మార్గసిద్ధి
>> Monday, April 19, 2010
[కాటూరు రవీంద్రత్రివిక్రమ్]
ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కొందరు ఏ మార్గంలో పయనించాలో తేల్చుకోలేక సందిగ్ధావస్థలో పడి సతమతమవుతుంటారు. చాలామంది ఎలాంటి శారీరక శ్రమాలేకుండా, సాధ్యమైనంత సుఖంగా తమ ఆధ్యాత్మిక ప్రయాణం సాగాలని కోరుకుంటుంటారు. ఫలితాలు, ప్రయోజనాలు ఘనంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. మధుమేహ రోగులు తీపిని తింటూనే రోగం తమను బాధించకూడదనుకుంటే- అది ఎలా సాధ్యం?
సిద్ధధ్వజుడనే మహర్షికి మూడు ఆశ్రమాలుండేవి. ఒక్కొక్క ఆశ్రమంలో నాలుగు నెలలు చొప్పున ఉంటూ, శిష్యులకు జ్ఞానబోధ చేస్తుండేవాడు. సిద్ధధ్వజుడు ఆశ్రమంలో ఉండని కాలంలో శిష్యులు తపస్సులో నిమగ్నమై ఉండేవారు. ఆశ్రమానికి తిరిగి రాగానే వివిధ ప్రశ్నలతో శిష్యుల పురోగతిని అంచనా వేసేవాడు. పరిపూర్ణత సాధించిన వారిని ఆయన ఆశీర్వదించి, ఇతర ప్రాంతాల్లో ఉన్న తపోభూముల్ని సందర్శించాక, చివరిగా హిమాలయాలకు వెళ్లమనే వాడు. విచిత్రం ఏమిటంటే- అలా హిమాలయాలకు వెళ్లినవారికి సిద్ధధ్వజుడు ఒక మంచుగుహలో కనిపించేవాడు. ఆ గుహ రాత్రింబగళ్లు వెచ్చగా ఉండటమే గాక, వెన్నెల వెలుగు లాంటి దివ్యకాంతితో నిండి ఉండేది. సిద్ధధ్వజుడు మౌనముద్రలో ఉండేవాడు. ఆయన విశాల నేత్రాలు శాంతి నక్షత్రాల్లా మెరుస్తుండేవి. శిష్యులు విస్మయంలో తలమునకలవుతూ ఆయనముందు భక్తిప్రపత్తులతో సాష్టాంగపడేవారు. ఆయన మందహాసంతో చేయెత్తి ఆశీర్వదించేవాడు.
వారిని మౌనంగా కూర్చుని ధ్యానం చేయమని సౌంజ్ఞలతో ఆదేశించేవాడు. అలా ధ్యానంలో కూర్చున్న శిష్యులకు క్షణాల్లో ఆత్మసాక్షాత్కారం లభించేది. అలా ఎంతసేపు గడిపారో కూడా తెలిసేది కాదు. కళ్లుతెరిచి చూస్తే సిద్ధధ్వజుడు ఉండాల్సిన చోట కాంతిపుంజం ఉండేది. ఆయన కనిపించేవాడు కాదు. ఆ కాంతిపుంజమే ఆయన ఆత్మస్వరూపంగా భావించి, నమస్కరించి మెల్లగా నిష్క్రమించేవారు శిష్యులు. ఒకసారి అలావచ్చిన శిష్యుల్లో ఆత్మానందుడనేవాడు తిరిగి వెళ్లటానికి ఇష్టపడక అక్కడే ఉండిపోయాడు. మిగతావాళ్లు వెళ్లిపోయారు. సిద్ధధ్వజుడు కనిపించకపోయినా, ఆయన ఉన్నట్టుగానే భావించి ఆత్మానందుడు ఆ గుహలోనే కాలక్షేపం చేస్తూ అధిక సమయం ధ్యానంలో గడపసాగాడు. ఒకరోజు భయంకరమైన మంచు తుపాను వచ్చి గుహబయట వాతావరణం క్షణంలో మారిపోయింది. గుహలోకి రెండు మంచు ఎలుగుబంట్లు పరుగున వచ్చాయి. అవి మనిషిని మించిన ఎత్తున్నాయి. మొదట భయపడినా తరవాత ఆత్మానందుడు నిబ్బరంగా ధ్యానంలో కూర్చున్నాడు. అవి రెండూ సమీపానికి వచ్చి, వాసన చూస్తూ మీదకు వెచ్చని శ్వాస వదిలినా ఆత్మానందుడు చలించలేదు. మరికాస్సేపటికి అవి రెండూ వెళ్లిపోయాయి. అవి వెళ్లిన కాస్సేపటికి ఒక గిరిజన యువతి భయభయంగా లోపలికి వచ్చింది. ఆమె గంపలో పర్వతప్రాంతాల్లో లభించే మధుర ఫలాలున్నాయి. వస్తూనే ఆమె కొన్ని ఫలాలను అతడికిచ్చింది. ఆత్మానందుడు వాటిని తిరస్కరించాడు. ఆమె అనేక విధాలుగా అతణ్ని కామ వికారానికి లోనుచేసేందుకు ప్రయత్నించి విఫలురాలైంది. చివరకు రుసరుసలాడుతూ బైటికి వెళ్లిపోయింది. అంతలో సిద్ధధ్వజుడు లోపలికి వచ్చాడు. ఆత్మానందుడు వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
'ఆత్మానందా! ఆధ్యాత్మిక మార్గమంతా కఠిన పరీక్షలతో నిండి ఉంటుంది. చివరి పరీక్షలకు నిలవగలిగావు. నువ్విప్పుడు నాతో సమానుడవైనావు. అంటే- నువ్వు నాలాగా ఎందరికో మార్గదర్శనం చేయాల్సిన కర్తవ్యం ఉంది. అప్పుడే నువ్వు మార్గసిద్ధుడివవుతావు. వెళ్లు. ప్రపంచంలో ఎందరో మార్గజ్ఞానశూన్యులై బాధపడుతున్నారు. నిస్వార్థంగా వారికి సహాయపడు' అని ఆదేశించాడు సిద్ధధ్వజుడు.
ఆత్మానందుడు గురువు ఆజ్ఞ పాటించి జిజ్ఞాసువులెందరికో మార్గదర్శనం చేశాడు. వారి ఆధ్యాత్మిక ప్రగతికి అనేక విధాలుగా సహాయపడ్డాడు. ప్రలోభాలకు లోబడని వారంతా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించారు. తద్వారా మార్గసిద్ధి అనే ఆత్మానందాన్ని పొందగలిగారు. ఆ విధంగా సిద్ధధ్వజుడి ఆకాంక్ష నెరవేరింది. ఆత్మానందుడు మార్గసిద్ధుడైనాడు.
2 వ్యాఖ్యలు:
గురువులు పెట్టే అంతటి పరీక్షలకు నిబడ్డారు కాబట్టే వారు పురాణ, చరిత్ర ప్రసిద్ది చెందిన శిష్యులయ్యారు. కాలానుక్రమంలో గొప్ప గురువులయ్యారు. అలాంటి ఈదేశంలో నిత్యానందం వంటి వారు కలుపు మొక్కలు ఎందుకో.
శ్రీవాసుకి
ఇదికలికాలం కనుక
Post a Comment