ఏకాగ్రతే జయానికి శిఖరాగ్రం
>> Sunday, September 2, 2012
లక్ష్యం ఎంతటి మహత్తరమైనదైనా బిగువైన పూనికతో, ఉగ్రమైన తపస్సుగా ఏకాగ్రతతో ప్రయత్నిస్తే ఆ కృషీవలునికి విజయద్వారాలు తెరుచుకోక మానవు. 'ఆ లక్ష్యానికి నేను అని విధాలా అర్హుణ్ణి' అని భావించి ఉరకలెత్తే ఉడుకుతో, పరుగులెత్తే దూకుడుతో బిరబిరమని ముందుకు సాగాలి. అప్పుడు అధిరోహించవలసిన లక్ష్యం ఎవరెస్టు శిఖరమంతటి మహోన్నతమైనదైనా, ఇంటి ముంగిట నిలిచి ఉన్న నిమ్మ చెట్టులా సులభంగా చేతికందుతుంది.
లక్ష్య లక్షణ సమన్వయానికి ఏకాగ్రతను మూలధాతువుగా, విజయ హేతువుగా భావించవచ్చు. అకుంఠిత దీక్షతో, అంతకు మించిన ఏకాగ్రబుద్ధితోనే ఏ లక్ష్యమైనా ఇట్టే సాధించగలం. ఏకాగ్రత లోపించిన సాధన దేవాలయంలో దైవ దర్శనానికి వెళ్లి దేవుడి మీద చిత్తం నిలపకుండా తాను ఆలయం వెలుపల వదిలిన పాదరక్షల గురించి ఆలోచించే చపలమైన మనసులా ఉంటే విజయం పెనుభారమై, సుదూరతీరంలోనే ఆగిపోతుంది. భారత పురాణాలలోని ఒక ఆసక్తికరమైన గాథ ఏకాగ్రత గొప్పతనాన్ని విడమర్చి చెబుతుంది.
నారదుడి ఏకాగ్రత
ఒకసారి బ్రహ్మదేవుడు నారదుడిని పిలిచి ముల్లోకాలు తిరిగి అక్కడి విశేషాలు చూసి వచ్చి చెప్పమన్నాడు. అయితే ఊరికే కాకుండా శిరస్సు మీద దీపం పెట్టుకుని...దీపం ఆరిపోకుండా, ప్రక్కకు ఒరిగిపోకుండా లోకాలను చుట్టి రావాలని చెప్పాడు. అందుకు సరేనన్నాడు నారదుడు. ఒక శుభముహూర్తాన తన శిరస్సు మీద దీపం పెట్టుకుని ముల్లోకాలను సందర్శించడానికి బయలుదేరాడు. శిరస్సు మీద నిలిపిన దీపం మీదే దృష్టంతా కేంద్రీకరించి అతి జాగ్రత్తగా లోకాలన్నీ విస్తృతంగా తిరిగి బ్రహ్మ దగ్గరకు వచ్చాడు.
నారదుడిని చూడగానే సంతోషంతో "నాయనా! త్రిభువన సంచారం చేసి వచ్చావు. చాలా సంతోషం. ముల్లోకాలలోని విషయాలు, విశేషాలు చెప్పు నాయనా'' అంటూ ఆసక్తిగా ప్రశ్నించాడు సృష్టికర్త. "తండ్రీ! నా దృష్టంతా తలమీద ఉన్న దీపం మీదే నిలిచి ఉన్న కారణంగా లోకాలు చూడలేకపోయాను'' అంటూ వినయంగా ప్రత్యుత్తరమిచ్చాడట నారదుడు. అతనిలోని చెక్కు చెదరని ఏకాగ్రతకు పరమానందం చెంది మనస్ఫూర్తిగా నారదుడిని అభినందించాడట బ్రహ్మ. ఏకాగ్రత యొక్క ఘనతను చాటే చక్కని ఉదాహరణ ఇది.
వివేకానందుని లక్ష్యఛేదన
మరొక ఉదాహరణలో స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక అరుదైన ఘటన ఏకాగ్రత యొక్క ప్రాముఖ్యాన్ని విశదం చేసి మార్గదర్శనం కావిస్తుంది. స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నపుడు ఒక రోజు సాయంత్ర వ్యాహ్యాళికి వెళ్లి నదీతీరంలో నడుస్తున్నారు. అదే సమయంలో ఆ నదిలో వేగంగా కదులుతున్న కొన్ని దొప్పలను కొంతమంది యువకులు తుపాకులతో గురి చూసి కొడుతున్న దృశ్యం ఆయనకు దర్శనమిచ్చింది. అక్కడ గుమికూడిన యువకులలందరూ ఒకరి తరువాత ఒకరు ప్రయత్నించారు గానీ ఒక్కరూ లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇది గమనించిన స్వామి చిరునవ్వుతో నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు.
అది చూసిన ఒక యువకుడు "పక్కవాడు ఏదైనా కార్యంలో విఫలమైతే నవ్వే వాళ్లు ఈ భూమ్మీద చాలామందే ఉంటారు. పరిహసించటం అతి సులువైన విషయం. ఆ లక్ష్యం మీరు అనుకున్నంత సులభమైనదేమీ కాదు. మీలో ఆ నైపుణ్యం ఉంటే లక్ష్యాన్ని సాధించండి'' అన్నాడు వివేకానందుడితో ఆవేశంగా. అంతే! వివేకానందుడు వారి దగ్గరి తుపాకిని తీసుకుని వేగంగా నదీ తరంగాలలో కదిలిపోతున్న పన్నెండు దొప్పలను వరుసగా కొట్టారు. అది చూసి నిర్ఘాంతపోయిన ఆ యువకులు "మీరు తుపాకీలో ఇంత నైపుణ్యం ఉన్న మనిషని మాకు తెలియదు'' అంటూ ఆశ్చర్యచకితులై చేతులు జోడించి ఆయనను శ్లాఘించారట.
వారి పొగడ్తలు పూర్తి కాకుండానే వివేకానందులు తనదైన శైలిలో మందహాసం చేస్తూ ముందుకు సాగిపోయారట. అయినా యువకులు ఆయన వెనకాలే వెళ్లి స్వామి గురిచూసి లక్ష్యాన్ని ఛేదించిన విధం ఎంతో శిక్షణ, పరిశ్రమతో తప్ప సాధ్యం కాదని, వివరాలు చెప్పమని పదేపదే అడిగారట. ఇక సమాధానం చెప్పక తప్పదని గ్రహించిన వివేకానందుడు "నవ యువకులారా! నేను ఇంతకు ముందు తుపాకిని కనీసం ఒక్కసారైనా స్పృశించలేదు. కేవలం ఏకాగ్ర చిత్తంతో ఆ దొప్పల మీదే దృష్టి నిలపడంతో లక్ష్య సాధన సులభమయి వాటిని కొట్టగలిగాను. గురి చూసి వాటిని కొడుతున్నప్పుడు నా సర్వశక్తులు, ఇంద్రియాలను ఆ దొప్పల మీదే కేంద్రీకరించడమే నేను సఫలీకృతుణ్ణి అవడానికి కారణం'' అని చెక్కు చెదరని దరహాసంతో చెప్పగానే నిశ్చేష్టులైన ఆ యువకుల నోట మాట రాలేదు.
లోపం ఎక్కడుంది?
నేను చాలా కష్టపడ్డాను, అయినా విజయం సాధించలేకపోవడానికి కారణం అంతుపట్టటం లేదు అని తలపోసే వాళ్లు ఒక్కసారి ఏకాంతంగా తమ అంతరంగాన్ని రంగరిస్తే లోపం అధిక సందర్భాల్లో మనదేనని తెలుస్తుంది. విధానాన్నీ, వ్యవస్థనూ నిందించే ముందు మన మానసిక అవస్థ ఎలా ఉందో తెలుసుకుంటే, తరువాత ప్రయత్నంలోనైనా అంగరంగ వైభవంగా విజయబావుటా రెపరెపలాడేలా ఎగురవెయ్యగలం.
అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం, భారతదేశం గర్వించదగిన అణుశాస్త్రవేత్తగా భాసించడమే గాక, భారతదేశ అత్యున్నత అధికార పీఠమైన రాష్ట్రపతి పదవిని సైతం అలంకరించగలిగారంటే దానికి కారణం ఆయన తన లక్ష్యం సిద్ధించటానికి చూపిన ఏకాగ్ర బుద్ధే అని అవగతమవుతుంది. ఎన్నో దశాబ్దాలుగా భారతీయులకు షూటింగ్ క్రీడలో అందని ఒలింపిక్స్ పతకాన్ని గగన్ నారంగ్ ఎలా సాధించాడు? క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డులనెన్నిటినో సాధించిన సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాలకు పైబడి ఆడుతూ యువకులతో పోటీ పడుతూ ఇప్పటికీ శతకాల మీద శతకాలెలా పూర్తి చేయగలుగుతున్నాడు. నిత్య విద్యార్థులై, చెదరని ఏకాగ్రతతో, తరగని మనోబలంతో ముందుకు సాగటంతోనే విజయం వీరి ముంగిటే నిలిచి ఉంటోంది.
లక్ష్య సాధనకు కావలసిన శిఖరాగ్రమైన లక్షణం నిరతమూ ఏకాగ్రత వెల్లివెరిసే ప్రబలమైన పథం. అటువంటి తపోనిధికి సకలం సుధాభరితమై తప్పక సాకారమవుతుంది మనోరథం.
- వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
0 వ్యాఖ్యలు:
Post a Comment