వైశాఖ వైశిష్ట్యం
>> Thursday, May 13, 2010
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
యుగాల్లో కృతయుగం, తీర్థాల్లో గంగాజలం, దానాల్లో జలదానం, మాసాల్లో వైశాఖం శ్రేష్ఠమని స్కందపురాణంలోని వైష్ణవ ఖండం పేర్కొంటోంది. కార్తీక, మార్గశిర, మాఘ, వైశాఖాలు పుణ్యప్రద మాసాలుగా ధర్మజ్ఞుల భావన. చాంద్రమానం ప్రకారం చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉండగా వచ్చేది వైశాఖ మాసం.
వైశాఖ మాసం హరికి ప్రీతికరమైనదనే భావనతో 'మాధవమాసం' అనీ వ్యవహరిస్తారు. వైశాఖం బహువిధ దానాలకు శుభప్రదమైన మాసం. వైశాఖంలో తిలాదానం, ధర్మఘటదానం, జలదానం, వస్త్రదానం, ఛత్ర(గొడుగు)దానం చేయాలని పండితులు చెబుతారు.
వైశాఖంలో శుక్లపక్ష తదియ మిక్కిలి శుభప్రదమైన దినం. కృతయుగం శుక్లపక్ష తృతీయనాడే ఆరంభమైందంటారు. అంటే 'కృతయుగాది' అన్నమాట. దీన్నే 'అక్షయతృతీయ'గా జరుపుకొంటారు. ఈ పర్వదిన ప్రాశస్త్యాన్ని విష్ణు, భవిష్యోత్తర పురాణాలు వివరించాయి. సౌభాగ్యాన్ని వృద్ధిచేసే దినంగా అక్షయతృతీయను పరిగణిస్తారు. ఆరోజు బదరీనాధక్షేత్రంలోని బదరీనారాయణుని దర్శిస్తే సకల పాపాలు హరిస్తాయని విశ్వాసం. వైశాఖ శుక్ల తదియనాడే సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవం. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం. అదేరోజు పరశురామ జయంతి. పాలకులు ధర్మరక్షణను విస్మరించి నిరంకుశులై ప్రవర్తించినప్పుడు బ్రహ్మ, క్షత్రియ శక్తులు ఒకే శక్తిగా అవతరించి ధర్మరక్షణ చేస్తాయనే అవతార తత్వానికి ప్రతీక- పరశురాముడు. వీరశైవ మార్గ ప్రవక్త బసవేశ్వరుని జన్మదినమూ ఈ రోజే కావడం విశేషం.
వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరుల జయంతి. ఈ దేశపు అఖండతను కాపాడేందుకు అక్షయమైన అద్వైతతత్వాన్ని ప్రబోధించిన తాత్విక శిఖరం శంకరాచార్య. వైశాఖ శుద్ధ ఏకాదశి పవిత్రదినం. ఆ రోజున అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణోత్సవం. త్రయోదశి నృసింహజయంతి. రాక్షస సంహారం చేసిన వైకుంఠధాముని అవతారంగానే గాక యోగమార్గంలోనూ, తంత్రమార్గంలోనూ భక్తులను తరింపజేసే దైవం. వైశాఖ శుద్ధ సప్తమిని గంగోత్పత్తి దినంగా భావిస్తారు. అంటే గంగావతరణమన్నమాట. ఆ రోజు గంగాస్నానం విశేషఫలదాయకమని భావన. ఈ సప్తమినాడే విజయనగర సామ్రాజ్య ప్రతిష్ఠాపనా ప్రేరక శక్తి, శృంగేరి పీఠాధిపతిగా ధర్మరక్షణకు కృషిసల్పిన విద్యారణ్యస్వామి జననం.
వైశాఖ శుద్ధ పూర్ణిమ మహావైశాఖి. అహింసామార్గ ప్రవర్తకుడు, కారుణ్యసింధువు, గౌతమబుద్ధుని జననం, సంబోధి, నిర్వాణం వైశాఖ పూర్ణిమనాడే సంభవించాయి. వైశాఖ శుద్ధ పూర్ణిమ పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి కూడా.
వైశాఖమాసంలో బహుళ దశమినాడు హనుమజ్జయంతి. రుద్రాంశ సంభూతుడుగా శైవులకు, రామకార్య దురంధరుడిగా వైష్ణవులకూ సర్వులకూ ఆరాధ్యదైవం హనుమ.
ఆధ్యాత్మికంగా వైశాఖమాసం విలక్షణం, విశిష్టం.
[ఈనాడు" నుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment