కోతులకు విందు భోజనం వద్దు సీతా ! అన్న రామయ్య మాట ,వినని సీతమ్మ
>> Tuesday, May 25, 2010
అమ్మవారికి అయోధ్య కొచ్చిన తరువాత అందరినీ సత్కరించటం ఒక పనై పొయింది . కష్టకాలంలో తమ పట్ల అభిమానం చూపిన వారందరినీ గుర్తుపెట్టుకుని వారందరినీ వారి స్థాయి ననుసరించి సన్మానించింది . అయితే తమ కోసం ప్రాణాలకు తెగించి రాక్షసులతో పోరాడిన వానరులపట్ల అమ్మవారి హృదయంలో అపారమైన కృతజ్ఞత గూడుకట్టుకుంది .లోకమాత గనుక వారిని బిడ్డలవలే సత్కరించాలని కోరిక .
ఒక శుభముహూర్తాన శ్రీరాములవారు విశ్రాంతిగా ఉన్నసమయం లో అమ్మవారు, స్వామీ ! గోముగా పిలచింది.
ఏమి దేవీ ! మరింత మురిపంగా అడిగారు స్వామి వారు.
నాదొక చిన్న విన్నపం స్వామీ ...
సీతా ! నువ్వడగటం నేను తీర్చక పోవటమూనా ! ఏంకావాలి నిరభ్యరంతంగా అడుగు స్వామి వారు అనుమతిచ్చారు.
వానరులు మనకోసం చేసిన త్యాగానికి మనం ఎంతచేసినా ఋణం తీరదు. అందుకని వారి కోసం ............
అడుగుదేవీ ! వాళ్లకు నీవు ఏమి ప్రసాదించ దలచినా సందేహించకు . అమూల్య రత్నాభరణాలను మన కోశాగారం నుంచి పంపిస్తాను చెప్పు ఏమివ్వమంటావో ?
అవికాదు స్వామీ ! పాపం వాళ్ళు వనచరులు .ఏవో ఆకులు కాయలు తప్ప మనరుచికరమైన వంటలను వారెప్పుడు తినలేరు . ఒక్కసారి బిడ్డలందరికీ స్వయంగా వండి వడ్డించి కడుపునిండా భోజనం పెట్టాలని నా కోరిక .వారి జీవితంలో రుచిచూడని మన నాగరిక వంటకాలతో విందు భోజనం పెట్టాలి. అందుకు ఏర్పాట్లు చేయించండి ప్రభూ .దానిలో పాల్గొనాలని సమస్త వానరులకు ఆహ్వానం పంపండి . అమ్మవారు మనసులో మాట బయట పెట్టింది .
స్వామి వారు అమ్మవారి అమాయకత్వానికి నవ్వుకున్నారు.
సీతా ! ఏదైనా సన్మానం చేయాలంటే అది గ్రహీతకు పీతిపాత్రంగాను చేసేవారికి ఇబ్బంది లేకుండాకూడా ఉండాలి. వానరులకు విందేమిటి ? .అది సాధ్యంకాదు.అంతేకాదు మనం అభాసుపాలవుతాము . అది కాక ఇంకేదన్నా అడుగు అన్నారు స్వామి.
అమ్మవారికి రోషం వచ్చింది . నేను వీరందరికీ ఏకొరతా లేకుండా వండించి వడ్డించగలను . అన్నారు.
అదికాదు సీతా .అవి కోతులు . వాటికి విందు భోజనం పెట్టటం లాంటి తిక్క ఆలోచనలు బాలేవు. వారించబోయాడాయన.
అమ్మవారి మాతృ హృదయం అన్నం పెట్టాలంటే వద్దంటున్న భర్తపట్ల క్రోధం వహిస్తున్నది.
మీరు ఎవరికి ఎన్ని సత్కారాలు చేసినా నేను వద్దన్నానా ? ఎదో ఎన్నడు తినని బిడ్డలకు కడుపునింపుదామనుకుంటే అడ్డుకుంటున్నారు ....దు:ఖం తొంగిచూస్తున్నది అమ్మ గొంతులో .
స్వామి వారికి ఇక ఏమి చెప్పినా లాభం లేదని అర్ధమైపోయింది . సరే నీ ఇష్టం నీవు కోరినట్లే ఏర్పాటు చేస్తాను ..ఆతరువాత ఫలితాలకు నాకు సంబంధమ్ లేదు ..ఆన్నాడు.
సీతమ్మ హృదయం ఆనందంతో పొంగిపోయింది .వెంటనే ఏర్పాట్లకు సిద్దమయి పోయింది
స్వామి వారు సమస్త వానరజాతి అమ్మవారిచ్చే విందుకు రావలసినదిగా ఆహ్వానాలు పంపారు.
అయోధ్యనిండా చలువ పందిర్లు వేశారు .పాక శాస్త్ర ప్రవీణులు వేలాదిగా తరలి వచ్చి అమ్మవారి పర్యవేక్షణలో రుచికరాలైన వివిధవంటకాలను వండారు.
ఇక వచ్చినవారందినీ బంతులమీదకూర్చో బెట్టారు . వివిధ భక్ష్యాలు,వంటకాలు వడ్డన సాగుతున్నాయి. అమ్మవారు ఆన్ని వరుసలు తిరుగుతూ కొసరికొసరి వడ్డింపజేస్తున్నారు. ఆహో ...ఓహో అంటు వానఎరులు లొట్టలువేస్తూ ఆరగిస్తున్నారు .అమ్మవారు ఆనందంతోతబ్బిబ్బవుతున్నారు.
ఇప్పుడు చారు వడ్డిస్తున్నారు బంతులమీద . .పులుసువేసి ఆన్నం కలుపుతున్నారు భుజిస్తున్న వాళ్ళు.
ఇంతలో ఒకపిల్లకోతి అన్నంపులుసు పిసికేప్పుడు ఒక చింతపిక్క చటుక్కున పైకెగిరింది దాని చేతిలోంచి. చింతపిక్క అలాపైకెగరటం చాలా సరదా అనిపించింది ఆపిల్లకోతికి .మరలా పులుసు పిసికింది మరొక చింతపిక్క చటుక్కున ఇందాకటిలాగే పైకెగిరింది . అదొక తమాషాగా ఉన్నందున ఆ పిల్లకోతి ఆచింత పిక్కకంటే పై ఎత్తుకు ఎగిరి కూర్చుంది . అయితే దానిపక్కనే ఉన్న కుర్రకోతి కూడా దానికంటే ఎత్తు ఎగిరి కూర్చుంది .
పక్కనే ఉన్న మరొక కోతి . దీనికేనా తెలుసు ?పై కెగరటం అనుకుని అదికూడా మరింత ఎత్తు ఎగిరి కూర్చుంది .
పక్కనే ఉన్న పెద్దకోతికి ఇది అవమానంగా తోచింది.అవునూ ఇది ఎందుకెగిరింది? అంటే నేనంత ఎత్తు ఎగరలేనా ?
అనుకుని అది మరింత ఎత్తు ఎగిరి కూర్చుంది .
నేను యుద్దంలో పదిమంది రాక్షసులను చంపినవాడిని నాముందే అది ఎగిరిందంటే ఇక నేను ఎగరకపోతే అవమానం కదా అనుకుని ఒక వానరవీరుడు దాదాపు పందిరి తగిలేలా ఎగిరాడు. ఆపక్కనున్నవాడు దీన్ని సవాల్ గాతీసుకుని పందిరి లేచేలా ఎగిరాడు.
ఇక చూస్కోండి . పక్కవారు ఎగరటం తనకు పోటీగా భావించి, అంతకంటే ఎక్కువ ఎత్తు ఎగరలేకపోతే అది అవమానకరంగా భావించి కోతులన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి ఎగరటం మొదలెట్టాయి . పందిర్లకేసిన తాటాకులు లేచి వెళ్లిపోతున్నాయి . వడ్డించేవాళ్ళు.వంటవాళ్లు పరిచారకులు ,చూస్తున్నవారు పరుగులు పెడుతున్నారు . కేరింతలు ,గర్జనలు ,ఎగిరిదుముకుతున్న కో్లాహలంతో భీభత్సమైపోయింది వాతావరణం. వారిని వారించాలనుకోవటం వృధాప్రయాసైపోయింది . ఎవరిమాట ఎవరూ వినడు. విందుభోజనం పందిర్లు వేదికలు రణరంగం జరిగి ధ్వంసమైనట్లు గా తయారయ్యాయి అరుపులు కేకలతో రసాభాసగా ముగిసింది విందుకార్యక్రమం. అమ్మవారి ముఖం చిన్నబోయింది . అది చూసి ఓదారుస్తూ రాముడు సీతా ! నేను ముందే చెప్పాను . అవి కోతులు వాటికి చెట్లమీదగెంతుతూ తినే అలవాటేగాని స్థిరంగా కూర్చునే అలవాటు ఉండదు అని. వినలేదు నువ్వు. జరిగిందేదో జరిగింది ,ఇలాంటి పని ఇకపై పెట్టుకోకు అని చల్లబరచాడు . పాపం కోతులకు కూర్చోబెట్టి భోజనం పెడదామనుకున్న సీతమ్మవారి కోరిక తీరనే లేదు.
9 వ్యాఖ్యలు:
ఎప్పుదొ లీలగా విన్న ఈ కధను మరల గుర్తు చెసారు.
hmm..kotta kadha cheppaaru dhanyavaadaalu.
అది చి౦త పిక్క కాదు. చిక్కుడు గి౦జ. పిదికితే గి౦జ బయటికి వస్తు౦ది.
మూర్తి గారు ఈకథను నేను చిన్నప్పుడు విన్నాను గుర్తుకు వచ్చి వ్రాశాను.
అయ్యా అజ్ఞాతగారు అది చింత పిక్కేనండి .అయితే చింతగింజలను మా ప్రాంతంలో చింతపిక్కలు అని పిలుస్తారు .చిక్కుడు గింజలు చారులో వాడరనుకుంటా !
చాలా బాగుంది సారు ఈ ప్రహసనం..ఇది చదువుతుంటే వానరుల కు భోజనములో మామిడిపండు వేయటం ..అందులో టెంక ఎగిరి పక్క వానరుడి విస్తట్లో పడటం..అక్కడి నుండి రసాభాస మొదలవటం గురించి ఎవరో చెప్పగా విన్నానో , లేదా ఎక్కడైనా చదివానో ఆ ప్రహసనం గుర్తుకు వచ్చిందండి.
ఆమ్రపాలి
ఆమ్రపాలిగారు
ఈకథ కొద్ది మార్పుతో రెండుమూడురకాలుగా అక్కడక్కడా వినిపిస్తున్నదండి
మీరు కథ సగమే రాశారనిపిస్తోంది..
అలా అందరు వానరులూ ఎగురుతున్నా ఆంజనేయస్వామి మాత్రం ఉలకడు పలకడు.. అప్పుడు సీతమ్మ ఏమి స్వామీ ఆంజనేయుడు ఎగరలేదు అని ఆడుగుతుంది.. దానికి శ్రీ రాముడు చిరునవ్వు నవ్వి.. ఒక తామర పువ్వు ని కోసి ఆంజనేయ స్వామికి ఇచ్చి సూర్యునికి ఇచ్చి రమ్మంటాడు. అది విన్న వెంటనే స్వామి సూర్యుణ్ణి చేరి ఆ పువ్వు ఇచ్చి వస్తాడు..
బలం ఉన్నంత మాత్రాన దాన్ని ఎక్కడంటే అక్కడ ప్రదర్శించకూడదు అనే నీతిని భోదించేందుకు ఈ కథను చెబుతారు.. నాకూ అలాగే చెప్పారు..
చక్కని కధ చెప్పారు చలా బాగుంది
nice story sir. I heard this in my childhood
Post a Comment