శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భక్తియోగి-కర్మయోగి

>> Thursday, May 13, 2010

భక్తియోగి-కర్మయోగి [ఈనాడు నుండి]
- రాధామనోహరన్‌
బాటసారులు దాహం తీర్చుకోవటానికి ఎవరో మహానుభావులు వూరికి దగ్గరగా ఒక చెరువు తవ్వించారు. దాని గట్టునే పెద్ద రావిచెట్టు ఉంది. అలసిపోయిన బాటసారులు ఆ చెరువులో నీరు తాగి చెట్టు దగ్గర బండమీద కాసేపు విశ్రమించి వెళ్లేవారు. ఆ అరుగు మీద ఒక గ్రామస్తుడు కూర్చొని ఉన్నాడు. ఎందుకోగానీ మొహం బాగా విసుగ్గా పెట్టుకుని, తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. ఆ మార్గంలో వెళ్తున్న ఒకాయన ఏవో పదాలు పాడుకుంటూ ఏకతారా మీటుతూ అటువైపు వచ్చాడు. ఆయనకు అక్కడ కాసేపు విశ్రమించాలని అనిపించింది. అక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఇంతలో గ్రామంలోంచి కొందరు ఆకతాయి పిల్లలు గోలగోలగా అరుస్తూ వచ్చారు. ఒక తేలుకు దారం కట్టి గిరగిరా తిప్పుతూ ఆనందిస్తున్నారు. కాసేపటికి వాళ్ళకు దానిమీద ఆసక్తి తగ్గింది. దాన్ని చెరువులోకి విసిరేసి, ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇదంతా గమనిస్తున్న ఆ భక్తుడు ఒక ఆకును తీసుకుని, చెరువు గట్టు దగ్గరకెళ్ళి దాన్ని తేలు దగ్గరగా పెట్టాడు. అది నెమ్మదిగా ఆకుమీదకు ఎక్కింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి రక్షిత ప్రాంతంలో వదలాలనేది ఆయన సంకల్పం. కానీ, అది ఆయనను కుట్టింది. ఆ కదలిక వల్ల మళ్లీ చెరువులో పడింది. ఆయన మళ్లీ దాన్ని ఆకుమీదకు రానిచ్చి రెండు అడుగులు వేశాడు. అది మళ్లీ ఆయనను కొండెతో కుట్టి కదలికకు చెరువులో పడిపోయింది. ఇట్లా ఆయన దాన్ని ఆకు మీదకు ఎక్కించి రక్షించటం, అది ఆయనను కుట్టి చెరువులో పడటం అయిదారుసార్లు జరిగింది. చెట్టు కింద కూర్చున్న ఆసామీకి ఆయన మీద కోపం వచ్చింది. 'ఏమిటి స్వామీ, అది విషకీటకం. తేలుకు కొండెలో విషం ఉంటుందంటారు. మీరేమో దాన్ని రక్షిస్తున్నారు. అదేమో మిమ్మల్ని కుడుతూనే ఉంది. మీ ప్రవర్తన నాకేం అర్థం కావటంలేదు... చూడటానికి మీరు జ్ఞానుల్లా ఉన్నారు. ఇదేమి పని?' అని ఆయన్ని మందలిస్తున్నట్లు విసుగ్గా, కోపంగా, కటువుగా కసురుకున్నాడు. దానికి ఆ భక్తుడు 'నాయనా! నా విధి నేను నిర్వర్తిస్తున్నాను. ఆపదలో ఉన్న జీవిని రక్షించటం మనిషి కనీస ధర్మం. దాని విధి అది నిర్వర్తిస్తోంది. కొండెతో కుట్టడం దాని లక్షణం. పైగా నేను రక్షిస్తున్నట్లు దానికి తెలీదు. అది ఆకుమీద స్థిరంగా ఉన్నప్పుడు... దాన్ని ఆ రాతిగుట్ట దగ్గర పెట్టి, నా దారిన నేను పోతాను' అని నిదానంగా చెప్పాడు.

'మరి అది ప్రతిసారీ మీ చేతిని కుడుతోంది కదా. మీకు కష్టంగా లేదా? పైగా అన్నిసార్లు దానికోసం ప్రయాసపడటం, మీకు విసుగనిపించడం లేదా?' అని అడిగాడు ఆ గ్రామస్తుడు. అతనడిగిన ప్రశ్నకీ, అతని అమాయకత్వానికీ ఆ భక్తుడికి నవ్వొచ్చింది.

'నాయనా, నీవెవరో నాకు తెలియదు. రూపాన్ని బట్టి రైతులా ఉన్నావు. విధి నిర్వహణలో కష్టం, విసుగు అనే మాటలకు తావుండదు. ఆ రెండూ నీ లక్ష్యానికి అడ్డు వస్తాయి. ఎంత కష్టమైనా మన పని మనం చెయ్యాలి. చేసే పని మీద మనకెప్పుడూ విసుగు రాకూడదు. ఇది ధర్మసూక్ష్మం. అర్థం చేసుకుంటే నీకే బోధపడుతుంది' అన్నాడాయన.

ఈలోగా ఆ తేలు ఆకు మీంచి కిందపడి గబగబా ఎటో వెళ్లిపోయింది. ఆయన సంతోషించాడు.

ఆ రైతు ఆ భక్తుణ్ని గౌరవ భావంతో చూస్తూ నమస్కరించాడు. ఆయన ఏకతారా తీసుకుని బయలుదేరబోతున్నాడు. తన సమస్యకు పరిష్కారం ఆయన చెప్పగలడని నమ్మకం కలిగింది.

'స్వామీ! నా పేరు భూపతి. నేనొక రైతుని. వర్షాలు లేక, చీడల పీడల వల్ల పంటలు పండటంలేదు. పడ్డ శ్రమంతా వృథా అవుతోంది. కష్టపడి సంపాదించినన్నాళ్లూ ఎంతో గౌరవంగా చూసే భార్యాపిల్లలు- నన్ను చులకనగా చూస్తూ విసుక్కుంటున్నారు. అందుకని ఇంటిమీద అలిగి, ఈ బొడ్డురాయి దగ్గరకొచ్చి కూర్చున్నాను... మీరు జ్ఞానులు... మీ మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. నాకు నా ధర్మం తెలిసింది...' అన్నాడు.

'నాయనా... కాలం ఎప్పుడూ ఒక రకంగానే ఉండదు. ఒక్క ఏడాది పంటలు పండకపోతేనే నిరుత్సాహపడి కోపం తెచ్చుకోకూడదు. వ్యవసాయం నీ ధర్మం. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. మీ గాదెలు నిండుతాయి. నీ పనిని విసుగు లేకుండా చేయి. ఫలితం బాగుంటుంది. సమర్థుడివి అని నిరూపించుకో. ధనహీనుణ్ని ఎవ్వరూ గౌరవించరు. అది లోకధర్మం. నిన్ను నిరసించిన వారే మళ్ళీ నిన్ను గౌరవిస్తారు' అని బోధించి బయలుదేరారు ఆయన. 'స్వామీ... మీ పేరు?' 'నాకంటూ పేరు లేదు. అందరూ నన్ను కబీరు అంటారు...' అని ఏకతారా మీటుకుంటూ ఆయన నిష్క్రమించారు.

2 వ్యాఖ్యలు:

Rajasekharuni Vijay Sharma May 14, 2010 at 7:22 AM  

చాలా మంచి కథ అందించారు. ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి May 14, 2010 at 8:20 AM  

నమస్కారములు.
ధర్మ సూక్ష్మాన్ని వివరించిన చక్కని కధని అందించారు.ధన్య వాదములు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP