విద్యార్థులున్న మన పాఠశాల కు వచ్చిన మొత్తం ఫీజులు దాదాపు నాలుగు నుండి ఐదులక్షలు . ఇక కేవలం ఐదవతరగతి వరకు మాత్రమే క్లాసులు నిర్వహించిన ఈ పాఠశాల వసూలు చేసిన మొత్తం పదహారు లక్షలరూపాయలు . ఇప్పుడు వాళ్ళు స్వంతగా స్థలం కొని దానిలో బిల్డింగులు ఒక చర్చి కూడా నిర్మిస్తూ రెండు వ్యాపారాలకు మార్గం సుగమమం చేసుకున్నారు. ఒకటవతరగతికి మాఫీజు ఎనిమిదివందలు .అదే ఇంగ్లీష్ మీడియం లో మూడువేలు . ఈ సంవత్సరం నారాయణ విద్యసంస్థలు వినుకొండలో బ్రాంచి తెరచాయి . వాళ్ల ఫీజు అదే క్లాసుకు ఆరువేలు పైనే. జనం పోలో మని పరుగెడుతున్నారు . బిల్డింగ్ అద్దెలకు తీసుకున్నారు కనీసం ఆటస్థలం లేదు .ఏదో ఎక్కడో ఉన్నట్లు రికార్డులలో చూపిస్తారు . తల్లిదండ్రులకు ఆవిషయం అక్కరలేదనుకోండి . వచ్చే సంవత్సరం భాష్యం ,శ్రీచైతన్య ఈ టెక్నిక్ స్కూల్స్ మొదలెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అందరూ పల్లెలకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఉన్న పెద్దవిద్యాసంస్థలలో కొత్త ట్రెండ్ మొదలైంది . ఆరవతరగతినుంచే ఐ.ఐటీ ఫొండేషన్ కొరకు శిక్షనట ! ఏమిటీ విపరీతాలు ? మొన్నటిదాకా ఎమ్సెట్ ప్రధానమని ప్రచారం చేశారు . ఇప్పుడిది . పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాక ఏమి చేయాలో ఏమి చదవాలు కూడా వీల్లే నిర్ణయించేస్తున్నారు . తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచనలేకుండా అదొక అదనపు గొప్పతనంగా భావిస్తున్నారు. చిన్నపాఠశాలలు పిల్లలు లేక బోరుమంటూన్నాయి . ఇక ఈ పరుగు పందెంలో విలువలు , నమ్ముకుని మిగిలేదెవ్వరు ? పిల్లల సర్వతోముఖాభివృధ్ధి లాంటి లక్ష్యాలకొరకు కృషిచేసే దెవ్వరు ?
ఈ వ్యాపార ధోరణితో పాఠశాలలను మనం చేయగలమా ? ఎల్ కేజీ నుంచే ఎంసెట్ కోచింగులంటూ విపరీత ప్రచారాలు చేయటం మా లాంటి సంస్థలకు సాధ్యమా ?
7 వ్యాఖ్యలు:
మీ ఆవేదన అర్ధమైంది,ఎక్కడో ఒకచోట ఈ విద్యా వ్యారానికి స్వస్తి చెప్పాలి.
మీ ఆవేదన నిజమే. గొర్రెల ప్రవాహం ఇది. దీన్ని ఆపడం ఒకరిద్దరి తరం కాదు. కానీ ఒక చిన్న మార్పు ఈ మధ్య నేను గమనించింది ఏమంటే ఈ విద్యా విద్యా విధానంపై కొంత అసంతృప్తి కొందరిలో మొదలైంది. తాము పిల్లల అందమైన బాల్యాన్ని నాశనం చేస్తున్నాం అని. నా సర్కిల్ లో విన్నాను. అయితే వారికి ప్రత్యామ్నాయం లేదు. కార్పొరేట్ స్కూళ్ళు వ్యవస్థను భ్రష్టు పట్టించాక మామూలుగా ఉన్న స్కూళ్ళు కూడా అలానే తయారు అయ్యాయి. భూమి గుండ్రం అనుకుంటే ఏదో ఒక రోజు వీటిని పాతిపెట్టనూ వచ్చు. అయితే ఈలొపు ఒకటి రెండు తరాల పిల్లల జీవితాలు నాశన్మ్ అవుతాయి. లోకఙ్ఞానం, సామాజిక సృహ లేక చదువుతో పిచ్చిపట్టిన మానసిక రోగులుగా మన భావి తెలుగు పౌరులు తయారవుతారు.
మన వంతు చేయాల్సింది. వారిలాగే మనమూ నటించాలి. మన బడికీ కార్పొరేట్ రంగు అద్దాలి. జనాల్ని రప్పించాలి. ఆపై మన అజెండా అమలు చేయాలి. విలువలు, సేవాభావం నేర్పాలి. ఇందులో కొంతైనా మంచి ఉంది కదా. ఇదివరకూ కూడా నేను ఇదే అభిప్రాయం చెప్పాను.
దుర్గేశ్వర గారూ,లేనిపోని అయిడియాలివ్వకండి! :-)))
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అది కూడా మొదలుపెట్టేస్తారు మన వాళ్ళు! "ఇన్నాళ్ళూ ఈ ఆలోచన రాలేదేంటబ్బా"అనుకోగలరు.
ఇప్పుడు ఆరోక్లాసు నుంచి IIT కోచింగ్ ఇస్తున్నవాళ్ళు ఎల్కేజీ నుంచి ఎం సెట్ కోచింగ్ ఇవ్వడం పెద్ద లెక్కా ఏమిటి వీళ్ళకి!
త్వరలో పుట్టబోయే ముందు మాతృగర్భంనుంచే పసిపిల్లలకు కూడా ఎమ్సెట్ కోచింగు,ఐ ఐ టి కోచింగ్ ప్రారంభించేలా ఉంది ఇప్పటి Eటెక్నో స్కూళ్ళ పరిస్థితి.
పైన జీవనిగారు చెప్పినట్టు మధ్యతరగతి తల్లితండ్రులకి వేరే ప్రత్యాహ్నం లీకపోవడం తో, గత్యంతరం లేక కార్పోరేట్ స్కూల్ లో చేర్పిస్తునారు, ఇప్పటికే చాల మందికి (మధ్యతరగతి తల్లితండ్రులకి) అసంతృప్తి వచ్చింది. అటువైపు దిశగా అలోచించి అడుగులేస్తే మంచి తరుణోపాయం దొరుకుతుందేమో అనిపిస్తుందండీ! అ మొదటి అడుగు మీరే ఎందుకు వేయకూడదు ఆదిశగా! కానీ, మొదటి అడుగు ఎప్పుడు వొంటరిదే నండీ!
ప్రమీల
ఉన్నతస్థాయి ఇంగ్లీష్ విద్య చదువు ద్వారా social upward mobility సాధించడం ఇప్పుడు అందఱికీ నిరంతరజపం. తాము చెయ్యలేనిది తమ పిల్లలు చెయ్యాలని తల్లిదండ్రులు అఱ్ఱులు చాస్తున్నారు. తాము సంపాదించలేని డబ్బుని ఏదో ఒకరోజు తమ పిల్లలు సంపాదించాలని వారు కోరుకుంటున్నారు. "దాని బదులు మనమే ఎంతోకొంత అదనంగా సంపాదించి మన పిల్లలకి ఇవ్వొచ్చు గదా" అని నా వాదన.
నెల గడుపుకోవడం గురించి కాదు ఈ రోజున జనం గోల. ఎవఱైనా అలా మాట్లాడుతూంటే అది శుద్ధ అబద్ధం. అసలు విషయం - "ఎవడో లక్షలూ, కోట్లూ సంపాదించేస్తున్నాడు. మనం కూడా అర్జెంటుగా సంపాదించేయాలి. వాడు ఫలానా కోర్సు చేసి, ఫలానా దేశానికి వలసపోయి సంపాదించాడు. కాబట్టి మనమూ అలాగే చెయ్యాలి." ఇదీ ఫిలాసఫీ.
మన మీద మనం నమ్మకం కోల్పోయిన పరిణామమిది. మనకిష్టమైన పని చేసి అందులో పైకి రాగలమనే నమ్మకాన్ని మనం కోల్పోయాం. ఇతరులు ఈ స్కూళ్ళ రూపంలో మన జీవితకాలానికొక అజెండా నిర్ణయించి పెడుతున్నారు. ఇందులో ఇంకో మతలబుంది. దేశంలో వస్తు/ వనరుల రూపంలో నిజమైన పాదార్థిక సంపద (real material wealth) లేకుండా ఎంతమంది ఎంత గొప్ప పట్టాల్ని ఏ భాషలో పుచ్చుకున్నా ఉపయోగం లేదు. ఆ సంగతి కప్పిపుచ్చి "మీకు ఇంగ్లీషు బాగా నేర్పిస్తాం, మీరు అమాంతం గొప్పవాళ్ళయిపోతా"రని చెప్పి మోసం చేస్తున్నారు. అది నమ్మి వాళ్ళ దగ్గఱ చేఱి పట్టాలు పుచ్చుకున్నాక వాళ్ళే మళ్ళీ ఒక కొత్త పాట అందుకుంటారు : "మీ అర్హతలకి తగిన దేశం అమెరికానే. అక్కడికి పోండి." అని ! ఇదొక విషవలయం.
నా మనసులో చాలాకాలం నుంచి మెదుల్తున్న ఒక ప్రశ్న విద్యాసంస్థలకి ప్రభుత్వ రికగ్నిషన్ అవసరమా ? అనేది, ఎలాగూ ప్రతివిధమైన విద్యకీ పై స్థాయిలో ఎగ్సామినేషన్ బోర్డులున్నప్పుడు, మన పేపర్లు మన సంస్థలో దిద్దనప్పుడు, పట్టా పుచ్చుకున్న విద్యార్థిని పరీక్షించి గానీ ఉద్యోగాలివ్వని పరిస్థితి కూడా ఉన్నప్పుడు రికగ్నిషన్ ఉన్నా లేకపోయినా విద్య నాణ్యతలో వచ్చిపడే తేడా ఏమిటని ? రికగ్నిషన్ ఉన్న సంస్థలన్నీ అద్భుతమైన విద్యార్థుల్ని తయారు చేస్తున్నాయా ? విద్య పేరుతో డాబు, వ్యాపారం, ప్రభుత్వంలో అవినీతి, సంస్థల్లో డబ్బుకాపీనం, తల్లిదండ్రుల దోపిడి, అధ్యాపకులకి బానిసత్వం తప్ప ఈ రికగ్నిషన్ పద్ధతి ఉద్ధరించినది వాస్తవంగా ఏమిటి ? అని !
మీ స్కూలు మూతపడినందుకు నేను కూడా బాధపడుతున్నాను. ఈ విద్యావ్యవస్థ లక్ష్యం మనుషుల్ని అమెరికా పంపడం తప్ప మఱింకేమీ కాదు. చదువుకు విలువ లేని ఈ వ్యవస్థలో, విద్యాసంస్థల ముసుగులో తయారైన ఈ ప్రైవేట్ పాస్‌పోర్ట్ ఆఫీసుల మధ్య నిజమైన విద్యా+ఆలయాలు మనుగడ సాగించడం కష్టం అని మాత్రం ఒప్పుకుంటాను.
@GREAT DISCUSSION:-
My hearty congratulation to
DURGESWAR garu, SUJATHA gar,
TADEPALLY garu, JEEVANI garu,
PRAMEELA garu & VIJAYAMOHAN garu..
I expect more discussions 4m u..
Thanq..
Post a Comment