దివ్యత్వానికి నాంది
>> Saturday, April 13, 2013
కొంత నిర్దిష్టమైన కాలాన్ని, శక్తినే మనం 'జీవం' అంటాం. శక్తి వేరే విషయమైనా కాలమనేది మాత్రం మన ప్రమేయం లేకనే గడిచిపోతుంది. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే ఒక నెల. సూర్యుని చుట్టూ భూమి ఒకసారి తిరిగితే ఒక సంవత్సరం. ఈ సూర్యునితో, చంద్రునితో ఈ భూమి ఉన్న స్థానాన్ని బట్టి అది మన వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. మన శరీరం, మనసులపై ఈ సూర్యచంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ భూమి ముఖ్యంగా సూర్యుని శక్తి వల్లే నడుస్తున్నది. మీ శరీరం కూడా ఈ భూమిలో ఒక అంశమే. సూర్యుని శక్తి ఎంత గ్రహించగలవన్న దానిని బట్టే నీకెంత శక్తి ఉన్నదో అనేది. అందువల్ల సూర్యుని చుట్టూ భూ పరిభ్రమణం కాలాన్నే కాక, మన శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే జీవానికి ప్రధాన అంశములైన కాలమూ, శక్తి అనేవి రెండూ సూర్యుని వల్ల నిర్దేశింపబడినవి. అందువల్ల భూమిపై సూర్యుని ప్రభావం అత్యంత మహత్వపూర్వమైనది.
కాని, సూర్యునిలాగా చంద్రుడు శక్తిని ప్రసరించకపోయినా, చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉండడం వల్ల మనపై దాని ప్రభావం కూడా ఎక్కువే. మన పుట్టుకే చంద్రుని గతిపై ఆధారపడి ఉన్నది. ఎందుకంటే స్త్రీ శరీరంలోని ఋతుక్రమానికీ, చంద్రుని గతికీ పూర్తి సంబంధం ఉన్నది. చంద్రుని ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణపరమైనది కాదు, అది అయస్కాంతపరమైనది. ఈరోజు విద్యుత్తు దేనినో తిప్పడం, తిరగడం మూలంగానే తయారవుతున్నది-వేరే మార్గంలేదు.
అదే విధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణల ద్వారా శక్తి క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నది. అందువల్ల భౌతికంగా బయట నుంచి జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే సూర్యునిపరంగా ఆలోచించాలి. అంతరంగంలో జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే చంద్రునిపరంగా ఆలోచించాలి. మానవుని అంతరంగంలో జరిగే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతులు సహజంగానే చాంద్రమానాన్ని లేక సౌర చాంద్రమానాన్ని అనుసరించాలి.
భారతీయ స్కృంతీపరంగా దీనిని పంచాంగం అంటారు. మనకు భౌతిక, అంతర్గత శ్రేయస్సులు రెండింటిపైనా ఆసక్తి ఉంది కాబట్టి మన పంచాంగం సౌరచాంద్రమాన పరమైనది. అది చంద్రుని చలనాన్ని, సూర్యుని చుట్టూ భూమి చలనాన్ని, స్థితిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ విధంగా క్యాలెండర్ తయారు చేసుకోవడం ఉత్తమం. దురదృష్టవశాత్తు అటువంటిదొకటి ఉందని కూడా ఈకాలంలో చాలామందికి తెలియదు.
ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలెండర్లలో ఇది ఒకటి. ఈ క్యాలెండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. ఉగాది భారతీయ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం. ఇప్పుడు భూమి సూర్యునికి అతి సమీపంలో ఉన్నది. ఎదగటానికి వేసవి అత్యనుకూలమైనది. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఎందుకంటే వాటి పెరుదలకే అవసరమైన కిరణజన్య సంయోగ క్రియ ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. కాని భూమిపై ఉండవలసిన వాటినన్నిటినీ నాశనం చేశాము కాబట్టి వేసవి అంటే అత్యంత అసౌకర్యమైన కాలమైంది. అసలు వేసవి అంటే ఎడారులలోనే అసౌకర్యంగా ఉండాలి. భూమి మీద జీవనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉత్సాహంగా జరగవలసిన సమయమిది. ఎఱుకతో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది.
పాత, కొత్త ఏదీ లేదు
ఈ అనంత విశ్వంలో, పాత సంవత్సరం కొత్త సంవత్సరం అంటూ ఏమీ లేవు. ఈ ఎల్లలన్నీ మనం మన జీవితాన్ని లెక్కించుకోవానికి ఏర్పర్చుకున్నవి. అందువల్ల క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే మానవునిగా పురోగమించామా లేదా గమనించాలి. మీ వ్యాపారం వృద్ధి చెంది ఉండవచ్చు. బాగా సంపాదించి ఉండవచ్చు. అది కాదు అసలు విషయం.
మానవునిగా క్రితం సంవత్సరం కన్నా కొద్దిగానన్నా మెరుగయ్యామా? వచ్చే సంవత్సరం ఇప్పటికన్నా మెరుగయ్యామా తెలుపడానికి ఒక చిహ్నం కావాలి. అన్నిటికన్నా మీరు మెరుగైన మానవులు కావాలి-ఇంకా సంతోషంగా, శాంతంగా, ప్రేమగా- అన్ని రకాలుగా ఉత్తమమైన మానవునిగా కావాలి. దానికి మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆ విధంగా అడుగులు వేస్తే మీలో మానవత్వం పొంగి పొర్లి దివ్యత్వం సంభవిస్తుంది. నా ఆశీస్సులు.
0 వ్యాఖ్యలు:
Post a Comment