సంన్యాసం
>> Monday, April 8, 2013
సమన్యాసమే సన్యాసం. కొన్నిటిని వదిలిపెట్టి మరికొన్నిటిని అంటిపెట్టుకుని ఇంకొన్నింటిని వంట పట్టించుకుని, గిరిగీసుకుని పరిధిలకు పరిమితమై ఎవరినీ పట్టించుకోనిది సన్యాసం కాదు. ఇటు లోకాన్ని, అటు లోకాతీతమైనదాన్ని సమన్వయం చేసుకుంటూ దేహాన్ని, మనసును, ఆత్మను ఒకే రీతిలో అనుభవిస్తూ, పరిమిత అవసరాలతో అపరిమిత ఆనంద విహార యాత్రగా జీవితాన్ని ఆవిష్కరించటం సన్యాసం. అన్ని అవస్థలలోనూ, స్థితులలోనూ, మనసును పరబ్రహ్మ భావనతో అనుసంధానం చేసి, ఆనందాన్ని అనుభవిస్తూ, జీవితాన్ని ఆదర్శప్రాయంగా జీవిస్తూ, మరొకరికి స్ఫూర్తిని కలిగించగలగటం సన్యాసం.
మనోవైకల్యం నుండీ కైవల్య స్థాయికి ప్రపంచాన్ని నడిపించగలగటం సన్యాసం.
బోధ గురువులు ఒకవైపు ప్రబోధ భేరి మోగిస్తూ,
లోక గురువులు లౌకిక జీవితాన్ని ఆవిష్కరిస్తూ,
సూచక గురువువు సూచనలిస్తూ,
మోచక గురువులు మోక్షమార్గాన్ని తెలుస్తూ,
వాచక గురువులు విజ్ఞానాన్ని పరుస్తూ,
నిషిద్ధ గురువులు విధివిధానాలను తెలియపరుస్తూ, సమాజాన్ని ఆక్రమిస్తూ, ప్రయాణంలో లెక్కలేనన్ని కూడళ్లను ఆవిష్కరిస్తున్న వేళ, మనిషి బతుక్కి కారణము, పరమార్థము ఎరుకపరచగల స్థిత ప్రజ్ఞామూర్తే సన్యాసి.
"చేసేది అర్పణ ఎలా అవుతుంది, నాన్నా! చేస్తున్నదంతా అర్పణ భావంతో చేయటం సమర్పణ కదూ'' అనే అమ్మ, "సన్యాసం స్వీకరించటమేమిటి, సన్యాసిగా వుండటమే అసులు సంగతి'' అంటుంది.
నమ్మకమంటే...?
నమ్మకం మనం ధరించే వస్త్రం వంటిది కాదు. నమ్మకమంటే చెదరని స్థిరభావన. ప్రాపంచికమైన నమ్మకాలన్నీ అవసరాల చుట్టూ అల్లుకునేవే. అవి కాల గమనంలో మారుతుంటయ్. నమ్మకానికి అమ్మకం అంటూకోకూడదు. ప్రపంచంలో జరుగుతున్న అన్నిటికీ కర్త వున్నాడని నమ్మకం స్థిరమైతేనే, అకర్తృత్వం కలుగుతుంది. అది జరిగిన నాడు అహంకారం ఉండదు. అహం తొలగితే ఆత్మ భావన కలగటం మొదలౌతుంది. మనసు సమన్యాసంలో తన సంచారాన్ని సాగిస్తుంది.
శంకర భగవత్పాదుల స్థితిని, భగవాన్ రమణుల ఆత్మానుభవాన్ని, బుద్ధుడి అన్వేషణని, వీరందరి కంటే ముందు యోగేశ్వర కృష్ణుడి మహాయోగాచార్యతను, ఆయనకంటే ముందరి శ్రీరామచంద్రుడి మనస్సన్యాసాన్ని, అధ్యయనం చేస్తే, వారంతా కర్త ఆజ్ఞను పాలించటమెట్లాగో, పాలిస్తే ఎట్లా వుంటుందో, జీవితం ఎంతగా పరిపూర్ణ స్థితిని సంతరించుకుంటుందో స్పష్టమౌతుంది. అమ్మపరంగా సన్యాసమంటే దేనినో వదులుకోవటం మాత్రమే కాదు, దేనినీ పట్టుకోకపోవటం కూడా! అందుకే ఒక సందర్భంలో "పట్టు కోకే కాదు నాన్నా, గోనె సంచీ చుట్టుకుని వుండగలను'' అన్నది. అది మనస్సన్యాసం.
నదీసదృశం
ఎవరి జీవితమైనా నదీసదృశం. అమ్మ వంటి వారిది మహాసముద్రం. అన్నిటినీ కలుపుకోవటం దాని లక్ష్యం, లక్షణం, గుణం. మధుర జలాలతో కూడిన నదులన్నీ దాని సంగమించినా, తన సహజగుణమైన ఉప్పదనాన్ని కోల్పోని స్థితి సముద్రానిది.
ఎందరెందరో తనను నిందించినా, నిష్ఠురమాడినా, అన్నిటినీ అనుభవించిన కరుణాసముద్ర అమ్మ! వేదాంతాన్ని అనుష్ఠానపూర్వకంగా బోధించినా, వేదనను, నిర్వేదాన్ని సమంగా స్వీకరించినా, కులభేదం పాటించక, మానవతను దర్శించినా, శబ్దజాలం వదిలి, అంతరార్థపరమార్థ బోధనలో హృదయ భాషను వినిపించినా, ప్రజ్ఞానం బ్రహ్మైతే, అజ్ఞానం బ్రహం కాదా, అని సూత్రీకరించినా, మనసు దైవమైనపుడు, అది చేసే మననంలోంచి పుట్టిన మంత్రదైవం కాదా, మంత్రాక్షరాన్నీ దైవం తాలూకు అక్షర రూపాలని, మహపరితాస్యన్ని విశదం చేసినా, బ్రహ్మ దైవమతే యయుడు దైవం కాడా అని ప్రశ్నించినా, అమ్మ గృహిణిగా సాగించిందీ, సాధించిందీ సమన్యాసమే.
ఎవరినీ దూరం పెట్టని...
ఎవరినీ దూరం పెట్టని, పెడగా నిలబెట్టని, పరంగా చూడనిదే అమ్మ చేసిన సన్యాసం.
'కుక్క, పిల్లి, పాము, ఆవు, కాకి, చీమ, దోమ, పామరుడు, పండితుడు, సాధకుడు, శోధకుడు, జ్ఞాని, విజ్ఞాని, అంటూ, సొంటూ, జననం, మరణం, స్థితీ, గతీ...యివన్నీ అనుకోవటానికే గాని, యిన్నెక్కడున్నయ్? ఉన్నది ఆత్మే! నడిపిస్తున్న వాడు కర్తే! ఇందులో ఎవరి పాత్రాలేదు. ప్రమేయమూ లేదు అంటున్న అమ్మది సమన్యాస విన్యాసం.
తామరాకు మీద నీటిబొట్టు, బిందువును నిలుపుకున్న ఆకు ఎంతగా అంటించుకోకుండా వుండగలిగితే సన్యాసం. తమలపాకు మీద నీటిబొట్టు ఆకును తడుపుతూ, ఆకును శుభ్రపరుస్తూ మొత్తపరుస్తూ, తాంబూల నిర్మాణంలో తానొకటే, నమలబడి, నులమబడి, అస్థిత్వాన్ని కోల్పోయి, చివరకు తూష్ణీకరింపబడితే, అది ఏమి?
సర్వ సమన్వయ భావన సన్యాసం!
అమ్మది సమన్యాసం, గృహస్థాశ్రమానికి పచ్చతోరణం అమ్మ!
వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
0 వ్యాఖ్యలు:
Post a Comment