శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అక్షయ తృతీయ [రేపే] నాడేం చేయాలి ? ఏ దేవతలను ప్రార్ధించాలి ?

>> Saturday, May 15, 2010


వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.

అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.

ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.

ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.
ఈరోజే దేవతలను పూజించాలి ?
-------------------------------
అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన వచ్చే అక్షయ తృతీయ నాడు జాతక రీత్యా 12 రాశులకు చెందిన జాతకులు, ఏయే దేవతలు పూజించాలనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి.

ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు, మహాలక్ష్మీలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు, పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. సింహ, కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులువుండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది.

తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సురాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటిపువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇకపోతే.. మకరరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవచ్చు.

అలాగే కుంభ రాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీన రాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

1 వ్యాఖ్యలు:

రాజేశ్వరి నేదునూరి May 16, 2010 at 3:38 AM  

నమస్కారములు.
అక్షర తృతీయ గురించి చక్క గా తెలియ జేసారు ఏ రాసివారు ఏ దేముని పూజిస్తె మంచిదొ వివరం గా తెలియ జెప్పినందుకు ధన్య వాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP