శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీరెన్నన్నా చెప్పండి మా ఆంజనేయస్వామి మాత్రం బ్రహ్మచారే !

>> Sunday, January 22, 2012

మీరెన్నన్నా చెప్పండి మా ఆంజనేయస్వామి మాత్రం బ్రహ్మచారే !. ఇది నాభావన కాదు. కోట్లాదిమంది హనుమద్భక్తులలో స్థిరమైన భావన. పండితులను ,శాస్త్రకారులను నేనుదహరించలేనుగాని సామాన్య భక్తులలో మాత్రం ఈనమ్మకాన్ని దూరంచేయలేము. రాబోయే మన్వంతరానికి ఆయన బ్రహ్మపదవిని చేపట్టనున్నారు కనుక ఆయనకు సూర్యశక్తిని సువర్చలాదేవిగా నిర్ణయించి ఆయనకు వివాహం జరపటం జరిగిందని అయితే ఆయన గృహస్థాశ్రమంలో ఉన్న బ్రహ్మచారని పెద్దలమాట. అయితే శాస్త్రవచనం ఎటున్నా సాధారణ భక్తులలో మాత్రం ఆయన బ్రహ్మచారే. అసలదే ఆయనలో ఉన్న గొప్ప ఆకర్షణీయగుణం జనులకు. ఈభావన ఎంత బలంగా ఉందో నాకెదురైన అనుభవాలలో చిన్నసంఘటన మీకందిస్తాను.

ఓ పది సంవత్సరాలక్రితం అనుకుంటా కమ్మవారి పాలెం అనే గ్రామంలో హనుమదభిషేకాలు జరిపాము మాబృందం.
ఆగ్రామానికి సంబంధించిన వాడలో భక్తులు మాకోసం కూడా అభిషేకాలు చేయమని అడిగారు. మరుసటిరోజు అక్కడ కార్యక్రమానికి సిధ్ధమయ్యాము. వినుకొండ ఆలయం నుంచి తెచ్చిన ఉత్సవవిగ్రహాలను తాత్కాలికంగా నిర్మించిన వేదికపై ఉంచి అభిషేకానికి సిధ్ధమయ్యాము అతలో ఓ వృధ్ధుడు ముందుకొచ్చాడు. ఏం టయ్యా ఇది ?ఆంజనేయస్వామి పక్కన ఆమెవరు? ఎందుకుంచారు ? ఇక్కడ అనడిగాడు. అయ్యా ఈమె సువర్చలాదేవి......అని చెప్పబోయాము . మాతాతలకాణ్ణించి మ్ము సామిని నమ్మినోళ్లం . బాధైనా సుఖమైనా స్వామి గుడికెళ్ళి చెప్పుకునేవాళ్లం . మేమింతవరకూ ఎరుగం .స్వామికి పెళ్లయిందని . స్వామి బ్రహ్మచారే ! . మీరేదో చెబితే వినాలా ? మాస్వామి బ్రహ్మచారే...బ్రహ్మచారే...బ్రహ్మచారే . అని గట్టిగా వాదిస్తున్నాడు. ఇక మిగతావాళ్లూ అదే ఉద్దేశ్యంతో ఉన్నట్లర్ధమయింది. ఇక్కడ పాండిత్యానికంటే వారి భక్తి భావనకే ప్రాధాన్యం. మీ భావన ఎలాఉందో అలానే పూజజరుపుదాం అని చెప్పి సువర్చలాదేవి మూర్తిని పక్కనపెట్టి అభిషేకాలు మొదలెట్టాం. మతమార్పిడి జరుపబడ్డవాళ్లు సహితం వారి మత కాపలాద్వారులు అడ్డగిస్తున్నా వాళ్లని తోసిరాజని అక్కడ బోరుపంపు దగ్గరస్నానాలు చేసి బిందెలతో నీళ్ళుతెచ్చుకుని స్వామికి చేసిన అభిషేకాలలో ఓలలాడాడు స్వామి. అక్కడ భక్తితో చిందులేసేవాళ్ళూ. జే కొట్టేవాళ్ళు...ఏలోకానున్నామో తెలియలేదు పూజయినదాకా మాకు. అంతటి ఆనందం కలిగింది ఆరోజు వారిపుణ్యాన మాకుకూడా . వాళ్ల దృష్టిలో స్వామి బ్రహ్మచారి . మహాబలశాలి . ఆపద్బాంధవుడు . అంతే .అందుకే దూర్జటి మహాకవి అంటారు ...ఏవేదంబుల్చదివె లూత .....అనేపద్యంలో .

3 వ్యాఖ్యలు:

astrojoyd January 23, 2012 at 6:28 AM  

మాష్టారూ..అయన ఎందుకు?..ఎలా? బ్రంహచారో చెబితే విస్మయం కలుగుతుంది...వేదాలలోని కొన్ని మాటలకు విశేషమైన..ప్రత్యేకమైన సూక్ష్మమైన అర్ధాలున్నాయి..వాటిని వివరించడానికి వేదం "నిరుక్తము" అనే వో ప్రత్యెకమైన నిఘంటువును ఏర్పరచింది.నిరుక్తం ప్రకారం నిత్యం వేద స్వరూపుని ధ్యానంలో ఉండే వారిని బ్రంహచారులు అని అంటారని వివరించారు.అలా ఉండేవారికి మంచి వర్చస్సు[సు-వర్చస్సు=సువర్చలా అయ్యింది] కలిగిన కాంతి ఉంటుంది[దీనినే మనం "ఆరా" అంటాము]..ఈ తేజము ధ్యానపరులను వొక పత్ని[భార్యా] వలె రక్షిస్తుంటుంది కనుక గూడార్ధములో సువర్చల హనుమకు భార్యా గా చెప్పారు విభుదులు..

durgeswara January 23, 2012 at 11:32 PM  

నిజమండీ ! చాలా అద్భుతంగా సశాస్త్రీయంగా వివరించారు ధన్యవాదములు

GALLA January 26, 2012 at 7:07 AM  

అస్త్రోజోయ్ద్ గారు చాల బాగా చెప్పారు . చాల మందికి ఈ సందేహం ఉన్నది వాస్తవం . మీ వివరణతో అలాంటి వారికి సందేహ నివృత్తి తప్పక కలుగుతుంది. ధన్యవాదములు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP