శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాస్తికుడు ఆస్తికుడైనవేళ

>> Friday, July 31, 2020

నాస్తికుడు ఆస్తికుడైన వేళ

చిత్రనిర్మాత సాండొ చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కార్లో వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు కాని కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోవడంతో మాద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు.

దేవార్ కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్సించుకోవడానికి వెళ్ళాడు. 

“ఒక ప్రమాదం జరిగింది” అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు “కన్నదాసన్ ఎలా ఉన్నాడు?” అని అడిగారు. 

తను ఏమి చెప్పకనే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగటంతో దేవార్ ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడు అన్న విషయమంతా స్వామివారికి విన్నవించాడు. 

దేవార్ ఆత్రుతని గమనించి మహాస్వామి వారు “దిగులు పడకు ఏమి పరవాలేదు” అని అతణ్ణి సముదాయించారు. ఆస్పత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి, కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు. 

ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్థిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడాని వారం రోజులముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల (కంచి పీఠాధిపతుల) చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్. 

ఆ త్రికాలజ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకుని దేవార్ తో ఇలా అన్నారు. 

”ఏమి అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుణ్ణి అడ్డుకున్నట్టు, ఈ నాస్తికత్వం అతణ్ణి అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యునివలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంమ్రేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్తానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయలాను సంరక్షించే మాహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?”

దేవార్ ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచం నోట్లో వేసి, మిగిలినదాన్ని దిండు కింద పెట్టాడు. అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి అరసు(కవి రాజు) కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. స్పృహలోకొచ్చిన కన్నదాసన్ కు ఏమి చెప్పాలా అని అలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు. 

మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండడం చూసి ఆనందపడ్డాడు. “నేను ఎన్ని రోజులనుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి అద్దాన్ని తీసుకుని రా” అని చెప్పాడు. దేవార్ ఆద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవార్ కొంచం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవడమూ, వారి అతణ్ణి అనిగ్రహించడమూ మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్ కు చెప్పాడు. 

అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ళపర్యంతం అయ్యాడు. “నన్ను కరుణించారా? నా పైన ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో, మాటలతో వారిని అవమానపరిచాను. ఎంతటి పాపిని నేను?” అని భోరున విలపించాడు. “పూర్తి స్వస్థత పొందిన తరువాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకుని వెళ్ళు” అని దేవార్ ను అర్థించాడు. 

అతని కోరిక ప్రకారం మహాస్వామివారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలువిధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామి వారిపై కవిత రాసాడు. మరలా స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు. 

”ఎవరి కనుచూపుచేతనే అన్ని పాపాలు నశించిపోతాయో 
ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలచినారో 
ఎవరు తన మేధస్సు చేత సత్యా జ్ఞానానికి అర్థం చెప్పగలరో
ఎవరు ఈ విశ్వాన్ని రక్షించాడానికి వచ్చిన విశ్వనాథుడో 
ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో
అటువంటివారి చరణారవిందములకు మనల్ని సమర్పించుకుందాము 
రండి! అందరూ తరలిరండి!!”

మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసన్ తో “నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి

స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తురువణ్ణామలై అర్ధనారీశ్వరుడు. ఆయనే సత్పురుషుడు, మహామనీషి” అని అన్నారు. 

”సనాత ధర్మ వైభవాన్ని గురించి మనస్పూర్తిగా రాయి” అని ఆశీర్వదించి పంపారు. 

అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి, చిన్న మొక్కై, మహావృక్షమై మహత్తరమైన “అర్థముల్లా హిందు మతం; అర్థవంతమైన హిందూ మతం” అనే పుస్తకమై వర్ధిల్లింది.

[పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింతపోకడలతో స్వధర్మాన్ని ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అందుకే ‘కురు పుణ్య మహోరాత్రం’ అన్నారు శంకరులు.]

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
Ik
t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP