శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మత్స్యావతార మహాత్మ్యం

>> Saturday, April 13, 2013

మత్స్యావతార మహాత్మ్యం



ధర్మాన్ని నిలపవలసిన బాధ్యత ధరణిపై జీవనం సాగించే జనులందరిపై ఉంది. ధర్మమనే పదానికి ప్రాతిపదిక నశించి, ధర్మపథానికి పూర్తిగా మార్గ బంధనం జరిగి, అధర్మ వర్తనం ఎల్లెడలా నర్తించినప్పుడు జగద్రక్షకుడైన పరమాత్మ ఒక్కడే ధర్మ పరిరక్షకుడు కాగలడు. అధర్మమనే వటవృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి జగతిని చీకటిలా కమ్ముకుని 'ధర్మం' సంపూర్ణంగా అవనతమైనప్పుడు ధర్మ రక్షకత్వాన్ని నిలిపే బాధ్యతను దశవిధావతారుడైన శ్రీమహావిష్ణువు స్వయంగా తన భుజాలపై వేసుకున్నట్లు వేదాలు, పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఈ మన్వంతరం ప్రారంభంలో సముద్రాలన్నీ కలగలిసి ఏకార్ణవంగా పొంగి ఉప్పొంగినప్పుడు జగత్ప్రళయం సంభవించిన తరుణంలో శ్రీ మహావిష్ణువు వైవస్వతమనువును మత్స్యావతారియై రక్షించాడు. మత్స్యావతారుడు ఈ చరాచర జగత్తుకు చేసిన మేలును ఎంత కొనియాడినా తక్కువే.

మత్స్యావతార గాథ
వైవస్వత మనువు ఒక సందర్భంలో పితృ తర్పణం సమర్పిస్తున్నప్పుడు నీటితో కూడి రెండు చేతులు కలిసిన అతని దోసిలిపై ఒక మత్స్యం దర్శనమిచ్చింది. ఆ చేప యొక్క మనోహరమైన రూపాన్ని తిలకించిన మనువు దానిని రక్షించదలచి దానిని తన కమండల జలంలో వేశాడు. ఆ మత్స్యం ఒక అహోరాత్రంలో పన్నెండగుళాల పొడవు పెరిగి 'రాజా! రక్షించు! రక్షించు!' అనగానే మనువు ఆ మత్స్యాన్ని వెడల్పైన మూతిగల మట్టిపాత్రలో వేశాడు.

అది మరొక అహోరాత్రంలో మూడు మూరలంత పెరగగానే మనువు బావిలో వేశాడు. అయితే బావిలోనూ ఇమడక, సరోవరంలోనూ సరిపోక పరిణామం పెరిగిన ఆ చేప 'రాజా! రక్షించు..రక్షించు' అనగానే మనువు ఆ విచిత్రమైన చేపను పావనమైన గంగానదిలో వేశాడు. విశాలమైన గంగా తరంగాలకే వన్నె కలిగేలా కన్నులు చెదిరే కాంతులీనుతూ ఆ మత్స్యం గంగానది మొత్తాన్ని ఆక్రమించింది. ఇక మనువు చివరి ప్రయత్నంగా సువిశాల సముద్రంలో ఆ చేపను వేయగా అపారమైన సముద్రజలం మొత్తాన్ని ఆ చేప ఆక్రమించగానే మనువు సంభ్రమంతో 'ఓ మత్స్యరాజమా! నీవెవరు? మాయాజాలం చేసే రాక్షస రాజువా! ఈ మహీమండలాన్ని రక్షించే వాసుదేవుడవా! దయచేసి తత్వబోధ చేయి తండ్రీ' అనగానే మత్స్యరూప ధారియైన శ్రీమన్నారాయణుడు 'మహారాజా! నీకు నా అనియత తత్వం తెలియజెయ్యాలనే ప్రయత్నంలోనే నేను మత్స్యరూపాన్ని ధరించాను. అతి త్వరలోనే జగత్ప్రళయం సంభవించబోతోంది.

ఆ విపత్తులో నిన్ను రక్షించే ఆపద్బాంధవుడను నేనే! ప్రస్తుతం సముద్రంలో నీకు కనిపించే దేవనౌక ప్రళయ సమయంలో నీకు కొందంత అండగా ఉంటుంది. నీవు ఈ ధరాతలానికే విజ్ఞాన మూలకందాలైన వేదాలను, జీవులకు ప్రాణధాతువులైన ఔషధులను, జీవ పునరుత్పత్తికి మూలకారకాలైన బీజాలను ఆ ఓడలో జేర్చు. దానికి కావలసిన మహత్తరమైన శక్తిని నీకు నేను అందిస్తాను. నేను మత్స్యరూపుడనై అవతరించిన ఆ తరుణంలో నా బలమైన కొమ్ముకు దివ్యకాంతులతో నిండిన ఈ నావను బంధించు.

నేను నిన్ను, వేదాలను, సమస్త ఔషధులను, బీజాలను రక్షిస్తాను' అని పలికి అంతర్ధానమయ్యాడు. శ్రీహరి చెప్పినట్లే ప్రళయం సంభవించినప్పుడు వైవస్వత మనువు ఆ నౌకలో ప్రాణధాతువులను, విజ్ఞాన సేతువులను ఉంచి నౌకను మత్స్యానికి ఉన్న కొమ్ముకు కట్టి ముందుకు సాగాడు. ఆ సమయంలో జగన్మోహన మత్స్యమై సంభ్రమం గొలిపిన జగన్నాటక సూత్రధారుని నామామృతంతో మునులు, సమస్త దేవతలు తరించారని పురాణాలు చెబుతున్నాయి. మత్స్యావతార మాహాత్మ్యాన్ని తెలుపుతూ బ్రహ్మ నారదునితో 'కుమారా! ప్రళయ కాలంలో శ్రీమన్నారాయణుడు విచిత్రమైన మత్స్యావతారాన్ని ధరించాడు. నా వదనం నుండి జారిపోయిన వేదాలను సంకీర్ణం కాకుండా, అపార జలంలో మునిగి జీర్ణం కాకుండా ఆ సర్వాత్ముడు కాపాడాడు. ఆ వేదాలను విభజించి దేవతల కోరిక మేరకు మళ్లీ నాకు ప్రీతితో అందజేశాడు.

మహనీయమైన ఆ మత్స్యావతార ప్రాశస్త్యాన్ని వివరించడం ఎవరికీ సాధ్యం కాదు నాయనా' అని చెప్పినట్లు మహాభాగవత ద్వితీయస్కంధంలో పేర్కొనబడింది. మత్స్యావతారాన్ని గురించిన వైదిక కథ శతపథ బ్రాహ్మణంలోనూ మనకు కనిపిస్తుంది. మత్స్యరూపుడైన విష్ణువును ఆరాధించే మంత్రం వేదాలలో చెప్పబడింది. మత్స్యావతారుని ప్రార్థన శుక్ల యజుర్వేదంలోనూ మనకు కనిపిస్తుంది. సోమకాసురుడు వేదరాశిని అపహరించి అపార జలరాశియైన సముద్రగర్భంలో దాస్తే మత్స్యరూపంలో శ్రీమహావిష్ణువు సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించాడనేది మరొక ఐతిహ్యం.

మత్స్యావతార బోధ
మత్స్యావతారం అఖండ భూమండలానికి విశేషమైన సందేశాలనెన్నిటినో అందచేసింది. అపార జలనిధిలో దాగిన విజ్ఞాన వారాశులైన వేదాలను వెలికి దెచ్చి అజ్ఞానపు చీకట్లను పారద్రోలిన విధాన్ని ఎంత కొనియాడినా తక్కువే! మత్స్యం అంటే చేపకు ప్రధానమైనవి కళ్ళు. ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించి అవగాహన చేసుకోవాలనేది మత్స్యం మనకిచ్చే సందేశంగా మనం భావించవచ్చు.

మత్స్య జయంతి
శ్రీమహావిష్ణువు మత్స్యరూపంలో మనువుకు దర్శనమిచ్చిన చైత్ర శుక్ల తదియ నాడు (ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ) మత్స్య జయంతిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అదే విధంగా మార్గశిర శుక్ల ద్వాదశిని మత్స్య ద్వాదశిగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ రెండు రోజులూ మత్స్యావతారుని ఆరాధనకు ప్రత్యేక దినాలుగా పేర్కొనబడ్డాయి. మత్స్యావతారుని విశిష్టమైన ఆలయం మన రాష్ట్రంలోనే నెలకొని ఉండటం విశేషం. చిత్తూరు జిల్లాలోని నాగలాపురంలో మత్స్యరూపధారుడైన వేదనారాయణుడు కొలువై ఉన్నాడు.

కరుణానిధియై లోకపారాయణుడైన వేదనారాయణ స్వామిని భక్తితో కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. మత్స్యజయంతి నాడు, మత్స్య ద్వాదశి నాడు స్వామికి దేవాలయంలో విశేష పూజలు జరుగుతాయి. వేదమయుని విభ్రాజమానమైన మత్స్యావతార గాథ స్వామి సహజసిద్ధమైన ధర్మరక్షణా ప్రకృతి! జగత్కల్యాణ కారకాలైన వేదాలను అందించిన ఈ అవతారగాథ అజ్ఞానపు చీకట్లను పారద్రోలిన మహిమాన్వితమైన సుకృతి! భారతీయ సంస్కృతీ ప్రాభవంలో మనోజ్ఞమైన దివ్యకృతి!

వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP