శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఓం సుఖప్రదాయై నమః

>> Sunday, August 12, 2012

 లలితా సహస్రనామములలో 191వనామంలో అమ్మవారు దుఃఖాలను తొలగిస్తుందని చెప్పుకొన్నాం. దుఃఖం నశిస్తే లభించేది సుఖం. తన భక్తులకు తలచినంత మాత్రాన పరమసుఖాలను ప్రసాదిస్తుంది అమ్మవారు. ద అనగా ఇచ్చునది. ప్ర అనే ఉపసర్గ వల్ల ప్రకృష్టం అనే అర్థం వస్తుంది. ప్రదే అనగా ప్రకృష్టంగా ఇచ్చునది. అనగా అన్ని సుఖాలూ చాలా ఎక్కువగా, బాగా అవసరాన్ని బట్టి ఇచ్చునది అని ఈ మంత్రార్థం.
సుఖం అనగా ఏమిటి?
ముందుగా ఇహం. ఈ లోకంలో మన శరీరం ఉన్నంత కాలం దీనికి కొన్ని అవసరాలు ఉంటాయి. అవి తప్పక ఉండాలి. అందులో ముఖ్యమైనవి సమయానికి పిపాసకు మంచినీరు, క్షుధకు అన్నం. ఈ రెండూ ఉన్నాక దేహానికి వస్త్రాల వంటి అలంకారాలు, నిద్రకు శయ్య, మానవ్ఞనికి ఇవి సాధారణ సౌఖ్యాలు. ఇక విశేష సౌఖ్యాలంటే, మృష్టాన్న భోజనం, దాసదాసీజనం, భవనాలు, వాహనాలు మున్నగునవి. మన భక్తి ప్రపత్తులనూ, అవసరాలనూ బట్టి అమ్మవారు వీటిని మనకిస్తుంది.

మనకనవసరమైన వాటివల్ల మనకు ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటివి దుఃఖప్రదాలు కనుక అవి ఇవ్వదు. ఇక రెండవ సుఖం పరం. అసలు భగవంతుడంటేనే ఆనంద స్వరూపం. రసోవైసః అని శ్రుతివాక్యం అనగా ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు సుమా అని అర్థం. భగవన్నామం వల్ల, దర్శనం వల్ల, స్పర్శనం వల్ల తరగని, చెదరని బ్రహ్మానందం లభిస్తుంది. ఈ ఆనందాన్ని దేనితోనూ పోల్చలేం. ఎన్ని సుఖాలనుభవించిన జీవికి పుట్టడం, పెరగడం, వార్ధక్యం, మరణం, పునర్జన్మ వంటి దుఃఖాలు తప్పవు. అదే అమ్మను చిత్తశుద్ధితో పట్టుకొంటే ఏనాడూ సంసారబంధాలు మనలను అంటని పరాకాష్ఠ స్థితికి తీసుకువెడుతుంది. మార్కండేయాదులు ఆ భాగ్యాన్ని పొందినట్లుగా పురాణాలు చెపుతున్నాయి. జన్మరాహిత్యమై పరసుఖం అమ్మవారి సన్నిధియే నిజమైన సౌఖ్యం. అది ఇస్తుంది కనుక అమ్మ సుఖప్రదం. కొందరికి ఎంత కష్టపడినా సమయానికి, నిద్ర, భోజనం వంటివి ధనం ఉన్నా లభించవు .దానివలన సుఖమేమున్నది ?

.మంత్రఫలం : ఈ మంత్రాన్ని 40రోజుల పాటు భక్తితో రోజూ 1000సార్లు జపిస్తూ మారేడాకులతో అమ్మను పూజిస్తే ఇటువంటి సుఖాలు ఎక్కడున్నా లభిస్తాయి. వార్థక్యంలో వచ్చే దుఃఖాలు పోవడానికి రోజూ 108సార్లు ఈ నామాన్ని కేవలం జపిస్తే చాలు. ఇక మోక్షం కావాలనుకొన్నవారు రాత్రిపూట ఈ మంత్రాన్ని ఏ కోరికా లేకుండా యథాశక్తి జపించుకోవాలి. స్వగృహ ప్రాప్తికి 90రోజులు తులసి, మారేడు పత్రాలతో అమ్మను పూజిస్తూ, పాయసం నివేదిస్తే రెండేళ్లలోపు సొంత ఇల్లు లభిస్తుంది. 

  - ప్రణవపీఠాధిపతి  వద్దిపర్తి పద్మాకర్‌

1 వ్యాఖ్యలు:

anrd August 12, 2012 at 11:45 PM  

చక్కటి విషయాలను అందించినందుకు కృతజ్ఞతలండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP