పాఠశాలలో నా ప్రయోగాలు..ఫలితాలు
>> Thursday, July 1, 2010
పాఠశాలను ప్రారంభించి నప్పుడు నా ప్రధానోద్దేశం ఏదో ఒక ఉపాధి కల్పించుకోవటం . అయితే ప్రయోగాలు చేయాలనే ఆకాంక్ష, పూర్వ ఋషికులాలు నడిపిన విద్యాబోధనాపద్దతులమీద ఉన్న అభిమానం నన్ను మొక్కుబడిగా బడినడపనివ్వలేదు. విద్యార్థికేంద్రంగా బోధన సాగాలనే ఆలోచనను వాస్తవ పరిస్తితులకు అనుగుణంగా అన్వయించుకుని నాకున్న పరిమిత వనరులతో కొన్ని ప్రయోగాలు చేశాను.
మాట్లాడే భాషలో కూడా పట్టుమని పది ఆక్యాలు తప్పులు లేకుండా రాయలేని పిల్లల విషయమై కొన్ని పద్దతులు పాటించాను. నా స్వానుభవరీత్యా నేను రెండవతరగతి మాత్రమే చదివి పాఠశాలకువెళ్లకుండా ఇక్కడ రవ్వవరం లోనే ఉన్నాను మాతాతగారిని విడిచి ఉండలేక . మానాన్నగారు నరసరావు పేట దగ్గర దేచవరం లో టీచర్ గా ఉద్యోగం చేస్తుండేవారు .కానీ చందమామ వంటి పిల్లలసాహిత్యం మాత్రం చదువుతుండేవాడిని ఊహఉంది కనుక. ఇలా కాదని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ నాలుగు నెలలు తనదైన పద్దతిలో శిక్షణ ఇచ్చి ఆరవతరగతి ప్రవేశ పరీక్ష వ్రాపించి రూపెనగుంట్ల హైస్కూల్ లో చేర్చారు . [మరల అక్కడనుండి మావూరు వచ్చి నూజండ్లలో చేరాననుకోండి] . ఈకాలంలో నాకు మానాన్నగారు రామాయణ .మహాభారతాలనుండి శ్లోకాలను చెప్పి ఉచ్చారణ దోషాలు లేకుండా అప్పజెప్పించి వ్రాయించేవారు . మాఊరిలో ఎన్నడు చూడని ఈతచెట్లు రబ్బరు చెట్లు ఆఊరిలో ఎక్కువ . అవెప్పుడూ నాలుగైదు నాకంటిముదే ఉండేట్టు పెట్టేవారు. కాబట్టి శ్లోకాలు అలవోకగా వచ్చేసేవి . ఇక మానాన్నగారు తెచ్చుకుని చదివే రాహుల్ సాంకృత్యాయన్, అడవి బాపిరాజు ,నుండి మధుబాబు నవలలదాకా నేనూ తిరగేశాను అప్పుడే . ఒకసారి రూపెనగుంట్ల హైస్కూల్ లో మాకు తెలుగుచెప్పటానికొచ్చిన సారు హరిశ్చంద్రుని కథను అవకతవకలుగ చెబుతుంటే అలా కాదండి అన్నాను . అలాగా నువ్వుచెప్పరా ,అంటే కథంతా చెప్పాను , ఈవిషయం హెడ్మాస్టర్ వీరారెడ్డిసార్ కు తెలిసి ఒకసారి నరసరావు పేటలో మాస్టర్లంతా కలిసినప్పుడు రామలింగయ్యగారి పిల్లవాడు అసాధ్యుడండి ..మా మాస్టర్ గారికే పాఠాలు చెప్పాడు అన్నారట . తరువాత కాలంలో మా నాన్నగారు చెబుతుంటే విన్నాను.
ఈవిషయం ఇక్కడప్రస్తావించినదెందుకంటే ఒక పిల్లవాడు మాతృభాషలో కూడా వెనుకబడటానికి కారణం అన్వేషించిన సందర్భం కనుక . మా నాన్నగారికి చదువుకోవటానికి ఆర్ధికపరిస్థితి లేదు .వాఊరి దగ్గర తిమ్మాపురం రాయనిభాస్కరుల అగ్రహారం .ఆరోజులలో అక్కడ బ్రాహ్మణుల వీధి అరుగులే విద్యాలయం .రవ్వవరంలో చదువుకునే వారి వెంట వెళ్ళి అక్కడ అయ్యవార్లు చెప్పింది విని పక్కవాల్ల పుస్తకాలు చూసి చదువుకున్నాడు మానాన్న . మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకునే వేళ వారి ఆడవాళ్ళు, ఏపురాణమో ,వ్రతకథలో రామలింగయ్యా ! ఇటురారా .అనిపిలచి చదివించుకునేవారటమానాన్న చేత . అలా విస్తృతంగా చదవటం మూలంగా ఎంతో సబ్జక్ట్ ను పెంచుకున్నానని చెప్పేవారాయన.
ఇక్కడ పిల్లవానికి పద్యాలు .శ్లోకాలు రాగయుక్తంగా పలికించటం వలన ,శబ్దోఛ్ఛారణలో బేధాలు కనిపెడుతూ వల్లెవేయటం వలన పిల్లవానికి భాషాజ్ఞానం మెరుగు పడింది .అదీ పిల్లవానికి ఇష్టమైంది . ఉక్తలేఖనం [డిక్టేషన్] లో వానిలో ఉన్న లోపాలు సరి చేయబడతాయి . ఇదే పద్దతిని నేను అనసరించాను.మూడవతరగతి నుంచి భగవద్గీత చిన్నపుస్తకాలిచ్చి రోజూ ఒక్కో శ్లోకం చెప్పి బట్టీ పట్టించాము . అలాగే రెండు బృందాలుగా విద్యార్థులను కూర్చోబెట్టి శ్లోకాలను ఒకచరణం ఒకబృందం మరొకచరణం ఎదుటివారి చేత బృందగానంగా పలికించే వారము . మొదట్లో ఏమిటి ఈవయస్సులో పంతులు గీత చెబుతున్నాడని గాంధీనగర్ నుండి అభ్యంతరాలొచ్చాయి . అయితే వాల్ల సమక్షం లోనే పిల్లలు ఏ పుస్తకాన్నైనా ఇచ్చి చదివించటం చేపించాను . మిగతా పాఠశాలల పిల్లలు అలా చేయలేకపోవటం చూసి తల్లిదండ్రులు ఈ పద్దతిలో లాభాన్ని చూసి ఇక మాట్లాడలేదు .
ఇక పిల్లలు మధ్యాహ్నం చదవటానికి చందమామ పుస్తకాలు [పాతవికూడా సేకరించి] పిల్లల సాహిత్యం తో లైబ్రరీ ఏర్పాటు చేశాము . దానితో స్వంతగా చదవటం అలవాటయింది పిల్లలకు . అలాగే పిల్లలే రెండు గోడపత్రికలను నడిపేలా ప్రోత్సహించాము . అందులో పిల్లలు వ్రాసిన కథలు ,పాటలు ,బొమ్మలు ప్రదర్శిస్తారు . అలా పోటాపోటీగా నడిపే ఈ పత్రికలలో ప్రచురించే వాటిని చదవటానికి పిల్లలు పోటీపడతారు. తమ రచనలను చూసుకోవటానికి పోటీపడతారు.
దీనివల్ల పిల్లలలో ఆలోచనాశక్తి .సృజనాత్మకత పెంపొందుతుంది . కావలసిన మెటీరియల్ మేమే ఇచ్చేవారము.
అలాగే పద్యాల పోటీ పెట్టేవాళ్లం .[ఇవన్నీ ఇప్పుడు సర్వశిక్షాఅభియాన్ లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వపాఠశాలల టీచర్లుగా మాకు ట్రైనింగ్ లో చెబుతున్నారు]
అలాగే ఇంటిలో ఉండే వస్తువులు నుండి వారి ఊరిలో ఉన్న వివిధ ఇళ్ళు లాంటివన్నీ లెక్కించటం .వాటి వివరాలు వ్రాపించటం ప్రాజక్ట్ వర్క్ గా ఇచ్చేవారము. అలాగే మట్టితోను , ఇతర వస్తువులతో బొమ్మలు చేయటం ప్రోత్సహించాము
. దొరికిన వస్తువులను తీసుకొచ్చి ఒక బాక్స్ లో వేస్తారు పిల్లలు . వాటిని అసెంబ్లీ జరిగే సమయం లో ఎవరివో గుర్తించి వారికివ్వటం జరుగుతుంది . శతక పద్యాలను బట్టీపట్టించే వాల్లము .గణితం లో కూడా అలాంటి శిక్షణ ఇచ్చే వాల్లము .
క్విజ్ పోటిలు ,పాటలు ప్రతి రెండు నెలలకు ఏదో ఒక ముఖ్యమైన రోజు బహుమతులిచ్చేవిధంగా ఆటల పోటీలుంటాయి . ఆటలలో కూడా ముఖ్యంగా కబడ్డి.ఖోఖో ,వాలీబాల్ లాంటివి ప్రోత్సహిస్తాము . కబడ్డీ ఆటలో చిన్నపిల్లలను ఆడ,మగ అనే తేదా చూపకుండా కలిపి ఆడిస్తాము . కబడ్డీ ఆడటం ద్వారా పిల్లలలో సమస్యను ధైర్యంగా ఎదుర్కునే తత్వం పెరుగుతుంది. ఎదురుగా ఏడుగురు ప్రత్యర్ధులున్నా వెరువక తలపడే ధైర్యం ఈ ఆటద్వారా పెరుగుతుంది . ఇది జీవితం లోనూ చాలా ప్రభావం చూపుతుంది . ఈమధ్య మొదటి బాచ్ లలో చదివిన సుజాత అనే అమ్మాయి కనపడింది . నమస్తే సర్ అని పలకరించింది . ఈ మధ్య అత్తగారింట్లో ఏదో సమస్య తో ఇబ్బంది పడుతున్నదని తెలిసి ఎలా ఉన్నదమ్మా ఇప్పుడు అని అడిగాను . ఏంపరవాలేదండీ మొగపిల్లలతో కూడా మొండిగా కబడ్డీ ఆడించేవారు ,ఆ ధైర్యం తోనే ఈ సమస్యలను కూడా ఎదుర్కోగలుగుతున్నానండి ...అని చెప్పటం విన్నాక నాప్రయోగం విజయవంతమైనందుకు కించిత్ గర్వం కూడా పెరిగింది .
ఇక వీటన్నింటితో పాటు ప్రత్యేక కార్యక్రమం మాక్ పార్లమెంట్ నిర్వహణ . ప్రతి నెలా మొదటి తారీఖు ఎన్నికలు నిర్వహించబడతాయి . పాఠశాలలో టైగర్స్ గ్రూప్ ,లైన్స్ గౄప్ అనే రెండు గ్రూప్ లలో పిల్లలు తమ కిష్టమైన దానిలో చేరుతుంటారు . ఎటూ చేరకుండా తటస్థంగా కూడా ఉండవచ్చు. ఐతే ఎన్నికలలో ఓటువేసి పాల్గోవాలి . ఎన్నికలలో సాధించిన ఓట్ల అధారంగా సీట్లు కేటాయించబడతాయి . ఎక్కువసీట్లు వచ్చిన గ్రూప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది . ముఖ్యమంత్రి ,తనగ్రూప్ నుంచి హోం, ఆర్థిక,ఆరోగ్య, పారిశుభ్రత ,క్రీడా, సాంస్కృతిక ,వన ,నీటిసరఫరా శాఖా మాత్యులనునియమించుకుంటాడు . ఓడినవారు ప్రతిపక్షం లో ఉంటారు . ఏ శాఖ కు చెందిన మంత్రి ఆశాఖ పరిపాలన చూస్తాడు . విద్యార్థులకు విశ్రాంతి సమయంలో చిరుతిండ్లు అమ్మే స్టాల్ ను ఆర్ధిక మంత్రి నిర్వహిస్తాడు. ఆవచ్చే లాభాలను మంత్రివర్గ నిర్ణయం ప్రకారం వివిధ శాఖల కొనుగోళ్లకు ,ఆటలపోటీలకు ఖర్చు చేస్తుంటారు. ప్రతి శుక్రవారం జరిగే మాకపార్లమెంట్ సమావేశాలలో పరిపాలన పై తీవ్రమైన చర్చలు వాదోపవాదాలు జరుగుతుంటాయి. దీనిద్వారా నాయకత్వ లక్షణాలు ,స్వయం పరిపాలన , బాధ్యత ,సమాజంపట్ల నిబద్ధత వంటి అంశాలాలో శిక్షణ నివ్వబడుతున్నది అంతర్గతంగా.
వనశాఖ మంత్రిగా ఉన్న మాలకొండారెడ్డి అనే పిల్లవాడు[ వాడిప్పుడు పెద్దవాడులెండి] ఒక్కో మొక్కకు వాల్లపేరు పెట్టి పెంచుకునే లా పథకం చేపడితే ,దానిఫలితంగా ఇప్పుడు పాఠశాలనిండా చెట్లు నిండా నీడనిస్తున్నాయి . ఇలా విద్యార్థులు ఆటపాటలతో సాగించిన విద్యాభ్యాసం తోడు రెసిడేన్షియల్ అవకాశం కూదా కల్పించి విద్యార్థులకు యోగా ,ధ్యానం ,మార్షల్ ఆర్ట్స్ ,,గాయత్రీ ఉపాసన , ఒక సబ్జక్ గా సంస్కృతం జోడించి ప్రాచీన ఋషికులముల పద్దతిలో ఒక మోడల్ స్కూల్ ను తయారు చెయ్యాలని కన్న కలలు లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా కలగపోవటం వలన రూపుదాల్చలేదు. భగవదేఛ్ఛ ఎలా ఉందో .
3 వ్యాఖ్యలు:
దైవమెఱుంగు మీ మనసు. తప్పక తీర్చును మీదు కోరికన్.
భావమునందు సద్గతులు పండిన తప్పక రూపు దాల్చు. స
ద్భావికి దైవమే శరణు.భవ్యుఁడ! దుర్గ మహేశ! మేలగున్.
దీవనలిచ్చి లక్ష్మియును తీర్చును మీ మదిఁ గల్గు కోర్కెలన్.
sir mee korika ammavaru tappakunda teerchutundi
A BHUVANEWARI MATHA DAYAVALLA MI KORIKA NIRAVERU GAKA
Post a Comment