శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆధ్యాత్మిక శిరోమణి అప్పలాచార్యులు

>> Saturday, April 6, 2013


శ్రీమద్రామాయణం, తిరుప్పావై, భాగవతం మున్నగు దివ్య ప్రబంధముల ప్రవచన ప్రచారములకు తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి, భక్తాగ్రగణ్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, మహామహోపాధ్యాయ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులవారు. వైదిక సంప్రదాయ సముద్ధరణకు వారు ఒనరించిన సేవ చిరస్మరణీయము. సంస్కృత ఆంధ్ర ఆంగ్లములలో వారి పాండిత్యము అనన్య సామాన్యము.

శ్రీ భాష్యం అప్పలాచార్యులుగా ప్రసిద్ధులైన శ్రీమాన్ శ్రీభాష్యం అనంత అప్పలాచార్యులవారు 1922 ఏప్రిల్ 6వ తేదీన (చైత్య శు.నవమి) విజయనగరానికి 15 కి.మీ. దూరంలో ఉన్న పద్మనాభం అన్న గ్రామంలో శ్రీనివాసాచార్య, తిరువేంగళమ్మ దంపతులకు జన్మించారు. అన్న ప్రాశన నాడు ముందు రామాయణ గ్రంథాన్ని తరువాత కలాన్ని ముట్టుకున్న కారణజన్ములు అప్పలాచార్యులు. చిన్నప్పుడే తల్లి సుమతీశతకం, కృష్ణశతకం, ముకుందమాల నేర్పగా విజయనగరం మహారాజా కళాశాలలో ఎందరో పండితుల వద్ద శాస్త్రాధ్యయనం చేసే అదృష్టం ఆయనకు కలిగింది.

ఆనాటి సాంప్రదాయానుసారం 13వ యేట పదేళ్ల తిరువెంగళమ్మతో వివాహమైంది. ప్రైవేట్‌గా ఇంటర్, బిఎ పాసైన తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎ సంస్కృతంలో ఉత్తీర్ణులయ్యారు. పుట్టకొండలోని సంస్కృత పాఠశాలలో ప్రారంభమైన వీరి ఉద్యోగపర్వం అనంతరం శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ కళాశాలల్లో ఉపన్యాసకునిగా సేవలందించారు. దశాబ్దాల పాటు ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగాయి.

1993లో రామాయణం బాలకాండ తత్త్వదీపిక ఆవిష్కరణ మొదలు 93-97 మధ్యకాలంలో రామాయణం 8 భాగాలు, భాగవతం, తిరుప్పావై, దాశరథీ శతకం, మాండూక్యోపనిషత్, ముకుందమాల, విభీషణశరణాగతి, ఆదిత్యహృదయం, ఏడుకొండలు-ఏడుకాండలు, శ్రీతత్త్వం-భగవతత్త్వం, గీతాజ్యోతి, రాముడు మానవుడే తదితర అనేక గ్రంథాలు ఆయన లేఖిని నుంచి వెలువడ్డాయి. ప్రవచన శిరోమణి అన్న బిరుదు లభించింది. 2003 జూన్ 7వ తేదీన అప్పలాచార్యులవారు మహాప్రస్థానం చేశారు. వారి ప్రవచనాలు వినే భాగ్యం సమకాలికులైన కొందరికే కలిగింది. కాని వారందించిన ఆధ్యాత్మిక సాహిత్యం తరతరాలకు కరదీపికగా నిలుస్తుంది.

ప్రసాదవర్మ కామఋషి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP