శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆపద వేళల...

>> Wednesday, April 21, 2010

ఆపద వేళల...
- సి.వేదవతి
మనం సాగిస్తున్న ఈ జీవనయాత్ర ఎంత సుందరమైనదో అంత కష్టతరమైనది. పుట్టిన దగ్గరనుంచీ, ఎన్నెన్ని అనుభవ పరంపరలు! మరింకెన్నెన్ని అనుభూతుల స్పర్శలు! కొన్ని కసుక్కున గుచ్చి బాధించే కసాయి ముళ్లు- మరికొన్ని అప్పుడే రేకలు విచ్చుకొన్న పూలపిల్లలు వచ్చి చల్లగా తాకినప్పటి మృదుల స్పర్శలు!

చల్లదనాన్ని ఆస్వాదించడానికి మనకు ఏ తోడూ లేకపోయినా ఫరవాలేదు. కానీ, ముల్లు గుచ్చుకొన్నప్పటి కరకు బాధ ఉన్నదే- దాన్ని ఓర్చుకోవటం మాత్రం ఒక్కరివల్లా కాదు. ఏ మూలనుంచో ఒక ఆపన్న హస్తం వచ్చి ఆదుకోవాలి! పళ్లబిగువున మనం అనుభవిస్తున్న బాధకు మరేపక్కనుంచో ఒక ఉపశమన మంత్రం వచ్చి మన చెవిలో వినిపించాలి. వచ్చి పడిన కష్టం ఎంతటిదైనా, దాని తీవ్రతను ఎంతో కొంత తగ్గించి మనకు స్వాంతన కూర్చే కారుణ్యమయ హస్తస్పర్శ వచ్చి మనలను చల్లగా తాకాలి.

కష్టసమయంలో మనం ఆశించే ఈ తోడ్పాటు ఏ దిశనుంచి వస్తుంది? మనకు అయిన వాళ్లెవరో వచ్చి మనలను ఆదుకోవాలి. సాధారణంగా వారు మనకు రక్తసంబంధీకులైన బంధువులో, మనకు మానసిక బంధంతో చేరువైన ఆప్తమిత్రులో అయి ఉంటారు. అందుచేత అవసర సమయాల్లో ఆసరా కోసం మనం వారిపైనే ఆధారపడాలని ఆశపడతాం.

వారు ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారన్నదీ అసంభవమైన విషయమే. వారు కూడా మనకుమల్లేనే మానవమాత్రులే. వారికీ మనకు మల్లేనో, ఇంకా ఎక్కువగానో సమస్యలు ఉండి ఉండవచ్చు. అదీ కాక- బంధువులు, మిత్రులు మనకు చేసే సహాయానికి కొన్ని పరిమితులు ఉంటాయి. వారికైనా, ఎల్లవేళలా మనకు సహాయపడటానికి ఉండేది కొద్దిపాటి శక్తి మాత్రమే!

మరి ఎలాగ? స్వశక్తికానీ, భౌతికమైన మరే సహాయ సంపత్తికానీ మనను ఆదుకోలేని దుస్థితి ఏర్పడితే... ఎలాగ మరి?

భయపడవలసిన పనిలేదు. సర్వశక్తిమంతమైన ఆపద్భాంధవ తత్వం ఒకటి సదా మనను వెన్నంటే ఉంటుంది. అది భౌతిక దృష్టికి అందదు కనుక- మనం గుర్తించలేకపోవచ్చు. నమ్మినవారి దృష్టిలో, సర్వవ్యాపకమైన ఆ పరమశక్తి దివ్యరక్షాకవచమై అన్నివేళలా మనలను ఆదుకొంటూనే ఉంటుంది. అది ఒక అపారమైన కారుణ్యతత్వం! ఎక్కడెక్కడ దైన్యం ఉంటుందో, ఎక్కడెక్కడ జ్వలితార్తి రగుల్కొంటూ ఉంటుందో- అక్కడక్కడ చినుకు చినుకై జల్లులాడే కృపావర్షమది!

ఆపత్సమయంలో మనం ఒకసారి స్మరించినా చాలు- కరిగి కరిగి నీరయ్యే నీలమేఘమల్లే మనలను చల్లగా తాకి ఆర్తిని హరింపజేసే ఆ దయామృతాన్ని ఏమని పిలవాలి? ఒక వూరా, ఒక పేరా? ఏ పేరుతో పిలిచినా పలుకక మానదు కదా! ఎక్కడ ఉన్నా- మనం పిలవగానే పరుగుపరుగున రాక మానదు కదా!

మన కంటికి కనుపించదు కానీ- ఆపద వేళలో, ఆకటివేళలో మనకు తోడునీడై నిలుస్తుంది, ఆర్తిహరమైన ఆ పరమాత్మతత్వం... పరమకారుణ్య భగవత్తత్వం!


[ఈనాడు ,నుండి]

1 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. April 21, 2010 at 6:06 PM  

ఆర్యా! నమస్తే.
వేదవతి గారి మాటలు అనుభవ సారాలు.

ఏ కరుణా స్వరూపిణి సమీప్సిత మొప్పగ నెల్ల వేళలన్
శ్రీకరమై హృదిన్ నిలచి; చేకొను హస్తము సాచి భక్తులన్
ప్రాకటమొప్ప నాయమయె ప్రాణముగామనయంద గల్గు.బా
ధాకరమౌను విస్మరణ తజ్జననీ పద కంజమున్ జనుల్.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP