శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరిత్ర 62-67

>> Thursday, July 12, 2012

పూర్వజన్మలో మనము ఏమేమి కర్మలు చేశామో, ఎలాంటి స్వభావంగల వ్యక్తులమై ఉన్నామో, ఆ కర్మలఫలాన్ని అనుసరించి, వాటి ప్రమాణాలను బట్టి, తరువాతి జన్మలో వర్తమాన శరీరం నిర్మించబడింది. వర్తమాన జన్మలో మనం చేస్తున్న మంచి చెడు కర్మలు మనకు చక్కగా తెలుసు. మంచి పని చేస్తే మంచి ఫలము, చెడు పనులు చేస్తే దుష్ఫలము అనుభవించవలసి వస్తుంది. దీనిని అందరూ అంగీకరించాలి. వర్తమాన జన్మలో మనము ఎలాంటి మనుష్యులంగా తయారవుతున్నామో, ఈ పనుల వలన భవిష్యజ్జన్మలో ఎలాంటి స్వభావంకల వ్యక్తులము అవుతామో తెలుస్తుంది. చక్కగా ప్రయత్నం చేస్తే మనంతట మనమే అదంతా తెలుసుకోగలము. ఇతరుల సహాయం అక్కరలేదు.
వర్తమన జన్మ యొక్క ఇహలోకమే పూర్వజన్మ యొక్క పరలోకము. అలాగే వర్తమాన జన్మ యొక్క పరలోకము భవిష్యత్ జన్మ యొక్క ఇహలోకము. ఈ స్థూల శరీరంలోపల మరొక శరీరం కూడా వున్నది. దాని పేరే సూక్ష్మశరీరము. దానిలోపల మరొక శరీరం ఉన్నది. అ కారణ శరీరము. అరటి చెట్టులోని పొరలలాగా ఒకదానిలో ఒకటిగా ఉన్న ఈ త్రివిధశరీరమే సంసార ప్రవాహంలో ప్రకాశిస్తున్నది. మానవశరీర నిర్మాణము- ఆకృతి, వర్ణము, స్వభావము, పండితుడు లేదా మూర్ఖుడు, కఠోర స్వభావుడు లేదా నమ్రస్వభావము, పండితుడు లేదా అధర్మవర్తి, సాధువు లేదా అసాధువు, సరళస్వభావుడులేదా కుటిలుడు, రాజులేదా జమిందారు, మధ్య తరగతివాడు లేదా పేదవాడు, ఉన్నత వంశస్థుడు లేదా నిమ్న వంశస్థుడు వంటివి అన్నీ పూర్వజన్మ కర్మానుభవంవలన వర్తమాన శరీరంగా ఏర్పడినవి. అదేవిధంగా తిరిగి ఈ జన్మ యొక్క ఫలాన్ని అనుసరించి, భవిష్యత్ జన్మ యొక్క శరీరము తయారవుతుంది.
జన్మనుంచి మృత్యువువరకూ ఉన్న కాలమును ఆయువు అంటారు. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే జీవుని ఆయువు అనంతమైనది. జీవుడు అక్షరుడు, అపరుడు. జీవుడు నశించిన తరువాతనే ఆయన ఉపకరణములు నశిస్తాయి. జీవుడు ఎంత పుణ్యాత్ముడైతే అతని ఆయువు కూడా అంత ఎక్కువగా ఉంటుందని, అతడు అంత ఎక్కువ కాలం జీవిస్తాడని సాధారణంగా నమ్ముతారు. కాని అది పొరపాటు. జీవుడు ప్రపంచానికి ఎంతోదూరంగా ఉంటాడు. ఆయనను పాపము స్పృశించదు. జీవుడు కర్మఫలాన్ని అనుభవించటానికి ఈలోకానికి వస్తాడు. ఎందుకంటే ప్రపంచము కర్మఫలమును అనుభవించే స్థానము. పుణ్యాత్ములైనవారు ఎప్పుడు కర్మఫలమును అనుభవించలేరు.
