శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తుఫానులో కూడా సాగిన యాగం .చలించని చిన్నారి దీక్షాస్వాములు

>> Saturday, May 22, 2010

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు ...అనే సూక్తి హనుమత్ రక్షాయాగంలో పాల్గొంటున్న బాల స్వాములకు బాగా వంటపడుతున్నది. . ప్రభంజనుని ధాటికి చలించకుండా దీక్ష సాగిస్తున్నారు. హోరుగాలి ,వర్షం తో రెండురోజులు అంతా అతలాకుతలమైనది. ఇక్కడ పదిహేనుమంది పిల్లలు దీక్షతీసుకుని ఉన్నారు. వారిలో నాలుగవతరగతి చదివేవారినుండి తొమ్మిదవతరగతి వరకు ఉన్నారు. వాళ్లకు భోజనసదుపాయం అంతా పీఠంతరపునే కల్పించబడుతున్నది. కాబట్టి వాళ్ళుకూడా దీక్షయిపోయినదాకా మాతో పాటే ఇక్కడ ఉంటారు. వర్షానికి తోడు పెనుగాలులు వీస్తుండటంతో ఉన్నరేకులషెడ్ లలోకి కూడా నీరు వచ్చిపడుతూ తడిసి ముద్దయింది పీఠం ఆవరణంతా . మేము నివాసం ,వంటకోసం ఉపయోగించుకుంటున్న గది రేకులు కూడా లేచిపోయేలా ఊగుతుండటం తో సామానంతా ఆఫీస్ గదిలోకి చేరవేశారు పిల్లలు . మా ఆవిడ ఆవర్షంలోనే ,మంచాలకు దుప్పట్లు కట్టించి అడ్దం పెట్టి ఆ షెడ్లలోనే ఉప్మా,అన్నం వండింది మొదటిరోజు . ఆఫీసు గదిలో పెట్టిన గ్యాస్ స్టవ్ పై కూరలు తయారు చేసింది . ఏదో ఇంట్లో మావరకైతే ఏ పచ్చడిమెతుకులైనా పరవాలేదు ,కానీ పిల్లలున్నారు ఇంతమంది అని ఆవిడ తపన.
ఇదేమీ పెద్దవిశేషం కాదుగానీ ,ఆవర్షంలో కూడా పిల్లలు తమ నియమపాలన తప్పకుండా సాగించిన దీక్షావిధి చెప్పుకోదగ్గది. జోరున కురుస్తున్న వానలోనే స్నానాలు చేసి గాలి విసురుతున్నా వెరవకుండా ప్రదక్షనాలు చేసారు . అనంతరం ఆ వానలోనే పూజ [ మా పీఠం లో హనుమంతులవారు ఓపెన్ లోనే ఉంటారు మరి] ముగించారు
. ఇక యజ్ఞం చేయాలి ఎలా ?
స్వాములూ ! మనం చేయగలమో లేదో అని ,మనకు ఇదొక పరీక్ష కనుక యజ్ఞం ఆపకుండా చేయాలి అని చెప్పాను. వర్షం జల్లులతో యాగశాలగా ఉపయోగిస్తున్న తాటాకులపాకలో నీల్లు ప్రవహిస్తున్నాయి . యజ్ఞకుండం తడిసి ముద్దయింది. సమిధలన్నీ నెమ్మిచ్చాయి . ఆవుపేడతో అలికిన నేలంతా చిత్తడిగా తయారయింది . గాలి తాకిడికి అగ్ని నిలబడటం ప్రజ్వరిల్లటం కష్టం . ఎలా చేద్దాం ? ఆలోచించండి అని చెప్పాను . వాళ్లు సామాన్యులా ? బండలుమోసి,కొండలుతెచ్చి వారధికట్టిన హనుమంతునికి ఆయనపరివారానికి వారసులు . . పాదరసాల్లా పనిచేశారు. యజ్ఞకుండం దగ్గర కూర్చోవటానికి నాకు రెండు చెక్కలువేసి దానిపై చాప పరచారు. యజ్ఞకుండం చుట్టూ వలయంలా నిలబడి వాళ్లకండువాలు రక్షణగా పట్టుకున్నారు . అంత చలికి వాళ్లు వణుకుతున్నా వాళ్ల స్థిరసంకల్పం మాత్రం తొణకలేదు. వారి సంకల్పానికి ముగ్దుడైన హవ్యవాహనుడు దేదీప్యమానంగా జ్వలించాడు. స్వాహాకారాలతో భక్తులందరి తరపున సమర్పిస్తున్న ఆహుతులని ప్రీతిపూర్వకంగా స్వీకరించాడు. నిర్విఘ్నంగా కొనసాగింది యాగం . భక్తసులభుడైన ఆంజనేయుడు ఈ బాలస్వాముల రూపంలో తన యాగానికి తానే రక్షణగా నిలచి తన ఉనికిని మరోసారి నాబోటి మందమతులకు తెలియపరచాడు . జైహనుమాన్.

4 వ్యాఖ్యలు:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ May 22, 2010 at 12:21 PM  

జై హనుమాన్.

చిలమకూరు విజయమోహన్ May 22, 2010 at 4:56 PM  

బాల హనుమంతులకు అభినందనలు.

రాజ్ కుమార్ May 24, 2010 at 2:48 AM  

జైహనుమాన్.

రాజేశ్వరి నేదునూరి May 24, 2010 at 3:20 AM  

బాగుంది పిల్లల కృషికి అభినందనలు అంతా ఆ ఆంజనేయ స్వామి దయ

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP