ధర్మవ్యాధుని ధార్మికబోధ
>> Friday, April 26, 2013
ధర్మాన్ని మించిన రక్ష ఈ ఇలాతలంలో లేదు. ధర్మాన్ని మనం పాటిస్తే ధర్మం మనకు తోడుగా నీడగా ఉంటుంది. శ్రేయోగర్భితమైన భారతీయ ప్రబంధాలను పరికిస్తే, నాటి కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు ధర్మవర్తనులే ధరలో మిగిలారు. అయితే ఏది ధర్మం, ఏది అధర్మం అన్నది సమయాసమయాలను బట్టి మారుతూ ఉంటుంది. ధర్మాధర్మ విచక్షణ తెలియచేసే మహాభారతంలోని ధర్మవ్యాధునిగాధ ధర్మాసక్తిని కలిగిస్తుంది. ఎదలో ఆలోచనలను రగిలిస్తుంది. ధర్మం అనేది ఏదో ఘనమైన పదార్థం కాదని, తన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా చేయటమే ధర్మంలోని ఉన్నత ఔచిత్యమని అవగతమవుతుంది.
బ్రాహ్మణుని ఆగ్రహం కౌశికుడనే బ్రాహ్మణుడు ఒక చెట్టు మొదట్లో కూర్చుని వేదాలు వలిస్తూ ఉండగా ఆ చెట్టు కొమ్మపై వాలి ఉన్న ఒక కొంగ అతడిపై రెట్ట వేసింది. కౌశికుడు ఆగ్రహంతో ఆ పక్షిని చూడగానే ఆ పక్షి ప్రాణాలు కోల్పోయి నేలపై పడింది. కౌశికుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఎన్నో విధాలుగా విచారించి మిట్ట మధ్యాహ్నం కావడంతో అక్కడికి సమీపంలోని గ్రామానికి వెళ్లి ఒక ఇంటి ముందు నిలబడి 'భిక్షాందేహి' అంటూ భిక్షను అర్ధించాడు. ఆ ఇంటి ఇల్లాలు వెంటనే బ్రాహ్మణయోగికి భక్తితో సమర్పించడానికి పాత్రను కడుగసాగింది.
ఆ సమయంలో ఆ ఇల్లాలి భర్త ఆకలితో ఇంటికి చేరాడు. తన భర్త ఆకలి కడుపుతో ఉండటం చూసిన ఇల్లాలు ఆతృతగా భర్తకు అన్నం వడ్డించి, అతని ఆకలి తీరి సంతుష్టుడయ్యాక, అతనికి సపర్యలు చేశాక తన వాకిలి వద్ద నిలిచిన బ్రాహ్మణశ్రేష్ఠుడికి భిక్షను ఇచ్చేందుకు కౌశికుడి దగ్గరకు వచ్చింది. జరిగిన ఆలస్యానికి ఉగ్రుడైన కౌశికుడు "ఏమమ్మా! నీ భర్తే ఈ లోకంలో గొప్పవాడని తలపోస్తున్నావా? నేను భిక్షకు వచ్చినట్లు నీకు తెలుసు కదా! నన్ను అవమానించడం నీకు తగునా..బ్రాహ్మణులు అవమానించబడితే వారి కోపం అగ్నిజ్వాలలా ఎగసి, ఈ పుడమిని దహించి వేస్తుంది అన్న విషయం నీకు తెలుసు కదా?'' అనగానే ఆ సాధ్వీమణి "అయ్యా..బ్రాహ్మణోత్తముల గొప్పదనం తెలియని దానను కాను.
అయితే..నా దృష్టిలో నాకు దేవుడు నా భర్త మాత్రమే. అయ్యా..మీ కోపం వల్ల ఒక కొంగ చనిపోయింది కదా.. కోపం, మోహం అనే శత్రువులను అణచకపోతే నీవు బ్రాహ్మణుడిగా ఎలా గొప్పవాడవు అవుతావు. ధర్మం మిక్కిలి క్లిష్టమైనది. స్థూలదృష్టికి ఒక రకంగా..సూక్ష్మ దృష్టికి మరొక తీరుగా కనిపిస్తుంది. నీకు వేదాలు వల్లె వేయటం తెలుసు గానీ.. ధర్మసూక్ష్మ నియతి లేదు. నీవు మిధిలా నగరంలో ఉండే ధర్మవ్యాధుడనే పేరుతో విరాజిల్లే బోయవాడిని కలిస్తే ధర్మసూక్ష్మాలను అత్యంత రమ్యంగా తెలియచేయటమే గాక, అపూర్వమైన విచక్షణా జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలడు'' అని చెప్పగానే కౌశికుడు ఆ ఇల్లాలికి కృతజ్ఞతలు చెప్పుకుని మిధిలా నగరానికి వెళ్లాడు.
ఎవరి ధర్మాలు వారివే... అక్కడ ధర్మవ్యాధుని గురించి అడిగి అతనుండే స్థావరానికి వెళ్లాడు. అక్కడ ధర్మవ్యాధుడు మాంసాన్ని ముక్కలు చేసి విక్రయిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూడలేక కౌశికుడు ఒక పక్కకు ఒదిగి నిలుచున్నాడు. కౌశికుడు తన కోసం వచ్చిన విషయాన్ని గ్రహించిన ధర్మవ్యాధుడు, "బ్రాహ్మణోత్తమా! మీరు మా ఇంటికి విచ్చేయండి'' అంటూ అత్యంత మర్యాదతో తన గృహానికి తీసుకువెళ్లాడు. అక్కడ ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను అత్యంత గౌరవప్రపత్తులతో చూడటం కౌశికుడి హృదయాన్ని కదిలించి వేసింది.
అయినా, ధర్మవ్యాధుడు చేసే మాంస విక్రయ వ్యాపారం ఎంతవరకు సమంజసం అనే మీమాంస కౌశికుని హృదయాన్ని తొలుస్తూనే ఉంది. తన సందేహనివృత్తి కోసం కౌశికుడు ధర్మవ్యాధునితో "ఓ మహానుభావా! నీవు ధర్మమార్గం తెలిసినవాడవు. జీవహింస చేయటం మీకు తగునా..'' అంటూ తన సంశయాన్ని వెలిబుచ్చాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో "విప్రోత్తమా! ఈ ధరణిలో ఎవరికి అనువైన ధర్మాలు వారు ఆచరించటమే చేయదగిన ఉత్తమం. బ్రాహ్మణులు నిర్వహించవలసిన ధర్మాలలో తపస్సు, వేదాలను చదవటం. అలాగే క్షత్రియులు పాటించవలసిన ధర్మం శిష్టరక్షణ, దుష్టశిక్షణ కూడిన పాలన.
వైశ్యులు చేయవలసినది వ్యవసాయం...వర్తకం మొదలైనవి. అలాగే, మాంసాన్ని విక్రయించడం వ్యాధుల(బోయవాళ్ల) వృత్తి ధర్మం. ఇందులో ఎటువంటి ధర్మభేదమూ లేదు, ఆత్మఖేదమూ లేదు. ఇలా, సముచితమైన రీతిలో ఎవరికి చెందిన ధర్మాన్ని వారు పాటించటమే ఘనమైనదిగా వేదాలూ ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా గౌరవించి ఆదరించటం కుమారులు ఆచరించవలసిన విద్యుక్త ధర్మం. తనకు తోడుగా, నీడగా మసలే భార్యను అనురాగంతో చూసుకుంటూ, ఆమె మంచిచెడులను చూడటం, వీలున్నంతగా ఆమెకు సహకరించటం భర్తకు ఉన్నతమైన ధర్మం. ఇక తన కోసం, సంతానం కోసం అహరహం శ్రమించే భర్త ఆలన, పాలన చూడటం, అతను అలసి వచ్చినప్పుడు అతనికి సాంత్వన కలిగించడం భార్యకు ఉన్నతమైన ధర్మం.
ధర్మపాలనకు అవరోధాలు... ఈ లోకంలో మనిషికి ఉండకూడనివి, ధర్మపాలనకు అవరోధమైనవి అయిన అవలక్షణాలు కోపం, లోభం. ఎంతో భాగ్యాన్ని కలిగి ఉండీ లోభించువాడు సమాజానికి నిరర్ధకం. తన స్వలాభం కోసమే జీవిస్తూ పరుల ఎడల ఎల్లవేళలా లోభించేవాడు జీవచ్ఛవంతో సమానం. అలాగే ఈ భూతలంలో మనిషికి అంతర్భహిఃశత్రువు అతనికి ఉన్న కోపం. కోపం మనిషిలో ఆవేశాన్ని రగించి అతనిలో ఉన్న ఆలోచనను, విచక్షణ జ్ఞానాన్ని పెకలించి వేస్తుంది. నీ ఉదాహరణలోనే తొలిసారిగా నీవు కోపించినప్పుడు ఒక కొంగ నీ ఆగ్రహానికి బలి అయింది. రెండవసారి నీవు నీ కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఆ ఉత్తమ ఇల్లాలు ఒక రకమైన అశాంతికి గురిఅయినప్పటికీ, నీలో ఒక రకమైన తేజస్సును చూసి, నీకున్న కోపమనే అవలక్షణాన్ని తొలగించడానికి మిధిలా నగరంలో ఉన్న నా దగ్గరకు పంపడం జరిగింది.
నీకు ధర్మబోధ చేశానని గొప్ప కాకపోయినా, ధర్మబుద్ధిని ప్రకటించే గుణాల సారాన్ని ప్రకటించగలిగానని భావిస్తున్నాను'' అంటూ ముగించాడు. కౌశికుడు ఎంతో భావోద్వేగంతో "మహాత్మా! నీవు నా కనులు తెరిపించి ధర్మమంటే ఏమిటో తెలియచెప్పినందుకు కృతజ్ఞుడను. తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూనే, ధర్మసారాన్ని, జీవితానికి విహితమైన ఉత్తమ గుణాలను ఆకళింపు చేసుకుంటాను'' అంటూ తన నగరానికి పయనమై వెళ్లాడు. అందుకే మహాభారతంలో ధర్మం బహువిధాలు. ధర్మానికి శృతి ఎంత ప్రమాణమో పెద్దలు ఏర్పరచిన ఆచారమూ అంతే ప్రమాణం. జీవుల మేలు కోరేది అబద్ధమయినప్పటికీ అది సత్యవాక్య ఫలాన్నే ఇస్తుంది. జీవులకు భయం కలిగించేది, కీడు చేసేది సత్యమే అయినా అసత్యంగానే భావించబడుతుంది. ఇలా ధర్మసూక్ష్మాలను సందర్భాన్ని బట్టి చేసుకోవాలి అన్వయం. అప్పుడు మానవ జీవితం అవుతుంది ధర్మ సమన్వయం!
వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు
1 వ్యాఖ్యలు:
అన్ని యుగాల వారు ఆచరించే విధంగా ఆ నాడే నిర్వచించారు .
ఈ కోపం అహం అనే భావంతో ప్రారంభమై అహంభావంగా పరిణతి చెంది
మనలని నాశనం చెయ్యజూస్తుంది అన్నది నిజమే .
కనుక కినుక వహించకుండా కోపాన్ని , లోభితనాన్ని వదిలేయటం
చాలా చాలా అత్యవసరమే కాదు , నిత్యావసరం కూడాను .
Post a Comment