అందువల్లనే జీవుడు కర్మఫలమును పూర్తిగా అనుభవించిన తరువాతనే పాపములనుండి విముక్తుడవుతాడు. అంతవరకూ అతడు ప్రపంచంలోనే ఉండవలసి వస్తుంది. పుణ్యాత్ములైనవారు చాలారోజుల వరకు ప్రపంచంలో ఉండవలసి వస్తుంది. పుణ్యాత్ములైనవారు చాలా రోజులవరకు ప్రపంచంలో ఉండాలి. అలాగే పాపాత్ములైన వారు కూడా ఈ ప్రపంచంలోనే ఉండి తమ కర్మఫలాన్ని అనుభవించాలి. కర్మఫలము సమాప్తమైన వారు ఈ ప్రపంచం నుండి విముక్తులవుతారు. జీవితము ఎంత తొందరగా లయించిపోతే అతడు అంత పుణ్యాత్ముడు. పాపంనుండి విముక్తుడయ్యాకనే ఈశ్వరునిలో లయమవుతాడు. అప్పుడు అతని ఆయువు అనంతమై, భగవంతుని సంకల్పం ఉన్నంతవరకూ అతని శక్తి ఉంటుంది. మనిషి ఈ విధంగా పాపపుణ్యాల ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్లనే కర్మఫలము పరిసమాప్తము కాకపోతే మళ్లీ మళ్లీ ఈ ప్రపంచంలో పుట్టవలసి వస్తుంది. పంచ భూతముల ప్రతిమ అయిన ఈ మానవుడు మృతి చెందిన తరువాత ఎక్కడికి వెళతాడు. లేక మృత్యువే చివరిదా? అని అడిగితే మనుష్యులు తమ కర్మఫలమును ఈ జన్మలోనే అనుభవిస్తారని, మృత్యువే చివరిదని ఇంగ్లీషు వారంటారు. ఆ విధంగా అనటం అన్ని విధాలా పొరపాటని చెప్పనవసరం లేదు. ఈశ్వరుడు ఉన్నాడంటే పరజన్మకూడా ఉన్నదని తప్పకుండా స్వీకరించాలి.

ఒకవేళ ఈశ్వరుడు ఉన్నాడంటే మనుష్యుని ఆత్మకూడా ఉన్నదని ఒప్పుకోవాలి. ఈశ్వరుని నశింపజేయలేనప్పుడు, ఈశ్వరుని శక్తిని, మనిషిని, ఆత్మను నశింపజేయలేము. ఒకవేళ పరజన్మ లేదంటే ఈశ్వరుని దయామయుడని ఎప్పుడూ అనలేము. అందుకు కారణము ఈ జీవితంలో ఒకడు రాజుగా, ఒకడు ప్రజగా ఒకడు ధనవంతుడుగా, ఒకడు దరిద్రుడుగా, ఒకడు పెద్ద ఇంట్లోను మరొకడు చిన్న ఇంట్లోను ఎందుకు పుడతారు? పూర్మజన్మలో చేసిన కర్మప్రకారము దాని ఫలము పూర్తికాకపోతే మిగిలిన కర్మఫలము ననుసరించి మరొక శరీరము ధరిస్తారు.
అందుకు స్పష్టమైన ప్రమాణము పుట్టకతో గ్రుడ్డివారైనను ఈ జన్మలో ఏమీ చూడలేరు. కాని మిగిలినవారందరూ చక్కగా చూడగలుగుతున్నారు గదా! దానికి కారణం ఏదైనప్పటికీ పూర్వజన్మ పాపఫలాన్ని అనుభవిస్తున్నామని మాత్రం ఒప్పుకోరు. ఈ జన్మలో లభించిన శరీరము, ఆకారము, స్వభావము, జ్ఞానము మొదలైనవన్నీ పూర్వజన్మ కర్మఫలము వలననే సంభవించినాయని నమ్మాలి. ఈ జన్మలో దొంగతనం వృత్తిగా స్వీకరించి జీవనము గడుపుతున్నవాడు పూర్వజన్మలో కూడా వాని ఆకారము, స్వభావము, రాక్షసునివలె కఠినమై ఉండి ఉంటుంది. అలాగే ఈ జన్మలో ధర్మాచరణముతో జీవితము గడుపుతున్నవాని ఆకార స్వభావములు పూర్వజన్మలో కోమలంగా ఉండి ఉంటాయి.
ఒకడు తన జీవితాన్ని సంపూర్ణంగా ధర్మాచరణతో గడుపుతూ ఉన్నప్పటికీ సుఖంగా లేడు ప్రపంచంలో నానా రకాలైన కష్టాలనూ పొందుతున్నాడు. మరొకడు అతి గర్హితములైన పనులు చేస్తూ లంపటుడై రాక్షస ప్రవృత్తిలో తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. ఇదంతా పూర్వజన్మకు ప్రమాణము మాత్రమే. కాని ఒకడు జీవితంలో ధర్మాచరణ చేసినా సుఖమును పొందటంలేదు. అయినప్పటికీ అతడు ఎప్పుడో ఒకప్పుడు సుఖమును పొందవచ్చును. కాని ఈ జన్మలో కష్టపడుతున్నాడంటే అదంతా పూర్వజన్మ కర్మఫలమనే చెప్పవచ్చును. వాటిని అనుభవించే సమయం ఆసన్నమైనా, అతడు కష్టాలను పొందుతున్నాడు. రెండో వ్యక్తి పూర్వజన్మలో చేసిన సుకృతమునకు అనుభవించటానికి సమయం ఆసన్నమైనది కనుక అతడు సుఖ జీవనం గడుపుతున్నాడు. కాని దాని తరువాత అతడు ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. పాప కర్మలు అనుభవించటం ఈశ్వరునివల్లనే అని, అట్లాగే పుణ్యకర్మలు అనుభవించటమూ ఈశ్వరుని దయే అని కొందరు అనుకొంటారు. ఇదంతా అజ్ఞానంతో కూడిన అభిప్రాయము.
మన ప్రవృత్తులు, ఇంద్రియములు మంచి చెడులను చేయిస్తాయి. కోపపడితే అనిష్టం జరుగుతుంది. కామం ఉంటే కావాలనే కోరిక నెరవేరవచ్చును. లోభం ఉంటే ఇతరుల ద్రవ్యాలను అపహరించే చేష్టలు జనిస్తాయి. అహంకారంవలన ఇతరులకు అనిష్టం చేసే ఆలోచన కలుగుతుంది. ఇట్లా ఏది దేని ధర్మమో, అది ఆ పని చేయిస్తుంది. అందువల్లనే భగవంతుడు మనిషికి హితాహిత విచక్షణా శక్తినిచ్చి, జీవరాశిలో శ్రేష్టునిగా చేశాడు. మృత్యువుతో ఆత్మ నశించదు. అట్లా కాకపోతే ఈశ్వరునకు ప్రతిరోజూ అనేక ఆత్మలను సృష్టించవలసి వచ్చేది. దానివలన భగవంతుని పని ఎంతో పెరిగిపోయేది. అది సర్వశక్తిమంతమైనది.
శరీరం నశించిపోయినా ఆత్మకు ఎలాంటి హానీ కలుగదు. ఇల్లు నాశనమైపోయినా ఇంటిలోని ఆకాశానికి ఎలాంటి క్షితీ కలుగదు కదా! ఆత్మ దేనినీ చంపదు. దేని చేతనూ చంపబడదు. ద్వేషము సంతాపనమునకు, సంసార బంధమునకు కారణము.
ద్వేషమునకు మృత్యువునకు సంబంధము. అందువలన బలవంతంగానైనా ద్వేషమును త్యజించాలి. సుఖ దుఃఖములు మనస్సుకు ఉంటాయి. కాని ఆత్మకు ఉండవు. ఆత్మ వాయువులాగా నిర్మలము, నిర్లేపము. అయినా ఈశ్వరమాయచే మోహితులమై మనము సుఖముదుఃఖములను అనుభవిస్తూ ఉంటాము. విశ్వమోహిని- అనాది- అవిద్యా అనే వాటి పేరే మాయ. కేవలం పుట్టక చేతనే ఆ అవిద్య లేదా మాయతో జీవునకు సంబంధం ఏర్పడుతుంది.
అప్పుడది సంసార బంధమవుతుంది. మనస్సు, బుద్ధి, అహంకారములు జీవునకు సహకరిస్తాయి. ఎవరు చేసిన కర్మఫలాన్ని వారే అనుభవించాలి. అంటే ఎవరి కర్మఫలం ఎట్లా ఉంటుందో, వారు అలాంటి ఫలానే్న అనుభవిస్తారు. తిరిగి జన్మించినప్పుడు జీవుడు మనస్సు మొదలైన వాటన్నింటితో సంబంధంకలిగి శరీర ధారణ చేసే బాధ్యత వహిస్తుంది. జీవుడు ముక్తుడు కానంతవరకూ అదే ప్రకారం పరిభ్రమించవలసి ఉంటుంది.
శరీరమే మనస్తాపమునకు మూలము. శరీరమే సంసార కారణము. కర్మఫలము వల్లనే ఈ శరీరము పుట్టినది. కర్మ రెండురకాలు: పాపము, పుణ్యము అనేవి. పాపపుణ్యముల ననుసరించియే శరీరధారికి సుఖదుఃఖాలు కలుగుతాయి. ఎంత పాపంచేస్తే అంత దుఃఖము, ఎంత పుణ్యం చేస్తే అంత సుఖము లభిస్తాయి. రాత్రి పగళ్లుగా అవి ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. ఈ అనుభవములు పూర్తి కానంతవరకూ ముక్తి లభించదు.
జీవుని శరీరమునకు కర్త ఆత్మ. ఆత్మహీనమైన శరీరానికి సుఖదుఃఖములు కలుగవు. శబ్ద స్పర్శ రూప రస గంధములలో దేనికీ జ్ఞానం ఉండదు. ఆత్మ శరీరమునకు కర్త అని నిశ్చయమైంది. సుఖ దుఃఖముల అనుభవము శరీరమునకు ఆత్మ లేకుండా కలుగవు. ఆత్మ ఏకాకిగా వెళ్లిపోతుంది. శరీరము దాని వెంట పోదు. అందువలన కేవలము ఆత్మను శిక్షించటం అసంభవము. ప్రతి ఒక్క శరీరంలోను భగవంతుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ యొక్క అంశ మాత్రమే! పాపము అనేక రకాలు అయినట్లు, వాని శిక్ష కూడా అనేక రకాలుగా ఉంటుంది. అట్లాగే పుణ్యముకూడా అనేక రకాలు. దానివలన కలిగే ఆనందం కూడా అనేక రకాలుగా ఉంటుంది. చేసినపాపానికి శిక్ష పరితాపమే. అట్లాగే చేసిన పుణ్యానికి పురస్కారము ఆనందము. పాప పుణ్యములను నిర్ణయించటానికి మానవ హృదయమే ఒక త్రాసు పుణ్యంవలన సంతోషము, పాపంవలన పరితాపము అనేవి మానవ హృదయంలోనే జన్మించి, అతను చేసిన కర్మకు తగిన ఫలాన్ని ఇస్తాయి. ఈ పరిణామాలను గ్రహించినవారు బుద్ధిమంతులై, పాపము నుంచి తమను తాము మరల్చుకొంటారు. ఆ విధంగా పాప పుణ్యములను గురించి ఆలోచన, వాటి ఫలభోగము ఈ జగత్తులోనే అవుతాయి. పంచ భూతములు కేవలం పరమాణువుల సమాహారమే. పరమాణువు అవినాశకము. అందువలన పంచభూతములు కూడా అవినాశకములే. మృత శరీరము పంచభూతములు కూడా అవినాశకములే. మృత శరీరము పంచభూతాలలో కలిసిపోతుంది. ఈనాడు నీ ముందున్న శరీరము పూర్వజన్మలోని ఏదో జీవి యొక్క శరీర పరమాణువుల చేత నిర్మితమైనది. అందువలన ఒకప్పుడు ఉండిన జీవి యొక్క పూర్వజన్మ ఫలమే నీ ముందున్న మానవుడు.
ఏ ఆత్మ ఎంత పరిమాణంలో పాపం నుంచి విముక్తి పొందుతుందో, ఏ ఆత్మ విషయభావనా శూన్యమైనదో, ఆ ఆత్మ అంత గొప్పది. ధార్మికుని ఆత్మ పాపి యొక్క ఆత్మ కంటెగొప్పది. ఆ ఉన్నత ఆత్మ శరీరాన్ని త్యజించినప్పటికీ అది ఉన్నతమైన ఆత్మగానే ఉంటుంది. ఆత్మ పురుషుడు; శరీరము ప్రకృతి. ఆత్మ- ప్రకృతికి సమీపం కానంతవరకూ అది వాసనాత్మకమై ఉంటుంది. అది శరీరమును త్యజించగానే పూర్వస్థితిని పొందుతుంది. ఆత్మ ప్రారంభ దశలో నిర్గుణమైనప్పటికీ, శరీరస్థమైనప్పుడు సగుణ సంపన్నమవుతుంది. అది పాపం నుంచి విముక్తిని పొందనంతవరకూ పాపఫలమును అనుభవిస్తూనే ఉంటుంది.
పశు శరీరము నుంచి మనుష్య శరీరాన్ని ధరించటానికి, దాని స్వభావంలో మార్పు తీసుకొని రావటానికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పశువు నుంచి మనుష్యుడు కావటం ఎంత కష్టమో, మనిషి నుంచి పూర్ణ మనుష్యత్వం పొందటం అంత కష్టము. మనిషి నుంచి దేవత్వం పొందటం ఎంత కష్టమో, మనిషి నుంచి ఉత్తమ మనుష్యత్వం పొందటం అంతకన్నా కష్టము. శుభకార్యములను అనుష్ఠించచి మనుష్యుడు దేవుడు కావచ్చు కాని అనాయాసంగా నిజమైన మనుష్యుడు మాత్రం కాలేడు.

సమస్త భోగాలమీది ఆశలను త్యజిస్తే కాని ముక్తి మందిరంలో చేరలేడు. సకామమైన శుభకార్యముల వల్లముక్తి మార్గం మరీ దుర్లభమైపోతుంది. స్వర్గలోక భోగములను అనుభవించటం పూర్తి అయిన తరువాత జీవుడు తిరిగి మర్త్యలోకంలో ప్రవేశించటానికి యోగ్యమైనది అవుతుంది. అందువలన మహాపురుషులు ఎప్పుడూ స్వర్గలోకమును కోరుకోరు.
ఎందుకంటే - కర్మఫల భోగము తప్ప, స్వర్గముకూడా చిరస్థాయియైనది కాదు. అసలైన మనుష్యత్వాన్ని పొందటానికి ఇంద్రియాల విజృంభణను అరికట్టాలి. అరిషడ్వర్గ వశీకరము, అంతఃకరణ విశుద్ధీకరణ, అన్నింటియందును సమదృష్టి, అభిమాన త్యాగముమొదలైనవి మనుష్యత్వసిద్ధికి ప్రధాన మార్గములు. అవేకాక- శవము, దమము, తితిక్ష, సమాధానము శ్రద్ధ, ఉపరతి వంటి గుణాలు కూడా మానవునిలో ఉండాలి.
మనుష్యత్వం పొందినప్పటికీ మానవునికి సహజంగా ముక్తిమీద కోరికుండదు. విషయ భోగాలలో ఎంతవరకూ కష్టం అనుభవించడో, అంతవరకూ జీవుడు మహా జితేంద్రియుడు- యోగీంద్రుడు అయినప్పటికీ మోక్షమును సాధించలేడు. మోక్షమును సాధించటానికి ప్రధానోపాయము వాసనలను త్యజించటమే. ముక్తి కావాలనుకొన్నా ముక్తి కూడా లభించదు. మహాత్ముల సత్సాంగత్యంవలన తొందరగా ముక్తి లభిస్తుంది. జీవునికి తన సుకృతంవలననే ఆ సత్సాంగత్యం లభిస్తుంది. సాధువులు సాధారణంగా నిర్జన ప్రదేశాలలో ఉంటారు. వారు సహజంగా కనిపించినా వారిని మనము గుర్తించలేము.
ఒకవేళ మనం వారిని గుర్తిస్తే, వారు మనను తమ సమీపంలో ఉండనివ్వరు. ఒకవేళ వారికి సమీపంలో ఉండగలిగే అధికారం సంపాదించుకొన్నా వారి నిర్మల హృదయ సహాయమును సాధించలేము. ఒక సాగరమును తరించటనికి నావ సహాయం అవసరమైనట్లుగానే, ఈ సంసార సాగరాన్ని తరించటానికి మహాత్ముల నిర్మల హృదయ సహాయం అవసరము. సత్సాంగత్యమువలన అంతా సులభం అవుతుంది. ధార్మికుని ఆత్మ ధర్మబలంచేత క్రమంగా ఉన్నతిని పొంది, ఆ తరువాత మోక్షమును పొందుతుంది. అలాంటి ఉన్నతి ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో సాధ్యం అయ్యేది కాదు. ఎంతోకాలం ప్రయత్నం చేస్తే కాని మోక్షం లభించదు. దానికి వ్యతిరేకంగా పాపాత్ముని ఆత్మ అధోగతిని పొందుతుంది. స్వర్గనరకములు ఏవీ లేక, ఆత్మకు ఉన్నతి- అవనతి మాత్రమే ఉంటాయి. ఆత్మౌన్నత్యము. ఆత్మ అవనతుల ననుసరించి వివిధ అవస్థలను పొంది మానవుడు జన్మిస్తాడు.
ఈ విశాల ప్రపంచంలో ఎవరు ఎక్కడ జన్మిస్తారో పరిశోధించి తెలుసుకోలేము. అందువలననే మానవులు పునర్జన్మను విశ్వసించరు. పునర్జన్మను కాని, పూర్వజన్మను కాని మనము చూడలేము. పునఃజన్మించిన వారెవ్వరూ వచ్చి చెప్పలేదు. కేవలము అనుమానము- యుక్తుల చేత మాత్రమే నమ్మవలసి ఉంటుంది. లేకపోతే- ధర్మాధర్మములకు, పాపపుణ్యములకు ఎలాంటి తేడా ఉండదు. మనుష్యుడు పాపం చెయ్యటానికి ఎందుకు భయపడతాడు? అందుకు కారణము పరజన్మ మీది విశ్వాసమే! పరజన్మలో ఘోరమైన నరకయాతనలు అనుభవించవలసి వస్తుందనే భయమే అందుకు కారణము.
ఈ జీవితంలో ఒకరు విద్వాంసుడు, ఒకరు మూర్ఖుడు, ఒకరు పండితుడు, ఒకరు జ్యోతిష్యుడు, ఒకరు గొప్ప గాయకుడు, ఒకరు గొప్ప వాద్య నిపుణులు కావటానికి కారణము వారు పూర్వజన్మలో అందులో సంపాదించిన నైపుణ్యమే. ఈ శరీరములోని ఆత్మ అదే కాని శరీరము మాత్రం భిన్నమైనది.
అందువలన వారికి ఆ విషయాలు సహజంగా లభిస్తాయి. అంతేకాని నేర్చుకోటానికి ప్రత్యేకంగా కృషి చేయనక్కరలేదు. కర్మఫలం లేకపోతే అలాంటి భేదాలు ఉండవు. మంచి కర్మలకో, చెడు కర్మలకో అతడు ఇంత కష్టపడవలసిన అవసరం ఉండదు. మంచి పనులు చేస్తే ఉచ్చదశ లభిస్తుంది. చెడ్డ పనులు చేస్తే నీచ దశ లభిస్తుంది
.ఆత్మబోధకు అర్థము- మనను మనం తెలిసికొనటం. మనను మనం తెలుసుకోగలిగితే భగవంతుని కూడా తెలుసుకోగలము. మనను మనం తెలుసుకోలేనంత వరకూ భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలుసుకోలేము. మనమేమిటో తెలుసుకోవాలంటే ఆత్మ- మనస్సు - బుద్ధి అన్న మూడింటి తత్త్వాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది.
సూర్యుడు భూమికి ఎట్లా కర్తో, అట్లాగే ఆత్మ శరీరానికి ప్రధాన వస్తువు, యజమాని, కర్త. సూర్యుని కిరణాల ప్రసరణవల్లనే, అన్ని జీవులు తమ తమ కార్యాలను చేసుకోగలుగుతున్నాయి. వాస్తవానికి సూర్యుడు ఏమీ చెయ్యడు. అలాగే మనుష్య శరీరంలో ఆత్మయే సూర్యునిలాగా కర్తయై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంవల్లనే ఇంద్రియాలు పనిచేస్తాయి. అంతేకాని ఆత్మ నిజంగా ఏమీ చెయ్యదు. ఇప్పుడు ఆత్మ సాకారమా నిరాకారమా అని తెలుసుకోవాలి. అంతేకాక శరీరంలో ఏ స్థానంలో, ఎట్లా అది ఉన్నదో తెలుసుకోవాలి. ఆత్మ అని చెప్పబడే దానికి హద్దులున్నాయి. కాని దానికి దేనితోనూ పోల్చగల ఆకారం లేదు. మన ఆత్మ- ఇతరుల ఆత్మ రెండూ ఒకే రకమైనవి. ఒక కాగితం మీద నానా రకాల చిత్రాలు చిత్రింబడినప్పటికీ వాటన్నింటికీ ఆ కాగితమే ఆధారమైనట్లు, జగత్తులోని అన్నింటి ఆత్మ ఒక్కటే! ఆత్మను గురించి మనం కొన్ని రోజులు మననం చేసినప్పుడు, ఆ ఆత్మ అగ్నికణంలాగా ప్రకాశిస్తున్నదని నిశ్చయంగా తెలుసుకొంటాము. ఆత్మ ఉన్నది కనుక పరమాత్మకూడా ఉన్నట్లే. అదే ఈశ్వరుడు. ఆత్మయొక్క విశిష్ట రూపమే ఈశ్వరుడు. అందువలన ప్రయత్నం చేస్తే అది తప్పక కన్పిస్తుంది. ఎందరో మహాపురుషులు దానిని చూశారు. ఇంకా ఎందరో చూస్తారు. కనుక ఆత్మ సాకారమైనదనటంలో సందేహం లేదు. ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకోవచ్చు. అట్లాగే పరమాత్మను తెలుసుకొంటే భగవంతుని లేదా ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఆత్మ పరమాత్మ యొక్క అంశమే అనేది నిశ్చయమైన విషయము. అందువలన, ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకోవచ్చు.
మనస్సు- బుద్ధి సకారములా, నిరాకారములా అని తెలుసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. మనస్సు విశ్వవ్యాప్తి కాదు. అది కొన్నిపరిధులు వరకే పరిమితమై ఉంటుంది. కనుక మనస్సు ఒక వస్తు విశేషమే అని నిశ్చయమవుతుంది. కొంతమంది ఇది మా మనస్సు, ఇది నీ మనస్సు అని అంటారు. ప్రతి మనిషీ చేసే పనులు వేరు వేరుగా ఉంటాయి. అట్లాగే మనస్సు చేసే పనులు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఇదికూడా ఆలోచిస్తే తెలుస్తుంది. అందువలననే మనస్సు కూడా సాకారమైనది. ఒకవేళ మనస్సు స్థానవ్యాపకతా రూపమైన ధర్మమును స్వీకరించకపోతే, దానిని వస్తువు అనరాదు. అప్పుడు మనస్సును ఏదో ఒక ప్రకారమైన స్థానవ్యాపకతా ధర్మ విశిష్ట వస్తువు యొక్క గుణమని అనాలి. సామాన్యంగా స్థూల ఇంద్రియాల సహాయం లేకుండా, ఏ ద్రవ్యమూ ఆకారమును పొందదు. కనుక మనస్సు యొక్క ఆకారము ఏ రూపంలో ఉన్నదో అర్థం కాదు. ఆకార శబ్దపు యదార్థ అర్థం తెలిస్తే ఎవరికీ ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. ఒక్కసారి ఆలోచించి చూడు- నీ మనస్సు నీ శరీరం కన్న సంపూర్ణమైన భిన్న వస్తువుగా ఉండి కూడా, నీ శరీరంలోని ఏ భాగంలోను లేదు. అట్లా ఉండటం కూడా ఎప్పుడూ జరుగదు. కనుక మనస్సు సాకారమైనదని నిశ్చయమవుతుంది. అంతేకాక దానిని బట్టి మనస్సు యొక్క కార్యములు కూడా విభిన్నములని తెలుస్తుంది.
బుద్ధి జగద్య్వాపి కాదు. కాని దానికి ఏదో ఒక హద్దు ఉన్నదనేది నిశ్చయమైన విషయము. కనుక బుద్ధికూడా ఒక వస్తు విశేషమే. అందరికీ బుద్ధిసమానంగా ఉండదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి బుద్ధి తక్కువగా ఉంటుందో వారిని బుద్ధిహీనులని అంటారు. బుద్ధి ఒక స్థానాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు అది సాకారమైనదనటంలో సందేహం లేదు. బుద్ధి మంచి చెడులను విచారిస్తుంది అనేది తెలిసిన విషయమే.
 మనస్సు - బుద్ధి రెండూ తలలో ఉంటాయిని సహజంగా తెలుసుకోవచ్చును. జీవశరీరంలో బుద్ధి అద్దంలాగా ఉంటుంది.
ఒక్క ప్రణవ మంత్రంవల్లనే ఈ జగత్తులో సృష్టి స్థితి లయ కార్యములు జరుగుతున్నాయి. ఆ ప్రణవ మంత్రాధి దేవత అగ్ని. ఈ అగ్నిలోని శక్తివల్లనే జగత్ చక్రం తిరుగుతున్నదని హిందువులు అనుకొంటారు. కాని అగ్నిగత శక్తి చైతన్యవంతమైనదని వారు భావించరు. హిందువులకు ప్రణవమంత్ర లక్ష్యం అగ్నిగతశక్తి. అది బ్రహ్మ. దాని గుణము చైతన్యము.
మన వ్రేలు మన చేతితో కలిసి ఉన్నంతవరకూ అది చైతన్యవంతమై ఉంటుంది. ఆ వ్రేలిని కోసి దానిని మన నుంచి వేరు చేస్తే దానిలో చైతన్యం ఉండదు. అది అచేతనమైన జడపదార్థం అయిపోతుంది. ఈ సమస్త జగత్తు చేతనామయుడైన ఒక పురుషుని శరీరము మాత్రమే. అది భిన్న భిన్న శక్తులకు ఆధారము. అగ్ని, వాయువు, నదులు, పర్వతములు, మట్టి మొదలైనవన్నీ ఆ శరీరముయొక్క అంగములు. అగ్ని అచేతనామయ పురుషునికన్న భిన్నము కాదని తెలిస్తే అందులో చైతన్యం ఉన్నట్లు తెలుస్తుంది. అచేతనామయ పురుషునితో అగ్నికి సంబంధం లేదనుకొనేవాడు అగ్ని జడపదార్థం అనుకొంటాడు.
ఆత్మ ఎల్లప్పుడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అది అన్నిచోట్లా ప్రకాశించదు. అది నిర్మల బుద్ధియందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఇంద్రియాలు తమ తమ పనులో నిమగ్నమై ఉండటంవల్ల ఆత్మయే అన్ని పనులలోనూ నిమగ్నమై ఉన్నట్లు అవివేకులు అనుకొంటూ ఉంటారు. ఉదాహరణకు మేఘములు పరిగిడుతూ ఉండటం వలన చంద్రుడు పరిగిడుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. సూర్య కిరణముల ఆధారంగా మనుష్యులు తమ తమ పనులు చేసుకొంటూ ఉన్నట్లు, శరీరము- ఇంద్రియాలు- మనస్సు - బుద్ధి అనేవి చైతన్య స్వరూపమైన ఆత్మను ఆశ్రయించి తమ తమ పనులు చేస్తూ ఉంటాయి.
అనురాగము, కోరిక, సుఖము, దుఃఖము మొదలైన వృత్తులు బుద్ధిలోనే కలుగుతాయి. ఆత్మలో కాదు. కారణమేమిటంటే- సుషుప్తి అవస్థలో ఆత్మ ఉంటుంది, కాని బుద్ధి ఉండదు. కనుక, ఆ సమయంలో రాగము- కోరిక వంటివి ఉండవు. ఏ విధంగా సూర్యుని లక్షణము ప్రకాశము, జల లక్షణము శీతలత్వము, అగ్ని లక్షణము ఉష్ణత అయి ఉన్నాయో, అట్లాగే సత్యము, చైతన్యము, ఆనందము, నిత్యత, నిర్మలతలు ఆత్మస్వభావములు. ఆత్మ యొక్క అస్తిత్వము, చైతన్యపు అంశ, బుద్ధివృత్తుల సంయోగంవల్లనే అవివేకులైన వారిలో ‘మాకు తెలుసు, మేము చేస్తున్నాము’ వంటి ప్రవృత్తులు కలుగుతున్నాయి.
ఆత్మకు ఎలాంటి వికారమూ లేదు. ఏ పరిస్థితులలోను బుద్ధి ఆత్మను ప్రబోధించలేదు. అందువలన జీవుడు ఆ సంయోగ వస్తువును తెలుసుకొని, ‘మేము జ్ఞానులము, మేము ద్రష్టలము’ అన్న జ్ఞానంతో ముగ్ధులవుతున్నారు. ఎట్లాగంటే-త్రాడులో సర్పభ్రాంతి కలిగినప్పుడు, సర్పభయం కలుగుతుంది. కాని అది త్రాడు అని తెలిసిన తరువాత ఆ భయం ఉండదు. అట్లాగే జీవునిలో ఆత్మకు జీవజ్ఞానమున్నట్లు భావిస్తే భయం కలుగుతుంది. మనము జీవులము కాము, మనము పరమాత్మయే అనుకొన్నపుడు ఇక భయం ఉండదు.
మనస్సు, బుద్ధి, మొదలైన ఇంద్రియాలను ఆత్మ ప్రకాశింపచేస్తుంది. అచేతనమైన బుద్ధి మొదలైన ఇంద్రియాలను ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఎట్లాగంటే- దీపం అన్ని వస్తువులనూ ప్రకాశింపజేస్తుంది. కాని దీపాన్ని ఏ వస్తువూ ప్రకాశింపజేయలేదు. దీపానికి దాని స్వరూపమైన ప్రకాశం ఉండగా మరొక దీపం యొక్క అవసరం లేనట్లు, ఆత్మకు కూడా తన స్వరూపము తెలిసిన తరువాత మరొక జ్ఞానము యొక్క అవసరం ఉండదు.
అవిద్యవలన ఉత్పన్నములైన దృశ్య వస్తువులన్ని నీటి బుడగలలాగా నశించిపోయేవే! ఈ సమస్త వస్తువులకూ పైన ఏ నిర్మల బ్రహ్మమున్నదో అదే మనమని తెలుసుకోవాలి. ఇది మన శరీరము కాదు.
- ఇంకాఉంది
[ తెలుగు అనువాదం: ఆచార్య హరిశివకుమార్ ఆచార్య రేగులపాటి మాధవరావు]



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP